Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రభుత్వాన్ని దీవించిన వరంగల్ ప్రజలు..

ఈ విజయంతో గర్వానికి పోకుండా, అహంకారం పెంచుకోకుండా బాధ్యతగా తీసుకొని ప్రజలతో మరింతగా మమేకం కావాలని వరంగల్ జిల్లా పార్టీ నేతలకు సూచించారు.

CM-KCR-addressing-with-Warangal-district-leaders

-తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ శ్రీరామరక్ష కావాలి -బాధ్యత పెరిగింది.. వినయంగా ఉండాలి -గర్వంతో విర్రవీగకండి.. తగ్గి ఉండండి -అవకాశాలు వచ్చేవరకు ఆగండి -వరంగల్ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్

ఈ విజయం చరిత్ర సృష్టించింది. అలాగే వరంగల్ జిల్లా ప్రజలు అత్యంత మెజార్టీ ఇచ్చి మనకు మరింత బాధ్యత అప్పగించారు. ప్రభుత్వాన్ని దీవించి ఆత్మవిశ్వాసం పెంచారు. అత్యంత వినయంగా ఉండాలి. వారి సమస్యలు ఓపికగా విని పరిష్కరించాలి. అసహనానికి గురికాకుండా శాంతంగా ఉండాలి. సంయమనం పాటించాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే వీలైనంత మేరకు తగ్గి ఉండాలి అని చెప్పారు.

వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్‌తోపాటు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు బుధవారం ఉదయం పెద్దఎత్తున తరలివచ్చి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ శ్రీరామరక్ష కావాలని అన్నారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు రక్షణ కవచంగా నిలవాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీపై అభిమానం చాటుకున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని నాయకులకు పిలుపు ఇచ్చారు.

పార్టీకి, ఉద్యమానికి అండగా నిలిచిన వరంగల్ తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ పార్టీకి మొదటి నుంచి వరంగల్ జిల్లా ప్రజలు అండగా ఉన్నారని సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 35 లక్షల మందితో భారీ బహిరంగసభ నిర్వహించి వరంగల్ ప్రజలు అద్భుతం సృష్టించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సత్తాను చాటారన్నారు. ఉద్యమానికి ప్రజలు అండదండలు అందించి టీఆర్‌ఎస్ పార్టీని ఎలా దీవించారో.. అదేరీతిలో ప్రభుత్వం తరపున అభివృద్ధి కార్యక్రమాల్లో వరంగల్‌కు తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. జిల్లాలో అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అలాగే వరంగల్ చుట్టూ ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, కార్యకర్తలు వాటిని ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు.

పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు త్వరలో శిక్షణ తరగతులు పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కలిగించడానికి, వాటిని ప్రజలకు చేరవేసేలా అవగాహన కలిగించడానికి కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు త్వరలోనే శిక్షణ ఇస్తామని తెలిపారు. చాలా చిన్న కార్యకర్త అయిన పసునూరి దయాకర్‌కు అవకాశం వచ్చినట్టే, పార్టీని నమ్మిన ప్రతిఒక్కరికి తప్పక అవకాశం వస్తుందన్నారు. అయితే కార్యకర్తలు తమవంతు వచ్చేవరకు ఓపిక పట్టాలని సీఎం కేసీఆర్ కోరారు. వరంగల్‌లో అత్యధిక మెజారిటీ రావడానికి కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

నేడు పసునూరి ప్రమాణం -ఘనవిజయంపై కేంద్ర మంత్రుల ప్రశంసలు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన పసునూరి దయాకర్‌కు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం పార్లమెంటులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వరంగల్ ఉప ఎన్నిక గురించి ఎంపీలు కే కేశవరావు, జితేందర్‌రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. గరిష్ఠ మెజారిటీతో గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులు అభినందనలు తెలిపారు. ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుపై సంతృప్తి వ్యక్తం చేయడమేనని వ్యాఖ్యానించినట్లు కేకే, జితేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు.

కాగా, వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ గురువారం ఉదయం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం రాత్రికే దయాకర్, కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. సభా కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందే దయాకర్‌తో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణం చేయించనున్నారు. దయాకర్ తెలుగులో ప్రమాణం చేయనున్న విషయాన్ని ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్రస్తుతం లోక్‌సభలో పదిగా ఉన్న టీఆర్‌ఎస్ ఎంపీల సంఖ్య వరంగల్‌లో గెలిచిన దయాకర్‌తో కలిపితే 11 అవుతున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.