-తెలంగాణలో అత్యంత వేగంగా పట్టణీకరణ -విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధి పరుగులు -24 గంటల కరంటు, ఇంటింటికీ నల్లా నీళ్లు -మున్సిపాలిటీలకు ప్రతినెల రూ.178 కోట్లు -ఆరేండ్లలో ఆస్తి పన్ను, నీటి బిల్లు పెంచలేదు -ప్రపంచం మెచ్చిన గమ్యస్థానం హైదరాబాద్ -పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశవ్యాప్తంగా సగటు పట్టణ జనాభా 31.2 శాతంగా ఉంటే తెలంగాణలో 42.6 శాతానికి చేరుకున్నదని తెలిపారు. ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా హైదరాబాద్ మారుతున్నదన్నారు. జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాలు, ఇతర మున్సిపాలిటీల్లో వసతులు, మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చను ప్రారంభిస్తూ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అనంతరం సభ్యులు లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలపై లెక్కలు, ఫొటోలతో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం దార్శనికతతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టి జరిగి పెట్టుబడులు పెరుగుతున్నాయని, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఇవన్నీ పట్టణాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థల బలోపేతం, ఉపాధి కల్పన, టీఎస్ఐపాస్ తదితర కార్యక్రమాల ఫలితంగా తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో 74 కొత్త మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఏర్పాటుచేశామన్నారు. ఫలితంగా రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 142కు పెరిగిందన్నారు.
ఆరేండ్లలో పలు సంస్కరణలు పౌరులకు నాణ్యమైన సేవలు అందించడం, వారి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో గత ఆరేండ్లలో అనేక పాలనా సంస్కరణలను చేపట్టామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పౌరులను కేంద్రంగా చేసుకొని తెలంగాణ మున్సిపల్ యాక్ట్-2019తో సంస్కరణలకు తెరలేపామన్నారు. అధికారులను, ప్రజాప్రతినిధులను బాధ్యులను చేస్తూ, పౌరులకు బాధ్యతలను గుర్తుచేస్తూ సులభంగా పౌరసేవలను అందించే దిశగా విధివిధానాలను రూపొందించామని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ టీఎస్‌బీపాస్‌ను ఆవిష్కరించామన్నారు. నిర్ణీత గడువులోగా భవన నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వకుంటే డీమ్డ్ టు అప్రూవల్ పొందే విప్లవాత్మక విధానాన్ని తెచ్చామన్నారు.
చట్టాలతోపాటే ప్రత్యేక సంస్థల ఏర్పాటు మున్సిపాలిటీల అభివృద్ధికి చట్టాలు చేస్తూనే.. వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు అందించేందుకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ), హైదరాబాద్ కోసం స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్సార్డీపీ), కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటివి ఏర్పాటు చేశామని వివరించారు. కరోనాతో దేశమంతా స్తంభిస్తే, తెలంగాణ మాత్రం దానినొక అవకాశంగా మలుచుకొన్నదని చెప్పారు. జీహెచ్ఎంసీ సహా పట్టణాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిందని అన్నారు.
ప్రజలపై పైసా భారం మోపలేదు విధులతోపాటు నిధులు కేటాయించినప్పుడే అభివృద్ధి సాధ్యమని విశ్వసించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా జీహెచ్ఎంసీకి రూ.78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు.. మొత్తంగా రూ.148 కోట్లు ఠంచనుగా విడుదల చేస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. పురపాలికలకు ఏటా రూ.1,776 కోట్లు సమయానికి విడుదలచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనన్నారు. దీంతోపాటు పురపాలికల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అయినా ప్రజలపై ఒక్కపైసా ఆర్థికభారం మోపలేదని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆస్తి పన్ను, నీటి బిల్లులు పెంచలేదని, పైగా రూ.1200కన్నా తక్కువ వార్షిక ఆస్తిపన్ను కలిగిన వారికి రూ.101కి తగ్గించామని వివరించారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నట్టు చెప్పారు.
గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌పక్ష నాయకుడు) తన నియోజకవర్గానికి రావాలన్నా, పోవాలన్నా ఖమ్మం మీదుగా పోతారని, 2014 వరకు ఖమ్మం ఎలా ఉన్నది? ఇప్పుడు మంత్రి అజయ్‌కుమార్ నేతృత్వంలో ఎలా అభివృద్ధి చెందిందో గుండెలమీద చేయి వేసుకొని చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాలు చేశారు. లక్కారం చెరువు అద్భుతంగా ఉన్నదని చెప్పారు. చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ నేతృత్వంలో వరంగల్ భద్రకాళి ట్యాంకును గొప్పగా తీర్చిదిద్దామన్నారు. వీటిని భట్టి తప్ప అందరూ ఒప్పుకుంటారని చెప్పారు.
ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్కు బ్రహ్మరథం ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘32 జిల్లా పరిషత్తులకుగాను అన్నింటినీ టీఆర్ఎస్ గెలుచుకున్నది. 130 మున్సిపాలిటీల్లో 122 స్థానాల్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. రాష్ట్రంలో 12,751 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరిగితే పదివేలకు పైగా టీఆర్ఎస్ గెలుచుకున్నది. కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండా పోయాయి’ అని చెప్పారు. అందుకే ఆ పార్టీ నాయకులు నిరాశా, నిస్పృహల్లో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను చిత్తశుద్ధితో అమలుచేస్తూ, నిరంతరం పట్టణాల అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడంతోపాటు అన్ని పట్టణాలను పరిశుభ్ర, హరిత పట్టణాలుగా మారుస్తామన్నారు. ప్రతి సిటీని లివబుల్, లవబుల్ సిటీగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టంచేశారు.
మెట్రోల్లో మేటి హైదరాబాద్ దేశంలో ఏ మెట్రో నగరాల్లోలేని అభివృద్ధి హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్నదని, దేశంలోనే నంబర్ వన్ సిటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో ఐటీ రంగంలో టాప్-5 కంపెనీలకు సంబంధించి.. 2001లో ఒక కంపెనీ హైదరాబాద్‌లో తన బ్రాంచిని ఏర్పాటు చేయగా… టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మిగిలిన నాలుగు కంపెనీలు ప్రపంచంలో రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశాయని మంత్రి తెలిపారు. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, ఉబర్ ఇలా ఎన్నో కంపెనీలు ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెట్టాయన్నారు.
చార్మినార్, గోల్కొండ మేమే కట్టినం అంటారు.. ప్రతిపక్షం నుంచి నిర్మాణాత్మక సూచనలు వస్తాయనుకుంటే.. హైదరాబాద్‌ను తామే నిర్మించామంటూ భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ప్రజాతీర్పు మేరకు ప్రస్తుతం శాసనసభలో టీఆర్ఎస్, మిత్రపక్షం మాత్రమే ఉన్నాయని, ప్రతిపక్షం నామమాత్రంగా మారిందన్నారు. అయినా కన్స్ట్రక్టివ్ (నిర్మాణాత్మక) సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరితే.. హైదరాబాద్ కన్స్ట్రక్షన్ అంతా కాంగ్రెస్ చేసినట్టు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని ఎద్దేవాచేశారు. ‘నాకు అనుమానం వచ్చి భట్టి విక్రమార్క గతేడాది ఉపన్యాసం రికార్డులను పరిశీలించా. సేమ్ టు సేమ్ తప్ప కొత్త విషయం ఒక్కటీ లేదు. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా చెప్పిందే చెప్పి కూర్చున్నారు’ అని విరుచుకుపడ్డారు. ఈరోజు తెలంగాణ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలకు ఉపాధి పోయిందని, గాంధీభవన్ దివాళా తీసిందని, రేపోమాపో టులెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌ను కాంగ్రెస్ ఉద్ధరిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు అయినా ఎందుకు గెలువలేదో చెప్పాలని సవాలు చేశారు. అవకాశం ఇస్తే ‘చార్మినార్, గోల్కొండ మేమే కట్టినం.. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ పేరు పెట్టినం’ అని కూడా చెప్తారని విమర్శించారు.
