Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రగతిరథ చక్రాలు ఆగవద్దు

– ప్రతిపక్షాల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలె
-మోసపోతె గోసపడుతం
-తెలంగాణ మళ్లీ ఆగం కావొద్దు
-ప్రగతిరథ చక్రాలు ఆగొద్దు
-తెలంగాణకు చారిత్రక ద్రోహం చేసిన కాంగ్రెస్
-కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి శాపం
-తెలంగాణ బతుకును ఆగం చేశారు
-కాంగ్రెస్ చెత్త నాయకులందరూ నల్లగొండలోనే
-చంద్రబాబూ.. మాతోని గెలుక్కున్నవ్ జాగ్రత్త!
-తెలంగాణ దెబ్బ ఏందో తగిల్తే
-ఎగిరి విజయవాడ కరకట్టకు ఎగిరిపడ్డవ్..
-నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమైతుందో..
-మిషన్ భగీరథ పనులు 99శాతం పూర్తి
-చెప్పిన మాట ప్రకారం రెండు నెలల్లో ఇంటింటికి నీరు
-తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్
-సొంత స్థలం ఉన్నవాళ్లకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు
-పూల పొదరిల్లులా రాష్ర్టాన్ని తయారుచేస్తున్నం
-ఈ జిల్లాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగాం
-పోరాటాల పురిటిగడ్డ సరైన తీర్పు ఇవ్వాలి
-నల్లగొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

ఈటెల్లాంటి మాటలు.. తూటాల్లాంటి విమర్శలు.. నిప్పుల ఉప్పెనలాంటి పదప్రవాహం! అదే వేడి.. అంతకుమించిన వాడి! ఉద్యమాల పోతుగడ్డ.. నల్లగొండలో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సింహగర్జన చేశారు! తెలంగాణ ప్రగతిరథ చక్రాలు ఆగకూడదన్న సంకల్పంతో ముందస్తు ఎన్నికలకు వెళుతున్న కేసీఆర్.. ఈ సంకల్పాన్ని దెబ్బతీసేందుకు స్వార్థ రాజకీయ ఎత్తుగడలతో కూటమి కడుతున్న పార్టీలను చీల్చి చెండాడారు. ప్రతిపక్షాలది మహాకూటమి కాదు.. కాలకూట విషమని హెచ్చరించారు. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తికాదని, వంచకుడు.. ద్రోహి.. బొడ్లో కత్తిపెట్టుకుని తిరుగున్నడని, ఏ మాత్రం అవకాశం వచ్చినా మన్నల్ని పొడిచిపారేస్తాడని హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామన్న కేసీఆర్.. ఎన్నికలప్పుడు ఆగం కావొద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌పైనా అదే విమర్శల వేడిని కొనసాగించిన కేసీఆర్.. ఆ పార్టీలోని చెత్త నాయకులంతా నల్లగొండ జిల్లాలోనే ఉన్నారని, ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానంటే.. తోకముడుచుకుని పారిపోయిన చరిత్ర ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని నాశనం చేసేందుకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా చూసేందుకే మహాకూటమి కట్టారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. అది మహాకూటమి కాదని, కాలకూటవిషమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ మళ్ళీ ఆగంకావొద్దని, మోసపోతే గోసపడుతామని హెచ్చరిం చారు. తెలంగాణ ప్రగతిరథ చక్రాలు ఆగొద్దని అన్నారు. అలాంటి కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ఆశీర్వాద సభల పరంపరలో భాగంగా గురువారం నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగసభనుద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. కాంగ్రెస్, చంద్రబాబు వైఖరులను తీవ్రంగా ఎండగట్టారు. చారిత్రక ద్రోహంచేసిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి శాపమని విమర్శించారు. చంద్రబాబు నయవంచకుడు.. ద్రోహి అని మండిపడ్డారు. నల్లగొండలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగామని, ఇప్పుడు పోరాటాల పురిటిగడ్డ సరైన తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. పేదలకు ఇచ్చే పింఛన్‌ను పెంచుతామని, సొంత జాగా ఉన్నవారికి కూడా అక్కడే డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. భారీగా హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..


చంద్రబాబునాయుడును తెలంగాణ ఆమోదిస్తదా?

