Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజాభీష్టం మేరకే

-కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ -14 జిల్లాలకు ప్రతిపాదనలొచ్చాయని వెల్లడి -సుమారు 70 కొత్త మండలాలు ఉంటాయని వ్యాఖ్య -కొత్త జిల్లాల ఏర్పాటు తెలంగాణ భవిష్యత్తు కోసమే -ప్రజలకు మేలు చేసేలా ప్రక్రియసాగాలి -ప్రభుత్వం, పార్టీకి మంచి పేరు తెచ్చేలా ఉండాలి -పార్టీ ప్రజా ప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం -టార్గెట్ పెట్టి మరీ పేదరికాన్ని తరిమికొడతమని విశ్వాసం -ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు తమాషా చేస్తున్నాయని ఆగ్రహం

KCR-addressing-in-TRSLP-Meeting

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జిల్లాల పునర్విభజన తెలంగాణ భవిష్యత్తు కోసమేనని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రజలు హర్షించేలా, ప్రజలకు మేలుచేసేలా జిల్లాల విభజన జరుగాలని ఆయన నిర్దేశించారు. ప్రజాభీష్టం మేరకే మండలాలను కొత్త జిల్లాల్లో కలుపాలని ఆయన సూచించారు. స్వతంత్రం అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లాల విభజన జరిగిందని.. కానీ ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మాత్రం జరుగలేదని కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న జిల్లాల విభజన ప్రజలకు మేలుచేసేలా ఉండాలన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ కసరత్తు ప్రజల అభీష్టానికి అనుగుణంగా జరుగాలని చెప్పారు.

కొత్తగా 14 జిల్లాలు, 70 మండలాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై పార్టీపరంగా వర్క్‌షాప్ నిర్వహించారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనల్ని ప్రజా ప్రతినిధులకు పంపిణీ చేశారు. దానిపై ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లాల వారీగా కూర్చొని ప్రజల అభీష్టం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై కసరత్తు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు కసరత్తు ఎలా ఉండాలనే దానిపై ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘మీరు చేసేది గొప్ప పని. తెలంగాణ భవిష్యత్తు కోసం చేస్తున్నాం.

సమక్షిగంగా కసరత్తు చేయాలి. ఆదరాబాదరా వద్దు. మంచి చేస్తే ప్రజల నుంచి స్పందన మంచిగ ఉంటది. ‘అబ్బ.. ఎంత మంచిగ చేసిండ్రు..’ అనిపించుకోవాలేగానీ చెడు చేశారనే పేరు రావొద్దు. అది మీ చేతుల్లోనే ఉంది. ప్రజల మూడ్ ప్రతిబింబించేలా మీ కసరత్తు ఉండాలి’ అని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఇంకా కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘కొత్త రాష్ట్రం ఏర్పడితే జిల్లాల పునర్విభజన చేస్తామని మనం ఉద్యమ సమయం నుంచి ప్రజలకు వివరిస్తూనే ఉన్నాం. జిల్లాల పునర్విభజన వెనుక కొన్ని ప్రబలమైన కారణాలున్నాయి. ఏదో ఆషామాషీకోసం వీటిని చేపట్టడం లేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనజరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే ఈ ప్రక్రియ జరుగలేదు. నేను ఏపీలో మంత్రిగా ఉన్నపుడు కూడా జిల్లాల పునర్విభజనపై ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అప్పుడు అంతా ఐటీ.. హైటెక్ అంటూ వాటిని పక్కన పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే జిల్లాల పునర్విభజన జరుగకపోవడంవల్ల చాలా నష్టాలున్నాయి. ఆ విషయం ఎంపీలకు బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వమైతే కొన్ని స్కీంలుగానీ, నిధులుగానీ జిల్లాలవారీగా ఇస్తుంది. నవోదయ కావచ్చు.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కావచ్చు.. జిల్లాలవారీగా ఇస్తుంది. సగటు చూసుకుంటే చాలా ఆశ్చరకరమైన వివరాలు ఉంటయి.

