Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పైప్‌లైన్లు కావు లైఫ్‌లైన్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా వేసే పైపులైన్లను.. భవిష్యత్ తెలంగాణకు లైఫ్‌లైన్లు (జీవన రేఖలు)గా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై, నెర్రెలు కొట్టిన తెలంగాణ ప్రాంత పొలాలతోపాటు, తడారుతున్న ప్రజల గొంతుల దాహార్తిని తీర్చుతామని ఆయన స్పష్టంచేశారు. గత పాలకులవల్ల తెలంగాణ మాగాణాన్ని కరువు పీడిస్తున్నదని, వారసత్వంగా వచ్చిన ఈ పరిస్థితిని మార్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాబోయే మూడేండ్లలో ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించి, ఆడబిడ్డల కన్నీళ్లు తుడుస్తామని చెప్పారు. తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డ నీళ్లకోసం బిందె పట్టుకుని ఇంటినుంచి బయటకు వెళ్లకుండా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం వాటర్‌గ్రిడ్‌పై జరిగిన చర్చలో టీఆర్‌ఎస్ సభ్యులు గంగుల కమలాకర్, గాదరి కిశోర్‌కుమార్, శంకర్‌నాయక్, ధర్మారెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ లేవనెత్తిన సందేహాలపై మంత్రి సమాధానమిచ్చారు.

KTR addressing on Watergrid project in Assembly

– వాటర్‌గ్రిడ్ ఆలోచనకు ఆనాడే అవార్డు – నెర్రెలు కొట్టిన పొలాలతోపాటు తడారిన గొంతుల దాహార్తిని తీరుస్తాం -ప్రతి ఇంటికీ నీళ్లిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు తుడుస్తాం – మూడేండ్లలో ఇంటింటికీ రక్షిత మంచినీరు – అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబు – అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మంత్రి కేటీఆర్ ప్రసంగం ఇలా సాగింది.. తెలంగాణ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతోనే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. కృష్ణా, గోదావరి నదులు తలాపున పారుతున్నా నల్లగొండ, పాలమూరు జిల్లాల ప్రజలకు గుక్కెడు రక్షిత మంచినీరు లభించడం లేదు. ఫ్లోరైడ్ విషపు నీటిని తాగుతూ రోగాల బారినపడుతున్నారు. ఆ నీళ్లు నల్లగొండ వంటి ప్రాంతాలను మానవరహితంగా మార్చుతుందని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు తెలంగాణకు చేసిన అన్యాయం. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌ జిల్లా ఏజన్సీలోని ప్రజలు బతకడానికి మురికినీరు తాగాల్సిన దుస్థితి నెలకొంది. అందుకే భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టడానికి సాహసం చేయని వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తిచేసి ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తాం.

గత పాలకులు అస్తిత్వాన్నే కాదు.. జీవితాలను ఛిద్రం చేశారు గతంలో రాష్ర్టాన్ని పాలించిన రెండు ప్రధాన పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్నే కాదు.. ప్రజల జీవితాలను ఛిద్రం చేశాయి. గత పాలకుల మాటలు తెలంగాణకు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. గుక్కెడునీళ్లకోసం ఆడబిడ్డలు అష్టకష్టాలు పడుతుంటే వారిని ఓట్ల యంత్రాలుగానే చూశారు. అధికారం, పదవి, ధన దాహాన్ని తీర్చుకున్న నాయకులు.. ప్రజల నీటి దాహాన్ని మాత్రం తీర్చలేదు. గత ప్రభుత్వాలు చేయని పనిని సమగ్రంగా పూర్తిచేస్తాం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్‌సింగ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ప్రణాళికను చూసి మెచ్చుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తే దేశానికే రోల్‌మోడల్‌గా ఉంటుందని కితాబిచ్చారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 20ఏండ్ల కిందటే బీజం పడింది. సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేసీఆర్ అప్పుడే రూ.62 కోట్ల వ్యయంతో 180 గ్రామాల్లో ఇంటింటికీ నీరందించారు.