కుట్రలల్ల కొత్త కుట్ర.. సిగ్గులేకుండా శరంలేకుండా పౌరుషంలేకుండా హీనాతిహీనంగా చంద్రబాబును దోల్కొస్తరంట. ఆమోదిస్తదా తెలంగాణ? ఈళ్ల చిల్లర రాజకీయం కోసం దిగజారి.. ఇయ్యాల చంద్రబాబునాయుడును దోల్కచ్చి.. చంద్రబాబుకున్న హాఫ్ పర్సెంట్, జీరో పర్సెంట్ ఓటుంటే దాన్తోని గండం గట్టెక్కుతరంట. సిగ్గు గూడా లేదు. చంద్రబాబు నిన్న విజయవాడల ఒక మాట మాట్లాడిండు తెలుగోల్లం ఒకటి అని నేను కేసీఆర్‌కు చెప్పిన. ఇద్దరం ఒక్కటైదం అని చెప్పిన. నా ఎంబడి రాలేదు. అందుకే మహాకూటమిలకొచ్చిన అని అంటుండు. మహాకూటమా? కాలకూట విషమా? మహాకూటమా? తెలంగాణను నాశనం చేసే కూటమా? నీ బొంద కూటమా? చంద్రబాబు ఇంకొకటి మాట్లాడ్తడు. మోదీ, కేసీఆర్ ఒక్కటైపోయిండ్రు అని. సిగ్గు ఉండాల్నా అట్ల మాట్లాడెటందుకు! నాలుగేండ్లు నువ్ ఆయన సంకల్నే ఉన్నవ్ గదా.. మోదీ సంకనాకినవ్ గదా! మోదీ కాళ్లు మొక్కి గదా నా ఏడు మండలాలు గుంజుకున్నవ్. మోదీని అడ్డుపెట్టుకొని కదా నా సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నవ్. మోదీని అడ్డం పెట్టుకొని గదా. నా హైకోర్టు విభజన గానియ్యలే. ఇవి వాస్తవాలు గావ్? ఇవన్నీ నిజాలు గావ్? నీ నంగనాచి మాటలు! సంపద పెంచుతున్నం.. పేదలకు పంచుతున్నం.

సంపద పెంచుతున్నం.. పేదలకు పంచుతున్నం.

ఇంత అచీవ్‌మెంట్.. ఒక్కొక్క రంగంలో ఊహించలేని విధంగా మార్పులు వస్తుంటే.. కన్నుగుట్టిన కాంగ్రెస్ పనికిమాలిన ఆరోపణలు చేస్తుంటే విసుగొచ్చింది.. బాధొచ్చింది.. ఇది నిజమా.. అవద్దమా మీరే ఆలోచించాలి. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం 9.56 కోట్లు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక.. ఈ నాలుగేండ్లలో ఇసుక మీద 1975 కోట్లు ఆదాయం వచ్చింది. ఎవడు దొంగ? ఎవడు మాఫియా? ఎవరు దోస్కొని తిన్నరు? మేం కడుపు గట్టుకొని, నోరు గట్టుకొని.. ప్రతి రూపాయి ప్రభుత్వానికి వచ్చేటట్లు చేస్తే.. సంపద పెరుగుతా ఉంది. పెరిగిన సంపదను పేదలకు పంచుతున్నాం. కడుపునిండా అన్నం పెట్టగలుగుతున్నాం. ఆడపిల్లలకు పెండ్లి చేయగలుగుతున్నాం. అమ్మాయిలు ప్రసవానికి వస్తే కేసీఆర్ కిట్లు ఇయ్యగలుగుతున్నాం. సంపద ఇంకా పెరుగాలె.. తెలంగాణల పేదలు ఇంకా బాగుపడాలె.

చంద్రబాబు మాతో గెలుక్కున్నవ్ జాగ్రత్త..
చంద్రబాబూ.. మాతో గెలుక్కున్నవ్ జాగ్రత్త.. నీకు డబ్బాగొట్టే ఒకటి రెండు వార్తాసంస్థలను అడ్డంబెట్టుకొని ఏమైనా జెయ్యగల్గుత అన్కుంటున్నవ్. తెలంగాణ దెబ్బ ఏందో తగిల్తే ఎగిరి విజయవాడ కరకట్టకు వడ్డవ్.. అనవసరంగా రాకు.. మా బతుకు మేం బత్కుతున్నం.. మేం నీ తెరువు రాలే.. మా యవుసం మేం చేసుకుంటున్నం. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నయి నియోజకవర్గాలు.. ఆడ సక్కగ లేదు నీ కత.. ఆగమాగమున్నది. ఈ నల్లగొండోల్లు మీ బార్డర్ పక్కనే ఉంటరు. దబ్బున నేను మూడో కన్ను దెరిస్తే.. నీ గతి ఏమైతదో ఆలోచించుకో. తెలుగువాళ్లం ఒక్కటిగా ఉందమంటున్నవ్.. నీ తెలుగువెట్టేగదా మాకు తెగులు దగిలిచ్చినవ్. తెలుగు పేరువెట్టే మన కొంపార్సిండు. చంద్రబాబు పేరు జెప్తే.. తెలంగాణల గొడ్లకొట్టంల గట్టేసిన బర్లు గూడా తాళ్లు తెంపుకొని పారిపోతయ్.. అంత దుర్మార్గమైన కాల్నీది. మల్ల నువ్ గావాల్న మాకు తెలంగాణకు? సిగ్గు లేదా మాకింక! నువ్ బెట్టిన బాధలు, నువ్ జేసిన కాల్పులు.. బూటకపు ఎన్‌కౌంటర్ల మీద నువ్ కాల్చి సంపిన వేల మంది పిల్లలు.. వాళ్ల ఆత్మలు ఘోషిస్తున్నయి ఈ రోజు.. అటువంటి తెలుగుదేశం పార్టీతోని సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు.పొత్తు వెట్టుకుంటున్నరు.

