Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఫ‌లితాలే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు

స‌మైక్య‌పాల‌న‌లో అసంపూర్తిగా మిగిలిన పెండింగ్ ప్రాజెక్టుల‌ను ఈ నాలుగేళ్ల‌లో పూర్తి చేసి సాగునీళ్లు ఇవ్వ‌డ‌ం, వ‌ల‌స‌బాట ప‌ట్టిన ప్ర‌జ‌లు తిరిగి ఊర్ల‌కు చేరుతుండ‌డ‌ం, పాల‌మూరు ప‌ల్లెల్లో పండుతున్న పంటలే రాఘవాచారి లాంటి వారి ‘ప్ర‌శ్న‌ల‌కు’ స‌మాధానం. అయినా ఇప్పటికీ ‘ప్రశ్నలు అలాగే ఉన్నాయి’ అంటే జనం హర్షిస్తారా?

పాల‌మూరు జిల్లా ప్రాజెక్టుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వంలో అన్యాయం జ‌రిగిపోతున్నదంటూ ఈ నెల 11న పాల‌మూరు అధ్య‌య‌న వేదిక క‌న్వీన‌ర్ రాఘ‌వాచారి ‘ప్రశ్న‌లు అలాగే ఉన్నాయి’ శీర్షిక‌న వ్యాసం రాశారు. ఇది ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం మాత్ర‌మే. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డేంత వ‌ర‌కు క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఇన్ని నీళ్లు అవ‌స‌రం అవుతాయ‌ని డీపీఆర్‌లో, ప‌రిపాల‌నా అనుమ‌తుల‌లో ప‌లుమార్లు పేర్కొన‌డం త‌ప్పితే కాంగ్రెస్, టీడీపీ ప్ర‌భుత్వాల హ‌యాంలో జీవో జారీచేసిన దాఖాలాలు లేవు. 40టీఎంసీలు అయితేనే ఈ ప్రాజెక్టుకు న్యాయం జ‌రుగుతుంద‌ని భావించి 2015 సెప్టెంబ‌రు 28న కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ ప్ర‌భుత్వం జీవో 141ని విడుద‌ల చేస్తూ ఘ‌న‌పురం బ్రాంచ్ కెనాల్ కింద 25వేల ఎక‌రాలు, క‌ల్వ‌కుర్తి 182వ డిస్ట్రిబ్యూట‌రీ అవ‌త‌ల‌ మ‌రో 38వేల ఎక‌రాల‌కు అద‌నంగా సాగునీరు ఇవ్వాల‌ని నిర్ణ‌యించి క‌ల్వ‌కుర్తి ఎత్తిపోతల ప‌థ‌కం ఆయ‌క‌ట్టును 4 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పెంచింది. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కానికి 40టీఎంసీల నీళ్లు కేటా యించినా ఈ ఏడాది కేవ‌లం 20టీఎంసీల నీళ్లే వాడుకోగ ‌లిగాం.

