-రాష్ట్రంలో ప్రారంభమైన పట్టణ ప్రగతి -పాలమూరులో శ్రీకారంచుట్టిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ -ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు -వార్డుల్లో తిరుగుతూ సమస్యలపై ఆరా

పల్లెప్రగతి స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతికి అంకురార్పణ జరిగింది. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లో ప్రారంభించి.. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పిలుపునిచ్చారు. అన్నివర్గాల ప్రజలు భాగస్వాములై పట్టణ ప్రగతిని పట్టాలెక్కించాలని సూచించారు. మొదటిరోజు కార్యక్రమానికి స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభించింది.
రాష్ర్టానికి కేసీఆర్, కేటీఆర్ రెండు కండ్లు రాష్ర్టానికి సీఎం కేసీఆర్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ రెండు కండ్లలాంటివారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. వారిద్దరి వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని కొనియాడారు. సోమవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతిని ప్రారంభించిన సందర్భంగా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే రాష్ట్రంలో వలసలు ఆగిపోయాయన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రిగా కేటీఆర్ పట్టణాలకు కొత్తరూపు తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు.

పట్టణాలు మెరువాలి: జగదీశ్‌రెడ్డి పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలు మెరువాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అ న్నారు. సోమవారం సూర్యాపేటలోని రెండో వార్డులో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి స్ఫూర్తితో చేపట్టిన పట్టణ ప్రగతిలో పట్టణాలు మరింత అభివృద్ధి చెందాలన్నారు.
కరీంనగర్ జిల్లాలో.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని 23, 29వ వార్డులు, జమ్మికుంటలోని 21, 29వ వార్డుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులతో కలిసి తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 22, 29, 27, 9వ డివిజన్లలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి సమస్యలను గుర్తించారు.

అవగాహన పెంచేందుకే..: సింగిరెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐదో వార్డులో ఎంపీ రాములు, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాలతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పట్టణ ప్రగతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణం, పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు.
సమగ్ర అభివృద్ధికే..: ఎర్రబెల్లి పల్లె ప్రగతి తరహాలో మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పా రు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని ఆరో వార్డు పరిధి ఎస్సీ కాలనీలో కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేశాయిపేటలో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పదిరోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
భాగస్వాములు కావాలి: సత్యవతి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములై సమగ్ర అభివృద్ధి సాధించి సీఎం కేసీఆర్ కల నెరవేర్చాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతోపాటు వరంగల్ పశ్చిమ నియోజకర్గంలోని రామన్నపేట ప్రాంతంలో పట్టణ ప్రగతిని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రోడ్లు, నర్సరీలు, శ్మశానవాటికలు, మోడల్ మార్కెట్లు, మూత్రశాలలు, పార్కులు, డంప్‌యార్డుల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ప్రభు త్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
మార్పు కనిపించాలి: పువ్వాడ పట్టణ ప్రగతితో నగరాలు, పట్టణాల్లో మార్పు కనిపించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఉద యం 6 గంటలకు ఖమ్మం నగరంలోని మాణిక్యనగర్‌లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, నగర మేయర్ డాక్టర్ పాపాలాల్, నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి మంత్రి మొక్కలు నాటి పట్టణ ప్రగతిని ప్రారంభించారు. మురుగు కాల్వలోని చెత్తను మంత్రి స్వయంగా తొలిగించారు.
నిర్మల్‌లో మురికి కాల్వలు శుభ్రం నిర్మల్‌లోని 8వ వార్డులో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీలోని మురికి కాల్వలను శుభ్రం చేయించారు.
ఉద్యమంలా పట్టణ ప్రగతి: సీఎస్ సోమేశ్‌కుమార్ పట్టణప్రగతి ఉద్యమంలా సాగాలని సీఎస్ సోమేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులతోకలిసి సీఎస్ పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతివార్డులో 60 మందితో కూడిన నాలుగు కమిటీలు ఏర్పాటుచేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. వార్డుల్లో నాటిన మొక్కలను సంరక్షించకపోతే చట్టప్రకారం.. సంబంధిత కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి గల్లీని ఇంటిలాగే ఉంచుకోవాలి: హరీశ్‌రావు ఇంటి మాదిరిగా గల్లీలను కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆదర్శ పట్టణాలు తయారవుతాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డిలోని 8వ వార్డులో పట్టణప్రగతిని ప్రారంభించారు. వార్డులోని నారాయణరెడ్డి కాలనీ, సంజీవనగర్ కాలనీల్లో పాదయాత్ర చేపట్టారు. కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నా రు. వార్డులోని యువత 300 మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికే సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారన్నారు.
కలిసికట్టుగా పనిచేద్దాం మంత్రి కొప్పుల ఈశ్వర్ పట్టణాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పా రు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పట్టణప్రగతిని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములై పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ రవి పాల్గొన్నారు.
ప్రగతిపథంలో పట్టణాలు మంత్రి మల్లారెడ్డి పట్టణాలను అభివృద్ధిపథంలో నడిపించేందుకే పట్టణప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రజల సమస్యలను శాశ్వతంగా పరష్కరించాలని అధికారులకు సూచించారు. దుండిగల్‌లో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పాల్గొన్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దుదాం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదుద్దుకుందామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని 3 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల పరిధిలో సోమవారం పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్‌నగర్‌లోని 33, 34, 35వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛ ఆటోలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు.