Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజా మ్యానిఫెస్టో

-పంట పెట్టుబడిసాయం రూ.8,000 నుంచి రూ.10,000లకు పెంపు
-రూ.1 లక్షలోపు రైతురుణాలు మాఫీ
-వికలాంగుల పెన్షన్ రూ.1,500 నుంచి రూ.3,016కు పెంపు
-నిరుద్యోగ భృతి రూ.3016
-పింఛన్ల లబ్ధిదారుల వయోపరిమితి 57 సంవత్సరాలకు తగ్గింపు
-మా ప్రయత్నమంతా రైతును రాజును చేసేందుకే
-2021 జూన్ నాటికి కోటి ఎకరాల తెలంగాణ
-రాష్ట్రం మంచి చెడ్డలు టీఆర్‌ఎస్‌కు ఒక టాస్క్
-తెలంగాణ సాధించిన పార్టీగా మాపైనే ప్రధాన బాధ్యత
-ప్రజలు కోరుతున్నవే మ్యానిఫెస్టోలో పెడుతున్నాం
-మాది విశ్వసనీయ ప్రభుత్వం
-చేసేది చెప్తాం.. చెప్పింది చేస్తాం
-వంద సీట్లు దాటడమే మా ప్రయత్నం
-ప్రతి జిల్లాలో అగ్రభాగాన ఉన్నాం
-అవినీతిపరుల వివరాలన్నీ ఉన్నాయి.. ఎవరినీ విడిచిపెట్టను
-జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పను: మీడియాతో సీఎం కే చంద్రశేఖర్‌రావు
-10 నుంచి 15వేల కోట్లతో ఎస్సీలకు, 6 నుంచి 8 వేల కోట్లతో గిరిజనులకు
-ప్రత్యేక పథకాలు
-ఐకేపీ మహిళా గ్రూపులకు సబ్సిడీపై ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు
-మరింత క్రియాశీలకంగా రైతు సమన్వయ సమితులు
-రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవభృతి
-యథాతథంగా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం
-సొంతజాగా కలిగినవారికీ ఉచితంగా డబుల్ ఇండ్లు
-సొంతంగా ఇల్లు కట్టుకునేవారికి ఆర్థిక సహాయం
-రెడ్డి కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు
-టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టోలో పేదలపైపెద్దమనసు

పేద ప్రజలపై
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెద్ద మనసు చాటుకున్నారు. టీఆర్‌ఎస్ ఎప్పుడూ పేద ప్రజలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసమే ఆలోచిస్తుందని మరోసారి నిరూపించుకున్నారు. రైతును రాజును చేయడమే తమ లక్ష్యమన్న సీఎం.. రాబోయే ఎన్నికల కోసం మంగళవారం ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోలో వారికి పెద్దపీట వేశారు. ఇప్పుడు ఇస్తున్న పంట పెట్టుబడి సాయం ఎనిమిదివేల రూపాయలను ఏకంగా పదివేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సామాజిక రంగంలోనూ తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రి.. ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించి.. 40 లక్షలమంది జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు. ఆసరా పింఛన్లు వెయ్యి నుంచి రూ.2016కు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంచుతామని చెప్పారు. 2021 నాటికి కోటి ఎకరాల మాగాణం ఖాయమని, ఈ క్రమంలో అన్ని అడ్డంకులు అధిగమించి, ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని ప్రతినబూనారు. రాష్ట్ర అభివృద్ధి తమకు ఒక టాస్క్‌లాంటిదని పునరుద్ఘాటించిన కేసీఆర్.. ఆ టాస్క్‌ను అధిగమించే క్రమంలో అభివృద్ధి చిత్రాన్ని ఆవిష్కరించారు. ప్రజలు కోరుతున్న అంశాలనే మ్యానిఫెస్టోలో పెడుతున్నామని స్పష్టంచేశారు. సాధ్యంకాని హామీలను టీఆర్‌ఎస్ ఇవ్వబోదని, కచ్చితంగా చేయగలిగిన హామీలను ఇచ్చి, వాటిని అమలుచేసి చూపిస్తామని చెప్పారు. ఇందుకు గత మ్యానిఫెస్టోలో ఇచ్చి, అమలుచేసిన పథకాలు, కార్యక్రమాలే ఉదాహరణ అన్నారు. వందసీట్లు దాటడమే తమ లక్ష్యమన్న సీఎం.. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్ల తమ పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేది టీఆర్‌ఎస్ పార్టీయేనని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయని గుర్తుచేశారు. తెలంగాణలోని ఆంధ్రప్రాంత వాసులు తెలంగాణవారేనని, ఈ విషయాన్ని తాను వేలసార్లు చెప్పానని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయం కోసం ఇక్కడ అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు.

వంద సీట్లు దాటుతం
రాష్ట్ర అభివృద్ధికి సుస్థిర రాజకీయ వ్యవస్థ అవసరం. వంద సీట్లు దాటడమే మా ప్రయత్నం. ప్రజల నాడి తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని రద్దు చేశామా? పాత పది జిల్లాల ప్రకారం చూస్తే ప్రతి జిల్లాలో సీట్లు, ఓట్ల సంఖ్య పెరుగుతుంది. చాలా జిల్లాల్లో వందకు వంద శాతం సాధిస్తం. గతంలోనే నిజామాబాద్ జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది సీట్లు తెచ్చుకున్నం. ఇప్పుడు ఖమ్మంలో 10కి 10 ఖాయం అంటున్నరు. దక్షిణ తెలంగాణల బలంగా ఉన్నం. గత ఎన్నికల్లో నల్లగొండలో ఆరు సీట్లు గెలిచి మెజార్టీ పార్టీగా నిలిచినం. మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలకు ఏడింటిలో గెలిచినం. రంగారెడ్డిలో అద్భుతమైన సీట్లు సాధించాం. హైదరాబాద్, ఖమ్మంలో చాలా వృద్ధిచెందాం.