తెలంగాణ కోసం నేను రాజీపడలే
మీ అందరికీ తెలుసు నేను తెలంగాణ కోసం ఎవరితోనూ రాజీవడలే.. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్కకు వోలే. నిజాం హాస్పిటల్‌లో కేసీఆర్ నువ్ కోమాలోకి వోతవ్ అని డాక్టర్లు చెప్పిండ్రు. చచ్చిపోతవ్ కేసీఆర్ మా మాట విను అంటే గూడ నేను వినలే! చావు నోట్ల తలకాయ వెట్టి సాధించిన తెలంగాణను మల్ల దీస్కవోయి విజయవాడకు అప్పజెప్తరా.. దయచేసి నల్లగొండ జిల్లా ప్రజలు ఆలోచించాలె. చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలె.. రేపు దరఖాస్తు వట్టుకొని అమరావతికి పోవాల్నా? మన హైదరాబాద్‌కు పోవాల్నా? ఎక్కడికి బోవాలె? దీన్ని తిప్పికొట్టాలని నేను మనవిచేస్తున్నా.. 58 ఏండ్ల పీడను ఎన్నో పోరాటాలు చేసి వదిలిచ్చుకుంటే.. ఈరోజు మళ్లీ ఈ దుర్మార్గులు నిస్సిగ్గుగా, పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నరు. అమరావతి గులాముల్లా ఉండాల్నా.. ఒకసారి ఊహించండి. దబ్బని ఈ దుర్మార్గులు అధికారంలోకొచ్చి 15 మంది టీడీపీఎమ్మెల్యేలు గెలిస్తే.. చంద్రబాబు మన డిండి ప్రాజెక్టు ముందల వడనిస్తడా? మన భాగం నీళ్లు రానిస్తడా? కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు కట్టనిస్తడా? మరి ఏ విధంగా వీళ్లని ఆమోదించాలె.. తెలంగాణ దీన్ని అర్థం చేసుకోవాలె.

అన్ని ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం ప్రతిదాన్ని ఆలోచించుకుని పనిచేస్తున్నాం. కష్టపడి పనిచేస్తున్నం. ఫలితాలు వస్తున్నయి.. శాసనసభ్యులు చనిపోతే.. సానుభూతి ఎక్కువ మన దగ్గర. బిడ్డలనో, కొడుకులనో, భార్యలనో పెడితే బ్రహ్మాండంగా గెలిపిస్తరు. కాని తెలంగాణలో అట్ల జరుగుతలేదు. టీఆర్‌ఎస్ మీద నమ్మకం ఏర్పడి పాలేరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ల భార్యను పోటీపెడితే నేను వేరు అభ్యర్థిని పెట్టిన.. 48వేల ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. నారాయణఖేడ్‌లో 53వేల ఓట్ల మెజార్టీతోని సానుభూతిపవనాలను అధిగమించి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించారు. వరంగల్‌లో ఎంపీకి దయాకర్‌ను పెట్టిన. 4.60 లక్షల మెజార్టీతో గెలిపించినారు. మెదక్‌లో 3.60 లక్షల ఓట్ల మెజార్టీతో ప్రభాకర్ అనే యువకుడు గెలిసినాడు. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో ఎవరెవరు ఏదేదో మాట్లాడిండ్రు.. టీఆర్‌ఎస్ గెలిస్తే.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్యాసం తీసుకుంట అన్నడు. సీపీఐ నారాయణ చెవి కోసుకుంట అన్నడు. హైదరాబాద్ ప్రజలు గుద్దుడు గుద్దితే 150లో టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌కు కలిపి 144 స్థానాలొచ్చినయి. కేవలం ఐదారు స్థానాలే వేరేవాళ్లకు పొయినయి. నేనన్నా.. నారాయణ.. ఓట్లు లెక్కించేనాడు ఉండకు. నీ చెవు ఎవరో ఒకరు గోస్తరు. ఒంటిచెవు నారాయణను సూడలేమని చెప్పిన.. ప్రతిసారి ప్రతి ఎన్నికలో అనూహ్యమైన రీతిలో చరిత్రలో లేని విధంగా గెలుస్తున్నాం. టీఆర్‌ఎస్‌కు అద్భుతమైన ఫలితాలు, ఆశీర్వాదాలు ఇచ్చి ప్రజలు గెలిపిస్తున్నరు.

తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలె
ఇంత నీచమా.. మీ అధికారం, స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతరా.. ఇంతకన్నా అధ్వానం ఇంకోటుంటదా.. దయచేసి ఆలోచించాలె.. ఏ ఒక్కనాటికి కూడా చంద్రబాబునాయుడు ఏం మాట్లాడిండు.. ఏనాటికైనా రెండు తెలుగు రాష్ర్టాలు ఒకటి చేస్తా.. ఇంకోడేమో.. రెండు జర్మనీలు ఒక్కటైనట్టు మళ్లీ ఒకటి చేస్తమని మాట్లాడుతుండ్రు.. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి గాదు.. నయవంచకుడు.. ద్రోహి.. బొడ్ల కత్తి వెట్టుకుని తిరుగుతుండు.. ఏం మోక దొర్కినా మనల్ని పొడిచి పారేస్తడు.. మళ్ల తెలంగాణ బానిసలు గావాలె. దయచేసి తెలంగాణ మేధావులు ఆలోచించాలె. ఈ కుట్రను తిప్పి కొట్టాలె. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలె. 19 ఏండ్ల నుంచి నేను తండ్లాడుతున్న. చాలా సందర్భాల్లో చెప్పిన పాలిటిక్స్ అంటే ఇతరులకు ఒక గేమ్. రాజకీయాలు మాకు గేమ్ కాదు. మాకు ఒక టాస్క్. ఒక మిషన్. అనుకున్న తెలంగాణ గావాలె.. కోటి ఎకరాలలో కచ్చితంగా పచ్చవడాలె. యాదాద్రి జిల్లా గంధమల్ల, బస్వాపూర్ ద్వారా ఇయ్యాల మన కాళేశ్వరం నుంచి రెండు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు రావాలె. డిండి ద్వారా దేవరకొండ మునుగోడు సస్యశ్యామలం గావాలె. శ్రీరాంసాగర్ కాల్వ ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ మొత్తం పచ్చవడాలె.. నకిరేకల్ మూసీ ప్రాజెక్టు బ్రహ్మాండంగ రావాలె. కృష్టలో మన వాటా నీళ్లు తీసుకుని మొత్తం నాగార్జునసాగర్ ఆయకట్టు ఒక గుంట బోకుండ గూడ మనం కాపాడుకోవాలె. రైతులు బంగారు రైతులు గావాలె. బ్రహ్మాండంగా.. రైతులు బాగుపడేదాక.. వాళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తం. అపురూపమైన రైతుబంధు కొనసాగిస్తం. ఎకరానికి రూ.8వేలు ఇస్తా ఉన్నం. గతంలో ఎవరూ పట్టిచ్చుకోలే. రైతుల గురించి మొట్టమొదట ఆలోచించింది దేశంలో తెలంగాణ ప్రభుత్వమే. రైతు చచ్చిపోతే అడిగే నాథుడు లేడు.. మేం రైతు బీమా చేసినం. ఐదు గుంటల భూమి ఉన్న రైతు చచ్చిపోతే గూడా రూ.5లక్షలు పది రోజుల్లోపల్నే వస్తయి.. వాళ్ల భార్య బిడ్డలు బజారుమీదవడే పరిస్థితి ఉండదు.

ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు..
పరిపాలన చేసుకుంటూ వెళ్తుంటే కాంగ్రెస్సోళ్లు రోజు.. ప్రతి రోజు ఒక భజన. ప్రాజెక్టులు పూర్తికావాలె. నీళ్లు రావాలె, వలసలు బంద్‌గావాలె. మన రైతులు బత్కాలె. రాత్రింబగళ్లు పనిచేస్తా ఉన్నం. కాంగ్రెస్ నాయకులకు పడుతలేదు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే 196 కేసులువేశారు దుర్మార్గులు. అన్ని గూడా కొట్లాడినం. అయిపోయింది. మొత్తం ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్సులు వచ్చినయి. ఆ క్లియరెన్సు ఇచ్చిన పద్ధతి తప్పు అని మల్ల కోర్టుకు పోయినారు. ఎంత సిగ్గుమాలిన నాయకులు!

తెలంగాణ పోలీసులు దేశంలో నంబర్‌వన్
కడుపు, నోరు కట్టుకొని అవినీతిరహితంగా పనిచేస్తున్నాం. ఇయ్యాల గుడుంబా బట్టీల్లేవు, పేకాట క్లబ్బుల్లేవు, మట్కా జూదాల్లేవు, గూండాల దందాల్లేవు, పైరవీకార్ల మందల్లేవు, భూ కబ్జాల్లేవు.. మతకల్లోలాల్లేవు.. బాంబుదాడుల్లేవు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అద్భుతంగా దేశం మొత్తం నివ్వెరపోయేలా ఉన్నది. మంచి పేరు మన పోలీసులకు వచ్చింది. అది గూడ ఓర్వరు. తెలంగాణ పోలీస్.. దేశంలోనే నంబర్ వన్‌గా రూపుదిద్దుకుంటున్నడు.

