– లక్ష్యానికి చేరువగా నమోదు ప్రక్రియ – టార్గెట్‌ను అధిగమించిన సూర్యాపేట జిల్లా, మేడ్చల్ సెగ్మెంట్ – జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లోనూ జోరు

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఈ నెల 20 చివరి తేదీ కావటంతో పోటాపోటీగా సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. చాలా గ్రా మాల్లో తుదిదశకు చేరుకున్నది. సూర్యాపేట జిల్లా మొత్తంగా చూస్తే రెండు లక్షల సభ్యత్వాల కు గాను 2.80లక్షలకు చేరుకున్నది. మేడ్చల్‌లో 50 వేలకుగాను 90వేల సభ్యత్వాలను దాటారు. జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలు టార్గెట్‌ను సమీపిస్తున్నాయి. సభ్యత్వం తీసుకున్నవారికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. సభ్యత్వ నమోదుపై ప్రత్యేకంగా దృష్టిసారించిన పార్టీ నాయకత్వం నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను నియమించింది. నమోదు ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి టీఆర్ఎస్ నేతలు చురుకుగా పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయి నేతలనుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు దగ్గరుండి నమోదు ప్రక్రియ విజయవంతమయ్యేందుకు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నమోదైన సభ్యత్వాల వివరాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. వివిధ జిల్లాల్లో ప్రక్రియ ఎలా సాగుతున్నదో పరిశీలిస్తున్నారు. చివరి తేదీవరకు ఇదే వేగాన్ని కొనసాగించాలని, ఉత్సాహంగా పనిచేయాలని సూచనలు చేస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి సభ్యత నమోదు ప్రక్రియపై మంచి స్పందన వస్తున్నది. ఎక్కడికక్కడే కేంద్రాలు ఏర్పాటుచేయడంతో నమోదు ప్రక్రియ మరింత సులువైంది. పార్టీ శ్రేణులు విస్తృతంగా పర్యటిస్తూ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. సభ్యులుగా చేరినవారి వివరాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్‌చేసే ప్రక్రియ అంతేవేగంగా కొనసాగుతున్నది. ఆన్‌లైన్‌ద్వారా enrol.trspartyonline.org వెబ్సైట్లో సభ్యత్వ నమోదుకు అవకాశం కల్పించడంతో పలుదేశాల్లోని టీఆర్ఎస్ అభిమానులు సైతం పెద్దఎత్తున నమోదు చేసుకుంటున్నారు. పెద్దఎత్తున నమోదు ప్రక్రియ కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

చురుగ్గా పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్లోని ఈసీనగర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమో దులో హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా మంత్రి మహమూద్ అలీ సభ్యత్వం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. నిర్మల్‌లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి చే తుల మీదుగా పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, భద్రాచలంలో ఇంచార్జి తెల్లం వెంకట్రావ్, పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం అమిస్తాపూర్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

దూసుకుపోతున్న జగిత్యాల, ధర్మపురి సెగ్మెంట్లు సభ్యత్వ నమోదులో ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు పోటీపడుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి 50 వేల చొప్పున సభ్య త్వ నమోదు లక్ష్యం విధించగా పలుచోట్ల టార్గెట్‌ను సమీపించాయి. మరికొన్నిచోట్ల లక్ష్యానికి మించి సభ్యత్వాలు చేయించేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. శుక్రవారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు మేడ్చల్ నియోజకవర్గంలో 50 వేలు టార్గెట్ కాగా ఇప్పటికే 90 వేల సభ్యత్వాల నమోదు దాటింది. జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లోనూ 45 వేల చొప్పున సభ్యత్వాలు పూర్తి చేయగా, సిద్దిపేటలో 40 వేల సభ్యత్వాలు చేశారు. కోరుట్ల, వేములవాడ, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో 30 వేల చొప్పున, బెల్లంపల్లిలో 21,483, చెన్నూర్‌లో 18,362, మంచిర్యాల నియోజకవర్గంలో 15,480 సభ్యత్వాలు నమోదయ్యాయి. కాగా సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను రెండు లక్షల టార్గెట్ కాగా ఇప్పటికే 2.80 లక్షల సభ్యత్వాలు చేయించి లక్ష్యాన్ని అధిగమించారు. నల్లగొండ జిల్లాలో మూడు లక్ష లు టార్గెట్ కాగా ఇప్పటివరకు 2.80 లక్షలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 8 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా కాగా ఇప్పటివరకు 4.25 లక్షలు నమోదు చేశారు.