2004లో కరీంనగర్ ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో ఇంటింటికీ నల్లా ప్రాజెక్టును ఇవ్వడానికి ప్రయత్నించగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడ్డుపడ్డారు. కేంద్రం 80% నిధులు ఇస్తానన్నది. మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ర్టాన్ని 20% నిధులు కోరితే వైఎస్ రెండు శాతం నిధులు కూడా ఇవ్వనని తిరస్కరించారు. దీంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అప్పుడే తెలంగాణలో గడపగడపకు నల్లా ఇవ్వాలనే సంకల్పం తీసుకున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన వాటర్‌గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టారు. రక్షిత మంచినీరనేది ప్రాథమిక హక్కుగా, కనీస మానవ హక్కుగా దేశానికి ఆదర్శంగా నిలిచే క్రమంలో ప్రతీ ఇంటికీ నల్లా ఇవ్వాలనుకున్నాం.

గ్రామాల్లో 100 ఎల్పీసీడీ, మునిసిపాలిటీల్లో 135 ఎల్పీసీడీ, కార్పొరేషన్లలో 150 ఎల్పీసీడీల నీటిని అందిస్తాం. అంతేకాదు పారిశ్రామికరంగం అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకోసం 10% నీటిని అందిస్తాం. ప్రస్తుతం వెయ్యి నుంచి 12 వందల ఫీట్లు బోర్లు వేసినా భూగర్భ జలాలు లభించని పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా ఇబ్బందవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉపరితల నీటిని వాడుకుని శుద్ధిచేసి ప్రజలకు అందిస్తాం. ఫ్లోరైడ్‌కు చరమగీతం పాడుతాం. నల్లగొండ జిల్లా పరిస్థితి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండాలంటే ఏకైక పరిష్కారం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి రక్షిత మంచి నీటిని అందించడమే.

30 సంవత్సరాల ముందుచూపుతో ప్రణాళిక రాబోయే 30 సంవత్సరాల్లో పెరిగే జనాభా, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటర్‌గ్రిడ్ ప్రణాళికలను రూపొందించాం. అంతర్జాతీయ స్థాయిలో రూపకల్పన చేశాం. కృష్ణానది, దాని ఉపనదులు, రిజర్వాయర్లనుంచి 19.65 టీఎంసీల నీటిని, గోదావరి, దాని ఉపనదులు, రిజర్వాయర్లనుంచి 19.62 టీఎంసీల నీటిని డ్రింకింగ్ వాటర్‌కోసం తీసుకుంటాం. ఎల్లంపల్లి లైను ద్వారా 3 టీఎంసీల నీటిని హైదరాబాద్ అవసరాల కోసం తరలిస్తున్నాం. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఇప్పటివరకు మంచినీటి సరఫరాకోసం నిర్మించిన వ్యవస్థను వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం.

వాటర్‌గ్రిడ్ ఆలోచనకే అవార్డు అందుకున్న ప్రాజెక్టు ఇది. హడ్కోవంటి ప్రతిష్ఠాత్మక సంస్థ అవార్డు ఇచ్చింది. ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా లేదు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్రాజెక్టులు మరో 50 పెంచుతున్నాం. రివర్స్ ఇంజినీరింగ్ విధానం ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. గ్రామీణ నీటి సరఫరా విధానాన్ని బలోపేతం చేయడానికి 1238 పోస్టులు మంజూరు చేశాం. లక్షా 25 వేల కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ పైపులైను దాదాపు ప్రపంచంలోనే పెద్దది. ఇది భూమి ఉపరితలాన్ని నాలుగుసార్లు చుట్టి వచ్చేంత పొడవైనది. తక్కువ ఖర్చుతో, పర్యావరణ అనుకూలమైన విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మిస్తున్నాం.

ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదు ప్రతిపక్షాలు వాటర్‌గ్రిడ్‌పై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కావాలని అంటున్నరు. అందులో ఏ మాత్రం నిజం లేదు. కేవలం 187 మెగావాట్ల విద్యుత్ సరిపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై తీవ్ర కసరత్తు చేశారు. కేసీఆర్.. వాక్‌శుద్ధే కాదు.. చిత్తశుద్ధి కూడా ఉన్న వ్యక్తి . అందుకే వికేంద్రీకరణద్వారానే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని నమ్మారు. అందులోభాగంగా 26 సెగ్మెంట్లుగా పనులు చేపట్టాం. 427 మండలాలను, 64 మునిసిపాలిటీలను, 98 నియోజకవర్గాలు లక్ష్యంగా 30 సంవత్సరాల భవిష్యత్ కాలపరిమితి అంచనాతో ప్రాజెక్టును చేపట్టాం.

భూసేకరణ సమస్య అవరోధం కావద్దనే ఉద్దేశంతో రైట్ ఆఫ్ యూజ్ పేరిట అసెంబ్లీలో తీర్మానం చేశాం. భూములు కోల్పోయిన నిర్వాసితులకు గరిష్ఠ ప్రయోజనం కల్పిస్తాం. మేం ప్రభుత్వ ఇంజినీర్లను విశ్వాసంలోకి తీసుకుని పనులు చేస్తున్నాం. దీనికోసం ముఖ్యమంత్రి స్వయంగా సీఈలతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న ఏఈలతో మాట్లాడారు. ఇలా మాట్లాడిన సీఎం చరిత్రలో ఎవ్వరూ లేరు. డీపీఆర్ పక్కాగా పూర్తిచేశాం. అయినా విమర్శలకు తావివ్వొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పజెప్పాం. పనుల నాణ్యతను పరిశీలించడానికి వ్యాప్కోస్‌ను థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్‌గా నియమించుకున్నాం. అంతేగాకుండా ప్రాజెక్టును స్మార్ట్‌గ్రిడ్‌గా తయారు చేస్తున్నాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. సచివాలయంలోనే డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి స్కాడావంటి విధానం ఏర్పాటు చేస్తాం. పనులు పూర్తిచేయడానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.

పారదర్శకంగా వాటర్‌గ్రిడ్ టెండర్లు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకతతో వాటర్‌గ్రిడ్ పూర్తిచేస్తాం. గత ప్రభుత్వాలు ఈపీసీ విధానం ద్వారా కాంట్రాక్టర్లకు పెద్దపీట వేశాయి. ప్రణాళికలు కాంట్రాక్టర్ల ఇష్టానుసారం జరిగాయి. వ్యయం ఇష్టానుసారంగా పెంచారు. అడ్వాన్స్‌లు పెంచి కాంట్రాక్టర్లు, నేతలు పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అలాంటి వాటికి అస్కారం ఇవ్వలేదు. గతంలో కొన్ని సంస్థలను ఎంపిక చేసి వాటికే టెండర్లు కట్టబెట్టేవారు. తర్వాత పనులను పూర్తిచేయకుండానే మధ్యలో వదిలేవారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సీడీఆర్‌కు లోనైన కంపెనీలకు అవకాశం కల్పించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక స్థోమత ఉన్న నిర్మాణరంగ సంస్థలకు పనులు లెస్ టెండర్లకు పారదర్శకంగా కట్టబెట్టింది.

మూడు దశల్లో చేపట్టిన 26 సెగ్మెంట్లకు పిలిచిన టెండర్లలో 18 నిర్మాణరంగ సంస్థలు పాల్గొన్నాయి. మూడు దశల్లో టెండర్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ స్థాయిలో అన్ని రకాల అనుమతులు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన, అర్థిక పరపతి ఉన్న సంస్థలకే టెండర్లు కట్టబెట్టాం. డీపీఆర్‌ను వ్యాప్కోస్ సంస్థ రెండుసార్లు పర్యవేక్షించింది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని కేంద్రప్రభుత్వం రాష్ర్టాలకు లేఖలు రాసింది.