జైపాల్‌రెడ్డికి వయసు మీద పడింది
జైపాల్‌రెడ్డికి ఇప్పటికే హరీశ్‌రావుతో భజన అయ్యుంటది! జైపాల్‌కు నేనో సలహా ఇస్తున్న. వయస్సు మీద పడింది. చాలా జాగ్రత్తగా మాట్లాడు. మంచి పేరో, చెడ్డ పేరో ఉంది. దాన్ని కాపాడుకో. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నవ్. ప్రాజెక్టులు, పథకాల్లో అవినీతి అంటూ లేనిపోనివి మాట్లాడితే స్థాయి దిగజారుతుంది. అవినీతి లేని పాలన అని జర్నలిస్టులే రాస్తున్నరు. నిజంగా అవినీతి ఉంటే దాగేదా? డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంలో ఏ ఒక్క రాజకీయ నేత జోక్యం చేసుకోలేదు. గజ్వేల్‌లో కూడా అంతే. లబ్ధిదారుల ఎంపికంతా కలెక్టర్లే చేశారు. పవర్ ప్రాజెక్టులు వస్తే ఒక్కటి కూడా తీసుకోలేదు. అన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ భెల్‌కు ఇచ్చేశాం. అవినీతి ఉండి ఉంటే దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ వృద్ధిని చేరుకునేదా? 19.73% వృద్ధి సాధించడమంటే మాటలా?

అప్పు.. ఆర్థిక స్వేచ్ఛ..
అప్పు తీసుకోవటం తప్పు కాదు. చేయాల్సిన సమయంలో, చేయాల్సినవి చేయకుంటే భవిష్యత్‌తరాలు దెబ్బతింటయి. అభివృద్ధికోసం అప్పు చేసుకునే స్వేచ్ఛను ఎకానమీ మనకు కలిగించింది. బాండ్ల రూపంలో రాష్ట్రాలు అప్పులు తెచ్చుకుంటయి. ఏడేండ్లకు మించి అమ్ముడుపోవు. కానీ తెలంగాణ బాండ్లు 25 ఏండ్లకు అమ్ముడుపోయాయి. నాగార్జునసాగర్ నిర్మించడానికి అప్పుడు రూ.92 కోట్లు ఖర్చు అయింది. అదే ఇప్పుడు నిర్మించాలంటే తొమ్మిది లక్షల కోట్లు కావాలి. నిజానికి జీవితంలో కూడా అలాంటిదాన్ని ఇప్పుడు కట్టలేం. అప్పుడు నిర్మించారు కాబట్టి ఇప్పుడు బతికిపోయాం. ఇప్పుడు మేము ప్రాజెక్టులు కట్టకుంటే భవిష్యత్‌తరాలు దెబ్బతింటయి.

జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పను
నేను ఉల్టాపల్టా చెప్పను. ఒత్తిడికి గురికాము. జర్నలిస్టులకు ఇండ్ల విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నం. ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వలేదు. మిమ్మల్ని కాదని వాళ్లకు ఇవ్వలేనుకూడా. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదో ఒక తీర్పు వస్తుందని ఆశిస్తున్న. అది రాగానే తక్షణం జర్నలిస్టులకు ఇంటి స్థలం, నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తం. వారితోపాటు ఎమ్మెల్యేలకు ఇస్తం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవారిపై చర్యలు తప్పవు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారెవరినైనా తొలగిస్తం. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించం.

ప్రజా మ్యానిఫెస్టో
-నేను రాహుల్‌గాంధీ అనగానే బెంబేలెత్తిపోతానా?
-గట్స్ లేనోడు, ధైర్యం లేనోడు ఎలక్షన్స్ తెస్తాడా?
-ప్రగతిచక్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దు
-సర్వేలన్నింటిలోనూ మాదే విజయమని తేలింది: సీఎం కేసీఆర్

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ రికమండ్ చేసింది అయినా కేంద్రం 24 రూపాయలు కూడా ఇయ్యలేదు రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మళ్లీ విజయం సాధించడం ఖాయమని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రం కోటి ఎకరాల మాగాణిగా మారటానికి ఎంతోకాలం లేదని, వచ్చే ఏడాది జూన్‌నాటికి ఆ కల సాకారమవుతుందని తెలిపారు. తమ ప్రయత్నమంతా రైతును రాజును చేసేందుకేనని నొక్కిచెప్పారు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ సమావేశం.. కమిటీ అధ్యక్షుడు కే కేశవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న కొన్ని అంశాలను అనంతరం మీడియా సమావేశంలో పాక్షిక మ్యానిఫెస్టో రూపంలో సీఎం వెల్లడించారు.

