Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పవర్‌ఫుల్ తెలంగాణ

-కావాల్సినంత కరంటు… కంటి నిండా నిద్ర.. -మటుమాయమైన చీకట్లు.. విరజిమ్ముతున్న వెలుగులు -దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా రికార్డు -చూద్దామన్నా కానరాని లోవోల్టేజీ, కోతల సమస్యలు -విద్యుత్‌రంగంలో కనీవినీఎరుగని మార్పు -ఆటోస్టార్టర్లు తొలిగించుకున్న 80 శాతం రైతులు -విద్యుత్‌పై భరోసాతో జోరుగా వ్యవసాయం -సమైక్య కష్టాలకు చెక్‌పెట్టిన సీఎం కేసీఆర్ ముందుచూపు -రికార్డుస్థాయిలో సాధించిన ప్రగతి చూద్దామన్నా కానరాని లోవోల్టేజీ.. కోతలు -80 శాతం ఆటో స్టార్టర్ల తొలిగింపు సమైక్య కష్టాలకు చెక్‌పెట్టిన సీఎం కేసీఆర్ ముందుచూపు

మీరు ఆంధ్ర నుంచి పోతే చిమ్మచీకట్లే గతి.. కరంటు రాదు.. మేమియ్యం.. బట్టలారేసుకోడానికే కరంటు తీగలు పనికొస్తయి.. అంటూ రాష్ట్రం రాకముందు వరకు తెగ శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు 24 గంటలు కరంట్ ఇస్తుంటే.. రైతులు ఆనందంగా పట్టపగలే తమకు కావలసినప్పుడే నీళ్లు వాడుకొంటుంటే.. తట్టుకోలేని అవే శకునపక్షులు పిచ్చికూతలు కూస్తున్నాయి.. తిక్క రాతలు రాస్తున్నాయి. తెలంగాణలో ఏదైతే జరుగదని.. జరుగకూడదని వాళ్లనుకున్నారో.. అందుకు పదిరెట్లు జరుగుతున్న అభివృద్ధిని చూసి అసహనంతో అల్లాడిపోతున్నారు. నిరంతర విద్యుత్తుతో మోటర్లు కాలిపోతున్నయని.. వాటిని బాగుచేయడానికి మెకానిక్కులు అడ్డగోలు బేరాలాడుతున్నారని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. కలలో కూడా ఊహించలేని ప్రగతిపథాన తెలంగాణ వ్యవసాయరంగం దూసుకుపోతుంటే ఓర్వలేనితనంతో చిత్తం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. వారి దగ్గర కానిదేదో ఇక్కడ జరుగుతుంటే తట్టుకోలేక.. ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి మనసురాక.. లేని లోపాలను ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాటి నుంచే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొంటూ.. విద్యుత్‌రంగంలో అంచెలంచెలుగా ముందుకు సాగుతూ.. ఒక్కో రికార్డును బ్రేక్‌చేస్తూ.. దేశంలోని అన్ని రాష్ర్టాల నోటివెంట ఔరా..! ఇదెలా సాధ్యమైంది? అనిపిస్తూ.. మూడున్నరేండ్ల స్వల్పవ్యవధిలో సేద్యానికి 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాచేస్తుంటే.. విమర్శకుల నోళ్లు నాలుక మడతేసుకొని కొత్త రాగాలందుకొంటున్నాయి. ప్రగతిని కండ్లారా చూసి కూడా గుర్తించలేని మూర్ఖులు.. కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక ప్రగతితో రైతులు ఇప్పుడు కంటినిండా నిద్రపోతున్నారు.