అన్ని పట్టణాల్లోనూ అభివృద్ధి పరుగులు వరంగల్‌తోపాటు ప్రతి పట్టణంలో మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీధి కుక్కలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నందున ప్రతి మున్సిపాలిటీలో యానిమల్ బర్త్ సెంటర్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. కుక్కలు, పందులులేని మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో పట్టణాల్లో మహిళలు షాపింగ్‌కు వచ్చినా, వేడుకలకు వచ్చినా కనీసం మూత్ర విసర్జనకు కూడా సౌకర్యాలు ఉండేవి కావని చెప్పారు. తమది మనసున్న, సంస్కారమున్న ప్రభుత్వమైనందునే రాష్ట్రవ్యాప్తంగా 11వేల పైచిలుకు టాయిలెట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. అందులో 50% మహిళలకు కేటాయించామని, ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా ప్రత్యేకంగా కట్టబోతున్నామని చెప్పారు. వెయ్యికి పైగా పట్టణ ప్రకృతివనాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. వెయ్యి పైచిలుకు పార్కులు ప్రారంభించామన్నారు. అన్నిరకాల వసతులతో వైకుంఠధామాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజూరాబాద్‌లో నిర్మించిన వైకుంఠధామం ఫొటోను సభలో చూపించారు. దేశంలోనే అతి పెద్ద ఎకో అర్బన్ పార్కును మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో 2700 ఎకరాల్లో బ్రహ్మాండంగా ఏర్పాటుచేశామని చెప్పారు.
ఆరేండ్లలో రూ.32వేల కోట్లు ఖర్చు హైదరాబాద్‌పై 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014-2020 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చును మంత్రి కేటీఆర్ వివరించారు. గత ఆరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.67,135 కోట్లను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌గా వివిధ రూపాల్లో ఖర్చు చేసిందని, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కలిపితే రూ.లక్ష కోట్లు దాటుతుందని చెప్పారు. కాంగ్రెస్ పదేండ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.4,636 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేండ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.32,533 కోట్లు ఇచ్చిందని తెలిపారు. పేదవారిపై ఒక్క రూపాయి భారం పడకుండా సుమారు రూ.10వేల కోట్లతో ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. లక్ష ఇండ్లను డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా.. కాంగ్రెస్ పార్టీ వారికి కనిపించడం లేదని విమర్శించారు.

అంబేద్కర్‌ను కాంగ్రెస్ గౌరవించిందా? అంబేద్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. అంబేద్కర్ తత్వమైన ‘బోధించు.. సమీకరించు.. పోరాడు..’ అని సీఎం కేసీఆర్ తమకు నేర్పిన పంథాలోనే టీఆర్ఎస్ నడిచి తెలంగాణను సాధించిందన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని, మొట్టమొదటి ఎన్నికలు జరిగిన 1952లోనే అంబేద్కర్‌ను పార్లమెంటులో కాలుపెట్టకుండా ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అధికారంలో 50 ఏండ్లు ఉంటే అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న సోయిలేదని విమర్శించారు. తమకు కాంగ్రెస్ నాయకుల కితాబులు అవసరం లేదన్నారు. అంబేద్కర్ గురించి ఆలోచన, అవగాహన ఉన్నందునే బోరబండలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దగ్గర 28 ఫీట్ల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని, అతిత్వరలోనే ట్యాంక్‌బండ్ పక్కన ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుతో అద్భుతంగా ఆవిష్కరించబోతున్నామని చెప్పారు.
త్వరలో వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ: కేటీఆర్ మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రామ పంచాయతీలలో కార్యదర్శుల మాదిరిగానే మున్సిపాలిటీలలో వార్డు అఫీసర్ల నియామకం ఉంటుందని, వారికి కూడా మూడేండ్లు ప్రొబేషనరి కాలపరిమితి విధిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వార్డు ఆఫీసులను కూడా ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. శాసనమండలిలో బుధవారం మంత్రి కేటీఆర్ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్.. రాష్ర్టానికి వృద్ధి ఇంజిన్ హైదరాబాద్ నగరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఇంజిన్ వంటిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘అత్యంత వేగంగా పుంజుకొంటున్న స్థిరాస్థిరంగం, చవకైన జీవనవిధానం, కట్టుదిట్టమైన శాంతిభద్రతలు, గంగా జమునా తెహజీబ్, స్థిరపడుతున్న అంతర్జాతీయ సంస్థలు, ఆకర్షణీయమైన ప్రభుత్వ పాలసీలు, అనువైన భౌగోళిక వాతావరణం, మెట్రో రవాణా వంటివాటి ఫలితంగా ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా, విశ్వనగరంగా హైదరాబాద్ మారుతున్నది’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ సహా మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు. అవి ఆయన మాటల్లనే..