ఈ ప‌రిస్థితి గ‌మ‌నించిన‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌నీసం ఈ ప్రాజెక్టు కింద మ‌రో 20టీఎంసీల నీళ్లు నిలువ చేసుకునే రిజ‌ర్వాయ‌ర్ల‌ను నిర్మిస్తేగానీ ఈ ప్రాజెక్టుకు ప‌రిపూర్ణ‌త చేకూర‌ ద‌ని భావించారు. ఈ మేర‌కు 46ఆన్‌లైన్ రిజ‌ర్వాయ‌ర్ల నిర్మా ణానికి స‌ర్వేలు ఇప్ప‌టికే 80శాతం పూర్త‌య్యాయి. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డే నాటికి ఎంజీకేఎల్ఐ కింద సాగు నీరు అందుతున్న‌ది కేవ‌లం 13వేల ఎక‌రాల‌కు మాత్ర‌మే. 2017 వ‌ర‌కు వివిధ పెండింగ్ ప‌నులను పూర్తి చేసి తెలంగాణ ప్ర‌భుత్వం 2,47ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వ‌డ‌మే కాక 438 చెరువుల‌ను నింపింది. ఈ ప‌థ‌కం కింద ఉన్న కాల్వ‌ల సామ‌ర్థ్యం 3200 క్యూసెక్కుల నుండి 5 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ ప్రాజెక్టుతోపాటే ప్రారంభించిన పోతిరెడ్డిపాడు కాలువ వెడ‌ల్పు కార్య‌క్ర‌మం, దానికింద రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణం నాలుగేళ్ల‌లో పూర్త‌యితే ఈ ప‌థ‌కం మాత్రం న‌త్త‌న‌డ‌క‌న సాగింది. అప్ప‌టి తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రూ దీనిని ప్ర‌శ్నించిన పాపాన‌పోలేదు. వైఎస్ అక్ర‌మంగా చేపట్టిన పోతిరెడ్డిపాడుకు, త‌ద్వారా జ‌రిగిన జ‌ల‌చౌర్యానికి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ప‌లికారు. అలాంటి చ‌ర్య‌లు జిల్లా మేధావుల‌కు ఆక్షేప‌ణీయం కాక‌పోవ‌డం శోచ‌నీయం. ఇప్పుడు కాంగ్రెస్‌వారే ప్రాజెక్టుల‌కు మోకాల‌డ్డు తుండగా, మేధావులు వితండవాద‌న‌తో వారికే మ‌ద్దతిస్తున్నారు.

తెలంగాణ ఉద్య‌మం నేప‌థ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల–-పాకాల ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని 2014 ఎన్నిక‌ల ముందు తెర‌మీద‌కు తెచ్చింది. తెలంగాణ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే స‌ర్వే కొర‌కు ప‌రిపాల‌న అనుమ‌తులు ఇచ్చింది. సాంకేతికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యంకాద‌ని నిపుణులు తేల్చ‌డంతో ఆ త‌రువాత నిలిపేసింది. జూరాల ప్రాజెక్టు నుండే ప్ర‌తిపాదించిన ఈ ప్రాజెక్టుతో పాల‌మూరు జిల్లాలో 7ల‌క్ష‌ల ఎక‌రాలు, రంగారెడ్డిలో 2.7ల‌క్ష‌ల ఎక‌రాలు, న‌ల్ల‌గొండ‌లో 30 వేల ఎక‌రాలు, మొత్తం 10ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు, తాగునీరు, ప‌రిశ్ర‌మ‌ల‌కు నీరివ్వాల‌ని పేర్కొన్నారు. కోయిల‌కొండ వ‌ద్ద 76 టీఎంసీలు, గండీడ్ వ‌ద్ద 35టీఎంసీలు, ల‌క్ష్మీదేవిప‌ల్లి వ‌ద్ద 10 టీఎంసీల నిలువ సామ‌ర్ధ్యంగ‌ల జ‌లాశ‌యాలు ప్ర‌తిపాదించారు. ఈ జ‌లాశ‌యాల‌ నిర్మాణంతో 47గ్రామాలు, 80,400మంది ప్ర‌జ‌లు, 16,342నివాసాలు ముంపుబారిన ప‌డుతాయని తేలింది. ఇక సాంకేతికంగా చూస్తే జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ఆరు టీఎంసీలు. మ‌రి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే పాల‌మూరు– రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఇక్క‌డ చేప‌ట్ట‌డం సాధ్య‌మా అన్న ప్ర‌శ్న ఎదుర‌యింది. ఇక జూరాల కింద ఇప్ప‌టికే 1.04ల‌క్ష‌ల ఎక‌రాల‌కు, భీమా కింద 2ల‌క్ష‌ల ఎక‌రాల‌కు, నెట్టెంపాడు 2ల‌క్ష‌ల ఎక‌రాలు, కోయిల్ సాగ‌ర్ 50వేల ఎక‌రాలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణ తాగునీటి అవ‌స‌రాలు, జూరాల జ‌ల‌విద్యుత్ ప్రాజెక్టుకు క‌లిపి 40వేల క్యూసెక్కుల నీళ్లు ఈ ప్రాజెక్టులో కేటాయించ‌బ‌డి ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల‌లో పాల‌మూరు– రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి నీళ్లు కావాలంటే జూరాల‌కు 50 వేల క్యూసెక్కులకు వ‌ర‌ద వ‌చ్చిన‌ప్పుడే సాధ్యం. ఇంత చిన్న ప్రాజెక్టు మీద ఆధార‌ప‌డి ఇంత భారీ ప్రాజెక్టును క‌ట్ట‌డం బాగుండ‌ద‌ని 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీ‌శైలం ప్రాజెక్టును ఎంచుకున్నారు.