80%రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించుకుని.. తమకు అవసరం ఉన్నప్పుడు మోటర్లను ఉపయోగిస్తున్నారు 16,987 విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను 16,987 కోట్ల వ్యయంతో బలోపేతం చేశారు. కేవలం ఆరంటే ఆరు 400 కేవీ సబ్ స్టేషన్లు ఉండగా.. కేవలం నాలుగేండ్లలోనే మరో ఆరు సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. 220 కేవీ సబ్‌స్టేషన్లను 51 నుంచి 75కు పెంచారు. 4నాలుగేండ్లలో సుమారు 4 లక్షల కనెక్షన్లు అదనంగా ఇవ్వడంతో.. వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 23.04 లక్షలకు చేరింది. పీటీఆర్లను 5,194కు, డీటీఆర్లను 6,52,338 కి పెంచారు. లోవోల్టేజీ, కోతల సమస్య లేకుండా చేశారు. దీనితో 26.71 శాతం ఉన్న డీటీఆర్ల వైఫల్య శాతం19.7.2018 నాటికి 6.61 శాతానికి పడిపోయింది.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే విద్యుత్‌రంగంలో విప్లవాత్మకమార్పులను తీసుకొచ్చి అప్రతిహతమైన రికార్డును సృష్టించింది నేటి తెలంగాణ ప్రభుత్వమే. అంధకారంలో మగ్గిపోతారంటూ చేసిన బెదిరింపులను పటాపంచలుచేస్తూ.. రాష్ట్రం ఆవిర్భవించిన ఐదునెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలపాటు అందించి ప్రజలందరి మన్ననలు పొందింది. మూడేండ్ల కాలంలోనే అత్యంత కీలకమైన వ్యవసాయరంగానికి కూడా 2018 జనవరి ఒకటోతేదీ నుంచి 24 గంటలపాటు కరంటును అందించిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే.. ఇప్పుడు ఎక్కడా కోతలు లేవు.. లో వోల్టేజీ సమస్యలు రావడంలేదు.. ఎక్కడా ఫిర్యాదులు లేవు.

నాడు చిమ్మ చీకట్లు.. తెలంగాణ వేరుపడితే, చీకట్లు తప్పవని పిల్లిశాపాలు పెట్టిన సమైక్యనేతలు.. తెలంగాణలో అదే పరిస్థితిని నెలకొల్పి వెళ్లిపోయారు. తెలంగాణ ఆవిర్భవించిన 2014 జూన్ 2 నాటికి విద్యుత్ రంగంలో తీవ్రమైన సంక్షోభం నెలకొని ఉన్నది. అప్పటి గరిష్ఠ డిమాండ్ 5661 మెగావాట్లు ఉండగా.. అందులో 2700 మెగావాట్ల విద్యుత్ లోటు తెలంగాణను వేధిస్తూ ఉండేది. రాజధాని హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం 2 గంటలు.. రాత్రి 2 గంటల చొప్పున ప్రజలు విద్యుత్ కోతలను ఎదుర్కొనేవారు. జిల్లా కేంద్రాల్లో రాత్రి, పగలు.. 3 గంటల చొప్పున మొత్తం ఆరు గంటల కోతలుండేవి. ఇక మండల కేంద్రాల్లోనైతే.. రోజూ 8 గంటలకుపైగా విద్యుత్ కోతలుండేవి. గ్రామాల్లో పగలంతా విద్యుత్ ఉండేది కాదు. ఇక వ్యవసాయానికి పేరుకే 6 గంటల విద్యుత్.. కానీ 4 గంటల విద్యుత్‌కూడా అందుబాటులో ఉండేది కాదు. పైగా అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఇష్టం వచ్చినప్పుడు సరఫరాచేసేవారు. పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్ హాలీడేగా ప్రకటించారు. అంతకంటే ఎక్కువగానే కోతలు ఉండేవి.

నేడు నిరంతర వెలుగులు.. ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలో.. సమైక్యవాదుల సృష్టించిన భయాందోళనలను ఎలా చెల్లాచెదురు చేయాలో తెలిసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అందుకు అనుగుణంగా అత్యంత ప్రాముఖ్యమున్న విద్యుత్ అంశంపైనే తొలి సమావేశాన్ని నిర్వహించారు. సమైక్యవాదులు చెప్పింది తప్పని నిరూపించడానికి ఐదు నెలలపాటు తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఇంజినీర్లు అహరహం శ్రమించారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రచించి, అమలుచేస్తూ.. వేగంగా ప్రగతిని సాధించారు. దీంతో 2014 నవంబర్ 20 నాటికే గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాల్లో విద్యుత్ కోతలకు చరమగీతంపాడారు. అన్ని రంగాల్లోని వినియోగదారులందరికీ నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడంద్వారా ప్రభుత్వంపై నమ్మకం, భరోసాను కల్పించారు. అలాగే రైతులకు 7 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించడం ప్రారంభించారు.

