Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పొత్తు లేదు గిత్తులేదు.. ఇక సమరమే : కేసీఆర్

కాంగ్రెస్ పార్టీతో విలీనం.. పొత్తు… ఏదీ ఉండదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తేల్చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధినేత స్పష్టం చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆలస్యం జరిగితే వందలాది బిడ్డలు చనిపోతున్నారని, ఇంకెంత కాలం ఈ చావులని తెలంగాణ ఇవ్వండని, అవసరమైతే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని బ్రతిమాలినా పట్టించుకోలేదని, తీరా నష్టం జరిగిన తరువాత చివరాఖరున నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ అన్నరు. అదీ తాము కోరుకున్న తెలంగాణ ఇవ్వలేదని, సంపూర్ణ తెలంగాణ కోసం ఇంకా కోట్లాడాలన్నారు. తెలంగాణ సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయమని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెపుతున్నట్లు విలీనం విషయంలో తాము ద్రోహం చేయలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు. విలీనం సమస్యపై నెల రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నా, కానీ అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నాతో మాట్లాడలేదని తెలిపారు.

ఉద్యమంలో ఎన్నో భరించామని, ఎన్నో సహించామని, ఒక్కో విద్యార్థిపై వందకు పైగా కేసులు పెట్టినా ఒక్క కాంగ్రెస్ నేతైనా మాట్లాడారా?, తానే లేకపోతే ఉద్యమాన్ని చిదిమేసేవారని, మొండిగా కొట్లాడటం వల్లే ఇవాళ కల సాకారమయిందన్నారు. ఇవాళ పీసీసీ పదవి పొందిన పొన్నాల లక్ష్మయ్య విద్యార్థులను గొడ్లను కొట్టనట్లు కొట్టియలేదా?, పదవులు అనుభవిస్తూ నీళ్ళూ నిధులు సీమాంధ్రకు దోచిపెట్టింది వీళ్ళు కాదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీపై గౌరవంతో సహనంగా ఉన్నామని, అయినా కాంగ్రెస్ పార్టీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఇక ఎంత మాత్రం సహించేది లేదని, టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తారో… కాంగ్రెసోళ్లు టీఆర్‌ఎస్‌లోకి వస్తారో చూద్దాం అని సవాల్ విసిరారు. ఇక రేపటి నుంచి చూసుకుందామన్నారు.

పదిహేను వందల మంది పిల్లలను పొట్టన పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే ఉద్యమం చేశామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ మోసం చేశారని పొన్నాల అనడం సబబు కాదన్నారు. ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పొన్నాల ఏ ముఖం పెట్టుకోని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల సూసైడ్ నోట్లో ఎవరి పేర్లు ఉన్నాయో తెలువదా అని ప్రశ్నించారు. విలీనానికి సంబంధించి జైరాం రమేశ్ నుంచి పొన్నాల దాకా అందరూ సొల్లు పురాణం మొదలు పెట్టారని ఎద్దెవా చేశారు. అక్రమంగా ఉద్యోగాలు కొల్లగొట్టడమే కాకుండా నీళ్లు, నిధులు దోచుకున్నారని మండిపడ్డారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.