సొంత జాగల కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు
కాంగ్రెస్సోళ్లు ఇప్పుడొచ్చి అర్రాజ్ పాట పాడినట్టే పాడుతున్నరిగ. కేసీఆర్ నువ్ వెయ్యి ఇస్తవా పింఛన్ మేం రెండు వేలిస్తం అంటున్నరు. ఇదేమన్న వేలంపాటనా? నేను రెండున్నర వేలిస్త.. ఇప్పుడేమంటరు? పింఛను పెంచుదమా? గ్యారంటీగా కడుపు నిండ పెంచుదం.. పది రోజులలో ప్రకటన గూడ చేస్తం. ఒక్క మాట కూడా పొల్లు మాట చెప్తలేను.. ఒక్కమాట కూడా అబద్ధం చెప్తలేను. అర్థమైన సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. ప్రజల నుంచి కొన్ని నాకు చేరినయ్. డబుల్ బెడ్‌రూం ఇండ్లు కడ్తున్నరు.. కాలనీ అంటే కాదు.. మా సొంత జాగ ఉంటే గూడ కట్టియ్యాలని కోరుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ పనిగూడ చేస్తం.అది కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్తం. దాని స్పీడు గూడ పెంచుతం. ఈ విధంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలాంటప్పుడు టీఆర్‌ఎస్‌ను ఓడ గొట్టాలె.. ఎన్ని అవద్దాలన్న జెప్పాలె అని కుట్రలు వన్నుతా ఉన్నరు.

12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా
నల్లగొండ జిల్లాలో12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతది. పీసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్షనాయకుడు ఇద్దరి గోషీలు ఊషిపోయే పరిస్థితి ఉన్నది. నిన్ననే కొత్త సర్వే రిపోర్ట్ వచ్చింది. 119 నియోజకవర్గాల్లో 110 చోట్ల గులాబీ జెండా ఎగరబోతున్నదని తీర్పువచ్చింది. చైతన్యవంతులైన నల్లగొండ జిల్లా ప్రజలు మిగతా జిల్లాలకు మార్గదర్శకం కావాలి. అన్నిరకాలుగా బాగుపడాలన్నా, ఈ ప్రగతి రథచక్రం ఆగొద్దన్నా మీరే ముందుకు తీసుకుపోవాలి. ఉర్కెటోని కాళ్లల్ల కట్టెపెట్టే దుర్మార్గులకు బుద్ధిచెప్పాలి.

కోడ్ ఎత్తేసిన తెల్లారే చీరెలు పంచుతా

ఆడబిడ్డలు బతుకమ్మ వస్తే పండుగ చేసుకుంటరు. వాళ్లను ఎవడూ పట్టించుకోలే. వాళ్లను గౌరవించి, 90 లక్షల చీరెలు తయారుచేయించి పంచుదామంటే.. కాంగ్రెసోళ్లు కోర్టుకు పోయిండ్రు. గూడూరు నారాయణరెడ్డి అని భువనగిరివాడు.. కోర్టుకుపాయే. ఈసీకి ఫిర్యాదు చేసిండు. ఆడబిడ్డల నోటికాడి కూడు గుంజుకుని, చీరలు పంచొద్దన్నరు. మా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక్కటే మనవి చేస్తున్నా.. ఎన్నికల కమిషన్ నిబంధన ఉండి, దసరా లోపట మీకు చీరలు పంచకపోయినా.. ఎలక్షన్ కోడ్ ఎత్తేసిన తెల్లారే గ్యారెంటీగా మీ ఊర్లకు, కాళ్ల దగ్గరకు చీరెలు తెచ్చి పంచుతం. మీరెవ్వరు రంది పడొద్దు. రైతుబంధు చెక్కులు కూడా ఇయ్యొద్దట. చెక్కులు ఇయ్యొద్దని మర్రి శశిధర్‌రెడ్డి అనే పుణ్యాత్ముడు కోర్టుకు పోయిండు. కోర్టు రెండు చెంపలు వాయించింది. అరె సన్నాసి బుద్ధున్నాదిరా..రైతులను బతుకనియ్యి అని చెప్పి, చెక్కులు పంచమన్నది.

