Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రాజెక్టులకు కాంగ్రెస్ దగా

-పాలమూరు ప్రాజెక్టు వద్దంటూ కోర్టుల్లో కేసులు
-ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి బాబు 30 లేఖలు
-సాగుకు నీళ్లు కావాలా.. రైతులకు కన్నీళ్లు కావాలా?
-ఆ కూటమికి ఓటేస్తే మరణశాసనం రాసుకున్నట్టే
-టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే ప్రాజెక్టులు పూర్తి
-మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు
-కల్వకుర్తి ప్రజా ఆశీర్వాదసభలో మంత్రి కే తారకరామారావు
-సిరిసిల్లలో నేడు కేటీఆర్‌కు నేతన్నల కృతజ్ఞత సభ

టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు అడుగడుగునా ఆటంకాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ పనిచేస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలను అడ్డుకొనేందుకు ఏకంగా 30 ఉత్తరాలను కేంద్రానికి రాశారని గుర్తుచేశారు. వన్యమృగాలకు ఈ ప్రాజెక్ట్ ఆటంకమంటూ కాంగ్రెస్ నేతలు హర్షవర్ధన్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి కోర్టులు, గ్రీన్‌ట్రిబ్యునల్‌లో కేసులు వేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు 200 కేసులు వేశారని, చనిపోయినవారి పేర్లతోనూ కేసులు వేయించిన ఘనత కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడుతూ, దాదాపు యాభై ఏండ్ల కాంగ్రెస్, 17 ఏండ్ల టీడీపీ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా తలాపునే కృష్ణమ్మ పరుగులు పెడుతున్నా, కాంగ్రెస్, టీడీపీ నేతల నిర్లక్ష్యంతో ఎడారిగా మార్చారని, ఫలితంగా వలసలకు, పేదరికానికి ఈ ప్రాంతం చిరునామాగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8-9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే, కాంగ్రెస్ నేతల కండ్లు ఎర్రబడుతున్నాయని, అందుకే కేసులతో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. 65 ఏండ్లకుపైగా పాలన సాగించి ప్రజలకు కన్నీళ్లను మిగిల్చిన టీడీపీ, కాంగ్రెస్‌లే ఇప్పుడు కూటమి పేరుతో జతకట్టాయన్నారు. ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ కావాలా? ప్రజలకు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్, టీడీపీ కావాలా? ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. మహాకూటమికి ఓటేస్తే మరణశాసనం రాసుకున్నట్టేనని, సాగు నీళ్లు కావాలో.. కన్నీళ్లు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఇదేనని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను కాలగర్భంలో కలిపేందుకు టీడీపీని స్థాపిస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. కానీ, మూల సిద్ధాంతాన్ని కాలగర్భంలో కలిపేసి కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌నే మట్టికరిపించిన నేల కల్వకుర్తి అని, చైతన్యవంతులైన ప్రజలు సత్తా చాటి జైపాల్‌యాదవ్‌ను అధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు.

కాంగ్రెస్ తగ్గట్టుగానే వారిది మొండిచెయ్యి గుర్తు
రాష్ర్టాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజలకు మొండిచెయ్యి చూపించిన కాంగ్రెస్ తీరుకు తగ్గట్టుగానే, వాళ్ల గుర్తు మొండిచెయ్యిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. ప్రజలకు చెవిలో పువ్వుపెడుతామన్నట్టుగా బీజేపీకి గుర్తు ఉన్నదని చమత్కరించారు. కల్వకుర్తిలో 1.1 లక్షల ఎకరాలకు నీళ్లు

కల్వకుర్తి నియోజవర్గానికి ఎంజీకేఎల్‌ఐ నీటిని తీసుకొచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, 35 వేల ఎకరాలకు నీళ్లిచ్చామని, ఎవరిపైనా వివక్ష లేదని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ద్వారా నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ టీఆర్‌ఎకు అధికారం ఇచ్చి రెండోసారి సీఎంగా కేసీఆర్‌కు అవకాశం కల్పించాలని కోరారు. అప్పుడే ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కారు ఆగవద్దని, డ్రైవర్ మారొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

రైతుబంధు దేశానికే ఆదర్శం
సీఎం కేసీఆర్ రైతుబిడ్డ కావడంతోనే అన్నదాతల కష్టాలను తీర్చేపథకాలను ప్రవేశపెట్టారని మంత్రి కేటీఆర్ చెప్పారు. రైతన్నల అవస్థలు నాలుగేండ్లలో తొలిగిపోయాయని, రూ.17 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీచేశామని గుర్తుచేశారు. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే రూ.లక్ష రుణమాఫీని చేయబోతున్నారని వివరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆసరా, వికలాంగుల పింఛన్లను రూ.2116, రూ.3016కు పెంచుతామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని ప్రకటించామని తెలిపారు. 58 ఏండ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పారు.

