దేశ పోలీసు చరిత్రలో పెద్దసంఖ్యలో తెలంగాణ పోలీసులకు వాహనాలు సమకూర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. పోలీసులు నిరంతరం సేవలతో ప్రజలకు దగ్గరవ్వాలి. అందుకే నూతన వాహనాలను అందజేస్తున్నాం. పోలీసు వ్యవస్థను పటిష్ట పర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని అంసెబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిలా ్లకేంద్రాల్లో ప్రభుత్వం పోలీసులకు కేటాయించిన నూతన వాహనాలను వీరు అందజేశారు.

-పోలీస్ వ్యవస్థ పటిష్టానికే వాహనాలు: స్పీకర్ సిరికొండ -దేశం గుర్తించేలా పనితీరు ఉండాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి -మన పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలవాలి: మంత్రి తుమ్మల జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు. వరంగల్‌కు కేటాయించిన 82 వాహనాలను హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్పీకర్ మధుసూదనాచారి అందజేశారు. ప్రజలకు న్యాయం చేయడానికి పోలీసులు వారదులు, సారథులుగా నిలవాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ గుర్తించి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శాస్త్రసాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. నల్లగొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఠాణాలకు కేటాయించిన 71 వాహనాలను విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేశారు.
పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో భయాన్ని పోగొట్టాల సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు దేశంలో మంచి పేరు తేవాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పోలీసులు కేసులను విచారణ జరిపి ప్రజలకు దగ్గర కావాలన్నారు.
ఖమ్మం జిల్లాకు కేటాయించిన 56 వాహనాలను ఎస్పీ స్టేడియంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్ట పర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకోసమే రూ. 350 కోట్లు కేటాయించి పోలీసుశాఖకు నూతన వాహనాలు కొనుగోలు చేశారని చెప్పారు. పోలీసులు లౌక్యంగా వ్యవహరిస్తూ శాంతి భధ్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.