పునర్విభజనకు సహేతుక కారణాలివి.. దేశ జనాభా 125-127 కోట్లు ఉంటే.. జిల్లాల సంఖ్య 683గా ఉంది. ‘భారతదేశ విస్తీర్ణం 30 లక్షల చదరపు కిలోమీటర్లు. సరాసరి తీస్తే.. ఒక్కో జిల్లా జనాభా సగటున 18.30 లక్షలు ఉంటుంది. అదే వైశ్యాలమైతే ఒక్కో జిల్లాది సగటున 4,392 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే.. అధికారిక లెక్కల ప్రకారమైతే జనాభా 3.60 కోట్లు ఉంది. వాస్తవంగానైతే ఇంతకంటే ఎక్కువనే ఉంటుంది. జిల్లాల సంఖ్య పది. తెలంగాణ విస్తీర్ణం 1.14 లక్షల చదరపు కిలోమీటర్లు అయితే సగటున ఒక్కో జిల్లా జనాభా 36 లక్షలుగా ఉంది. అదే విస్తీర్ణమైతే ఒక్కో జిల్లాది 11వేల చదరపు కిలోమీటర్లు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాలదైతే 18వేల చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. అంటే కేరళ రాష్ట్రంలో సగమన్నమాట. మరి.. దేశవ్యాప్తంగా జిల్లాల విస్తీర్ణం సరాసరి 4,392 చదరపు కిలోమీటర్లుంటే.. మన దగ్గర 11వేల చదరపు కిలోమీటర్లకు పైగా ఉంది. ఇంత పెద్ద విస్తీర్ణం ఉంటే మానిటరింగ్ (పర్యవేక్షణ) చాలా కష్టమవుతది.

పేదరికాన్ని తరిమేందుకే తెలంగాణ.. ఆర్థికవేత్తలు చెప్పే లెక్కల ప్రకారం తెలంగాణ బడ్జెట్ 2019నాటికి రూ.2 లక్షల కోట్లవుతుంది. ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి రెట్టింపు అవుతుంది. ‘మన రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు 26.62 శాతంగా ఉంది. మనం ప్రవేశపెట్టిన పాలసీలు అద్భుతమైన ఫలితాలను తీసుకువచ్చినయి. టీఎస్-ఐపాస్ తీసుకుంటే.. రెండు వేల పైచిలుకు పరిశ్రమలు కొత్తగా ఏర్పాటుకావడం నభూతో.. నభవిష్యతి అన్నట్లు. అందులో 1200 పరిశ్రమలు ఉత్పత్తిని మొదలుపెట్టినయి.

పదిహేను రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తున్నం. ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున వచ్చినయి. గత రెండు సంవత్సరాల్లో వర్షాలు సరిగాలేక కరువు వచ్చింది. కానీ ఈసారి అద్భుతమైన వర్షాలుంటాయని చెప్తున్నరు. ఇప్పుడు మిషన్ కాకతీయ పనుల ప్రభావమేందో (ఇంపాక్ట్) ప్రపంచానికి అర్థమవుతుంది. మంచి వర్షాలు పడి పంటలు బాగా పండితే.. రైతుల దగ్గర డబ్బులు ఉంటయి. తద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లవుతుంది. ఇటీవల నేను గవర్నర్‌ను కలిసినపుడు మీ తెలంగాణ వాళ్లు ఇంత బడ్జెట్ ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. అయితే గతంలో నా కలలన్నీ నిజమైనయి.. ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి పేదరికాన్ని పారదోలాలని సంకల్పించిన. జిల్లాల పునర్విభజన తర్వాత ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్మన్ ఇలా నాయకగణానికి చిన్న జిల్లా కావడంతో వివరాలన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉంటయి. కంప్యూటర్‌లో ప్రతి కుటుంబ వివరాలు ఉంటయి. అప్పుడు కుల, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకొని పేదవారిని గుర్తిస్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణులు, మైనార్టీలు.. నువ్వు ఎవరైనా సరే! పేదవాడిగా ఎలా ఉంటావ్? ఏం పని చేయగలవు? అని వారిని తట్టిలేపి చేయూత అందిస్తం. ఇలా టార్గెట్ పెట్టి మరీ పేదరికాన్ని తరిమికొడతం. తెలంగాణ తెచ్చుకున్నదే ఇందుకు. ఏదో తమాషాకు తెచ్చుకోలేదు.

అవి గ్రోత్ సెంటర్లు.. జిల్లాల పునర్విభజనపై కొత్త బేస్‌వర్క్ ఉండాలని జిల్లా కలెక్టర్లతో పదు దఫాలుగా సమావేశంం పెట్టిన. అందుకు కలెక్టర్లు 24 జిల్లాలుగా చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన ఇచ్చినరు. జిల్లాలతో పాటు కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినరు. ఆ వివరాలన్నీ మీకు పంపిణీ చేస్తం. వాటిని పరిశీలించండి. ఏ మండలాన్ని ఎండ్ల కలిపితే బాగుంటుంది? ఏ జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై చర్చించండి. ఉదాహరణకు.. కరీంనగర్ జిల్లాలో ఎల్కతుర్తి మండలం ఉంది. ఆ మండల ప్రజల దైనందిన కార్యకలాపాలన్నీ వరంగల్ జిల్లాతో ముడిపడి ఉంటయి. అందుకే వాళ్లు మమ్మల్ని వరంగల్‌లో కలుపమని అడుగుతున్నరు. అట్ల ఉన్న వాటిని ప్రజల అభీష్టానికి అనుగుణంగా కలపండి.

