Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రభంజనం

-జీహెచ్‌ఎంసీలో సెంచరీ కొడతాం
-ఇది అహ్మదాబాద్‌ కాదు.. హుషార్‌ హైదరాబాద్‌
-మత రాజకీయాలను మన ప్రజలు నమ్మరు
-హైదరాబాద్‌ ఆగమైతే.. తెలంగాణ ఆగమైతది
-ఢిల్లీ పార్టీకి కాదు.. గల్లీ పార్టీకి ఓటు వేయండి
-ఓట్ల కోసం కొందరు కొత్త బిచ్చగాళ్లొస్తున్నరు
-వరద సాయం చేస్తుంటే అడ్డుకున్నదెవరు?
-పదివేలు ఆపినోళ్లు 25 వేలు ఇస్తరా?
-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చలాన్లు కడుతున్నరా?
-కేటీఆర్‌ సూటి ప్రశ్నలు

‘మమ్మల్ని గెలిపిస్తే మీరు చలాన్లు కట్టొద్దు. మీ ఇష్టం వచ్చినట్టు బండి మీద ముగ్గురు నలుగురు ఎక్కి తిరగండి’ అంటడొకాయన. తాగి నడపండి చలాన్లు జీహెచ్‌ఎంసీ కడుతది అంటడు. ఇంతకంటే అన్యాయం ఉంటదా? బెంగళూరు, అహ్మదాబాద్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాలు అక్కడ చలాన్లు కడుతున్నయా? ట్రిపుల్‌ రైడింగ్‌ పోయి పిల్లగాండ్లు చనిపోతే ఎవరిది బాధ్యత?

తొలి రోజు ప్రచారంతోనే టీఆర్‌ఎస్‌ ధూంధాం చేసింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు నిర్వహించిన రోడ్‌షోకు గ్రేటర్‌ ప్రజలు ప్రభంజనంలా కదిలి వచ్చారు. రెండు నియోజకవర్గాల పరిధిలో సాగిన రోడ్‌షో ఆసాంతం జై తెలంగాణ, జై కేసీఆర్‌, జై కేటీఆర్‌ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఆయన ప్రతిమాటకూ చప్పట్లు మార్మోగాయి. శనివారం రోడ్‌ షోలో భాగంగా ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, చిత్తారమ్మతల్లి చౌరస్తా, నర్సాపూర్‌ ఎక్స్‌రోడ్స్‌, ఐడీపీఎల్‌ ఎక్స్‌రోడ్స్‌, షాపూర్‌నగర్‌లో ప్రసంగించారు. రోడ్‌షోలలో కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఓట్ల కోసం కొత్త బిచ్చగాళ్లు వస్తరు
హైదరాబాద్‌లో ఓట్లకోసం కొత్త బిచ్చగాళ్ల లెక్క బయల్దేరుతున్నరు. ఒకాయనంటడు మమ్మల్ని గెలిపిస్తే మీరు చలాన్లు కట్టద్దు. మీ ఇష్టం వచ్చినట్టు బండి మీద ముగ్గురు నలుగురు ఎక్కి తిరగండి అంటడు. తాగి నడపండి చలాన్లు జీహెచ్‌ఎంసీ కడుతది అంటడు. ఇంతకంటే అన్యాయం ఉంటదా. బెంగళూరు, అహ్మదాబాద్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాలు చలాన్లు కడుతున్నయా? ట్రిపుల్‌ రైడింగ్‌ పోతే పిల్లగాండ్లు చనిపోతే మీరు బాధ్యత తీసుకుంటారా? సంక్రాంతి వాళ్లు వచ్చినట్లు వచ్చి.. బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ.. అంటూ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతరు. రూ. 25వేలు ఇస్తా మమ్మల్ని గెలిపిస్తే అని ఒక పెద్దమనిషి చెప్తడు. ఇస్తరా నిజంగా.. వాళ్లతోని ఐతదా?

అహ్మదాబాద్‌ కాదు.. హుషార్‌ హైదరాబాద్‌
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రారు.. ఎన్నికలప్పుడు మాత్రం వచ్చి కథలు చెప్తున్నరు. కథలు చెప్తే వినడానికి ఇది అహ్మదాబాద్‌ కాదు.. హుషార్‌ హైదరాబాద్‌. యాది పెట్టుకోండి. ఇక్కడ డ్రామాలు నడువవు. అన్నీ తెల్సిన హైదరాబాద్‌.. మీరు ఆగమాగం చేస్తే ఆగం కావడానికి ఇక్కడ ఎవరు తయారుగా లేరు. ఎవరు అభివృద్ధి కోసం చూస్తున్నారు.. ఎవరు ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారో ప్రజలకు తెలుసు.

ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతరు?
మీ ఆశీర్వాదంతో తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేండ్లయింది. అక్కడ ఢిల్లీలో మోదీ అధికారంలోకి వచ్చి ఆరేండ్లు అయ్యింది. కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగిందంటే మేం వందపనులు చెప్తాం. రూ.67 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఏమేమి పనులు చేశామో చూపిస్తం. కేంద్రం హైదరాబాద్‌లో ఫలానా పనిచేశామని ఒక్కటంటే ఒక్క పనిని చూపించాలి. కేంద్రంలో ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి చెప్పాలి. హైదరాబాద్‌లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? ఈ ఆరేండ్లలో హైదరాబాద్‌లో మంచి జరిగిందా? చెడు జరిగిందా ప్రజలే ఆలోచించాలి. ఆనాడు హైదరాబాద్‌లో మంచి నీళ్లగోస అంతా ఇంతా కాదు. ఆ పరిస్థితి ఇప్పుడులేదు. 95% నీళ్ల గోసను తీర్చుకొన్నం. ఇక కరెంటు గోస గురించి ఎంత చెప్పినా తక్కువే. రాష్ట్రం రాకముందు కరెంటు ఉంటే వార్త. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక ఈ రోజు కరెంటు పోతే వార్త. ఇది నిజమా? కాదా? ప్రజలే ఆలోచించాలి.

ఖాతాల్లో రూ.15 లక్షలు ఎవరికి పడ్డాయి?
ఓట్ల కోసం ఎన్నో అబద్ధ్దాలు చెప్తున్నరు. ఢిల్లీలో ఉన్న పెద్దాయన ఆరేండ్ల కిందట మీకు రూ.15 లక్షలు అకౌంట్లో ఏస్తమన్నరు. ఏసిండ్రా? ఎవలకైనా 15 లక్షలు పడ్డయా? ఆ పెద్ద మనిషి చెప్పిండా? లేదా? ఇవన్నీ కేవలం ఓట్లకోసమే చెప్తున్నరు.

అన్నీ అనుమానాలు పటాపంచలు
ఆరేండ్ల కింద తెలంగాణ ఏర్పడ్డప్పుడు.. హైదరాబాద్‌లో ఏం జరుగుతదో.. ఏమేం ఇబ్బందులు వస్తయో? ఎట్లుంటదో? అని చాలా అనుమానాలుండేవి. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని ఒకాయన.. కొత్త పరిశ్రమలు వచ్చుడు కాదు, ఉన్నోళ్లే వెళ్లిపోతరని ఇంకోఆయన.. ఈ టీఆర్‌ఎస్‌ వాళ్లు అధికారంలోకి వస్తే ఏమైతదో అని అన్నరు. కానీ ఈ ఆరేండ్లలో హైదరాబాద్‌ నగరం అభివృద్ధిలో ఎంత ముందుకు పోయిందో మీకే తెలుసు. రూ.400 కోట్లతో కట్టిన ఈ బాలాపూర్‌ బ్రిడ్జే ఇందుకు ఉదాహరణ. 30 ఏండ్ల నుంచి కృష్ణారావు పోరాడుతున్నా కానీ బాలానగర్‌ బ్రిడ్జిని కేసీఆర్‌ ప్రభుత్వంలోనే కట్టుకొన్నం..ఇంకో నెలలోపుల పూర్తిచేసి సంక్రాంతివరకు మీకు అందిస్తం. ఫతేనగర్‌ బ్రిడ్జిని కూడా విస్తరించుకొంటున్నం. రూ.40 కోట్లతోటి దాని కింది నుంచి అండర్‌పాస్‌ను ఏర్పాటు చేసుకొంటున్నం.

