Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజారోగ్యంలో కేసీఆర్‌ విప్లవం

-మూడేళ్ళ క్రితం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే కనిపించిన దృశ్యాలకు ఇప్పుడు కనిపించే దృశ్యాలకు మధ్య భూమ్యాకాశాల తేడా. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్నది పాత నానుడి. ‘నేను పోను బిడ్డో ప్రయివేటు దవాఖానకు’ అన్నది నేటి వాడుక వాక్యం.

-ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది నిరూపిత సత్యం. మనిషి ఆరోగ్యంపైనే అతని ఉత్పాదక శక్తి ఆధారపడి ఉంటుంది. ప్రజలను ఉత్పత్తి శక్తులుగా కాకుండా కేవలం ఓటర్లుగా భావించినందున వాళ్ల ఆరోగ్యాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఇదే దుస్థితి. నిన్నటిదాకా తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య రంగం ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’లో ఉండినది.మంచం పట్టిన తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఆయన ముందు చూపు వల్ల ఐసీయూ పరిస్థితి నుంచి సర్కారు దవాఖానాలు విముక్తి చెందినవి. అసలిదంతా ఎందుకు? తెలంగాణలో రాష్ట్ర రాజధాని మినహా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడా ఐసీయూ సౌకర్యం అరవై ఏండ్లుగా లేదంటే ఎవరు నమ్ముతారు! కానీ ఇది నిజం. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదని… జిల్లాలు, గ్రామాలతో, సామాన్య అట్టడుగు సబ్బండ వర్ణాల ప్రజలతో కూడిన ప్రాంతం అని కేసీఆర్ భావించినందునే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేశారు.

-ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు పనిచేస్తున్నవి. మరో 20 ఆస్పత్రుల్లోనూ ఐసీయూ సౌకర్యం కలుగుతున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బెడ్‌లు, స్ర్టెచర్‌లు, సెలైన్ బాటిల్స్ స్టాండ్‌లు ఏర్పాటు చేయడం, ఆస్పత్రులకు రంగులు, పెయింటింగ్ వంటి పనులు జరిగాయి. తెలంగాణ స్వయం పాలన వచ్చే నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్‌ల సంఖ్య 17,000. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన వెంటనే వీటి సంఖ్య మరో మూడు వేలు పెంచారు.నిమ్స్‌లో 500, నీలోఫర్‌లో 500, ఎమ్.ఎన్.జె. క్యాన్సర్ ఆస్పత్రిలో 250 పడకలు పెరిగాయి. జిల్లా ఆసుపత్రులలో మిగతా 1750 పడకలు పెంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఉచితంగా సరఫరా చేసే మందుల కొనుగోలు కోసం కేవలం 114కోట్లు ఖర్చు చేసేవారు.ప్రభుత్వం దాన్ని మూడింతలు పెంచింది. 300 కోట్ల రూపాయలు మందుల కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు. కిడ్నీ, గుండె వంటి అవయవాలు మార్పిడి తర్వాత దీర్ఘకాలికంగా వాడవలసిన మందుల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలోని మందుల పంపిణీ స్కీంను ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకూ విస్తరించబోతున్నారు. లివర్, గుండె, కిడ్నీ వంటి అవయవాల మార్పిడి సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద వర్గాలకు ఉచితంగా, సునాయాసంగా, సురక్షితంగా జరిగిపోతున్నాయి.

-మూత్రపిండాల వ్యాధికి గురైతే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్ప త్రులే దిక్కు. బతికితే ఇంటికి లేదా కాటికి. ఇప్పుడు నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ‘డయాలసిస్’ సెంటర్‌లు పనిచేస్తున్నవి. ఇంకా తాండూరు, వనస్థలిపురం, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూరు, నల్గొండ, సూర్యాపేట, భద్రాచలం, ఏటూరునాగారం, మహబూబాబాద్, జగిత్యాల, గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి, కామారెడ్డి ఆస్పత్రులకూ డయాలసిస్ సౌకర్యాలను విస్తరిస్తున్నారు. మరో 15 రోజుల్లో 47 డయాలసిస్ సెంటర్‌లు ఏర్పాటవుతున్నవి. రోగ నిర్ధారణ పేరిట జరుగుతున్న ప్రయివేట్ దోపిడీకి కేసీఆర్ బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. 40 ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు ఒకేచోట జరిగేలా చర్యలు తీసుకున్నారు. అధునాతన పరికరాలతో రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అదే రోజున రిపోర్టులివ్వడంతో పాటు మందులు ఇస్తున్నారు. లేబర్ రూమ్స్‌ను ఎల్‌డీఆర్ కాన్సెప్ట్‌తో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకలపై దుమ్ము, ధూళి కొట్టుకుపోయిన, చిరిగిపోయిన బెడ్ షీట్లు గతంలో వుండేవి. ఆ పడకలపై పడుకుంటే కొత్త రోగాలు అదనంగా వచ్చేవి. పడకలు పరిశుభ్రంగా ఉంచుతూ తెలుపు, గులాబీ రంగు బెడ్ షీట్లు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా కేంద్ర ఆస్పత్రికి సూపర్ స్పెషాలిటీ హంగులు సమకూర్చుతున్నారు.