దీని మూలంగా వ‌ర‌ద‌లేని రోజుల్లో కూడా 90రోజుల వ‌ర‌కు నీటిని ఎత్తిపోసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. పాల‌మూరు–రంగారెడ్డితో పాటు డిండి – న‌క్క‌ల‌గండి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో ముంపు అధికంగా ఉండ‌డం, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ల‌భించేది శ్రీ‌శైలం జ‌లాశ‌యం నుండే కాబ‌ట్టి ఒకే ఇన్టేక్ నుండి నీటిని స‌ర‌ఫ‌రా చేయ‌డం సాంకేతికంగా సాధ్యం అని భావించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టు రీడిజైన్‌కు ఆదేశించారు. జ‌ల‌వ‌న‌రుల నిపుణుల‌తో కూడిన‌ వ్యాప్కోస్ సంస్థ‌, జీవిత‌కాలం తెలంగాణ‌కు నీళ్లు ద‌క్కాల‌ని ప‌రిత‌పించిన తెలంగాణ జ‌ల‌వ‌న‌రుల నిపుణులు ఆర్ విద్యా సాగ‌ర్ రావు, మ‌రెంద‌రో నిపుణుల సూచ‌న‌ల మేర‌కు ఈ ప్రాజెక్టు రీ డిజైన్ చేయ‌బ‌డింది. రీ డిజైన్ ప్ర‌కారం పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో ఆరు జ‌లాశ‌యాల ద్వారా 10ల‌క్ష‌ల ఎకరాలు అనుకున్న ఆయక‌ట్టును 12.30ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పెంచారు.

పాల‌మూరు జిల్లాలో 7ల‌క్ష‌ల ఎక‌రాలు, రంగారెడ్డిలో 5ల‌క్ష‌ల ఎక‌రాలు, న‌ల్ల‌గొండ‌లో 30వేల ఎక‌రాలకు నీరంద‌నుంది. మొత్తం 72 మండ‌లాల‌లో 1131 గ్రామాల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. నార్లాపూర్ 8.51, ఏదుల 6.09, వ‌ట్టెం 16.74, క‌ర్వెన 17.34, ఉదండాపూర్ 15.91, ల‌క్ష్మిదేవిప‌ల్లి 2.80 టీఎంసీల నీళ్లు నిలువ సామర్థ్యంగ‌ల జ‌లాశ‌యాలు ప్ర‌తిపాదించారు. వీటి మొత్తం నిలువ సామర్థ్యం 67.85 టీఎంసీలు కావ‌డం గ‌మ‌నార్హం. ఆరుజ‌లాశ‌యాలు, 12.30ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందించే అంచనాతో ప్ర‌తిపాదించిన ఈ రీడిజైన్‌లో కేవ‌లం 3గ్రామాలు, 20తండాలు, 2.781 నివాస‌గృహాలు మాత్ర‌మే ముంపుకు గురవుతాయి. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ప్ర‌కారం మూడు జ‌లాశ‌యాల‌లో 47 గ్రామాలు, 80,400 మంది ప్ర‌జ‌లు, 16,342 నివాసాలు ముంపుకు గురవుతు న్నాయి. రీడిజైన్ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆమోదిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం జీవో 105ను జూన్ 10,2016న జారీచేసి రూ.35,200 కోట్లకు ప‌రిపాల‌నా అనుమ‌తులు ఇచ్చింది. జూన్‌ 6, 2015న క‌రివెనవ‌ద్ద ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు. పాల‌మూరు నీళ్ల‌ను న‌ల్గొండ‌కు త‌ర‌లిస్తున్నార‌ని, క‌ల్వ‌కుర్తి ఆయ‌క‌ట్టును ముంచుతున్నార‌ని వ్యాస‌క‌ర్త ఆరోపిస్తు న్నారు. ఈ ప్రాజెక్టు కోసం క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద న‌ష్ట‌పోతున్న ఆయ‌క‌ట్టు కేవ‌లం ఐదు వేల ఎకరాలు మాత్ర‌మే.