రైతులకు గతంలో అమలుచేసిన హామీ తరహాలోనే రాబోయే ప్రభుత్వంలో కూడా లక్ష రూపాయల వరకు రైతురుణాలను మాఫీచేస్తామని ప్రకటించారు. ఆసరా పింఛన్లమొత్తాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. ప్రధాన డిమాండ్లు కాబట్టి వాటిని ఈ రోజు ప్రకటిస్తున్నామన్నారు. మేం అభ్యర్థులను ప్రకటించినం. మైదానం అంతా ఖాళీ ఉంది. మా ప్లేయర్స్‌లాగా, ఎదుటి జట్టు ప్లేయర్స్ లేరు. అయినా జనం ఫలానా విషయం ఏమైంది.. అని అడుగుతుంటరు. వాళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంటది. ఈ రోజుతో మాకు ఆ బాధ పోతది.. మా విధానం ఏంది? అన్నది మా మంత్రులు, అభ్యర్థులు పర్యటనలకు పోయినప్పుడు, స్వయంగా నేను కూడా సభలో పాల్గొన్నప్పుడు చెప్పుకునే వీలుంటది అని వివరించారు. రాష్ట్రం మంచిచెడ్డలు ఇతర పార్టీలకు రాజకీయ క్రీడ అయితే.. టీఆర్‌ఎస్‌కు అదో టాస్క్ అని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ సాధించిన పార్టీగా తమపై ప్రధాన బాధ్యత ఉంటుందని, నిర్దిష్ట లక్ష్యాలు, చేరుకోవాల్సిన గమ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. మ్యానిఫెస్టో కమిటీకి 300 పైచిలుకు విజ్ఞాపనలు అందాయని, వాటన్నింటినీ క్రోడీకరించి, కొన్ని ముఖ్య అంశాలపై సుదీర్ఘ చర్చ చేసినట్టు చెప్పారు. నాలుగేండ్లలో అనుభవాలు.. ఎమ్మెల్యేలు, మంత్రులు, తాను ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు కోరుతున్నవి పరిగణనలోకి తీసుకున్నట్టు వివరించారు. వివిధ అంశాలపై సీఎం ఏమన్నారంటే..

కల్యాణలక్ష్మి.. మంచి ఉదాహరణ
కల్యాణలక్ష్మి మొదట ఎస్సీ, ఎస్టీలకే అమలుచేసినం. రూ.51 వేలు మాత్రమే ఇచ్చాం. ఒక సంవత్సరానికి ఎన్ని పెండ్లిళ్లు జరుగుతయి? ఎంత ఖర్చవుతుంది? అనే అంచనా లేదు. సంవత్సరం తర్వాత బీసీలు, ఓబీసీలకు విస్తరించినం. మూడో సంవత్సరం రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై అవగాహన వచ్చిన తర్వాత దానిని రూ.75 వేలు చేసినం. రాష్ట్ర ఆర్థిక వృద్ధి పెరుగుదల ఏయేటికాయేడు స్థిరంగా ఉంది. అందుకే ధైర్యం వచ్చి, నాలుగో సంవత్సరం రూ.1.16 లక్షలు చేసినం. కొత్త రాష్ట్రమైనందున, చెప్పిన మాట జరుగాలని, ప్రలోభపెట్టి తమాషా చేయొద్దని అంత జాగ్రత్తగా వ్యవహారం చేస్తూవచ్చాం. తెలంగాణ సాధించిన పార్టీగా, సాధించిన రాష్ట్రంలో విజయవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీగా మాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అందుకే ఆషామాషీగా, అడ్డంపొడవు చెప్పడానికి లేదు.

2021 జూన్ నాటికి కోటి ఎకరాల మాగాణం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం అపారం. అన్నీ శిథిలాలు మిగిలినయి. అందుకే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. అందుకోసం మేం వ్యవసాయంతో ముడిపడి ఉన్న నీటి వనరులకు చాలా ప్రాధాన్యం ఇచ్చినం. ప్రభుత్వం వచ్చిన 10-15 రోజుల్లో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించినం. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పోయినం. ఆన్‌గోయింగ్ స్కీంలు, ఫైళ్లలో ఉండి కార్యరూపం దాల్చని స్కీంలను కూడా అమలుచేశాం. తద్వారా కోటి ఎకరాలకు తెలంగాణ నీళ్లు తీసుకోవాలని అనుకున్నం. వందశాతం సఫలీకృతమైనం. 2021 జూన్‌కల్లా తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు వస్తయి. కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, మల్కాపూర్ రిజర్వాయర్, తుపాకులగూడెం బరాజ్.. అన్నీ వందశాతం పూర్తవుతయి. కొత్తవి, పాతవి కలిపి 2021 జూన్‌నాటికి కోటి ఎకరాల సస్యశ్యామల తెలంగాణను సాధిస్తం.