24 గంటల విద్యుత్ చారిత్రాత్మకం.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వ్యవహరించి.. విద్యుత్ వ్యవస్థలను బలోపేతం చేయడంతో.. సీఎం కేసీఆర్ కలను సాకారం చేసే అవకాశం ఏర్పడింది. వ్యవసాయానికి కూడా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా ఇవ్వడాన్ని 2018 నుంచి ప్రారంభించారు. ఇది దేశచరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించిన సందర్భం. ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. ఇది మీకెలా సాధ్యమైందంటూ.. మన విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులను దేశంలోని అనేక రాష్ర్టాల ఉన్నతాధికారులు, డిస్కంల అధికారులు అడిగి తెలుసుకోవడం విశేషం. రాష్ట్రం ఏర్పడేనాటికి 19.02 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. నాలుగేండ్లలో సుమారు నాలుగు లక్షల కనెక్షన్లు అదనంగా ఇవ్వడంతో.. వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 23.04 లక్షలకు చేరింది. ఇదొక్కటి చాలు.. విద్యుత్‌పై తెలంగాణ రైతాంగం ఎంతటి నమ్మకం పెట్టుకుందో చెప్పడానికి.

అతి తక్కువగా.. ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యం.. దశాబ్దాలపాటు నిరంతరం కరంటు కోతలు.. లోవోల్టేజీ సమస్యలతో అన్ని రంగాల వినియోగదారులు.. ముఖ్యంగా రైతాంగం పడిన బాధలు అన్నీఇన్నీ కావు. సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా వ్యవసాయరంగాన్ని చెప్పుకోవచ్చు. విద్యుత్ కోతలు, ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యం, బారెడు డిమాండ్ ఉంటే.. జానెడు విద్యుత్ సరఫరా.. వెరసి వ్యవసాయ బావుల్లోని మోటర్లు కాలిపోవడం రైతుల దినచర్యల్లో భాగమైపోయింది. రాష్ట్రం ఏర్పడే సమయానికి 19.02 లక్షల విద్యుత్ కనెక్షన్లు (అన్ని రంగాల కనెక్షన్లు 1.19 కోట్లు) ఉండగా.. వీటికోసం కేవలం 3,272 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు (పీటీఆర్), 4,69,512 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్) ఉండేవి. లోవోల్టేజీలు, కోతల కారణంగా 26.71% డీటీఆర్ వైఫల్యం ఉండేది.

నూతన శకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ విద్యుత్ రంగాన్ని గట్టెక్కించడం ద్వారా.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నూతన శకాన్ని ఆవిష్కరించారు. విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి అనుగుణంగా చర్చించి, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచించి.. విద్యుత్ ఉద్యోగుల శ్రమతో, సాధనతో అనుకున్నది సాధించారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి.. పీటీఆర్, డీటీఆర్‌ల సంఖ్యను గణనీయంగా పెంచారు. పీటీఆర్‌లను 5,194కు, డీటీఆర్‌లను 6,52,338 కి పెంచారు. లోవోల్టేజీ, కోతల సమస్య లేకుండాచేశారు. దీనితో 26.71 శాతం ఉన్న డీటీఆర్‌ల వైఫల్య శాతం కాస్తా.. జూలై 19 నాటికి 6.61 శాతానికి పడిపోయింది. గతంలో ప్రతిరోజూ కనపడే ధర్నాలు, ఘెరావ్‌లు, సబ్‌స్టేషన్లపై దాడులు, విద్యుత్ సిబ్బంది నిర్బంధాలు, విద్యుత్ కోతలపై నిరసనలు.. ఇవన్నీ గతమే. గడిచిన నాలుగేండ్లుగా ఇటువంటివి చూద్దామన్నా కనపడటం లేదు. ఎక్కడా ఒక్క ఫిర్యాదు వచ్చిన దాఖలాల్లేవు. విద్యుత్ మోటర్లు కాలిపోవడం అనేది రైతులు ఆశ్చర్యంగా చూసే అంశంగా మారిందనటం అతిశయోక్తికాదు.

స్వచ్ఛందంగా అటోమెటిక్ స్టార్టర్ల తొలిగింపు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ రైతాంగంలో నమ్మకాన్ని పాదుకొల్పింది. గతంలో ఉన్న అటోమెటిక్ స్టార్టర్లను సుమారు 80% రైతులు స్వచ్ఛందంగా తొలిగించుకున్నారు. అవసరం ఉన్నప్పుడు మోటర్లను ఉపయోగించుకొంటున్నారు. కొన్నిచోట్ల 24 గంటలపాటు మోటర్లను అలాగే ఉపయోగించడంతో బోర్లలో నీళ్ళు తగ్గిపోయి, మోటర్లు కాలిపోతున్నాయి. నాణ్యతలేనివి, స్టార్ రేటెడ్ కాకుండా స్థానికంగా తక్కువ ధరకు లభించేవి, అసెంబుల్డ్ మోటర్లు ఉపయోగిస్తుండటం కూడా అవి కాలిపోవడానికి కారణమవుతున్నది. నిరంతరాయంగా నీళ్లు పెట్టడం వల్ల పంటలుకూడా పాడవుతాయని రైతులే ఒప్పుకుంటున్నారు. పంటలకు ఎంత నీళ్లు అవసరమో అంతే పెట్టాలి.వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్న రైతులు స్వచ్ఛందంగా అటోమెటిక్ స్టార్టర్లను తీసివేసి, విద్యుత్‌ను ఆదా చేస్తున్నారు. పంటల దిగుబడిని పెంచుకొంటున్నారు.

రూ.16,987 కోట్లతో వ్యవస్థ పటిష్ఠం.. విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడమేకాకుండా ఆ విద్యుత్‌ను అన్ని రంగాలకు అందించడం నిజంగా సవాలే. దీని కోసం సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ట్రాన్స్‌కో, డిస్కంల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఇంజినీర్లు నిరంతరం శ్రమించారు. రూ.16,987 కోట్ల వ్యయంతో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతంచేశారు. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ చర్యలు తీసుకొన్నారు. అప్పటివరకు కేవలం ఆరంటే ఆరు 400 కేవీ సబ్ స్టేషన్లుండగా.. కేవలం నాలుగేండ్ల కాలంలో మరో ఆరు సబ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. 220 కేవీ సబ్ స్టేషన్లను 51 నుంచి 75కు పెంచారు. 132 కేవీ సబ్ స్టేషన్లను 176 నుంచి మన అవసరాలకు అనుగుణంగా 224కు పెంచారు. దాదాపు 17 వేల సీకేఎం ఉన్న ఈటీహెచ్ లైన్లను 21,709 సీకేఎంకు పెంచారు. 14 వేల ఎంవీఏ వరకు ఉన్న ట్రాన్స్‌ఫార్మేషన్ల సామర్థ్యాన్ని 25,682 ఎంవీఏకు తీసుకొచ్చారు. ఇక 33 కేవీ సబ్ స్టేషన్లు, డిస్కం విద్యుత్ లైన్లను భారీగా పెంచారు. 3,272 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను 5,194కు పెంచారు. అలాగే డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యను 4.69 లక్షల నుంచి 6.52 లక్షలకు పెంచారు. దీనికి తోడుగా.. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 5,880 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. విద్యుత్‌పై భరోసాతో వ్యవసాయం

ఎవరెన్ని కూతలు కూసినా.. పల్లెల్లో రైతులు నిరంతర విద్యుత్‌ను ప్రణాళికాబద్ధంగా వాడుకుంటున్నారు. అవసరమున్న సమయంలో పంటలకు నీరు పెట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సోన్‌పేట్‌కు చెందిన నర్సయ్య దుబాయ్ వెళ్లి ఇంటికి వచ్చి ఇరవై నాలుగు గంటల విద్యుత్‌తో గత యాసంగిలో నాలుగెకరాల్లో వరి, ఆరుతడి పంటలను సాగు చేసుకున్నాడు. నిరంతర విద్యుత్ సరఫరాతో అదనంగా రెండు ఎకరాల సాగు పెంచుకోబోతున్నానని ఆనందంగా చెప్పాడు. కామారెడ్డి జిల్లాలో గతంలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. పంటలను కాపాడుకునేందుకు రైతులు పొలాల వద్దనే నిరీక్షించాల్సి వచ్చేది. అధిక ఒత్తిడితో పటాకుల్లా పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్‌లతో, కాలిపోయే మోటర్లతో రైతన్నలు అవస్థలు పడ్డారు. ఇప్పుడలాంటి ఘటనలే లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3.20 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి.

