Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రధానీ.. నేలకు దిగిరా!

-తెలంగాణలో తిరిగితే అభివృద్ధి కనిపిస్తది..
-టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే మార్పు
-బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్లు దక్కవు
-అది మహాఘట్‌బంధన్ కాదు.. మహాఘటియా బంధన్
-7వ తేదీ తర్వాత ఎవరి సత్తా ఏమిటో తెలుస్తది
-70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ విఫలం
-పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం తప్పదు
-ప్లాన్-ఏ, ప్లాన్-బీ కాదు.. తెరపైకి ప్లాన్-సీ
-కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌దే కీలకపాత్ర

ప్రధాని నరేంద్రమోదీ విదేశాలకు వెళ్లడం తగ్గించుకొని దేశంలో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయి. హెలికాప్టర్‌లో తిరుగడం కాదు, నేలపైకి దిగి ప్రజలతో మాట్లాడితే తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమిటో తెలుస్తది. డిసెంబర్ 7 తర్వాత ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది. ప్రధానికి ఆయన పార్టీ బలమేమిటో తెలిసొస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పరాభవం తప్పదు అని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పడినది మహా ఘట్‌బంధన్ (మహాకూటమి) కాదని, మహా ఘటియాబంధన్ (మహా చెడు పార్టీల కూటమి)గా వర్ణించారు. మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో న్యూస్ 18 చానల్ ఆధ్వర్యంలో ఎజెండా తెలంగాణఅంశంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సీఎన్‌ఎన్ న్యూస్‌ఎడిటర్ భూపేన్ చౌబే అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానమిచ్చారు. నిజామాబాద్ సభలో ప్రధాని మాట్లాడుతూ.. హెలికాప్టర్ నుంచి చూస్తే అసలు అభివృద్ధి కనిపించలేదనడంపై ఘాటుగా స్పందించారు. మొదట ప్రధాని విదేశీ పర్యటనలు మానుకొని స్వదేశంలో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. హెలికాప్టర్ దిగి ప్రజలను అడిగితే తెలంగాణ అభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుందని, గాల్లో తిరిగితే ఎలా తెలుస్తుందని ఎద్దేవాచేశారు. తెలంగాణకు మోదీ ఏ మేలూ చేయలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి, కాళేశ్వరాన్ని అటకెక్కించారని గుర్తుచేశారు. దేశానికి సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలమయ్యాయని విమర్శించారు.

70 ఏండ్లుగా అభివృద్ధి జరుగలేదు
ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదమిస్తే, రాజీవ్‌గాంధీ అదే నినాదంతో ముందుకెళ్లారని, ఈ రోజు కూడా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ గరీబీ హఠావో అంటున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అంటే దేశాన్ని అభివృద్ధి చేయలేదనే స్పష్టమవుతున్నదన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు నదులను అనుసంధానం చేస్తామన్నప్పటికీ జరుగలేదని, 70 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని తెలిపారు. 45 వేల టీఎంసీలను పొలాలకు మళ్లించగలిగితే రైతుల దు:ఖం తీరిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికీ శౌచాలయ్ (టాయిలెట్లు) నిర్మిస్తామని మోదీ అంటున్నారంటే, 70 ఏండ్లుగా ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట ప్రయత్నాలు జరుగలేదని స్పష్టమవుతున్నదని చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టాక పరిస్థితి మారింది.

త్వరలో కోటి ఎకరాలకు సాగునీరు, ఇంటింటికీ తాగునీరు ఇవ్వబోతున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలనే మూడు ప్రధాన లక్ష్యాలతో అధికారంలోకి వచ్చి.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 శాతం వృద్ధిరేటు సాధించాం. సంపదను పెంచి పేదలకు పంచడమే ఉద్దేశంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. జీఎస్డీపీలో 10 శాతం వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయరంగంలో జాతీయ సగటువృద్ధి మూడు శాతం ఉంటే తెలంగాణలో 6.9 శాతంగా ఉన్నది. పారిశ్రామిక ప్రగతిలో 5.6 శాతం వృద్ధిరేటు సాధించాం. అదే సమయంలో జాతీయ వృద్ధిరేటు 4.8 శాతమే. సేవారంగంలో జాతీయ సగటు వృద్ధి 8.3 శాతమైతే, తెలంగాణలో 11.1 శాతానికి పెరిగింది. వ్యవసాయ, నీటిపారుదల రంగం అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లను కేటాయిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు 53 శాతానికి తగ్గాయి. ఇవి మేం చెప్తున్న లెక్కలు కావు. కేంద్రవ్యవసాయశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన సత్యాలు అని మంత్రి కేటీఆర్ వివరించారు.

సమధర్మం పాటిస్తున్న కేసీఆర్
విద్యకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. తాలీమ్ మే తాఖత్ (విద్యతోనే వికాసం) అన్న నినాదంతో తెలంగాణ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గురుకులాల ద్వారా 3లక్షల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై లక్షా 20వేల రూపాయలను ఖర్చుచేస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నదన్న ప్రశ్నకు బదులిస్తూ.. సీఎం కేసీఆర్‌కు హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్నదని, అదే సమయంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని స్పష్టంచేశారు.

జాతీయ మీడియా ఢిల్లీ దాటి చూడాలి
టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి నాలుగు పార్టీలు ఏకమైనప్పటికీ చిత్తుగా ఓడిపోవడం తథ్యమని మంత్రి కేటీఆర్ చెప్పారు. మహాఘట్‌బంధన్‌గా కాదు ఘటియాబంధన్‌గా ప్రజలు తిప్పికొడుతారని పేర్కొన్నారు. బీజేపికి గతంలో వచ్చిన ఐదు స్థానాలు కూడా రావని, వంద సీట్లలో డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారు. చంద్రబాబు మహా అవకాశవాది అని పేర్కొన్నారు. కేంద్రంలో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి రావని, టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఎదిగి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ లేకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ కాదంటే బీజేపీ అనే ప్లాన్-ఏ ప్లాన్-బీ నుంచి ప్లాన్-సీ తెరపైకి వస్తుందని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా బలపడుతున్నాయో జాతీయ మీడియా ఢిల్లీ దాటి చూడాలని సూచించారు. ఇదే చర్చలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో రూపొందించినట్టు వెల్లడించారు.

మతప్రాతిపదికన రిజర్వేషన్‌లు సాధ్యం కావు: సుబ్రమణ్యస్వామి
చట్టం ప్రకారం మతప్రాతిపదికన రిజర్వేషన్‌లు సాధ్యం కావని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభుడు సుబ్రమణ్యస్వామి ఇదే చర్చలో అన్నారు. అనాదిగా అణగదొక్కబడిన కులాలకు మాత్రమే రాజ్యాంగం రిజర్వేషన్లను ప్రసాదించిందని, ముస్లింలు ఆ కోవలోకి రారని తెలిపారు. ఆరువందల ఏండ్లుగా రాజ్యాధికారాన్ని చేపట్టిన ముస్లింలను అణగారిన వర్గాలుగా చూడలేమని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగి తీరుతుందని స్పష్టంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.