Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజా సంక్షేమమే ఎజెండా

ప్రజాసంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఎజెండా అని మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు స్పష్టంచేశారు. సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్‌లో వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలు, మిషన్ కాకతీయ, పౌర సరఫరాల శాఖలపై జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం జరిగింది.

Etela-Rajendar-in-Sangareddy

-సంక్షేమ పథకాల్లో కోత విధించాలనే ఆలోచన లేదు: మంత్రి ఈటల -ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ: మంత్రి హరీశ్‌రావు -రైతు సంక్షేమమే ధ్యేయం: మంత్రి పోచారం ఈ కార్యక్రమానికి మంత్రులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఆంధ్రా మీడియా విష ప్రచారం చేస్తున్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ ఒక్క ప్రభుత్వ పథకంపై వేటు వేయాలనే సంకుచిత ఆలోచన సర్కారుకు ఎంత మాత్రం లేదని స్పష్టంచేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ఆహారభద్రత కార్డులు అందుతాయని పునరుద్ఘాటించారు. మెదక్ జిల్లాలో 6.4 లక్షల మందికి ఆహారభద్రత కార్డులు అందిస్తున్నామని, రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చునని.. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లోని విద్యార్థులకు జనవరి 1 నుంచి మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యం అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించనున్నామని చెప్పారు.

సంక్షేమ పథకాలను గ్రామీణస్థాయిలో ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి అక్రమాలు జరగకుండా చూడాలని కోరారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం రానున్నదని చెప్పారు. రాష్ట్రంలో కాకతీయ, రెడ్డి రాజులు నిర్మించిన దాదాపు 47 వేల చెరువులు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారన్నారు. 250 టీఎంసీల నీరు నిలువుండే చెరువులు ధ్వంసం కావడంతోనే రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాని ఆందోళన వ్యక్తంచేశారు.

అక్రమాలకు తావు లేకుండా మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ పనులను ఆన్‌లైన్ టెండర్ల ద్వారానే నిర్వహిస్తున్నామన్నారు. కబ్జాకు గురైన చెరువులు, కుంటల భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలిసి పనిచేస్తే ఉద్యమంలా అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. తాను స్వయంగా ప్రతి మండలంలో తట్టపట్టి మట్టి మోస్తానని హరీశ్‌రావు ప్రకటించారు. చెరువులు ఎండిపోవడంతోనే జిల్లాలో 323 గ్రామాలు డార్క్ ఏరియా ఖాతాలో చేరాయని ఆందోళన వ్యక్తంచేశారు.

చెరువుల పూడికను స్వచ్ఛందంగా తాము తరలించుకుంటామని ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానం చేస్తే 20శాతానికి మించి చెరువులను పునరుద్ధరణకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువు మట్టి పొలాలకు తరలించడం ద్వారా రైతుకు డబ్బు ఆదాతోపాటు 30 శాతం దిగుబడి పెరుగుతుందని, ఈ విషయాన్ని ఇక్రిశాట్ శాస్తవేత్తలు ధృవీకరించారని వెల్లడించారు. అటవీ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఎస్‌ఈలను నియమించామని, ఇరిగేషన్‌లో అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. అధికారులకే చెరువు అభివృద్ధి టెండర్ బాధ్యతలు అప్పగించామని పునరుద్ఘాటించారు. పునరుద్ధరణ సమయంలో అధికారులు రైతులను సంప్రదించి వారి సూచనల మేరకు ఏ చెరువు చెబితే ఆ చెరువును తీసుకోవాలని సూచించారు. చిన్ననీటి వనరుల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1,828కోట్లు: పోచారం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1,828 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

ఇందులో భూసార పరీక్షలకు రూ.20 కోట్లు కేటాయించిందని, రాష్ట్రంలోని 50 లక్షల మందికి సాయి ల్ హెల్త్‌కార్డులు అందివ్వాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. సమైక్య పాలనలో ధ్వంసమైన రాష్ట్రంలోని 10 సీడ్ ఫాంలను పునరుద్ధరిస్తామన్నారు. పాలిహౌస్ సాగుకు రూ.252 కోట్లు, బిందు, తుంపర సేద్యానికి హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాలకు రూ.455 కోట్లు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీపై బిందు, తుంపర పరికరాలు అందజేస్తున్నామన్నారు.

వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై కరపత్రాల ద్వారా గ్రామగ్రామాన ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సోలార్ పంపుసెంట్ల పంపిణీకి కిర్లోస్కర్ కంపెనీ ముందుకు వచ్చిందని, రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తారన్నారు. మెదక్ జిల్లాలో సీడ్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. నకీలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను మంత్రి ఆదేశించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పథకాలను అమలు చేస్తున్నదన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, బాబుమోహన్, మదన్‌రెడ్డి, గీతారెడ్డి, కిష్టారెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములునాయక్, పాతూరి సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, కలెక్టర్ రాహూల్ బొజ్జా, జేసీ శరత్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.