-ప్రగతిని చెప్పాలి.. పట్టుదలతో ముందుకెళ్లాలి -వరంగల్ నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం

‘రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నరేండ్లుగా చేసిన ప్రగతిని ప్రజలకు చెప్పండి. పట్టుదలతో ముందుకెళ్లండి’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులతో ప్రగతిభవన్లో ఆయన శుక్రవారం సమావేశం అయ్యారు. త్వరలో జరుగబోయే శాసనమండలి (పట్టభద్రుల నియోజకర్గం) ఎన్నికలు, వరంగల్ మహానగర పాలకసంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం మొదలైన అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించటంలో ప్రతీ ఒక్కరూ ముందు వరుసలో ఉండాలని ఆయన పేర్కొన్నారు. కష్టపడే ప్రతి ఒక్కరికీ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళ్లాలని, డివిజన్ల వారీగా కష్టపడే కార్యకర్తలను గుర్తించి సముచిత స్థానం కల్పించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. శుక్రవారం తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ పుట్టిన రోజు కావడంతో సమావేశంలోనే ఆయనకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్లు దాస్యం వినయభాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు సహా పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.