పోలీసుశాఖ పటిష్ఠానికి మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాజాగా ఆ శాఖపై వరాలజల్లు కురిపించారు. అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా పోలీసుశాఖ న్యాయమైన కోరికలను సీఎం నెరవేర్చారు. విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన అమరవీరుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. -అమరుల కుటుంబాలకిచ్చే ఎక్స్‌గ్రేషియా భారీగా పెంపు -వచ్చే ఏడాది నుంచే తెలంగాణ పోలీసు మెడల్స్ -ఎస్‌ఐ అధికారికి గెజిటెడ్ హోదా -కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు సీయూజీ సిమ్‌కార్డ్స్ -రోజువారీ బందోబస్తు భత్యం రూ.90 నుంచి రూ.250కి పెంపు

కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ హోదా వరకు ఉన్న సిబ్బంది విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ఇప్పటివరకు ఇస్తున్న పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్‌ఐ హోదా ఉన్న అధికారి చనిపోతే ఇస్తున్న పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షలకు.. సీఐ, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ హోదాగల అధికారులు మృతిచెందితే ఇస్తున్న మొత్తాన్ని రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు.. ఎస్పీస్థాయి లేదా ఐపీఎస్ అధికారి మృతి చెందితే ఇచ్చే పరిహారాన్ని రూ.50 లక్షల నుంచి రూ. కోటికి పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.
అమరవీరుల కుటుంబాల్లోని పిల్లల చదువులు, ఆ కుటుంబాలకు ఇంటినిర్మాణం ప్రభుత్వమే చూసుకుంటుందని హామీఇచ్చారు. చనిపోయినవారి రిటైర్మెంట్ వయసు వరకు ఆయా కుటుంబాలకు పూర్తి జీతం చెల్లిస్తామని.. వారికి రావాల్సిన ప్రయోజనాలను రెండు వారాల్లో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ పోలీస్ మెడల్స్ పోలీస్‌శాఖలోని అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అధికారులు, సిబ్బందికి తెలంగాణ పోలీస్ మెడల్స్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రిటైర్డ్ డీజీపీల నుంచి కానిస్టేబుళ్ల వరకు చప్పట్ల మోత మోగించారు. మొత్తం 20 మందికి తెలంగాణ పోలీస్ మెడల్స్ ఇస్తామని, అందులో మూడో వంతు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారని సీఎం ప్రకటించారు. మెడల్స్‌తోపాటు వన్‌టైమ్ బెనిఫిట్‌గా రూ.5 లక్షల నగదు పురస్కారం కూడా అందిస్తామని తెలిపారు.
ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా గెజిటెడ్ హోదా కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ల కల ఎట్టకేలకు నెరవేరనున్నది. ఎస్‌ఐలకు త్వరలోనే గెజిటెడ్ హోదా కల్పిస్తామని సీఎం ప్రకటించారు. మండలస్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎస్‌ఐలకు త్వరితగతిన గెజిటెడ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీయూజీ సిమ్‌కార్డులు.. ఇంటర్నెట్ సౌకర్యం పోలీస్‌శాఖ సమాచారవ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యంతో సీయూజీ సిమ్‌కార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. అంతర్గత విభాగాలను పటిష్ఠం చేసుకునేందుకు వీటిని వినియోగించాలని సీఎం సూచించారు.
రోజువారీ భత్యం పెంపు అసెంబ్లీ, పండుగలు, ఇతర కార్యక్రమాలు జరిగే సమయంలో వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేస్తారు. అలాంటి సిబ్బందికి ఇప్పటివరకూ ఇస్తున్న రూ.90 భత్యాన్ని రూ.250కి పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. బందోబస్తు సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
ఆరోగ్య భద్రత సీలింగ్ పెంపు పోలీస్‌శాఖలో అమలవుతున్న ఆరోగ్య భద్రత పథకాన్ని సీఎం మరింత బలోపేతం చేశారు. ఇప్పటివరకు కిందిస్థాయి సిబ్బందికున్న రూ.లక్ష సీలింగ్‌ను రూ.5 లక్షలకు పెంచారు. పైస్థాయి అధికారుల సీలింగ్‌ను రూ.2.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 40 ఏండ్లకు పైబడిన అధికారులకు ప్రతి ఆరు నెలలకోసారి పూర్తిస్థాయి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. వాస్తవానికి ప్రతి రెండేండ్లకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరినా.. సీఎం ఆరు నెలలకోసారని చెప్పడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో పోలీస్‌శాఖకు ఉన్న 15 క్యాంటీన్లలో కొనుగోలు చేస్తున్న వస్తువులపై వ్యాట్‌ను మినహాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
హామీలు కాదు ఆచరణలోనూ.. పోలీస్ సంస్మరణదినం సందర్భంగా ప్రకటించిన హామీలను అమలుచేసే దిశగా వెంటనే సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇచ్చిన హామీల్లో సిమ్‌కార్డు విషయం తప్ప మిగతా అన్ని ప్రతిపాదనలు సాయంత్రానికి హోంశాఖకు పంపించాలని డీజీపీ అనురాగ్‌శర్మను సీఎం ఆదేశించారు. ఈ మేరకు అన్ని ప్రతిపాదనలను హోంశాఖకు పంపించినట్లు డీజీపీ టీ మీడియాకు తెలిపారు. డ్రాఫ్ట్ జీవోకు సంబంధించిన అంశాలను కూడా సిద్ధం చేశామన్నారు.
జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం -పోలీసు అధికారుల సంఘం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన హామీలపై పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తంచేసింది. ఉమ్మడిరాష్ట్రంలో పోలీస్‌శాఖను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలకు సీఎం కేసీఆర్ దీటైన సమాధానం చెప్పేలా పథకాలు ప్రకటించారని సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి అన్నారు. ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదాను అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా సీఎం ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. ప్రతి ఆరునెలలకు ఉచిత వైద్యపరీక్షలు, సీయూజీ సిమ్‌కార్డులు తదితర హామీలను ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదన్నారు. తెలంగాణ పోలీస్ సిబ్బంది సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు.