-మరో చరిత్ర దిశగా టీఆర్ఎస్ -వరుస సభలతో హోరెత్తించనున్న ముఖ్యమంత్రి -19 నుంచి డిసెంబర్ 5 వరకు వరుసగా సభలు -ఇప్పటికే సోమ, మంగళవారాల షెడ్యూలు ఖరారు -21 నుంచి 25 వరకు మరో దఫాలో 22 సభలు -ప్రతి నియోజకవర్గాన్నీ చుట్టనున్న సీఎం కేసీఆర్ -డిసెంబర్ 3న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీసభ
ఎన్నికల సమరాంగణానికి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ రద్దు నిర్ణయం సందర్భంగా నిర్వహించిన కొంగరకలాన్ సభ మొదలుకుని.. ఇప్పటికే పలు భారీ బహిరంగసభల్లో పాల్గొన్న సీఎం.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనల్లో పాల్గొనేందుకు కార్యాచరణ ఖరారైంది. రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా మరో చరిత్ర సృష్టించే దిశగా ఈ నెల 19 నుంచి మలి విడుత ప్రచారంలో పాల్గొనబోతున్న సీఎం.. సోమ, మంగళవారాల్లో ఆరు జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో ఆరు సభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే షెడ్యూలు ఖరారైంది. ఆ తదుపరి ఈ నెల 21 నుంచి డిసెంబర్ 5 వరకు వరుస సభలు నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 21నుంచి 25 వరకు 22 నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభల్లో సీఎం పాల్గొంటారు. దాదాపుగా ఈ సభలన్నింటికీ ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఉపయోగించనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మలివిడుత ప్రచారాన్ని ప్రారంభించనున్న సీఎం.. ఒక్కోరోజు ఆరేడు సభల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు సీఎం హాజరుకానున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డిసెంబర్ 3న పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కో సభను నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగనుండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం కొత్త పుంతలు తొక్కనుంది. వార్ వన్సైడేనన్న విధంగా కేసీఆర్ సభలు ఉంటాయని చెప్తున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతోపాటు.. ప్రతిపక్షాలు కూడా సీఎం కేసీఆర్ సభల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. సీఎం తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే తమ విజయం ఖాయమవడమేకాకుండా.. మెజార్టీ కూడా భారీ స్థాయిలో పెరుగుతుందన్న అంచనాలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. గత ఎన్నికల్లో ఒంటిచేత్తో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈసారి కూడా అదే స్థాయిలో ప్రచారంలోకి దిగనుండటంతో ఆయన ప్రసంగాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తాయని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు.
గడిచిన నాలుగున్నరేండ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చెప్పడంతోపాటు.. మరింత అభివృద్ధికి ఉన్న అవకాశాలకు ప్రతిపక్షాలు ఎలా గండికొట్టిందీ సీఎం ఆయా సభల్లో ప్రధానంగా వివరిస్తారని తెలుస్తున్నది. ప్రగతి రథ చక్రాలు ఆగకుండా ఉండాలంటే.. మరోసారి టీఆర్ఎస్ను ఆశీర్వదించాల్సిందిగా కోరనున్నారు. ప్రత్యేకించి కూటమి పేరుతో తెలంగాణ వ్యతిరేక శక్తులు జట్టుకట్టిన తీరును సీఎం తన ప్రసంగాల్లో ఎండగట్టనున్నారు. ఆయా సభల్లో సీఎం పేల్చే మాటల తూటాలు.. విపక్షాల దింపుడు కళ్లం ఆశలకు తూట్లు పొడుస్తాయని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే రెండు స్థానాలు మినహా అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే రెండు విడుతలుగా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పూర్తిచేసుకున్నారు. ఇక నామినేషన్ల పర్వం కూడా ఉపందుకున్న నేపథ్యంలో తుది దశ ప్రచారాన్ని అభ్యర్థులు వేడెక్కిస్తున్నారు. ఈ వేడికి సీఎం కేసీఆర్ ప్రచారం తోడైతే.. వార్ వన్‌సైడే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రి అల్లోలకు సీఎం కేసీఆర్ ఫోన్ -సభలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచన నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచార సభల షెడ్యూల్ ఖరాన నేపథ్యంలో ఆయా సభలకు ఏర్పాట్లుచేసుకోవాలని ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. మలివిడుత ప్రచారంలో భాగంగా ఈ నెల 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని ఇచ్చోడ (బోథ్ నియోజకవర్గం), ఖానాపూర్, నిర్మల్, ముథోల్‌లో నిర్వహించే ఎన్నికల శంఖారావ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 22న మధ్యాహ్నం నిర్మల్ పట్టణంలో జరిగే సభలో పాల్గొంటానని.. మిగతా మూడుచోట్ల కూడా ప్రచారసభలు ఉంటాయని అల్లోలకు సీఎం చెప్పారు. సోన్ మండలం జాఫ్రాపూర్‌లో మంత్రి అల్లోల ఎన్నికల ప్రచారంలో ఉండగా.. పార్టీ అధినేత నుంచి ఫోన్ వచ్చింది. దీంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బోథ్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల టీఆర్ఎస్ అభ్యర్థులు రాథోడ్ బాపూరావు, అజ్మీర రేఖానాయక్, గడ్డిగారి విఠల్‌రెడ్డి సీఎం కేసీఆర్ ప్రచార సభల ఏర్పాట్లపై దృష్టి సారించారు.