ఆకలేస్తే అన్నం.. సుస్తీచేస్తే వైద్యం
పేదోడికి ఆకలైతే హైదరాబాద్‌లో ఎక్కడికి పోయినా రూ.5 కే అన్నపూర్ణ నాణ్యమైన భోజనం పెడుతున్నది కేసీఆర్‌ ప్రభుత్వం. పేదోడికి సుస్తీచేస్తే వైద్యం కోసమని 350 బస్తీ దవాఖానలను పెట్టింది కేసీఆర్‌ ప్రభుత్వం. కాన్పు అయితే కేసీఆర్‌ కిట్‌.. పెండ్లి చేసుకొంటే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌.. రూ.లక్ష నూట పదార్లు ఇస్తున్నం. రేషన్‌ బియ్యం.. ఇట్లా చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి. లక్ష బెడ్‌రూం ఇండ్లు పూర్తయినయి. ఎవరికీ ఏం రంధి అవసరం లేదు. ఏనుగెల్లింది.. తోక చిక్కిందా అన్నట్టు కొద్ది పనులున్నయ్‌.. డబుల్‌బెడ్‌రూం ఇండ్లు తొందరల్లోనే అప్పజెప్పే బాధ్యత నాది. చిత్తారమ్మపల్లి బస్తీలో కనిపిస్తున్నయ్‌ డబుల్‌బెడ్‌రూం ఇండ్లే.. అలాగే మీకు కూడా కట్టించి ఇస్తం. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి లాభం జరిగిందా? లేదా? అన్నది ఒక్కసారి ఆలోచించాలి. పింఛన్‌ రూ.200 నుంచి రూ.2 వేలకు పెరిగిందా లేదా? వికలాంగులకు రూ.500 నుంచి రూ.3 వేలకు పెరిగిందా? లేదా? అన్నది అంతా ఆలోచించాలి. మీకు అన్ని వేళలా అండగా ఉండేది కేసీఆర్‌ ప్రభుత్వం. మీ అన్న కేసీఆర్‌ మీ అందరికీ న్యాయంచేస్తారని హామీ ఇస్తున్నా.

గల్లీ పార్టీ కావాలా.. ఢిల్లీ పార్టీ కావాలా..
ప్రధాని మోదీ వోకల్‌ ఫర్‌ లోకల్‌ అన్నరు. తెలంగాణలో గల్లీ పార్టీ కావాల్నా.. ఢిల్లీ పార్టీ కావాల్నా తేల్చుకోవాలి. గల్లీ బాయ్స్‌ కావాల్నా డిల్లీ బాయ్స్‌ కావాల్నో తేల్చుకోవాలి. కుత్బుల్లాపూర్‌ మినీ భారతదేశం లాంటిది. ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. కుత్బుల్లాపూర్‌ ఆరేండ్ల క్రితం ఎలా ఉండేదో ఇప్పుడెట్ల ఉన్నదో తెలుసుకోవాలి. గతంలో పారిశ్రామికవాడల్లో వారానికి రెండు రోజులు పవర్‌ హాలిడేలు ఉండేవి. ఇప్పుడు 24 గంటల కరెంట్‌తో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఉన్న భూ పట్టాలను సమస్యలను సీఎం కేసీఆర్‌ పరిష్కారిస్తారు. సూరారంలో 40వేల పట్టాలకు యాజమాన్య హక్కు ఇప్పించే బాధ్యత మాది. ఈ పనులు వేరే వారి వల్ల కాదు. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.

రూ.10 వేలు అందకుండా చేసింది ఎవరు?
మొన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరద బాధితుల కోసం రూ.10 వేలు ఇస్తే ఆపింది ఎవరు? ఎట్లుంది కథ అంటే.. పది వేలు ఆపినోడు.. రూ.25 వేలు ఇస్తడట. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడట. హైదరాబాద్‌లో వరదలొస్తే 6.64 లక్షల మందికి రూ.664 కోట్లు సాయంచేసినం. పేదోడి నోటికాడి ముద్ద గుంజేసిన వాళ్లకు ఓటేద్దామా? మీరే ఆలోచించాలి. ఇంకా సాయం రానోళ్లకు, అర్హులైన వారందరికీ సాయం అందిస్తాం. కొందరు ఈసీకి ఉత్తరాలు రాయడం వల్లే సాయం ఆగింది తప్ప.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయమందించే బాధ్యత ప్రభుత్వానిది. కరోనావస్తే తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వందేండ్లలో ఎన్నడూలేని వరదలు వస్తే.. నిండు నీళ్లలో మీకు తోడుగా ప్రభుత్వం నిలిచింది. వర్షం నీళ్లలో మీతో తిరిగినం.

