Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఫార్మాసిటీకి సాయంచేయండి

-మౌలిక వసతుల కోసం రూ.1318 కోట్ల గ్రాంట్‌ఇన్ ఎయిడ్
-సీఈటీపీకి రూ.2100 ఆర్థికసాయం అందించండి
-ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్కు
-ఫార్మాసిటీ ద్వారా రూ.64వేల కోట్ల పెట్టుబడులు
-5.60 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
-కేంద్ర మంత్రులు గోయల్, ప్రధాన్‌లకు మంత్రి కేటీఆర్ లేఖలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్‌పీసీ)కి పెద్దఎత్తున ఆర్థికసహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మాసిటీని జాతీయ పెట్టుబడి తయారీజోన్ (నిమ్జ్)గా సూత్రప్రాయంగా గుర్తించిన నేపథ్యంలో ఆ మార్గదర్శకాల ప్రకారం ఆర్థికసాయంతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించాలన్నారు. మౌలిక సదుపాయాల కోసం గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం ప్రకటించాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి పీయూష్ గోయల్‌కు.. ఫార్మాసిటీకి అవసరమైన సహజవాయువును ప్రిఫరెన్షియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాలని కోరుతూ పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత ఫార్మాపార్క్ అని మంత్రి కేటీఆర్ తన లేఖల్లో పేర్కొన్నారు.

దేశంలో ఫార్మారంగ అభివృద్ధికి ఈ పార్క్ దోహదపడుతుందని, జాతీయ ప్రాధాన్యంగల ప్రాజెక్టుగా ఫార్మాసిటీని కేంద్రం గుర్తించిందని తెలిపారు. హెచ్‌పీసీకి జాతీయ అంతర్జాతీయ ఫార్మా కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని, ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు సుముఖంగా ఉన్నాయని వివరించారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఫార్మాసిటీ అంతర్జాతీయ ఫార్మారంగంలో భారతదేశపు నాయకత్వ స్థాయిని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఫార్మాసిటీకి కేంద్రం మద్దతునివ్వాలని మంత్రి కేటీఆర్ తన లేఖల్లో కేంద్ర మంత్రులను కోరారు.

కాలుష్యరహితంగా..
జీరో లిక్విడ్ డిశ్చార్జి పద్ధతిలో కాలుష్యరహితంగా.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హెచ్‌పీసీ నిర్మాణమవుతున్నట్లు పీయూష్‌గోయల్‌కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ, లాజిస్టిక్స్ పార్క్, ట్రైనింగ్, టెస్టింగ్ పరిశోధనశాలలు, కామన్ డ్రగ్ డెవలప్‌మెంట్ సెంటర్ వంటి సౌకర్యాలతోపాటు ఫార్మారంగంలోని స్టార్టప్‌లకు ప్రత్యేక హబ్ ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. మొత్తం 19,333 ఎకరాలకు మాస్టర్‌ప్లాన్ పూర్తయిందని, మొదటి దశలో భాగంగా 8,400 ఎకరాలకు సవివరమైన డిజైన్లు కూడా పూర్తయ్యాయని చెప్పారు. హెచ్‌పీసీకి కేంద్రం ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేసి తొలిదశ పనులను ప్రారంభించిందని పేర్కొన్నారు. హెచ్‌పీసీ ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రావటానికి అవకాశమున్నదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5.60 లక్షల మందికి ఉద్యోగాలు దొరికే వీలున్నదని తెలిపారు. ఇంత విశేష ప్రాధాన్యమున్న ఫార్మాసిటీకి నిమ్జ్ మార్గదర్శకాల మేరకు బహిరంగ మౌలిక వసతుల కల్పనకోసం రూ.1318 కోట్ల గ్రాంట్‌ఇన్ ఎయిడ్ అందించాలని కోరారు.

దీంతోపాటు అంతర్గత మౌలిక వసతుల కల్పన, కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సీఈటీపీ) వంటి సాంకేతిక మౌలిక వసతుల సదుపాయాల కోసం 50% ఖర్చును (సుమారు రూ.2100 కోట్లు) సహాయంగా అందించాలని పేర్కొన్నారు. ఫార్మాసిటీలో ఏర్పాటుచేయనున్న కంపెనీల అవసరాలకోసం సహజవాయువును ప్రిఫరెన్షియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాలని పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు బొగ్గును ఇంధనంగా వాడుతున్నాయని, కానీ, హెచ్‌పీసీని గ్రీన్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్ (కాలుష్యరహిత పద్ధతి) ప్రకారం ఏర్పాటుచేస్తున్నందున సహజవాయువును వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నందున.. తక్కువ ధరకు సహజవాయువును సరఫరాచేయాలన్నారు. ఫార్మాసిటీలోని యూనిట్లకు అవసరమైన 3.4 ఎంఎంఎస్‌సీఎండీ (మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పర్ డే)ని కేటాయించాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.