-ప్రజారోగ్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు గత ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నించాయి. ఆ విషయంలో చాలా ముందుకు కూడా వెళ్ళాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అయినందున ప్రజారోగ్యానికి మునుపెన్నడూ లేని రీతిలో ప్రాధాన్యం ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ రంగాలతో పాటు వైద్య ఆరోగ్య రంగం కూడా తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురైంది. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రను పాలించిన నాయకులు ప్రజల ప్రాణాలను గాలిలో దీపం వలె పెట్టారు. సామాన్య పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఓవైపు కార్పొరేట్‌ ఆస్పత్రులు, బడా ఆస్పత్రులు ఖరీదైన వైద్యంతో రోగులను గుల్ల చేస్తుంటే సామాన్యుడికి ఆసరాగా నిలవాల్సిన సర్కార్‌ ఆస్పత్రులు కాగడా పెట్టి వెతికినా దొరికేవి కావు. మొత్తం ఆరోగ్య రంగం ప్రయివేటు చేతుల్లోకి వెళుతున్న దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ రూపంలో అద్భుతమైన నాయకత్వం లభించింది. మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ ఆస్పత్రులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఎజెండాను కేసీఆర్ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇదొక గుణాత్మక మార్పు. గత ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా ప్రయివేటుకు కట్టబెట్టి చోద్యం చూశాయి. సర్కార్‌ దవాఖానాలకు నిధుల కొరత లేకుండా చేశారు. ఇది ప్రజారోగ్య రంగం బలోపేతం చేసేందుకు కేసీఆర్ వేసిన తొలి అడుగు. వాటి సక్రమ నిర్వహణ అసలు సమస్య అని కూడా ప్రజల ముఖ్యమంత్రికి తెలుసు. అందువల్ల ప్రభుత్వ ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రుల్లో రోగుల అందుబాటులో ఔషధాలు వంటి విషయాల్లో కేసీఆర్ ఇంచుమించు విప్లవమే తీసుకువచ్చారు. కేసీఆర్ మిగతా రాజకీయ నాయకులకన్నా భిన్నంగా ఆలోచిస్తారు. అంతకన్నా సృజనాత్మకంగా పథకాలను రచిస్తారు. ఆయన ఏమి చేసినా అందులో మానవీయ కోణం ఉంటుంది. ప్రజలకు మేలు చేసే తపన ఉంటుంది. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలను గత పాలకులు మనుషులుగా కూడా ట్రీట్ చేయలేదు. ఇలాంటి క్షేత్రస్థాయి గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల జీత భత్యాలు పెంచడం ఒక రికార్డు. ఒక చరిత్ర. నిజానికి ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు పెంచడం వారి ఆర్థికపరిస్థితిలో మార్పు తీసుకుని రావడమే కాదు, ప్రసవానికి ముందు, ప్రసవానంతరం కూడా తల్లీ పిల్లలను నిబద్ధతతో సంరక్షిస్తున్నందన గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ పటిష్టం కావడానికి దోహదపడుతుంది. సమైక్యాంధ్ర పాలకుల పాపాలకు ప్రతిఫలంగా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కునారిల్లింది.