రైతును రాజుగా చేసేందుకే ఈ అడుగులు
తెలంగాణ ఎదుర్కొన్న జీవన విధ్వంసంలో అతి పెద్ద బాధితుడు తెలంగాణ రైతు.. వారిని అనుసరించుకొని ఉన్న కూలీలు. 50-60 ఎకరాలున్న రైతులు కూడా వలసొచ్చి హైదరాబాద్‌లో కూలిపని చేసుకున్నరు. ఇప్పుడు కొంచెం బాగయింది. కచ్చితంగా తెలంగాణలో రైతును రాజు చేయాలనే కృత, దృఢ నిశ్చయంతో అనేక కార్యక్రమాలు మొదలుపెట్టినం. రైతులకు రూ.లక్ష వ్యవసాయ రుణం రద్దుచేసినం. వ్యవసాయ ట్రాక్టర్లకు టాక్స్ రద్దుచేసినం. నీటి తీరువా పన్ను జీరో చేసినం. భూ రికార్డులను ప్రక్షాళనచేసినం. రైతుబంధు చెక్కులు ఇచ్చినరు. ఇప్పుడు రెండోవిడుత కూడా ఇవ్వబోతున్నరు. దానితో రైతాంగానికి పెద్ద ఊరట వచ్చింది. విద్యుత్ కొరతను పరిష్కరించాం. ఈరోజు దేశంలో 24 గంటలపాటు రైతులకు ఉచిత కరంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. నాలుగేండ్లుగా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో తెస్తున్నం. రైతుబంధు అద్భుతమైన స్కీం. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నయి. అశోక్‌గులాటీ, స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు దానిని వేనోళ్ల కొనియాడారు. రైతుబీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా సరే ఐదు లక్షలలు ఐదారు రోజుల్లో జమ అవుతున్నయి. ఇప్పటికే దాదాపు రెండు వేల మందికి వచ్చినయి.

అర్ధాకలితో ఉన్న ఉద్యోగులను ఆదుకున్నాం..
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఆశవర్కర్లు.. వీరెవరినీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం అధికారంలోకి రాగానే కొత్త రాష్ట్రమైనప్పటికీ.. అర్ధాకలితో పనిచేసేవారిని మానవతా దృక్పథంతో ఆదుకున్నాం. నాలుగేండ్లలో రాష్ట్ర ఆదాయం 17.70% వృద్ధి చెందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 19.73% ఆర్థికవృద్ధి సాధించాం. అందరం కష్టపడితేనే ప్రగతి సాధ్యమైంది. మళ్లీ ఆశీర్వదిస్తే చిన్న ఉద్యోగుల కడుపు నింపుతం. గత మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా అనేక పథకాలు అమలుచేశాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హాస్టళ్లకు సన్నబియ్యం వంటివి అందజేశాం. ఉద్యోగులు ఐఆర్ గురించి ఇబ్బంది పడక్కర్లేదు. ఐదేండ్లకోసారి అది కచ్చితంగా చేయాల్సిందే. మేం ఎంప్లాయి ఫ్రెండ్లీ. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వాటన్నింటినీ నెరవేరుస్తాం.

కాంగ్రెసోళ్ల మాదిరిగా బుకాయించలేను..
కాంగ్రెస్ వాళ్ల మాదిరిగా ఇవ్వలేనివి కూడా ఇస్తామని బుకాయించలేం. వంద శాతం చేసేవే చెప్తున్నం. వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తాం. డిసెంబరులో ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెడతం. మార్గదర్శకాలు రూపొందించాల్సిన ఉన్నందున నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మూడు నాలుగు నెలలు పడుతుంది. పంచాయతీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు వస్తాయి కాబట్టి.. కొంత సమయం తీసుకుంటం. మిగిలినవన్నీ వచ్చే బడ్జెట్ నుంచి అమలు జరుగుతాయి.

మాది.. క్రెడిబుల్ గవర్నమెంట్!
మా పార్టీ ఏం చేస్తుందో చెప్తాం తప్ప.. ఇతర పార్టీల గురించి వ్యాఖ్యానించబోం. కాంగ్రెస్ వాళ్లు పెన్షన్ ఇస్తామంటుంటే ప్రజలు వద్దంటున్నరు. ఎందుకంటే, ప్రస్తుతమున్న విధానంలో మధ్య దళారుల్లేరు. లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా సొమ్ము జమయ్యే సరికొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయినా, వాళ్లు (కాంగ్రెస్) వచ్చేదెన్నడు? చేసేదెన్నడు? ఇక్కడ నేను టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను వెల్లడిస్తున్నాను. మా అభ్యర్థులు రంగంలో ఉన్నారు కాబట్టి.. వారు ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే ప్రజలు అడుగుతున్నరు కాబట్టి.. పాక్షిక మేనిఫెస్టోను ప్రకటిస్తున్నా. మ్యానిఫెస్టో ఫైనల్ రిపోర్టు కేశవరావు దగ్గర ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలకేం చేయాలి? ఎడ్యుకేషన్, హెల్త్ వంటి మీద ఎలా ఫోకస్ పెట్టాలి? ఇవన్నీ పరిశీలించి తుది మ్యానిఫెస్టో రూపొందిస్తాం. చేసేదే చెప్తాం. చెప్పింది చేస్తాం. రుణమాఫీని కాంగ్రెస్ వాళ్లు రెండు లక్షలు చేస్తమన్నారు.. కానీ, అలా మేం చేయనివి చెప్పలేం. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నాం.. చేశాం. మాది క్రెడిబుల్ గవర్నమెంట్. అదే విధానంలో ఇప్పుడు కూడా లక్ష రూపాయల దాకా రైతులకు రుణమాఫీ చేస్తాం.