కొన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులున్నయి. ఆదిలాబాద్‌ వంటి జిల్లాలో పెద్ద సమస్య లేదు. నిజామాబాద్‌లోని కందమర్తినుంచి తూర్పు, పశ్చిమ ఆదిలాబాద్ జిల్లాకు గోదావరి గెట్టుగా ఉంది. అందుకే అక్కడ రెండు జిల్లాలు చేయడం సులువు అవుతుంది. ఒక్కో జిల్లాలో ఐదు నియోజకవర్గాల చొప్పున వస్తయి. కొమురం భీం గొప్ప గిరిజన నాయకుడు అయినందున తూర్పు జిల్లాకు ఆయన పేరు పెట్టుకుందాం. వరంగల్‌లో కొత్తగా ఏర్పడే భూపాలపల్లికి ప్రొఫెసర్ జయశంకర్‌సార్ పేరు పెట్టుకుందాం. నల్లగొండను రెండుగా చేసి, సూర్యాపేట, నల్లగొండగా చేసుకుందాం. అయితే వరంగల్‌లోని జనగాంతో ఎవరూ కలిసెటట్టు లేరు. జిల్లాల పునర్విభజన అనేది ఒక శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. తెలంగాణలో ఇప్పుడున్న జిల్లాలు మంచి గ్రోత్ సెంటర్లుగ ఉన్నాయి. వీటితోపాటు ఇంకిన్ని సెంటర్లు రావాలి. ఈ గ్రోత్ సెంటర్ల గుర్తింపు అనేది చాలా శాస్త్రీయంగా జరుగుతుంది. హైదరాబాద్‌నుంచి నిజామాబాద్‌కు పోయే రహదారిలో కామాడ్డి మంచి గ్రోత్ సెంటరుగ ఉంది. హైదరాబాద్‌నుంచి బోధన్ పోయేటపుడు మెదక్; హైదరాబాద్ నుంచి పోయేటపుడు సంగారెడ్డి; హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు సూర్యాపేట.. ఇలా గుర్తించడం జరుగుతుంది.

ఒక్కో జిల్లాకు రమారమి 20 మండలాలు.. ఒక్కో జిల్లాకు రమారమి 20 మండలాలు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నం. కొన్ని దగ్గర 17, 18, 21 కూడా ఉండొచ్చు. చాలాచోట్ల ఆయా స్థానిక ప్రజల అభివూపాయాలు, అభీష్టానికి అనుగుణంగా.. స్థానికంగా నిత్యం వాళ్లు కార్యకలాపాలు కొనసాగించే జిల్లాలో వారు కలిసేలా చూడండి. రమారమి 70 కొత్త మండలాలు వచ్చేలా ఉన్నాయి. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒక్క జిల్లాలోనే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. ఒక్క నియోజకవర్గం రెండు జిల్లాల్లో కూడా ఉండొచ్చు. మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ క్లాస్‌మేట్ హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ జిల్లాల పునర్విభజనపై రాజీవ్‌శర్మ ఫోన్ చేసినపుడు ‘మా దగ్గర ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం రెండు కాదు.. మూడు జిల్లాల పరిధిలో కూడా ఉంది’ అని చెప్పినరు. అందుకే నియోజకవర్గాలు ఓవర్ ల్యాప్ అయితే సమస్య ఏంలేదు. నిజామాబాద్ పట్టణ జనాభానే నాలుగు లక్షలు. అందుకే ఒక మండలం పెరుగాలి. ఇలా అర్బన్ మండలాలు పెరుగాల్సిన అవసరముంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రామగుండం ఇలా కార్పొరేషన్లలోనూ మండలాలు పెరుగాలి.

ఎట్ల మేలయితే అట్ల.. ఈ మధ్యలో కొందరు కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నరు. కొత్త జిల్లాలైతే కొత్త జడ్పీ చైర్మన్లు వస్తరా? అంటున్నరు. ఒక్కో జిల్లాకు ఒక్కో జిల్లా సెషన్స్ కోర్టు ఉండాలి. అయితే ఇలాంటి వెంటనే ఏర్పాటయ్యేవి కావు. ముందుగా రెవిన్యూ జిల్లాలను ఏర్పాటు చేస్తం. గతంలో కొత్తగా మండలాలు వచ్చినపుడు కూడా తొలుత రెవిన్యూ మండలాల్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా చట్టం ప్రకారంగా ఏది మేలో అట్లనే చేద్దాం. కొత్తగా జడ్పీలు ఏర్పాటు చేయాలంటే ఉన్న జడ్పీల్లో తీర్మానాలు పెట్టి ఆమోదిస్తే సరిపోతుంది. అయితే కొత్త జడ్పీలు వెంటనే ఏర్పాటు చేయాలా? ఈ కొద్దికాలం ఉన్న వాటినే కొనసాగించాలా? అనే దానిపై ఏది బెటర్ అయితే దాన్ని అమలుచేద్దాం.

