-హెచ్ఎండీఏలో ఈ మూడింటిపై దృష్టిపెట్టండి -టీఎస్ బీపాస్ చట్టంతో మార్పులు అనివార్యం -సిద్ధంగా ఉండాలని సూచించిన మంత్రి కేటీఆర్

హెచ్ఎండీఏ చేపట్టిన మౌలికవసతుల అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. టీఎస్ బీపాస్ చట్టం వచ్చిన తర్వాత హెచ్ఎండీఏలో జరుగబోయే మార్పులకు సిద్ధం కావాలని, ముఖ్యంగా ప్లానింగ్.. విజనింగ్.. డిజైనింగ్ వంటి అంశాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. అందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు.
హెచ్ఎండీఏ చేపట్టిన పలు అభివృద్ధి పనులపై మంత్రి శనివారం జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఔటర్ రింగ్‌రోడ్డుపై చేపడుతున్న మౌలికవసతుల కల్పన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రోత్‌కారిడార్ పరిధిలోని బఫర్‌జోన్‌లో వెలిసిన నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఇందుకు ఓఆర్ఆర్ విస్తరించి ఉన్న జిల్లాల కలెక్టర్ల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ తరహాలో ఆస్తుల పరిరక్షణకు అసెట్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటుచేసుకొని, ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ఓఆర్ఆర్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లుండేలా చూడాలన్నారు.
హెచ్ఎండీఏ కొనసాగిస్తున్న గ్రీనరీ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తంచేసిన మంత్రి ఇందుకు కృషిచేసిన అధికారులను అభినందించారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి అందజేశారు.నిర్వహించిన ఈ సమీక్షలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ కూడా పాల్గొన్నారు.