కేంద్రం నుంచి నయాపైసా అదనంగా రాలేదు
కేంద్రం నుంచి అదనంగా వచ్చిన సాయం సున్న. మిషన్ కాకతీయ బాగుందని ప్రపంచ బ్యాంకు ఒప్పుకుంది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ నర్సంపేట చెరువుకట్టపై పుట్టినరోజు చేసుకొని ప్రశంసించారు. మిషన్‌భగీరథ పథకాన్ని పదకొండు రాష్ర్టాల వాళ్లు, కేంద్ర మంత్రులు వచ్చి చూసిపోయినరు. ప్రధాని స్వయంగా గజ్వేల్‌లో ప్రారంభించినరు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ రికమండ్ చేసింది. అయినా కేంద్రం 24 రూపాయలు కూడా ఇయ్యలేదు. కేంద్రం తనకొచ్చే ఆదాయంలో కచ్చితంగా రాష్ర్టాలకు ఇవ్వాల్సిందే. అదేదో మెహర్బానీ కాదు. హక్కుగా రావాల్సింది. అది వచ్చింది కానీ, అదనంగా రూపాయి రాలే. మొన్న మహారాష్ట్రకు కేంద్రం రూ.15వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో వాళ్ల పార్టీ ప్రభుత్వం ఉందనో.. మరే కారణంచేతనో ప్యాకేజీ ఇచ్చారు. అట్ల అనుకూల ప్రభుత్వం ఉంటే మనంకూడా ఇరిగేషన్ ప్యాకేజీనో, రోడ్ల ప్యాకేజీనో తెచ్చుకోవచ్చు. సంవత్సరానికి రూ.20-30 వేల కోట్లు అదనంగా తెచ్చుకునే ఆస్కారం ఉంటది.

అవినీతిపరులను విడిచిపెట్టను
గత పాలనలో అవినీతిపరుల వివరాలు మావద్ద ఉన్నయి. ఇండ్ల దొంగల పేర్లు తెలుసు. ఏమైనాచేస్తే దాన్నీ రాజకీయం చేస్తారని ఈసారి ముట్టుకోలేదు. కానీ వచ్చే టర్మ్‌లో ఎవరినీ విడిచిపెట్టను. అవినీతిపరుల బండారాన్ని బయటపెడుతం. అవినీతిపరులను ప్రజలముందు నిలబెడుతం. ఇక్కడున్న బిడ్డలంతా తెలంగాణవాసులే తెలంగాణలో ఉన్న ఆంధ్ర మిత్రులు ఆంధ్రావాళ్లుగా భావించాల్సిన అగత్యం లేదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. గతంలోనూ ఆ చర్చ వచ్చినప్పుడు.. ఇక్కడున్నోళ్లంతా హైదరాబాదీలని గర్వంగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పానని గుర్తుచేశారు. 70 ఏళ్ల క్రితం బాన్సువాడకు వచ్చినోళ్లను ఇంకా ఆంధ్రోళ్లని ఎందుకు అనుకుంటరు? ఇక్కడున్న ఆంధ్రా మిత్రులు తెలంగాణవాసులు గా క్లెయిమ్ చేసుకోవాలి. ఇదే విషయాన్ని వేలసార్లు చెప్పా. చంద్రబాబు అనే ఉడుము రాకముందువరకూ ఇక్కడ సమస్య లేదు. ప్రశాంతంగా బతుకుతున్నవారి మధ్య కొర్రాయి పెట్టడానికేనా చంద్రబాబు మళ్లీ ఇక్కడికొచ్చింది? ఇక్కడున్నోళ్ల ఆస్తులను గుంజుకుంటరు, తరిమికొడతారని చంద్రబాబు అండ్ గ్యాంగ్ గతంలో దుష్ప్రచారం చేశారు. నాలుగున్నరేండ్లలో ఎవరినైనా తరిమికొట్టామా? మేం అలాంటి దుర్మార్గులమైతే ఎన్ని గడ్‌బడ్‌లు అవుతుండే? అసలలాంటి వివక్షే..ఆ వాసనే.. తెలంగాణ సమాజంలో లేదు అని సీఎం స్పష్టంచేశారు.

ఆంధ్ర నుంచి వచ్చినోళ్లు ఇక్కడ మంచిగ బతుకుతన్నరు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ అన్న బేధం అసలుందా? టీఆర్‌ఎస్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎంత గొప్పవాళ్లు! ఎక్కడైనా వచ్చిందా ఆ మాట? ఎక్కడైనా తేడాలొచ్చాయా? చిల్లర రాజకీయాల కోసం ఇక్కడున్న ఆంధ్రావాళ్లను అభద్రతకు గురిచేస్తావా? ఎంత దుర్మార్గం ఇది! దేనికోసం చంద్రబాబు ఇక్కడికొచ్చిండు? ఆయన రాజ్యాలేలేదుందా? అసలు చంద్రబాబుకి ఇక్కడ డిపాజిట్టు వస్తుందా? అంత పిచ్చోళ్లా తెలంగాణ ప్రజలు? ఇదివరకే ఒకసారి వచ్చి, లేని మెజార్టీకోసం ప్రయత్నించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కుపోయాడు..ఇంకా సిగ్గు, బుద్ధి రావొద్దా? అక్కడ (ఏపీలో) సామాన్య మానవులు టీవీల్లో చెప్తున్నరు. పొద్దున లేస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్.