తెలంగాణను అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్రలు
తెలంగాణ రాంగనే చంద్రబాబు కుట్రలు మొదలుపెట్టిండు. అస్థిరపర్చాలి, గడబిడ చేయాలని ఓటుకు నోటు ప్రయత్నం చేసిండు. మజ్లిస్‌పార్టీ అధ్యక్షుడు, మిత్రుడు అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నుంచి నాకు ఫోన్‌చేశారు. సార్.. ప్రభుత్వం పడగొట్టాలని కుట్ర జరుగుతున్నదని చెప్పి తెల్లారి వచ్చి కలిశారు. వాళ్ల పార్టీ ఆఫీస్‌లో మీటింగ్‌పెట్టి మద్దతు డిక్లేర్ చేసిండ్రు. తర్వాత బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప, వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు టీఆర్‌ఎస్‌లో కలువడంతో మన సంఖ్య 75కి పెరిగింది. తర్వాత కుట్రలు బందైయినయి. అట్లాంటి కుట్రదారుడైన చంద్రబాబును తీసుకొచ్చి ఇవ్వాళ వీళ్లు ఊరేగుతామనుంటున్నరు. ముసల్‌మాన్ భాయోంకో మై సలామ్ కర్తాహూ. ఆప్ తమామ్ లోగోంసే గుజారిష్ కర్తాహు. ఇన్‌చార్‌సాలోమే తెలంగాణమే క్యా హోరాహాహై? ఆప్‌లోగ్ బెహతరీన్ జాన్తాహై. ఫైసలాలీజీయే. ఆప్‌నే పూరే జద్దేజౌద్‌మే తావూన్ కియా.తెలంగాణకా తాయీజ్ కియా..ముజే పూరా సపోర్ట్ దియా..ఆప్‌కీ దువావోంసే తెలంగాణ హాసిల్ హువా..మై ఏకీబాత్ కహెనా చాహ్‌తాహూ..ఆజ్ చంద్రబాబు, గలత్ తాకతోంకో లాకే ఫిర్‌సే ఏక్‌బార్ తెలంగాణకో హరానా చాహెతేహై..కుచ్‌నహీ హోగా..హమ్‌కో మిఠా సకే యే జమానా మే ధమ్‌నహీ..హమ్‌సే జమానాహై..జమానాసే హమ్‌నహీ. జంబూయత్‌మే జబ్ ఇంతేకాబ్ ఆతాహై..జబ్బీ ఎలక్షన్ ఆతాహై..ఇంతెకాబ్‌గా ఖుదా అవామ్ హోతాహై..ఆప్‌లోగ్ హోతాహై..ఆప్‌కా అగర్ దువాహై..చంద్రబాబు, కాంగ్రెస్ హమారే కుచ్‌నహీ బిగాడ్‌తా..తెలంగాణకా కుచ్‌నహీ బిగాడ్‌తా..జబ్ అల్లాకా కరమ్‌హై..హమ్‌కామ్యాబ్ హోకే రహేంగే..ఆప్‌కా ఆశీర్వాద్ కేలియే మై ఆజ్ ఆయాహూ..సారే రియాసత్‌కే ముసల్‌మాన్ భాయోంకో మై సలామ్ కర్తాహూ..ఆప్‌కా తావూన్..ఔర్ తాయీజ్ చాహ్‌తాహూ..జమాతే ఇస్లాంనే సపోర్ట్ ఎలాన్ కియాహై..ఆప్ తమామ్‌లోగోంసే మై గుజారిష్ కర్తాహూ.. ఆప్‌లోగోంకా తావూన్ అగర్‌హో..ఆప్‌లోగో అగర్ తాయీజ్ కరేంగే. తోజరూర్ హమ్ కామ్యాబ్ జాబ్‌హోకే రహేంగే..ఫానూస్ బన్‌కర్ జిస్‌కీ హిఫాజత్ హవ కరే..హో షమా క్యాబుజే..జిస్‌కీ రోషన్ ఖుదా కరే..ఇత్నాబడా కామ్యాబ్ మిలేగా అని సీఎం కేసీఆర్ చెప్పారు..

బ్రహ్మాండంగా సభ.. అందరికీ దన్యవాదాలు
సోదరులా.. సోదరీమణులారా.. నల్లగొండ చరిత్రలో కనీవినీ ఎరుగని సభ జరిగింది. నేను కూడా ఊహించలేదు. బాగా చేస్తామని జిల్లా నేతలు చెప్పిన్రు. సభను మీ ఊర్లో పెట్టండని చెప్పా.. సరిపోదు సార్, అని అద్దంకి చౌరస్తాలో పెట్టారు. హెలికాప్టర్‌లో వస్తున్నప్పుడు చూశా. సభా ప్రాంగణం నిండిపోయింది. చాలా మంది బయట బస్సులకాడ, సభ వెలుపల ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చి, దీవెన ఇచ్చి సభను విజయవంత చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిర్వాహకులైన టీఆర్‌ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. సెలవు తీసుకుంటున్నా అంటూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.

రాళ్లతో కొట్టి చంపమన్నా
ఉద్యమ సమయంలో ప్రజలకు ఒకే మాట చెప్పా. ఉద్యమబాట వీడను. మడమ తిప్పను. మడమ తిప్పితే రాళ్లతో కొట్టి చంపాలని పిలుపిచ్చా. మీరంతా నాపై విశ్వాసం ఉంచి, చేతులు కలిపి పోరాడారు. 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సా ధించాం. తెలంగాణలో అన్ని వర్గాలను పట్టి పీడించిన కరంటు సమస్యను ఐదారు నెలల్లో పరిష్కరించాం. అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. దేశంలో తొలిసారిగా రైతులకు 24 గంటలపాటు ఉచిత కరంట్ ఇస్తున్నాం. తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ ప్రారంభించాం. 99 శాతం పనులు పూర్తయ్యాయి. రాబోయే రెండునెలల్లో ఇంటింటికీ నీళ్ల కల సఫలమవుతుంది. సమైక్యపాలనలో అర్ధాకలితో పనిచేసిన ఉద్యోగులకు.. గౌరవప్రదమైన జీవితం గడిపేలా జీతాలు పెంచాం. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, విద్యార్థులకు సన్నబి య్యం ఇలా అనేక పథకాలు పెట్టుకున్నాం. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు నేత కార్మికులు చనిపోతే.. చంద్రబాబుకు చేతులెత్తి దండంపెట్టి తలా రూ.50 వేలు ఇవ్వాలని అడిగా. ఇవ్వకపోతే భిక్షాటనచేసి ఇంటికో రూ.50 వేలు సాయంచేసి ఆదుకున్నాం.

రైతుల కన్నీరు తుడిచాం
తెలంగాణ ప్రయాణం ప్రారంభమైన కొత్తలో కరంట్ బాధలు, సాగులో సంక్షోభం, ఫ్లోరైడ్ కష్టాలు, శిథిలమైన చెరువులు, ప్రాజెక్టులు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో చుట్టుముట్టాయి. ఓపక్క చంద్రబాబు కుట్రలు, మరోపక్క ఇక్కడివారి సహాయ నిరాకరణ..అయినా భయపడకుండా ధైర్యంగా ఉండి గెలిచి నిలిచాం. రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 2,637 మంది వీఏవోలను నియమించాం. సాదాబైనామాలకు ఫ్రీగా పట్టాలిచ్చాం. భూరికార్డులను ప్రక్షాళనచేసి పాస్‌పుస్తకాలు ఇచ్చాం. సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చాం. సబ్సిడీ యంత్రాలు, పనిముట్లు ఇచ్చాం. నీటి తీరువా శాశ్వతంగా రద్దుచేశాం.

కుల వృత్తులు నాశనం చేశారు
సమైక్యపాలనలో వృత్తులన్నీ పోయాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పట్టణాలకు రోజుకు 650 లారీల గొర్రెలు దిగుమతయ్యేవి. 30లక్షల మంది గొల్లకుర్మలు న్నా దిగుమతవడంపై గత ప్రభుత్వాలు ఆలోచించలేదు. మేం గుర్తించి 65 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. వాటికి 35లక్షల గొర్రెలు పుట్టాయి. మొత్తం సంఖ్య కోటి కి చేరింది. గొర్రెల పంపిణీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ గొర్రెలకు గొల్ల, కుర్మ సోదరులే బుద్ధిచెప్పాలి. మత్స్యకారుల కోసం వెయ్యి కోట్లు కేటాయించి ఉపాధి పెంచాం. దేశంలో ఎక్కడాలేనివిధంగా 50 శాతం సబ్సిడీ కింద నూలు ఇచ్చి, రంగులు, రసాయనాలు ఇచ్చి చేనేతలను ఆదుకున్నాం. ఆత్మహత్యలు ఆగాయి. చీప్‌లిక్కర్ లాబీలకు తలొగ్గి కాంగ్రెస్ నాయకులు కల్లు దుకాణాలు మూసేస్తే మేం తెరిచాం. రజకులు, నాయీబ్రాహ్మణులకు సాయంచేశాం. ఎంబీసీల కోసం రూ. వెయ్యి కోట్లతో దేశంలో ఎక్కడా లేని కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.