తెలంగాణలోనే అత్యధికంగా వ్యవసాయ పంపుసెట్లు ఉన్న జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే శాతం తగ్గింది. 2016-17లో 9.37 శాతం ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్ ఉండగా 2017-18 నాటికి 7.6 శాతానికి తగ్గించారు. గడిచిన ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చూస్తే ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్‌శాతం 0.47 శాతంకు పడిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 24 గంటల కరంటుకు తోడు బోర్లలో పుష్కలంగా నీరుండటంతో మోటర్ల వినియోగం పెరిగింది. రైతులు స్వచ్ఛందంగా అటోమెటిక్ స్టార్టర్లు తొలిగించుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బోరు మోటర్లు మరమ్మతు చేసే దుకాణల్లో గిరాకీ లేక ఖాళీగా ఉన్నామని మోటర్ల మెకానిక్‌లు చెప్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,13,511 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరాతో రైతులంతా బోరుబావుల కింద పంటలు సాగుచేసుకుంటున్నారు.

రైతులు స్వచ్ఛందంగా అటోమెటిక్ స్టార్టర్లు తొలిగించుకోవాలని మంత్రి హరీశ్‌రావుతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సభలు సమావేశాల్లో చేసిన సూచనలకు రైతులు స్పందించారు. 24 గంటల సరఫరాతో విద్యుత్ సమస్యలు తీరి.. రైతులు ప్రశాంతంగా పంటలు సాగుచేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అవసరాలన్నిటికీ 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ ప్రతి రోజు ఖర్చవుతున్నది. వ్యవసాయ సీజన్ ఊపందుకున్న దశలో 18 మిలియన్ యూనిట్ల వరకు రోజువారీ వినియోగం ఉన్న సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో 1.10 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. నిరంతర విద్యుత్తు సరఫరా కోసం అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటుతోపాటు రెండు వేలకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు, 60కిపైగా సబ్‌స్టేషన్లను నిర్మించగా.. వెయ్యి కిలోమీటర్లకుపైగా కొత్త లైన్లను ఏర్పాటుచేశారు. దీంతో రైతులకు లోవోల్టేజీ సమస్య లేకుండా ఓవర్‌లోడ్ భారం పడకుండా నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతున్నది. నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభించాక సగానికిపైగా ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు తగ్గిపోయాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి జితేందర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో 20 ఏండ్లుగా మోటర్ల మెకానిక్. ఒకప్పుడు లోవోల్టేజీ, ఇతర సమస్యలతో మోటర్లు పాడైపోయి.. చేతినిండా పని ఉండేది. ఇప్పుడు వ్యవసాయానికి నాణ్యమైన కరంట్ ఇస్తుండటంతో మోటర్లు కాలిపోవడం తగ్గింది. దీంతో గిరాకీ తగ్గి, వెల్డింగ్‌వర్క్ చేస్తున్నాడు. తాను వేరే పనిచూసుకున్నా, రైతులకైతే మేలు జరుగుతున్నదని సంతోషంగా చెప్తున్నాడు.