12.30ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించే ప్రాధాన్య‌త దృష్ట్యా వ్యాస‌క‌ర్త ఆరోప‌ణ‌లు అర్థరహితం. ముంపును త‌గ్గించి, జూరాల కింద ఆయ‌క‌ట్టును కాపాడిన దానితో పోలిస్తే ఇదే ప్ర‌జ‌ల‌కు ప్ర‌యో జ‌నం. వివిధ కేసుల మూలంగా రంగారెడ్డి జిల్లా ప్యాకేజీ ప‌నుల టెండ‌ర్లు ఆగిపోయాయి. దీని గురించి ఏ మేధావీ ప్ర‌శ్నించ‌డు. పాల‌మూరు–రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఇన్టేక్ వెల్ నుండి డిండి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి 30టీఎంసీలు, పాల ‌మూరు– రంగారెడ్డికి 90టీఎంసీలు ఎత్తిపోయాల‌ని నిర్ణ‌యిం చారు. న‌ల్ల‌గొండ‌, పాల‌మూరు రెండు కృష్ణా బేసిన్ ప‌రిధిలోని జిల్లాలే. దేవ‌ర‌కొండ‌, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు గోదావ‌రి నీళ్లు మ‌ల్లించ‌డం భౌగోళికంగా సాధ్యం కాదు. న‌క్క‌ల‌గండి –డిండి ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద న‌ల్ల‌గొండ జిల్లాలోని దేవ‌ర‌కొండ‌, మునుగోడు, నాగార్జున‌సాగ‌ర్, న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గాల‌లోని 14 మండలాలు, అచ్చంపేట్, క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాల‌లోని 5 మండ‌లాల‌లో 3.41 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందించాల‌ని నిర్ణ‌యించారు. న‌ల్ల‌మ‌ల అడ‌విలో ఎత్తున ఉన్న అమ్రాబాద్ మండ‌లానికి నీరు అందించ‌డం సాధ్యం కాదు.

అందుకే డిండి ఎత్తిపోత‌ల ద్వారా చంద్ర‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌రు నింపి దాని నుండి మ‌రో ప్ర‌తిపాదిత రిజ‌ర్వాయ‌రుకు నీళ్లు మ‌ల్లించి ఎత్తిపోత‌ల ద్వారా అమ్రాబాద్ మండ‌లంలోని 25 వేల ఎక‌రాల‌కు నీరు అందించ‌నున్నారు. పాల‌మూరు–రంగారెడ్డి, నార్లాపూర్–డిండి ప‌థ‌కాల‌ ప్రాజెక్టుల స్థ‌ల‌మార్పిడిని ప్ర‌శ్నించ‌డం అంటే కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను ఆంధ్రాకు ధారాద‌త్తం చేయ‌డానికి అంగీక‌రించ‌డ‌మే. ప్రాజెక్టు స్థ‌ల‌మార్పిడి మూలంగా నారాయ‌ణ‌పేట న‌ష్ట‌పోతుంది అన‌డం అబద్ధం. నియోజ‌క‌వ‌ర్గంలోని 58,791 ఎక‌రాల‌కు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత‌ల కింద సాగునీరు ఇచ్చేందుకు ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ వేసిన కేసుల మూలంగా ఆ ప‌నులు ఆగిపోయాయి.