నువ్విక్కడ పరిపాలన చేసినప్పుడు ఎన్నిసార్లు మతకల్లోలాలు, ఎన్నిసార్లు కర్ఫ్యూలు! ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఉందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పేకాట క్లబ్బులు, జూదాలు, భూకబ్జాలు పోయినయ్. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణకు ఉడుములా చొచ్చి.. మొత్తం ఆంధ్రవాళ్లకు అంటగడతావా? తెలంగాణలో ఉన్న ఆంధ్రావాళ్లకు చంద్రబాబు శని. తెలంగాణలో ఆయన అవసరమేంది? ఆయన వచ్చుడేంది? మొత్తం ఆంధ్రావాళ్లకు ఆపాదించడమేంది? ఎంత దుర్మార్గమిది? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఉన్నవాళ్లంతా ఆంధ్ర అన్న భావన వీడాలి. అందరూ రెస్పెక్టెబుల్ తెలంగాణ సిటిజన్స్. తెలంగాణ ప్రజల ఔన్నత్యంపై ఎంత చెప్పినా తక్కువే.

ఇక్కడి ఆంధ్రాప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు!
ఆంధ్ర నుంచి ఎప్పుడో వచ్చి ఇక్కడ ఉంటున్నవాళ్లలో చాలా మంది రాజకీయ ఆసక్తి చూపించారు. మేం జీహెచ్‌ఎంసీలో పన్నెండు సీట్లు ఇచ్చినం. వారంతా రికార్డు మెజార్టీతో గెలిచారు. ఇయ్యాల ఏడెనిమిది మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినం. మీరు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ప్రజలు. మీరు ఇక్కడి రైతులు. మీకు హక్కులున్నయ్. మీ పిల్లలు ఇక్కడ పుట్టిండ్రు, పెరిగిండ్రు.. మీరు ఇక్కడంతా తెలంగాణ సమాజంలో కలిసిపోయారు. ఆనందంగా ఉంటున్నరు. కల్సి ఉంటున్నవారిని డిటాచ్ చేసి, కుటిల రాజకీయాల కోసం దుర్మార్గంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఇదే చంద్రబాబు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు చేసి చేతులు కాల్చుకుండు.

ఫలితాలు ఏమోచ్చాయో మీ అందరికీ తెలుసు. ఈ రోజు కూడా అంతకంటే దారుణంగా ఆ పార్టీకి ఫలితాలుంటాయి. ఆంధ్రా ప్రజలంతా కలిసి చంద్రబాబుకు బుద్ధిచెప్తారు. చంద్రబాబుతో పొత్తు అంటే బర్రెలు కూ డా తనుగులు తెంపుకుని పారిపోతయ్ అని మొన్న సభలో చెప్పిన. పోయిపోయి చంద్రబాబు నాయుడా? ఎందుకంత దుర్మార్గం మాకు? అసలు మాకు పొత్తే అవసరమే లేదు. మీరు చూడండి.. చాలా పెద్ద పరిణామాలుంటాయి. కాంగ్రెస్ భస్మం అయిపోతది. డిసెంబరులో గడ్డం గీక్కునేదెవడో.. ఉంచుకునేదెవడో? చాలా పరేషాన్ ఉంటది కథ అంతా. కౌంటింగ్ రోజు ఇక్కడ ఉండొద్దని నారాయణ(సీపీఐ నేత)కు చెప్పిన.

సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ
రాహుల్ గాంధీ అనగానే.. ఆయన సభ అనగానే బెంబేలెత్తిపోతామా? అసలు ఎన్నికలు తెచ్చిందే నేను. గట్స్ లేనోడు, ధైర్యం లేనోడు ఎలక్షన్స్ తెస్తాడా? అన్నీ ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నాం. అద్భుతంగా సాగిపోతున్న ఈ ప్రగతిచక్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దు.. అంటే సుస్థిరమైన, పటిష్టమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణకు కచ్చితంగా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఎన్నికలకు వెళ్లాం. తెలంగాణ సమాజానికి ఒక పొలిటికల్ పవర్.. ఇనుప కంచె అవసరం. ఇయ్యాల కచ్చితంగా టీఆర్‌ఎస్ రూపం లో పటిష్ఠమైన పొలిటికల్ పార్టీ అందుబాటులో ఉంది. రాష్ట్రం తెచ్చిన పార్టీగా, రాష్ట్రంకోసం తపన పడుతున్న పార్టీగా.. రాష్ట్రాన్ని రేపు కూడా తీర్చిదిద్దుతున్న పార్టీగా.. అణువణువున సంపూర్ణ అవగాహన ఉన్న పార్టీగా టీఆర్‌ఎస్ ఉన్నది. నాకు సంబంధమే లేని ఆరేడు సంస్థలు సర్వే చేసి చెప్పినయ్.. వందస్థానాలకుపైగా మేం గెలువబోతున్నాం. ఎవరేం చెప్పినా ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఏర్పాటుచేస్తుందని ప్రతి ఒక్కరూ తేల్చిచెప్పేశారు.