నాగార్జునసాగర్ స్థానమార్పిడి భారీ మోసం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు అసలు పేరు నందికొండ. ఇప్పుడున్న దానికంటే 19 కిలోమీటర్లపైన ఏళేశ్వరం దగ్గర కట్టాలి. అప్పటి డిజైన్ ప్రకారం తెలంగాణకు 180 టీఎంసీలు, ఏపీకి 60 టీఎంసీల హక్కు ఉంటంది. కానీ ప్రాజెక్టును 19కిలోమీటర్లు కిందికి తెచ్చి పేరుమార్చా రు. నీటి వాటాలో చెరి 132 టీఎంసీలు అని మోసంచేశారు. అయినా.. నాటి సీఎం బూర్గుల రామకృష్ణారావు మూతి ముడుసుకున్నడు. నెహ్రూ ఇదే జిల్లాకు వచ్చి ఫౌండేషన్ వేస్తే గుడ్డిగా అమోదం తెలిపారు. అది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం. సమైక్య రాష్ట్రంలో ఎస్‌ఎల్బీసీ సొరంగాన్ని ఏ గతిచేశారో తెలుసు. 2002లో నల్లగొండ జిల్లాకు అప్పటి సీఎం వస్తే నిలదీశా. కుడి కాల్వ కింద లక్ష ఎకరాలకు లిఫ్ట్ ఉంటే, మన ఎడమ కాల్వలకు 30 వేల ఎకరాకే ఉంటది. కుడి కాల్వకేమో ప్రభుత్వం కరంట్ బిల్లు కడితే.. ఎడమ కాల్వకేమో రైతులే కట్టాలి. ఇది వివక్ష కాదా అని చంద్రబాబును ప్రశ్నించా. ఆగమేఘాల మీద మంత్రిని పంపించి ఎడమ కాల్వ బిల్లును రద్దుచేశారు. ఇలా ఎన్నో ఆరాచకాలు జరిగాయి. ఏనాడూ కాంగ్రెస్ నాయకులు పోరాటం చేయలేదు. కాంగ్రెస్ కావొచ్చు.. టీడీపీ కావొచ్చు..ఒకరు చంద్రబాబుకు గులాం.. మరొకరు ఢిల్లీకి గులాం. ఈ గులాంల వల్లే తెలంగాణ ప్రజల బతుకులు ఆగమయ్యాయి.

నల్లగొండతో నాది ఉద్వేగపూరిత అనుబంధం
నల్లగొండ పోరాటాల పురిటి గడ్డ. నాటి సాయుధ రైతాంగ పోరాటంలోనూ, నేటి తెలంగాణ ఉద్యమంలోనూ పిడికిలి బిగించి చైతన్యాన్ని రగిలించిన నల్లగొండ ప్రజానీకం సరైన తీర్పు ఇవ్వాలని కోరుతున్నా. ఈ జిల్లాతో నాది ఉద్వేగపూరితమైన అనుంబంధం. కోదాడ నుంచి హాలియా దాకా పాదయాత్ర చేశా. ఫ్లోరైడ్‌పై పోరాటంలో ఎనిమిది రోజులు ఇక్కడే మకాం వేసి ఉద్యమించా. ప్రజల సహకారంతో 2001లో గులాబీ జెండా ఎగిరింది. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు స్థానమే లేదని చెప్పినచోట, గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 12లో ఆరు స్థానాలు గెలిపించి విశ్వాసం ప్రకటించారు. ఇప్పుడు అన్నిపార్టీలు వాదనలు చెప్తాయి. శ్రద్ధగా వినాలి. వాస్తవం గుర్తించి, పనిచేసే వాళ్లను గెలిపిస్తే ప్రజలకు లాభం జరుగుతది.

జగదీశ్‌రెడ్డి గట్టోడు..
విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఉత్తర తెలంగాణలో ఉన్నయి. దక్షిణ తెలంగాణలో లేవు. నల్లగొండ జిల్లాలో నాయకులు లేరా. ఎత్తు తక్కువున్నరా? దొడ్డు తక్కువున్నరా? ఎన్నడూ నోరు తెరవలేదు. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గానీ, ఎవరూ కూడా నల్లగొండ జిల్లాలో పవర్ ప్రాజెక్టు పెట్టాలని అడుగలే. ఈరోజు విద్యుత్‌శాఖమంత్రి.. జానారెడ్డి అంత ఎత్తు లేకపోవచ్చు.. ఉత్తమ్ అంత పొడుగు లేకపోవచ్చు. కానీ.. గట్టివాడు. దక్షిణ తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలని కొట్లాడిండు. 4వేల మెగావా ట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ను రూ.29,965 కోట్ల పెట్టుబడితో ఈ బక్క మంత్రి జగదీశ్‌రెడ్డి దామరచర్లకు తెచ్చిండు. రెండేండ్లలో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ ముఖచిత్రం మారుతది.

చంద్రబాబునాయుడూ.. మాతో గెలుక్కున్నవ్ జాగ్రత్త.. తెలంగాణ దెబ్బ ఏందో తగిల్తే ఎగిరి విజయవాడ కరకట్టకు వడ్డవ్.. అనవసరంగా రాకు.. మా బతుకు మేం బత్కుతున్నం.. మేం నీ తెరువు రాలే.. ఆడ సక్కగ లేదు నీ కత.. ఆగమాగమున్నది. ఈ నల్లగొండోల్లు మీ బార్డర్ పక్కనే ఉంటరు. దబ్బున నేను మూడో కన్ను దెరిస్తే.. నీ గతి ఏమైతదో ఆలోచించుకో.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.