TRSLP-Meeting

తెలంగాణ పచ్చగుండటమే మన లక్షం.. ‘కొంతమంది ఏదేదో మాట్లాడుతరు. అవన్నీ పట్టించుకోవద్దు. తెలంగాణ తెచ్చింది మనం. గులాబీ జెండా ఎగిరినపుడు చాలామంది అవహేళన చేసినరు. ఇది మగ్గల పుట్టింది.. పబ్బల పోతదన్నరు. కానీ తెలంగాణ సాధించినం. అందుకే ప్రజలు మీరు సేవ చేయండని అవకాశమిచ్చినరు. ఈ రెండేండ్లలో పార్లమెంటు, శాసనసభ, స్థానిక.. ఏ ఎన్నికలైనా ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలను మెచ్చుకుంటూ, ఇది మన పార్టీ అని, తెలంగాణ భవిష్యత్తుకు ఈ పార్టీ కావాలని ఎండార్స్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేక చాలామంది చాలా మాట్లాడతరు. అక్కసు వెళ్లగక్కుతరు. భయపడొద్దు. తెలంగాణ ప్రభుత్వం కట్టే ప్రాజెక్టులు ఆగాలని అనుకుంటున్నరు. మల్లన్నసాగర్‌గానీ, పాలమూరు-రంగాడ్డి ప్రాజెక్టు మీదగానీ పిల్ వేస్తరు. కోర్టు వాటిని కొట్టివేస్తే మళ్లీ వేస్తరు. ఇదంతా తమాషాగా ఉన్నది. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక దృక్పథం లేకుండా వ్యవహరిస్తున్నయి. మనకు ప్రజలే బాస్‌లు. మన తెలంగాణ బాగుపడాలి. పచ్చగుండాలె. ఇదీ మన లక్షం.

దసరాకు మనుగడలోకి కొత్త జిల్లాలు.. మనం చేసే పని అంతిమంగా ప్రజలకు మేలు చేయాలి. మనది మిలిటరీ ప్రభుత్వం కాదు. ప్రజల ప్రభుత్వం. తీర్పుకోసం మళ్లీ ప్రజల దగ్గరకు పోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలిగానీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. జిల్లాల పునర్విభజన ద్వారా ప్రజలకు మంచి జరుగాలి. వాళ్ల అభిలాష ప్రకారం జరుగాలి. గత ప్రభుత్వాలు ఇంత ఫెయిర్‌గా చేసిన దాఖలాలు లేవు. వాళ్ల నాయకుల ప్రయోజనాల కోసం, ఇష్టానుసారంగా చేసినరు. ఇది వర్క్‌షాప్. ఓపికగా కూర్చుని అందరూ కలిసి చర్చించండి. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మండలాల విషయంలో స్థానికంగా సర్పంచులు, ఇతరులను ఫోన్‌లో సంప్రదించండి. జిల్లాలైతే సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేయండి. ప్రజల అభిప్రాయాలు, అభీష్టాలు ఎలా ఉన్నాయో కనుక్కోండి. జిల్లాల పునర్విభజన అనేది కీలకమైన అంశమైనందున.. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తం. దసరాకు కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలి. పనులు మొదలుపెట్టాలి. ఏ వ్యవహారమైనా పకడ్బందీగా చేయాలి. తత్తర బిత్తరపడి.. అయోమయంలో చేస్తే ఫలితముండదు. దసరాకు కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తే ఒకటి, ఒకటిన్నర ఏండ్లలో అంతా సెటిల్ అవుతుంది. కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలపై గ్రిప్ సంపాదిస్తరు.

గిరిజనుల బతుకుల్లో వెలుగులు.. మహబూబాబాద్‌ను జిల్లాగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అది అంతా గిరిజన ప్రాంతం. జిల్లా అయితే గిరిజన బతుకుల్లో వెలుగు వస్తది. అదిలాబాద్ తూర్పు కూడా అంతే. ఆదివాసీలు ఎక్కువగా ఉన్నందున వారికి కూడా మంచి జరుగుతది. ఇలా రాష్ట్రంలో గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఆ ప్రాతిపదికన ఒకటీ, రెండు జిల్లాలు చేయాల్సి వస్తది. కొన్ని విషయాల్లో భయపడొద్దు. వరంగల్‌లోని ములుగును జిల్లా చేయమంటున్నరు. అది కార్నర్‌లో ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల.. అది సరిహద్దులో ఉంది. దాన్ని దాటితే అంతా కర్ణాటక. అట్లాంటి వాటిని జిల్లా చేయడం కరెక్టు కాదు. స్థానికంగా కొన్ని ఆందోళనలు వస్తయి. కానీ ప్రజలకు మేలు జరిగేలా మన కసరత్తు ఉండాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.