-ఏప్రిల్ నుంచి నిరుపేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం వర్తింపు -సంక్షేమ పథకాల రీడిజైనింగ్‌కు సమాచార ఉత్సవం దోహదం -ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. వినూత్న సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ ప్రజా సంక్షేమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పత్రికా సమాచార కార్యాలయం ఏర్పాటు చేసిన పౌరసమాచార ఉత్సవం చివరి రోజైన గురువారం మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన నిరుపేద ఆడ పిల్లల వివాహాల కోసం రూ.51 వేలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
ఏప్రిల్ నుంచి పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తామని స్పష్టంచేశారు. పేదల ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 69 ఏండ్లుగా అనేక వందల సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసినా, వాటి ప్రయోజనాలు సామాన్యులకు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని పథకాలు సామాన్యులకు త్వరగా చేరగా, మరికొన్ని అసలే అర్థమే కావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల సమగ్ర సమాచారాన్ని పేదలకు చేరవేసేందుకు పౌరసమాచార ఉత్సవాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. పథకాలపై ప్రభుత్వ పెద్దలకు, అధికారులకే సరైన అవగాహన కొరవడిందని మంత్రి గుర్తుచేశారు. దీంతో యాంత్రికంగా, తూతూ మంత్రంగా కొన్ని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రారంభించిన పథకం ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నమూ జరుగడం లేదన్నారు. పౌరసమాచార ఉత్సవాల ద్వారా ప్రజలకు పథకాలను వివరించడమే కాకుండా, పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వాటిని రీడిజైనింగ్(పునర్ వ్యవస్థీకరణ)చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.