-కార్డులు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటే కఠినచర్యలు -నేతలు, ప్రజాప్రతినిధులపైనా ఏసీబీ దాడులు -ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల హెచ్చరిక -అవసరమైతే ఒక్కొక్కరికి 8 కిలోలు ఇస్తామని ప్రకటన

ఈ పదవులు మీరిచ్చినవి. ఈ ప్రభుత్వం మీ ది.. మనది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా మన రక్తం.. చెమట చుక్కలు. ధర్మంగా ఖర్చు పెట్టుకుందాం. సంక్షేమ పథకాలు అన్నీ అర్హులకే అందాలి. కొందరు డబ్బులు తీసుకొని అనర్హులకు పైరవీలు చెస్తున్నట్లు తెలిసింది. అర్హులకు రాకున్నా.. అనర్హులకు ఇచ్చినా.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసినా.. ఊరుకునేది లేదు. జైలుకు పంపుడే అని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇన్నాళ్లూ ఏసీబీ దాడులు అధికారుల మీదే జరిగాయి, ఇప్పుడు మంత్రి నుంచి వార్డు సభ్యుడు.. నాయకులపైనా ఉంటాయని స్పష్టంచేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు వచ్చిన మంత్రి పట్టణంలో స్వామి వివేకానంద విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు పింఛన్లు.. ఆహార భద్రత కార్డులు రాలేదని.. పైసలడుగుతున్నరని.. మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మంత్రి ఈటల పై విధంగా మాట్లాడారు. అర్హులకే అన్ని పథకాలు వర్తిస్తాయన్నారు. ప్రభుత్వం అక్రమాలను అడ్డుకుంటదని స్పష్టంచేశారు.
ప్రభుత్వ ఉద్యోగి మినహా అందరికీ కార్డులు: గతంలో కంటే ఎక్కువ పింఛన్లు, ఆహార భద్రత కార్డులిచ్చిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుదేనన్నారు. కార్డులు తీసేయాలని ఏ అధికారులకు ఆదేశాలివ్వలేదని, అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అర్హులు అధికారులను కలవాలని చెప్పారు. ప్రభుత్వోద్యోగికి తప్ప దాదాపు అందరికీ కార్డులందుతాయన్నారు. ప్రతి పథకం అమలుకు స్థానిక అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులదే బాధ్యతని గుర్తు చేశారు. కడుపునిండా కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోలు సరిపోకుంటే 8 కిలోలైనా పంపిణీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అభివృద్ధికి రూ.500 కోైట్లెనా ఇస్తానని, మీరు మాత్రం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 14వ తేదీన రూ.200-250 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. కన్నతల్లిలాంటి జమ్మికుంట రుణం తీర్చుకుంటానన్నారు.