Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజా ఉద్యమంలా హరితహారం

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని హరిత ఉద్యమంగా మలచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. పోస్టర్లు, కరపత్రాలు, ఆడియో, వీడియో ప్రచారాలు, కవి సమ్మేళనాలు, అవధానాలతో విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులు శ్రమదానం చేసి మొక్కలు నాటాలని సూచించారు.

KCR-meeting-on-Harithaharam

-మన కార్యక్రమాలకు దేశమంతా ప్రశంసలు -అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారు – అదే స్ఫూర్తితో 230 కోట్ల మొక్కలు నాటుదాం – మొక్కల సంరక్షణకు గ్రామ హరిత రక్షణ కమిటీలు – పట్టణాల్లో అగ్నిమాపక వాహనాలతో మొక్కలకు నీళ్లు – హరిత హారం సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక పథకాలు విజయవంతంగా అమలు చేసిన అధికారులు అదే పట్టుదలతో హరిత ఉద్యమానికి సన్నద్ధులు కావాలని కోరారు. ఆదివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఫ్‌ఓలు, హౌసింగ్‌శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మతో పాటు వివిధశాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హరితహారం రూపురేఖలను అధికారులకు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా మంచిపేరు వచ్చిందని చెప్పిన ముఖ్యమంత్రి అధికారులు అంకిత భావంతో పని చేయడం వల్లనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. తిరిగి అదే స్ఫూర్తితో, అంకిత భావంతో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమం అమలుపై అధికారులకు అనేక సూచనలిచ్చారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే…

రాష్ట్ర పథకాలకు ఎల్లెడలా ప్రశంసలు.. రాష్ట్రం చేపట్టిన కార్యక్రమాలను దేశమంతా ప్రశంసిస్తున్నది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, నూతన పారిశ్రామిక విధానానికి మంచి ఆదరణ లభించింది. పలువురు కేంద్ర మంత్రులు, నాయకులు నాతో మాట్లాడినప్పుడు మన పథకాల గురించి ప్రస్తావించి ప్రశంసించారు. హడ్కోలాంటి సంస్థలు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చాయి. మంచి ఉద్దేశంతో చేసే పనులకు భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది. అని కేసీఆర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని వెల్లడించారు.

ప్రజా ఉద్యమంగా.. హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజాఉద్యమంలా జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంపై విస్త్రృత ప్రచారం నిర్వహించాలి. పోస్టర్లు, కరపత్రాలు, ఆడియో, వీడియో ప్రచారాలు, కవి సమ్మేళనాలు,అవధానాలు కూడా నిర్వహించాలి. విద్యార్థులను భాగస్వాములను చేయాలి. ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతివాహనంపై స్టిక్కర్లు అంటించాలి. గ్రామస్థాయిలో విఆర్వోలతో పాటు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలి. గ్రామపంచాయతీలు, ప్రార్థనా మందిరాల వద్ద మైక్‌సెట్ల ద్వారా హరితహారం పాటలు మార్మోగాలి. ఇందుకోసం అర్చకులు, ఫాదర్స్, ఇమామ్‌లు. గురుద్వారాల నిర్వాహకులతో సమావేశాలు పెట్టాలి అని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రచారం చేయాలన్నారు.

శ్రమదానంతో.. శ్రమదానం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని విభాగాల ఉద్యోగులతోపాటు, పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మిషన్ కాకతీయతో పాటు అనేక ప్రజాకార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తెలంగాణ పోలీసులు మంచిపేరు తెచ్చుకున్నారు. హరితహారంలో కూడా పోలీసులు స్వయంగా మొక్కలు నాటాలి. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఇందులో భాగస్వాములను చేయాలి అని ఆయన మార్గదర్శనం చేశారు.

నేనూ తిరుగుతా.. హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా. హెలికాప్టర్‌లో కాకుండా బస్సులోనే అన్ని జిల్లాలు తిరుగుతా. ఈ కార్యక్రమంలో కలెక్టర్ల పాత్ర ఎంతైనా ఉంది. నియోజకవర్గాల వారీగా అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని డిజైన్ చేయాలి. ప్రచారానికి సాంస్కృతిక సారథి బృందాలను వినియోగించుకోవాలి. వారంలోగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించాలి.

సంరక్షణా మన బాధ్యతే.. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నాం. కేవలం మొక్కలు నాటడంతో వదిలేయకుండా వాటిని పెంచి పెద్ద చేయడానికి అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మొక్కలను సంరక్షించడానికి ట్రీగార్డులు, ప్రాంగణాల గేట్ల వద్ద ఎనిమల్ ట్రాపర్స్ ఏర్పాటు చేయించండి. పాఠశాలల హెడ్మాస్టర్లు, తహశీల్దార్లు, వీఆర్‌ఓలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో గ్రామ హరిత రక్షణ కమిటీలు ఏర్పాటు చేయండి. ప్రస్తుత ఏడాదికి మొక్కలు నాటుతూనే, వచ్చే ఏడాదికి అవసరమయ్యే మొక్కల సేకరణకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోండి. నర్సరీల నుంచి గ్రామాలకు మొక్కలు పంపే ఏర్పాట్ల మీద దృష్టి పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా అంతరించిపోయిన అడవులను మళ్లీ దట్టమైన వనాలుగా తీర్చిదిద్దడానికి అనువైన మొక్కలు ఎంచుకోండి అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇక్కడ పెంచవచ్చు.. మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలు, నీటిప్రాజెక్టుల రిజర్వాయర్లు, సింగరేణి స్థలాలు, పోలీసు బలగాలుండే ప్రాంగణాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్‌స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాలు,వివిధ మతాల ప్రార్థనా స్థలాలు, రైల్వే స్థలాలు, ఇతర ఖాళీస్థలాలు మొక్కల పెంపకానికి అనువుగా ఉంటాయని తెలిపారు. చెరువుగట్ల వద్ద సిల్వర్‌ఓక్స్, ఈత చెట్లు పెంచాలన్నారు. మొక్కలకు నీరు అందించే విషయంలో పట్టణ ప్రాంతాల్లో అగ్నిమాపక వాహనాలను ఉపయోగించుకోవలని సూచించారు.

40 కోట్ల మొక్కలు సిద్ధం.. కార్యక్రమంలో తొలుత అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి మిశ్రా, వివిధ జిల్లాల కలెక్టర్లు హరితహారం కార్యక్రమం కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 4213 నర్సరీల్లో 40 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో పండ్లచెట్లు, నీడనిచ్చే, ఔషధ, అలంకరణ, భూమికి సారాన్నిచ్చే చెట్లు చెరువులపై నాటేందుకు ఉద్దేశించిన ఈత, ఆటవీప్రాంత చెట్లు ఇలా అన్ని రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.