పాక్షిక మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
-ఆసరా పింఛన్లు డబుల్
రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నం. వృద్ధాప్య ఫించన్లకు 65 ఏండ్లు వయోపరిమితి పెట్టినం. పింఛన్ల వయస్సు తగ్గించాలన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 57 ఏండ్లు పూర్తిచేసుకున్న వారందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినం. దీనివల్ల లబ్ధిదారులు సంఖ్య ఎనిమిది లక్షల వరకు పెరుగుతది. ఖర్చు కూడా పెరుగుతది. చనిపోయే వాళ్లను ఆసరా ఫించన్లతోటి బతికిస్తున్నారని కొందరు, మమ్మల్ని చూసేవాళ్లే లేకుండే.. అట్లాంటివాళ్లను ఆదుకుంటున్నారని మరికొందరు! ఇట్లా చెప్తున్నప్పుడు చాలా సంతృప్తి కలుగుతుంది. మధ్య దళారులు లేకుండా లబ్ధిదారులకు మేలు కలుగటం మరింత సంతృప్తినిస్తుంది. ఒక ముస్లిం మహిళ నాకు ఒక లేఖ రాసింది.. పింఛన్ రూ.2వేలకు పెంచితే మేం బాగా బతకగల్గుతం.. మీకు కొంత భారం అయినా చేయండి.. మేం నిరుపేదలం అని అందులో చెప్పింది. మ్యానిఫెస్టో కమిటీ కూడా పింఛన్లు పెంచాలని ఏకగ్రీవంగా చెప్పింది. నేను ఈ మధ్యే నల్లగొండ సభలో ప్రకటించాను. ఇప్పుడు అన్ని రకాల పింఛన్లు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చుకుంటున్నం. దాన్ని రూ.2016కు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. దివ్యాంగులకు పింఛన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.

లక్షలోపు రైతు రుణాలు మాఫీరైతు రాజు కావాలంటే ఊరికే కారు.
రైతులు అప్పుల నుంచి బయటపడి, తమ పెట్టుబడి తామే పెట్టుకునే స్థితికి, ఆర్థిక స్వావలంబనకు చేరేవరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటది. రాష్ట్రంలో 45 లక్షల పైచిలుకు రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారు. అందులో రూ.లక్షలోపు అప్పు కలిగినవారు 42 లక్షలమంది ఉన్నరు. పోయినసారిలాగనే ఈసారి కూడా రూ.లక్షవరకు రైతులకు రుణమాఫీ చేస్తం. పోయినసారి వచ్చిన సమస్యలు రాకుండా, త్వరితగతిన, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మాఫీచేస్తం.

పంట పెట్టుబడి ఏడాదికి ఎకరానికి రూ.10వేలు
ఇప్పటివరకు రైతుబంధు పథకంలో ఎకరానికి సీజన్‌లో రూ.4వేల చొప్పున సంవత్సరానికి రూ.8వేలు ఇచ్చినం. దాన్ని ఎకరానికి రూ.5వేలు చేస్తూ.. ఏడాదికి రూ.10వేలు ఇస్తం.

ఐకేపీ గ్రూపులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లురెండు నియోజకవర్గాలకు ఒకటిచొప్పున ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తం.
ఐకేపీ మహిళా గ్రూప్ సభ్యులకు సబ్సిడీలు ఇచ్చి, నిర్వహిస్తం. లిజ్జత్‌పాపడ్ అనేది ముంబైలోని ధారవి మురికివాడలో స్వచ్ఛంద ప్రారంభించిన కంపెనీ. మహారాష్ట్రలో ఇవాళ దాని టర్నోవర్ రూ.1100 కోట్లు. మనం కూడా అనేక కల్తీలతో బాధపడుతున్నాం. రైతులు పండించే పంటలను ప్రాసెస్ చేసేదాంట్లో ఐకేపీలోని సెర్ప్‌కింద ఉన్న వాళ్లకు జీతాలిచ్చి, రెగ్యులర్ ఎంప్లాయీస్‌గా పెట్టుకుని నిర్వహిస్తం. పంటలో చాలావరకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లకు వెళ్తుంది. ఇంకేమై నా పంట మిగిలితే కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ కో సం రూ.2 వేల కోట్లు పెడుతున్నం. కేంద్రం పంటను కొన్నా, లేకున్నా రైతులను ఆదుకుంటం.

రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి
రైతు సమన్వయ సమితులను బాగా యాక్టివ్ చేస్తం. సమితి సభ్యులకు గౌరవభృతి ఇవ్వాలని మ్యానిఫెస్టో కమిటీ సూచించింది. ఎంత ఇవ్వాలి? ఏ తారీఖు వరకు ఇవ్వాలన్నదానిపైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధివిధానాలు రూపొందించి ఇస్తం.

నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి
రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? అసలు ఎవరిని నిరుద్యోగులు అనాలి? అనేది పెద్ద సమస్య. సమగ్ర కుటుంబ సర్వేలో కొంత సమాచారం వచ్చింది. ఈ ఏడాది నిరుద్యోగిగా ఉన్నవాళ్లకు వచ్చే ఏడాదికి ఏదో ఒక ఉపాధి దొరకొచ్చు. కాబట్టి ఈ సంఖ్య ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఈ అంశంపై బాగా చర్చించినం. 11 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని తెలిసింది. ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగ భృతి నిబంధనలు రూపొందిస్తం. పిల్లలంతా మనోళ్లే కాబట్టి.. సంఖ్య తో సంబంధం లేకుండా నిబంధనలకు లో బడి వందశాతం నిరుద్యోగులందరికీ నెలకు రూ.3016 భృతి అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూరేలా ప్రత్యేక స్కీంలు ఎస్సీ, ఎస్టీలు తరతరాలుగా అణచివేతకు గురయ్యారు. వాళ్లు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేకంగా కార్యక్రమం కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సోదరులు కలిసినప్పుడు ప్రత్యేకంగా ఏం కోరుతున్నారు అనడిగితే యాదవులకు ఎట్లయితే ఏడాదికి రూ. 4వేల కోట్లు పెట్టి గొర్రెలు ఇప్పించారో..అట్లనే మాకు ఏడాదికి మూడు నాలుగు వేల కోట్లచొప్పున పెట్టేలా స్కీం తెస్తే లాభపడేందుకు ఆస్కారం ఉంటుంది అన్నరు. వందశాతం చేస్తం. ఆ స్కీంలు ఎట్లా ఉండాలన్నదానిపై కడియం శ్రీహరి అధ్యక్షతన కొప్పుల ఈశ్వర్, రాములుతోపాటు మరికొంతమందితో కమిటీ వేశాం. ఎస్సీల అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లు, గిరిజనులకు రూ.6వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లు ఖర్చుచేసే పద్ధతిలో ఈ స్కీంలు రూపొందిస్తం. మ్యానిఫెస్టో తుదిరూపునకు వచ్చేటప్పటికి ఆ స్కీంను కూడా చేరుస్తం.

