పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి -మంత్రి హరీశ్ రావు

స్వరాష్ట్రం వచ్చాక విద్యుత్, తాగు నీటి సమస్యలు తీరాయని, ముఖ్యంగా విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం భారతీనగర్ డివిజన్లోని సాయిబాబానగర్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించి హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అల్లర్లు లేకుండా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తుండటంతో ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదన్నారు.
బీజేపీది రెండు నాల్కల ధోరణి.. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ సర్కార్ భేషుగ్గా పనిచేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కితాబుబిస్తే.. మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విఫలమైందని అనడం బీజేపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. బీజేపీ నాయకులు ఎక్కడైనా కరోనా బాధితులకు అండగా నిలిచిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ‘కష్టాల్లో ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చాం.. ఎన్నికల్లో ఓట్లు అడగటానికీ మీ ముందుకు వచ్చాం.. అభివృద్ధి చేయడం, అండగా నిలువడం మా వంతు’ అని హరీశ్‌రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సింధూరెడ్డిని కార్పొరేటర్‌గా గెలిపించాలని ఆయన కోరారు.