ఆరుశాఖల సమన్వయంతో పనులు వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి ఆరుశాఖల సమన్వయంతో పనులు నిర్వహిస్తున్నాం. వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి సంబంధించి 226 రైల్వే క్రాసింగ్‌లు, 540 జాతీయ రహదారులు, 6,717 పంచాయతీరాజ్ రోడ్లు, 647 కాల్వలను దాటుకొని పైప్‌లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. చాలావరకు ప్రభుత్వ భూముల్లోంచే పైప్‌లైన్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాం. ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన నాయకులు సీఎం కేసీఆర్. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్‌పథకంతో ఇక నుంచి గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడిచి బిందెలు నెత్తిన పెట్టుకొని మంచినీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండదు.

వాటర్‌గ్రిడ్‌కు అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబు వాటర్‌గ్రిడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు మాటిమాటికీ అడ్డుతగులుతున్నారు. పాలమూరు, ఫ్లోరైడ్ బాధిత నల్లగొండకు నీళ్లు ఇవ్వకుండా బాబు అడ్డుపడుతున్నారు. వాటర్‌గ్రిడ్‌కు కృష్ణా జలాలు వాడుకోవద్దని ట్రిబ్యునల్ బోర్డుకు చంద్రబాబు లేఖ రాసిండు. కృష్ణా, గోదావరి నదీ జలాలనుంచి తెలంగాణకు న్యాయంగా 1200 టీఎంసీలు రావాల్సి ఉంది. వీటితో పాటు కృష్ణా, గోదావరిలో 10% నీళ్లు తాగునీటి అవసరాల కోసం వాడుకునే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం 42టీఎంసీల నీరు వాటర్‌గ్రిడ్‌కు అవసరం. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వాటిని దీటుగా ఎదుర్కొన్నం. తెలంగాణ తల్లికి 60 సంవత్సరాల పాటున్న సంకెళ్లను పోరాడి తొలగించుకొని రాష్ర్టాన్ని సాధించాం. అదే స్ఫూర్తితో వాటర్‌గ్రిడ్‌ద్వారా తెలంగాణ తల్లికి జలాభిషేకం చేస్తాం. తెలంగాణ వాటర్‌గ్రిడ్‌పై అన్ని మండలాల్లో టైమ్‌బౌండ్ మ్యాప్‌లు ఏర్పాటు చేస్తాం అని మంత్రి కేటీఆర్ చెప్పారు.

80శాతం గ్రామాలకు తాగునీరిచ్చినట్లు చూపిస్తే రాజీనామాకు సిద్ధం మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న నేతలు వాటర్‌గ్రిడ్‌కు డీపీఆరే లేదని ఒకరు, పనులు మొదలుకాకముందే అవినీతి జరిగిందని మరొకరు, ఇప్పటికే 80 శాతం గ్రామాలకు తాగునీరిచ్చామని, వాటర్‌గ్రిడ్‌కు రూ.36వేల కోట్లు అవసరమా? అని మరొకరు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టుల ద్వారా గ్రామాలలో 80శాతం నీళ్లు ఇస్తున్నామని చెప్తున్న వాళ్లు దానిని నిరూపిస్తే నేను పదవికి రాజీనామా చేస్తా.

అసలు డీపీఆర్ లేకుంటే ఏ ఫైనాన్షియల్ సంస్థ అయినా నిధులిస్తుందా? కేవలం విమర్శలు చేయడం ద్వారా నైతికైస్థెర్యాన్ని దెబ్బతీయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి. ప్రభుత్వంపై రాజకీయ దురుద్దేశంతోనే పనికట్టుకొని విమర్శలు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తాగునీటి కోసం ఒక్క చిత్తూరు జిల్లాకే రూ.7వేల కోట్లు తీసుకెళ్లారు. అలాంటిది పది జిల్లాలున్న తెలంగాణలో రూ.36వేల కోట్లు అవసరం లేదా?.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.