వైశ్యులు , రెడ్డి పేదలకు కార్పొరేషన్లు
రెడ్డి కులస్తులు, వైశ్యులు మాకు ఒక కార్పొరేషన్ పెట్టాలి. మా వర్గంలోని పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా కొంత కార్పస్ ఫండ్ ఇవ్వాలి అని కోరుతున్నరు. వందశాతం ఆ రెండు వర్గాలకు కూడా కార్పొరేషన్లు, కార్పస్ ఫండ్ ఏర్పాటుచేస్తం.

రెండుతరాల వరకు ఇంటి బాధ పోవాలి
ఎన్నికట్టిండ్రు? అని అక్కడక్కడ విమర్శలు చేస్తా ఉన్నరు. మీలెక్క మేం డంబాచారాలకు పోం. కట్టే ఇండ్లపై మాకు క్లారిటీ ఉంది. 2.60 లక్షల ఇండ్లు లక్ష్యంగా పెట్టుకుని కట్టిస్తున్నాం. మేం కట్టిస్తున్న ఒక ఇల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఏడు ఇండ్లతో సమానం. మేం రెండు లక్షల ఇండ్లు కట్టిస్తున్నం అంటే.. మీరు కట్టించిన డబ్బా ఇండ్లతో పోల్చితే 18 లక్షల ఇండ్లతో సమానం. వందశాతం సబ్సిడీపై కట్టిస్తున్నం. వాళ్లు రెండో ఫ్లోర్ కట్టుకునేందుకు అవకాశం ఉండేలా పిల్లర్లతో కట్టిస్తున్నం. ఒకసారి ఇల్లు కట్టిస్తే.. రెండుతరాలవరకు ఆ కుటుంబానికి ఇంటిబాధ శాత్వతంగా పోవాలి. అది డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం వెనుక మా అసలు ఉద్దేశం. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు.

సొంత జాగ ఉన్నవాళ్ళకు ఇండ్లు కట్టిస్తం..
మీరు కాలనీలు కట్టిస్తున్నారు.. సంతోషం. కానీ, మాకు సొంత జాగాలు ఉన్నాయి. కాబట్టి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టుకునేందుకు మాకు కూడా అవకాశం ఇవ్వండి అని కొందరినుంచి డిమాండ్ వస్తున్నది. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొంతజాగా ఉన్నవారికి కూడా డబుల్‌బెడ్‌రూం ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తం. మరికొంతమంది.. ప్రభుత్వం రూ.3-4 లక్షలు ఇస్తే ఇండ్లు కట్టుకుంటం.. అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నరు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటం.

గత ప్రభుత్వాల లెక్కలు చూస్తే కుటుంబాల కన్నా ఎక్కువ ఇండ్లున్నాయి
కాంగ్రెస్, టీడీపీ చెప్పే లెక్కల ప్రకారం ఇండ్లు కట్టి ఉంటే.. రాష్ట్రంలో ఇండ్లు కట్టే అవసరమే లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటివరకు కట్టించిన ఇండ్ల లెక్కలు తీస్తే.. రాష్ట్రంలో కుటుంబాలకు మించిపోయినవి. అయినా ఇంకా డిమాండ్ ఉంది. దానికి కారణం కుంభకోణాలు. ఒక్క మంథని నియోజకవర్గంలో 100 కుటుంబాలుంటే.. 140 ఇండ్లు కట్టించినట్టు రిపోర్టులున్నాయి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. కుటుంబ సర్వేలో లెక్కలు తీసినప్పుడు.. 8.25 లక్షల ఇండ్లు కడితే రాష్ట్రంలో అందరికీ ఇండ్లు ఉంటాయని తేలింది. ఏడాదికి రెండు లక్షల చొప్పున కట్టుకుంటూ పోతే నాలుగున్నరేండ్లలో పూర్తిచేసుకుంటం అనుకున్నాం. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కట్టించిన సోకాల్డ్ ఇండ్లతోటి ప్రజలుపడ్డ బాధలు వర్ణనాతీతం. ఒక్క ఇల్లు ఫ్రీగా కట్టియ్యలే. అన్నీ లోన్‌తోనే! కాంగ్రెస్, టీడీపీల హయాంలో కట్టించిన ఇండ్లకు సంబంధించి ప్రజలపై ఉన్న రుణాల బకాయి రూ.4136కోట్లను టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక్క సంతకంతో రద్దు చేసిన.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.