వెలుగుతున్న పరిశ్రమలు నిరంతర విద్యుత్‌తో వాణిజ్య, వ్యాపార, చిన్న మధ్య, భారీ పరిశ్రమలకు నిరంతరం పని ఉంటుంది. దీంతో అక్షరాస్యులైన, లేకపోయినా ఉపాధి దొరుకుతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్ కాటేజీ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, వీధిదీపాలు, జనరల్ (స్వచ్ఛంద), తాత్కాలిక, భారీ పరిశ్రమలు తదితర క్యాటగిరీల్లో కలిపి 61,27,082 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటికి 1,35,426 ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ప్రధానంగా 423 సబ్‌స్టేషన్ల ద్వారానే విద్యుత్ పంపిణీ చేస్తున్నారు. రోజుకు సుమారుగా 3 వేల మెగావాట్ల విద్యుత్‌ను రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో వినియోగిస్తున్నారు. గతంలో సరఫరా చేసే విద్యుత్ తక్కువైనా అధికారులకు కంటిమీద కునుకు ఉండేది కాదు. ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ చర్యలతో ప్రతి ఒక్కరిలో చిరునవ్వులా విద్యుత్ కాంతులు కనిపిస్తున్నాయి.

నిరంతర కరంట్‌తో బేఫికర్ కొవ్తొతులు చేసేవాళ్లు.. లోవోల్టేజీ సమస్యతో కాలిన మోటర్లకు వైండింగ్ చేసిన వాళ్లతో మాట్లాడితే తెలంగాణ రాకముందు వచ్చిన తరువాత మారిన రైతు బతుకు చిత్రం స్పష్టం అవుతున్నది. తెలంగాణ రాకముందు బువ్వతినేందుకు సుత పగటిపూట రికాం ఉండేది కాదు. అసుంటిది.. గీ సర్కార్ పుణ్యమా అని ఇప్పుడు మాకు గిరాకే లేకుండా పోయింది అని మోటర్ మెకానిక్‌లు పేర్కొంటున్నారు. అదే సమయంలో వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్న రైతులు సంతోషంగా ఉన్నరు అది చాలు అని వరంగల్ నగరంలో కాలిన మోటార్లకు వైండింగ్ చేసే వ్యక్తి చెప్పారు.

దుష్ప్రచారం తగదు.. 24 గంటల విద్యుత్ సరఫరాతో ఎలాంటి సమస్య లేదు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఆరు ఎకరాలు సాగుచేస్తున్నాను. గతంలో ఎన్నోసార్లు ట్రాన్స్‌ఫార్మర్లు, మోటర్లు కాలిపోయినయి. ఇప్పుడు ఆ సమస్యే లేదు. 24గంటల ఉచిత విద్యుత్ మొదలుకాగానే నేను ఆటోమెటిక్ స్టార్టర్ తీసేసిన. నాలాగే ఆటోమెటిక్ స్టార్టర్లను తీసేసినోళ్లకు ఎట్లాంటి ఇబ్బందీ లేదు. – పుట్ట పుల్లారెడ్డి, రైతు ఇమాంపేట

ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం తగ్గింది 24గంటల కరంటు ఇవ్వకముందు మా దగ్గరికి నెలకు 25 నుంచి 30 ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చేవి. వీటిని రిపేరుచేసే వరకు రైతులందరూ ఇక్కడే ఉండేవారు. సెక్షన్ పవర్ మెకానికల్ (ఎస్పీఎం) సెంటర్ పరిధిలోని హుస్నాబాద్ పట్టణంతోపాటు రూరల్ మండలంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు నెలకు కేవలం 8 నుంచి 10 ట్రాన్స్‌ఫార్మర్లు మాత్రమే కాలిపోయి వస్తున్నయ్. ఇవి కూడా పిడుగుపాటువల్ల, వైర్లు ఒకదానికొకటి తాకడంవల్ల, చెట్లకొమ్మలు తాకడంవల్ల మాత్రమే కాలిపోతున్నాయి. -మర్యాల మహేందర్‌రెడ్డి, ఎస్పీఎం ట్రాన్స్‌ఫార్మర్ మెకానిక్ -హుస్నాబాద్

లో వోల్టేజీ, కోతలు లేనప్పుడు వైఫల్యం ఎందుకుంటుంది? రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిమాండ్ ఎక్కువ ఉండేది.. సరఫరా తక్కువగా ఉండేది. దీంతో లోవోల్టేజీ, కోతలు నిత్యకృత్యంగా కనిపించింది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో వేల కోట్ల వ్యయంతో సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతంచేశాం. ఇప్పటి అవసరాలతోపాటు, భవిష్యత్‌నుకూడా దృష్టిలో పెట్టుకుని 400 కేవీ నుంచి 33 కేవీ వరకు పటిష్ఠపరిచాం. కేవలం నాలుగేండ్లలోనే నాలుగు లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. అన్ని రంగాలను చూసుకుంటే.. 21 లక్షల విద్యుత్ కనెక్షన్లు పెరిగాయి. కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన విద్యుత్‌ను, పంపిణీ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చాం. 24 గంటల ఉచిత విద్యుత్ అందుబాటులో ఉండటంతో.. ఎక్కడా ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యం కనపడటం లేదు. మోటర్లు కాలిపోవడం లేదు. గతంలో ఉన్న 26.71% వైఫల్యాలను 6.61 శాతానికి తగ్గించాం. లోవోల్టేజీలు లేవు.. కోతలు లేవు. రైతులు స్వచ్ఛందంగా అటోమెటిక్ స్టార్టర్లను తీసివేశారు. – డీ ప్రభాకర్‌రావు, సీఎండీ, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో

ఒక యూనిట్ ఆదా చేస్తే.. 1.2 యూనిట్లు ఉత్పత్తి చేసినట్టే.. నీటిని పొదుపుగా, అవసరం మేరకే వాడుకోవడంతో విద్యుత్‌ను పొదుపు చేస్తున్నట్టే లెక్క. కేంద్ర విద్యుత్ సంస్థల అంచనాల ప్రకారం ఒక యూనిట్ విద్యుత్‌ను పొదుపు చేయడమంటే.. 1.2 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్టే. అంటే తెలంగాణ రైతాంగం ఇటు నీరు, విద్యుత్‌లను పొదుపు చేస్తూనే.. పరోక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. – రఘుమారెడ్డి, సీఎండీ, ఎస్పీడీసీఎల్

కిరాయి కష్టమైతంది పదిహేనేండ్ల నుంచి వైండింగ్ షాపు నడుపుతున్నా. సీజన్‌లో దాదాపు 300 నుంచి 400 మోటర్లు రిపేరు చేసేవాడిని. నా దగ్గర నలుగురు వర్కర్స్ ఉండేవారు. రెండు గదులను అద్దెకు తీసుకొని షాపు నడిపించేవాడిని. ఈ సీజన్‌లో 10-12 మోటర్లు మాత్రమే రిపేరుకు వచ్చాయి. షాపు నిర్వహణ కష్టంగా మారింది. ఒక గదినే ఇద్దరం(టైలర్‌షాపు) పంచుకొని అద్దె చెల్లించుకుంటున్నాం. – శ్రీరాముల సాంబయ్య, వైండింగ్ షాపు యజమాని, దండేపల్లి, మంచిర్యాల జిల్లా

రిపేర్లు మానేసి వ్యవసాయం చేస్తున్నా గత పదేండ్లుగా మోటర్ మెకానిక్ పనిచేశాను. ఇప్పుడు మాకు పని కరువైంది. ప్రత్యామ్నాయంగా వ్యవసాయం ఎంచుకున్నాను. నాకు ఎకరం భూమి ఉంది. దీనికితోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. – ఈర్ల మహేందర్, ఎలక్ట్రిషియన్, రామకృష్ణపూర్(వీ), జయశంకర్ భూపాలపల్లి జిల్లా

కరెంటు మోటర్లు కాలిపోవడం తగ్గింది పోయిన సంవత్సరం వానకాలంలో ఈ టైమ్ వరకు నా దగ్గర కనీసం 10 నుంచి 20 మోటర్లు రిపేరు కోసం ఉండేవి. ఏడాదికాలంగా రోజుకు కనీసం ఒకటి కూడా రావడంలేదు. గతంలో గడియ తీరిక ఉండకపోయేది. ఇప్పుడు ఎక్కువ సమయం ఖాళీగా ఉండి తక్కువ సమయం పనిచేస్తున్నం. -పోగుల సత్యం, మోటర్ మెకానిక్, హుస్నాబాద్