పాల‌మూరు– రంగారెడ్డి, క‌ల్వ‌కుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగ‌ర్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల‌, గ‌ట్టు ఎత్తిపోత‌ల‌ ప్రాజెక్టులు అన్నీ పూర్త‌యితే పాల‌మూరు జిల్లాలో 18ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంది. తెలంగాణలోని ఏ పూర్వ‌పు జిల్లాతో పోల్చుకున్నా ఇది అత్య‌ధికం. నెట్టెంపాడు ప‌థ‌కం కింద 2014 వ‌ర‌కు నీళ్లు ఇచ్చింది 2300 ఎక‌రాలే. తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్ల‌లో పెండింగ్ ప‌నులు పూర్తి చేసి ల‌క్షా 40వేల ఎక‌రాల‌కు నీళ్లిచ్చి 110 చెరువులు నింపింది. తాటికుంట‌, నాగ‌ర్ దొడ్డి, ముచ్చోనిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్లు దాదాపు పూర్తి చేయ‌డం జ‌రిగింది. భీమా ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద 2014 వ‌ర‌కు నీళ్లు ఇచ్చింది 12వేల ఎక‌రాలే. ఈ ప్ర‌భుత్వం 148చెరువులు నింపి ల‌క్షా 70వేల ఎక‌రాల‌కు నీళ్లిచ్చింది. కోయిల్ సాగ‌ర్ నుండి 2014 వ‌ర‌కు 12వేల ఎక‌రాల‌కు నీళ్లిస్తే ఈ ప్ర‌భుత్వం ఇప్పుడు 32వేల ఎక‌రాల‌కు నీళ్లిచ్చి 25 చెరువులు నింపింది. తుమ్మిళ్ల లిఫ్ట్‌తో ఆర్డీఎస్ కింద ఉన్న 55 వేల ఎక‌రాల‌ను స్థిరీక‌రించ‌నుంది.

కృష్ణా నీటిలో న్యాయంగా ద‌క్కాల్సిన వాటా గురించి తెలంగాణ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కేంద్రానికి నివేదించింది. వాటా పెంపుకోసం సుప్రీంకోర్టులో అంత‌ర్ రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం సెక్ష‌న్ 3ప్ర‌కారం వేసిన కేసు ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం సెక్ష‌న్ 89 ప్ర‌కారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ కేసు న‌డుస్తున్న‌ది. క‌ల్వకుర్తి ఎత్తిపోత‌ల‌, నెట్టెంపాడు, డిండి, పాల‌మూరు, ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టుల‌కు నిక‌ర‌జ‌లాల‌ను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం పోరాడుతోంది. స‌మైక్య‌పాల‌న‌లో అసంపూర్తిగా మిగిలిన పెండింగ్ ప్రాజెక్టుల‌ను ఈ నాలుగేళ్ల‌లో పూర్తిచేసి సాగునీళ్లు ఇవ్వ‌డ‌ం, స‌మైక్య పాల‌న‌లో వ‌ల‌స‌బాట ప‌ట్టిన ప్ర‌జ‌లు తిరిగి ఊర్ల‌కు చేరుతుండ‌డ‌ం, పాల‌మూరు ప‌ల్లెల్లో పండుతున్న పంటలే రాఘవాచారి లాంటి వారి ‘ప్ర‌శ్న‌ల‌కు’ స‌మాధానం. అయినా ఇప్పటికీ ‘ప్రశ్నలు అలాగే ఉన్నాయి’ అంటే జనం హర్షిస్తారా?

సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.