-పతనావస్థకు చేరుకున్న వ్యవసాయ, మార్కెటింగ్, సాగునీరు, విద్యుత్ రంగాలను ఏకీకృతం చేస్తున్న నాయకుడు కేసీఆర్. వీటితో పాటు ఆరోగ్య రంగం కూడా కీలకమని ఆయన గుర్తించారు. ఈ రంగం బలహీనంగా ఉంటే మిగతా రంగాలు మరింతగా బలహీన పడతాయని ముఖ్యమంత్రి అవగాహన. నిజమే కదా! ప్రజలు బలంగా ఉంటేనే సామాజిక, ఆర్థిక రంగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. మూడేళ్ళ క్రితం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే కనిపించిన దృశ్యాలకు ఇప్పుడు కనిపించే దృశ్యాలకు మధ్య భూమ్యాకాశాల తేడా. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్నది పాత నానుడి. ‘నేను పోను బిడ్డో ప్రయివేటు దవాఖానకు’ అన్నది నేటి వాడుక వాక్యం. పేద, అభాగ్యుల ప్రజలకు సర్కారు దవాఖానాల పట్ల ఇదివరకు విముఖత ఉన్న మాట నిజమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్ని సర్కారు దవాఖానాల వైపు మళ్లించేందుకు చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వ డాక్టర్లు ఇదివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కన్నా ప్రయివేటు ప్రాక్టీసుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. క్రమంగా వాళ్ళు తాము పనిచేసే ఆస్పత్రులలోనే బాధ్యతగా పనిచేసే వాతావరణం సీఎం కల్పించారు. అవసరం ఉన్నా, లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేసి మహిళల జీవితాలతో చెలగాటం ఆడే దుష్ట సంప్రదాయానికి కేసీఆర్ చరమగీతం పాడారు. గడచిన మూడేళ్ళుగా తగ్గిపోయిన సిజేరియన్ల గణాంకాలే ఇందుకు సాక్ష్యం. సిజేరియన్‌ వల్ల తమ పనులు తాము చేసుకోలేని శారీరకంగా బలహీనులుగా మారుతున్న దౌర్భాగ్య స్థితికి మహిళలను నెట్టివేస్తున్న సంస్కృతిని కేసీఆర్ నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిజేరియన్‌ వల్ల తల్లి ఆరోగ్యం దెబ్బతింటున్నది. మరో వైపు ఆ కుటుంబం వేలల్లో ఖర్చులు చేసి దివాలా తీస్తున్నది. అప్పుల పాలవుతున్నది. ఈ పరిస్థితిలో మార్పు కోసం కేసీఆర్ తీవ్రంగా కృషిచేశారు. దాని ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీల సంఖ్య మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు ఇవ్వడం సంచలనం. ‘కేసీఆర్ కిట్’ చరిత్రాత్మకం. ప్రభుత్వ ఆస్పత్రులలో ఇదివరకటి కంటే ప్రసవాలు 50 శాతం పెరిగాయి. ప్రసూతి అయిన తల్లీబిడ్డలకు 15 రకాల వస్తువులు ‘కేసీఆర్ కిట్’ కింద పంపిణీ చేస్తున్నారు.

-మహబూబ్‌నగర్ జిల్లాలో భార్య శవాన్ని తరలించేందుకు ప్రభుత్వ వాహనం లేక, ప్రయివేటు అంబులెన్స్ సమకూర్చుకునే స్థోమత లేక ఒక వ్యక్తి భుజాన తన భార్య శవాన్ని మోసిన ఘటన సీఎంను కలచివేసింది. ఇలాంటి దురవస్థ మరెవ్వరికీ రాకూడదని ఆయన ‘పార్థీవ వాహనాలు’ సమకూర్చారు. చనిపోయిన వ్యక్తి వూరికి, ఇంటికి పైసాఖర్చు లేకుండా శవాన్ని చేర్చే కార్యక్రమం మరో అద్భుతం. కేసీఆర్ మానవత్వానికి ఇది నిలువుటద్దం. ప్రసవ మారణాలు, శిశు మరణాల విషయంలో తెలంగాణ దేశంలో 28వ స్థానంలో ఉండడం మామూలు మాట కాదు. ‘మిషన్ ఇంద్రధనుష్’ పేరుతో చేపట్టిన ఇమ్యునైజేషన్ కార్యక్రమం అత్యుత్తమమైనదిగా దేశంలోనే గుర్తింపు వచ్చింది. దీన్నిబట్టి ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని అంచనా వేయవచ్చును.

-ఇక గత ప్రభుత్వాలు ప్రయివేటు వైద్య రంగాన్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రోత్సహించగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది ఒక జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 2016లో మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయగా ఈ సంవత్సరం సిద్ధిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమవుతున్నది. మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి యేటా 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. ఈ మూడేళ్లలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం తెలంగాణ సాధించిన ఘనత.

-కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కేవలం మహిళా సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల యువతుల పెళ్ళి ఖర్చుల కోసం ప్రభుత్వం ఇంతకుముందు రూ.51,000 ఇచ్చింది. ఈ మొత్తాన్ని రూ.75,116 కు పెంచారు. ఇది ఆర్థికపరమైన సహాయంగా చూడడం ఒక కోణమే. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఆడపిల్ల పెళ్లి చేయాలి. అప్పుడే ప్రభుత్వ సహాయం అందుతుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పుణ్యమా అని బాల్య వివాహాల శాతం తగ్గుతోంది. కేసీఆర్ విజన్ వల్లనే పేద ఆడపిల్లల పెళ్లికి కష్టాలు తీరిపోవడంతో పాటు బాల్య వివాహాల కారణంగా పట్టి పీడించే అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తి లభిస్తున్నది.

టి. హరీశ్ రావు నీటిపారుదల, మార్కెటింగ్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.