ట్రాఫిక్ సమస్యకు చెక్: దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎస్సార్డీపీలో భాగంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి చేపట్టాం. ఇప్పటివరకు రూ.24వేల కోట్లతో 137 కిలోమీటర్లమేర 7 స్కైవేలను, 166 కిలోమీటర్ల పొడవుతో 11 మేజర్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. గచ్చిబౌలి మైండ్‌స్పేస్ జంక్షన్, కూకట్పల్లి, ఎల్బీనగర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ వంటి ప్రాంతాల్లో రద్దీని తగ్గించగలిగాం. ఇందిరాపార్క్, ఒవైసీ జంక్షన్లో స్టీల్ బ్రిడ్జీలు ప్రారంభమైనాయి. ఎస్సార్డీపీ ద్వారా 46 ఫైఓవర్ల నిర్మాణం, హెచ్ఆర్డీసీఎల్ కింద చేపట్టిన 27 మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్నది. సీఆర్ఎంపీ ద్వారా 709 కిలోమీటర్ల రోడ్లను ఏడు ప్యాకేజీలుగా విభజించాం, వాటి నిర్వహణ కొనసాగుతున్నది.
-ఉప్పల్-నారపల్లి స్కైవే నిర్మిస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ రోడ్డుకు, నిజామాబాద్ రోడ్డు వైపు స్కైవేలను నిర్మించాలని భావించినా, రక్షణ శాఖ సహకరించడం లేదు. -పేదలకు నాణ్యమైన వైద్యం: అల్పాదాయ వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు 198 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు 350 దవాఖానలు ఏర్పాటుచేస్తాం. -4 కోట్ల మంది పేదలకు అన్నం: పేదలకు సురక్షిత, పౌష్టికాహారాన్ని అతి తక్కువ ధరకు అందించేందుకు జీహెచ్ఎంసీ 150 అన్నపూర్ణ భోజన కేంద్రాలను నడుపుతున్నది. వీటి ద్వారా రోజూ 35వేల మంది రూ.5కే ఆకలి తీర్చుకుంటున్నారు. కొవిడ్ సమయంలో 373 సెంటర్ల ద్వారా రెండు పూటలా ఉచితంగా ఆహారం అందించాం. 2014 నుంచి ఈ ఏడాది మార్చి వరకు 4 కోట్ల మంది పేదలకు భోజనం అందించాం. కొవిడ్ సమయంలో అందించిన 1.58 కోట్ల భోజనాలు కలిపితే మొత్తం 5.5 కోట్ల మందికి కడుపు నింపాం. -వీధి వ్యాపారులకు లోన్లు: స్ట్రీట్ వెండర్స్ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలికల్లో 3.97 లక్షల మంది వీధి వర్తకులను గుర్తించాం. ఇందులో సుమారు 99,364 మంది హైదరాబాద్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 2.15 లక్షల మందికి రూ.10వేల బ్యాంకు రుణాలు అందించాం. -13వేల టాయిలెట్లు: స్వచ్ఛ తెలంగాణ దిశగా జీహెచ్ఎంసీ పరిధిలో 4,225, ఇతర మున్సిపాలిటీల్లో 8,839 టాయిలెట్లను నిర్మిస్తున్నాం. ఇవి పూర్తయితే దేశంలోనే అత్యధిక టాయిలెట్లు ఉన్న నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది. -ఇంటింటికీ నల్లా నీళ్లు: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా నెట్వర్క్ బలోపేతానికి సుమారు రూ.1900 కోట్లతో పనులు చేపట్టాం. హైదరాబాద్‌కు భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చే కేశవాపూర్ రిజర్వాయర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. జలమండలి విజ్ఞప్తిమేరకు సీఎం కేసీఆర్ విద్యుత్తు బిల్లుల భారాన్ని కొంత తగ్గించారు. ఇందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. -సీసీటీవీలతో రక్షణ: 3,42,645 సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్ నగరం నిఘాలో దేశంలోనే మొదటిస్థానంలో, ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. నేరాలను అరికట్టడంలో మూడో కన్నుగా అవి ఉపకరిస్తున్నాయి. ఇప్పటివరకు 18,235 నేరాలను సీసీటీవీల ద్వారా గుర్తించారు. -షా కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం మూడు దశల్లో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నాం. ప్రధాన నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పాతబడినందున అవసరమున్న చోట పైపులైన్లు మార్చడంతోపాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించి కార్వాన్ పరిధిలో రూ.380 కోట్లతో పాత వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టనున్నాం. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం ఇలా చుట్టుపక్కల మున్సిపాలిటీల పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.3700 కోట్లతో పనులు చేపట్టేందుకు త్వరలో టెండర్లు పిలువనున్నాం.