ఎదురుచూసే గోస తప్పింది నాకు బాయి కింద ఎకురం పొలం ఉన్నది. మునుపు దీన్ని పారిచ్చెతానికి ఈన్నే ఉండాల్సి వచ్చేటిది. రాత్రి కరంటు ఇచ్చినపుడు అరిగోసపడ్డం. ఇపుడు మా ఇంట్ల ఆడోళ్లచ్చిగూడ కరెంటు పెట్టుతున్నరు. చాన సంతోషంగున్నది. ఇపుడు ఎకురం పొలం పారెతానికి రెండు గంటలు సరిపోతంది. – బెజ్జంకి రాజయ్య, గోపాల్‌పూర్ రైతు

నాటి కష్టాలు తలుచుకుంటే దుఖమస్తది మునుపటి కరెంటు కష్టాలు తలుచుకుంటే దుఖమస్తది. ఇంటికాడ ఉన్నా, ఎటన్న ఊరికిపోయినా పాణమంతా కరెంటు మీదికే కొట్టుకునేది. ఎప్పుడస్తదో, పొలమెప్పుడు పారుతదో.. ఇదే రంది. కరెంటచ్చినంక లోఓల్టేజీ వచ్చి మోటరు కాలుతదో.. ట్రాన్స్‌ఫార్మర్ కాలుతదో తెల్వకపోవు. – అనుముల నాగరాజు, రైతు, కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్

పైసలు మిగులుతున్నాయి మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబంలోని ఏడుగురికి 62 ఎకరాల భూమి ఉంది. 7 వ్యవసాయ బోరు బావులున్నాయి. గతంలో ప్రతి పంటకు మూడు, నాలుగుసార్లు మోటర్లు కాలిపోయేవి. తరుచూ మరమ్మతు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మా మోటర్లకు సమస్యలు రాలేదు. శ్రమ తగ్గింది. -పల్లె సురేందర్, రైతు, నిజాలాపూర్, మూసాపేట మండలం,మహబూబ్‌నగర్ జిల్లా

బోరు బావుల కింద సాగు బాగుంది బోరు బావుల కింద ఇప్పుడు సాగు బాగుంది. 24గంటల విద్యుత్ తర్వాత నీటి సమస్య తీరింది. ఎప్పుడు అవసరముంటే అప్పుడు సాగు నీటిని వాడుకుంటున్నాం. లోవోల్టేజీ సమస్య లేకపోవడంతో మోటర్లు కాలిపోవడం లేదు. – సాయన్న, రైతు, కమ్మర్‌పల్లి, నిజామాబాద్ జిల్లా

వ్యవసాయం గాడినపడినట్లే వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇస్తే చాలనుకున్నాం. దండుగనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్న సీఎం కేసీఆర్ సారుకు రైతులంతా రుణపడి ఉంటారు. తెలంగాణలో వ్యవసాయం గాడిలో పడినట్లే. – సమద్, యువ రైతు, కుర్తి గ్రామం, పిట్లం (కామారెడ్డి జిల్లా)

బోర్లు కాలిపోయినట్లు ఫిర్యాదులు రాలేదు నిజామాబాద్ జిల్లాలో 70 శాతం పొలాల్లో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. కరెంట్ సరఫరా సమృద్ధిగా ఉండడంతో లోవోల్టేజీ సమస్య రాలేదు. బోర్లు కాలిపోవడంలేదు. రైతులు కూడా ఫిర్యాదులు చేయలేదు. -ప్రభాకర్, నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ

ఆటోమెటిక్ స్టార్టర్లు తీసేసినాం నాకు పదెకరాలు భూమి ఉంది. పత్తి, సోయాబిన్ పంటలు వేశాను. ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. పంటలకు అవసరమైనప్పుడు నీటిని వాడుకుంటున్నాను. మా ప్రాంతంలోని రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లు తీసివేసి నీరు, కరెంటు పొదుపు చేస్తున్నారు. దీంతో మోటర్లు కాలిపోవడం లేదు. ప్రభుత్వం సరఫరాచేస్తున్న విద్యుత్‌తో రెండు పంటలు సాగుచేసుకునే అవకాశం లభించింది. -ఆడ్డి అశోక్‌రెడ్డి, పొచ్చర, ఆదిలాబాద్ మండలం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.