తెలంగాణ నుంచి గత ఆరేండ్లలో కేంద్రానికి రూ.2.72లక్షల కోట్లు పన్నుల రూపంలో ఇస్తే తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.1.40లక్షల కోట్లు మాత్రమే. అంటే రూపాయి కడితే ఆఠాణ వచ్చినట్లు. వరదసాయంచేయాలని కేంద్రానికి సీఎం లేఖ రాస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు. బెంగళూరులో వరదలు వచ్చాయని సాయమడిగితే రూ. 600 కోట్లు ఇచ్చారు. గుజరాత్‌లో వర్షం వస్తే ప్రధాని హెలికాప్టర్‌లో పోయి రూ.500 కోట్లు ఇచ్చారు. తెలంగాణ ఇండియాలో లేదా? మేం మనుషులం కాదా? మీరు ఇయ్యరు కేసీఆర్‌ ఇస్తే అడ్డుపడుతరు. మేం ఇచ్చింది కూడా తామే ఇచ్చినమని ప్రచారం చేసుకొంటారు. వరద ప్రాంతాల్లో నష్టపోయిన వారికి కేంద్రంతో మాట్లాడి రూ.50 వేలు ఇప్పియ్యండి.. మేము 6.64 లక్షల మందికి సాయం చేశాం… మీరు కేంద్రం నుంచి నిధులు తెచ్చి రూ.50 వేల చొప్పున 20 లక్షల మందికి ఇవ్వండి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దమ్ముంటే ఈ పనిచేయాలి.

జుమ్మా రోజు కావాలని ధర్నాచేశాడు
పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో నిప్పుపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండాలా.. అగ్గి మండాలా… ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉన్నాం. ఒకాయన చార్మినార్‌ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్‌ దగ్గర ధర్నా చేసిండు. జుమ్మా రోజు కావాలని ధర్నా చేసిండు. దేవాలయం దగ్గర ధర్నాచేస్తే ఫర్వాలేదు. మాకు నమ్మకాలు ఉన్నాయి. కానీ హైదరాబాద్‌లో వేరే దేవాలయాలు లేవా? బిర్లామందిర్‌ లేదా? తాడ్‌బంద్‌ ఆంజనేయస్వామి లేదా? బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి లేదా? అక్కడ వద్దు. ఎక్కడ పెట్టాలె కావాలనే చార్మినార్‌ దగ్గర పెట్టాలె. కావాలని గెలుక్కోవాలి. హిందూ- ముస్లిం, పాకిస్తాన్‌- ఇండియా ఇదే కావాలి. హైదరాబాద్‌లో హిందూ ముస్లిం కలిసుంటే వారికి నచ్చదు. కండ్లు మండుతున్నయి. ఎలాగైనా వీరి మధ్య చిచ్చుపెట్టాలె. నాలుగు ఓట్లు సంపాదించుకోవాలె. తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో ఏదో జరుగుద్ది అని భయపెట్టారు. నేడు అభివృద్ధి మాత్రమే జరిగింది.

హైదరాబాద్‌ ఆగమైతే తెలంగాణ ఆగమైతది
హైదరాబాద్‌లోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లకు చేతులు జోడించి విజ్ఞప్తిచేస్తున్నా. ఎలాంటి హైదరాబాద్‌ కావాలి మనకు. పచ్చగా పిల్లాపాపలతో సుఖంగా ఉండే హైదరాబాద్‌ కావాల్నా. తెల్లారితే భయంతో తల్లడిల్లే హైదరాబాద్‌ కావాల్నా.. ఆలోచించండి. హైదరాబాద్‌ బాగుంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఒక గూగుల్‌ వస్తే, ఒక యాపిల్‌ వస్తే, ఒక ఫేస్‌బుక్‌ వంటి కంపెనీ వచ్చిందంటే ఇక్కడ ప్రశాంతత ఉన్నదని వచ్చాయి. అలాంటి హైదరాబాద్‌లో చిచ్చు పెట్టుకుంటే, పంచాయతీలు పెట్టుకుంటే ఎవరూ రారు. హైదరాబాద్‌ఆగమైతే తెలంగాణ ఆగమైతది. ఆరేండ్లలో బ్రహ్మాండంగా జీహెచ్‌ఎంసీలో పనులు చేసుకున్నం. మరింత వేగంగా పనులుచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కేసీఆర్‌, కారు గుర్తుకు ఓటువేసి అభివృద్ధి ముందుకు వెళ్లేలా నడిపించండి. పెద్ద మెజార్టీతో గెలిపించండి.

చెప్పింది చేశాం.. చేసేది చెప్తాం
-ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌లో చెప్పిందే చేశామని, చేసేదే చెప్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ మేరకు శనివారం కేటీఆర్‌ ట్వీట్‌చేశారు. బాధ్యతాయుతమైన హామీలను ఇస్తున్నామని, వాటన్నంటినీ నెరవేరుస్తామని చెప్పారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక వీడియోను పోస్టుచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.