Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

‘పోతిరెడ్డి’పై పాడు కూతలు’

ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై కోతిసర్కస్‌లు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పాత్రధారులు. న్యాయమైన 11,500 క్యూసెక్కుల వాటాను కాదనివైఎస్‌ 44 వేల క్యూసెక్కులను రాయలసీమకు అప్పనంగా తీసుకుపోతుంటే కిమ్మనకుండా ఉన్నారు.

నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉంది నేటి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రాంత ముఖ్యమంత్రుల వద్ద తెలంగాణ అవసరాలను, ఆకాంక్షలను తాకట్టుపెట్టినవారు ఈరోజు పోతిరెడ్డిపాడుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యం వహిస్తున్నారని మాట్లాడుతున్నరు. అసలేం జరిగింది.. తమిళనాడుతో ఒప్పందంలో భాగంగా ఆనాడు ఎన్టీఆర్‌ తెలుగు గంగకు కేటాయించిన నీళ్లు ఎన్ని? ఆ తర్వాత 2 004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా మరో 33వేల క్యూసెక్కులు ఏ విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తీసుకుపోయాడు..? అక్రమంగా రాయలసీమకు తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ పదవుల కోసం బానిసల్లాగా మారిందెవరు అనేది ఇయ్యాల తేలాల్సిన అంశం.

ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై కోతిసర్కస్‌లు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పాత్రధారులుగా ఉన్నారు. న్యాయమైన 11,500 క్యూసెక్కుల వాటాను కాదని రాజశేఖర్‌రెడ్డి 44 వేల క్యూసెక్కులను రాయలసీమకు అప్పనంగా తీసుకుపోతుంటే కిమ్మనకుండా ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షపాత్రలో పులిచింతల నటనను మరిచిపోతే మదినుంచి పోయేది కాదు. నల్లగొండకు చెందిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షులతోపాటు నాటి ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు నాయకులు పులిచింతలను వ్యతిరేకించడమే కాకుండా ప్రాజెక్టు పనులను అడ్డుకొని మోటర్లను సైతం ప్రాజెక్టులో పడేసిన విషయం నల్లగొండ ప్రజలకు ముఖ్యంగా పులిచింతల ప్రభావిత ప్రాంత ప్రజలకు తెలుసు. మరి అంతగా వ్యతిరేకించినవారు అందులో ఏం మార్పు చేసిన్రని 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించినట్లో సమాధానం చెప్పాలి.

వీళ్ల రాజకీయ ప్రణాళికలో భాగంగా జూన్‌ 2న చేస్తారంటున్న దీక్షకు వేదిక అయిన ఎస్సెల్బీసీ టన్నెల్‌ ఇవ్వాళ్టివరకు ఎందుకు ఉపయోగంలోకి రాలేదు?.. ఆ పరిస్థితికి కారణమైన డిజైన్‌, సొరంగమార్గం అలైన్‌మెంట్‌, సంక్లిష్ట వ్యవహారాలకు ఎవరు కారణమో నల్లగొండ ప్రజలు మరిచిపోతారా! ఒకవైపు పులిచింతలను వ్యతిరేకించి తర్వాత స్వాగతించింది ఈ కాంగ్రెస్‌ నాయకులే. మరోవైపు ఎస్సెల్బీసీకి తప్పుడు విధానం ఎన్నుకొని దశాబ్దాలపాటు నల్లగొండ జిల్లాకు నీళ్లు రాకుండా చేశారు. 2004లో అధికారంలోకి రాగానే పోతిరెడ్డిపాడుకు ఆమోదం తెలిపి తద్వారా నల్లగొండ ఎడారిగా మారడానికి కారణమైన కాంగ్రెస్‌ వ్యవహారం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాశికి పోయినట్లుగా ఉంది.

తెలంగాణ మలిదశ ఉద్యమంలోనే టీఆర్‌ఎస్‌ స్పష్టమైన వైఖరి తీసుకున్నది. కృష్ణానదిపైన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా అనేక ధర్నాలు, దీక్షలు, సభలు, పాదయాత్రలు నిర్వహించింది. అధికారంలోకి వచ్చినా నాటి సిద్ధాంతాలనే కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నది. కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో రాజీపడే ప్రసక్తేలేదంటున్న కేసీఆర్‌పైన, టీఆర్‌ఎస్‌పైన నిత్యం ద్వంద్వవిధానంలో బతికే కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లే. ఉద్యమ సమయంలో అక్రమంగా సాగర్‌ నీటిజలాలను తరలించుకుపోతుంటే టీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డుకుంది. సాగర్‌ ఎడమకాలువల నిర్వహణ ప్రభుత్వమే నిర్వహించాలని నాటి ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చింది, ఎడమకాలువ ద్వారా న్యాయంగా రావాల్సిన నీళ్లవాటా కోసం ఉద్యమించింది. అక్రమంగా ఆర్డీఎస్‌ ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకుపోతున్న సందర్భంలో కేసీఆర్‌ పాదయాత్రలు కూడా చేశారు.

వైఎస్‌ సర్కారు 2006లో పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలించడానికి ప్రయత్నిస్తుంటే అప్పటికే అలయెన్స్‌లో భాగంగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఆరుగురు మంత్రులు క్యాబినెట్‌ సమావేశాల్లో తమ అసంతృప్తిని తెలియజేశారు. మంత్రిమండలి నుంచి బయటకు వచ్చారు. ఈ వాస్తవాలను ప్రజలు మరిచిపోతరా! పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని నాటి ప్రభుత్వం 44,000 క్యూసెక్కులకు పెంచడంపై తెలంగాణ వచ్చినాక బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ముందు సవాల్‌ చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా! కృష్ణా నీటి వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు పోతున్న వరదను అంచనా వేసే టెలిమెట్రీలను ఏర్పాటుచేయాలని పలుసార్లు హెచ్చరించింది. 2019 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పెంపు ప్రతిపాదన వచ్చిందన్న మీడియా వార్తల ఆధారంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. జీవో 203 వెలువడిన వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకునే చర్యల గురించి చర్చించింది. ఇవన్నీ వాస్తవం కాదా!

ఇంతటి అపర భగీరథున్ని పట్టుకొని పోతిరెడ్డిపాడుకు సంబంధించి కేసీఆర్‌ నిర్లక్ష్యంతో వ్యవహరించారని, అందువల్లనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మే 5న సంబంధిత 203 జీవోను తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమైనవి. వాటికి భంగం కలుగనంతవరకే కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకొని పక్క రాష్ర్టాల వరకు స్నేహసంబంధాలుంటాయి. తెలంగాణ ప్రాంత హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీస్తే కేంద్ర ప్రభుత్వమైనా, పక్క రాష్ర్టాలైనా రాజీపడే ప్రసక్తే ఉండదు.

(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు) కర్నె ప్రభాకర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.