సేవకుడిలా పనిచేశా: అభ్యర్థి జైపాల్‌యాదవ్
కల్వకుర్తిలో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి అసెంబ్లీకి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, మీరు ఆశీర్వదించి గెలిపిస్తే సేవకునిలా పనిచేస్తానని, అన్నిరంగాల్లో కల్వకుర్తి అభివృద్ధికి కృషిచేస్తానని స్థానిక అభ్యర్థి జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. కల్వకుర్తికి మరింత మేలుజరిగేలా ఎంజీకేఎల్‌ఐ 4వ లిఫ్టు ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీ లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్సీలు కే జనార్దన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, అచ్చంపేట, షాద్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు గువ్వల బాలరాజు, అంజయ్యయాదవ్, జెడ్పీ చైర్మన్ బం డారి భాస్కర్, మార్కెట్ చైర్‌పర్సన్ విజితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జైపాల్‌యాదవ్ విజయానికి కృషిచేస్తా: ఎమ్మెల్సీ కసిరెడ్డి
కల్వకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ విజయానికి కృషిచేస్తానని గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఆయన వెంట కల్వకుర్తి ప్రచారసభకు వెళ్లారు. కల్వకుర్తి టికెట్ ఆశించిన ఆయన, జైపాల్‌యాదవ్‌కు టికెట్ కేటాయించడంతో అనుచరుల ఒత్తిడితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాని భావించారు. ఏ అభ్యర్థినీ మార్చరాదని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో మనసు మార్చుకున్న కసిరెడ్డి.. కల్వకుర్తి సభకు హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ మేనమామ అయ్యిండు
మంత్రి కేటీఆర్ సభావేదికపైకి వెళ్లేటప్పుడు కల్వకుర్తికి చెందిన గౌసియాబేగం ఆయనకు ఓ లేఖ ఇచ్చారు. వేదికపై ఆ లేఖను మంత్రి చదివి వినిపించారు. అన్నా.. నా కూతురి పెండ్లికి నా సోదరుడు సామాన్లు కొనిచ్చాడు. తర్వాత చిన్నఘర్షణ జరిగి పెట్టిన సామాన్లు తిరిగి తీసుకున్నాడు. అదే సమయంలో షాదీముబారక్ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుతో నా బిడ్డకు సామాన్లు కొనిచ్చా. మేనమామలా నిలిచిన కేసీఆర్‌కు ధన్యవాదాలు అని ఆ లేఖలో రాసిఉంది. దీనిని కేటీఆర్ చదువగానే సభాప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగింది.

సిరిసిల్లలో నేడు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞత సభ
ఉరిశాలను సిరిసిల్లగా మార్చిన మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం నేత కార్మికులు జిల్లాకేంద్రంలో కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వకళాశాల మైదానంలో నిర్వహించే సభ ఏర్పాట్లను గురువారం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగారావు తదితరులు పరిశీలించారు.

రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేసినందుకే ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలో మైనార్టీలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖను ఇచ్చి గౌరవించింది. టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ. మైనార్టీలకు 12% రిజర్వేషన్ల కోసం బిల్లు ఆమోదించి పంపితే కేంద్రం అడ్డుకుంది.
-మహమూద్ అలీ, డిప్యూటీ సీఎం

కూటమి అంటే సంకీర్ణం. సంకీర్ణమంటే సంక్షోభం. ఇవాళ మనకు సంకీర్ణం కావా లా సంక్షేమం కావాలా? అభివృద్ధి కావాలా సంక్షోభం కావాలా? ప్రజలు ఆలోచించాలి. కూటమి అధికారంలోకి వస్తే కరంటు సంక్షో భం వస్తుంది. దొంగరాత్రి 12గంటలకు కరంటు చాలవుతుంది. ఆ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దవుతాయి.
– తన్నీరు హరీశ్‌రావు, నీటిపారుదలశాఖ మంత్రి

ఎన్నో కష్టాలను దిగమింగి ఉద్యమాలతో తెలంగాణ సాధించుకున్నాం. సీమాంధ్ర పాలనలో ముదిరాజ్‌లు పూర్తిగా అన్యాయానికి గురయ్యారు. కరంటు లేక, పంటలు ఎండి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేడు అలాంటి పరిస్థితులు లేకుండా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి, బడుగు బలహీనవర్గాలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం కల్పించారు.
– ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.