Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజాహితానికే పటిష్ఠచట్టం

-ల్యాండ్ మాఫియాలు, అక్రమ లేఅవుట్లు పోవాలి
-అక్రమాలను అరికట్టడానికి శస్త్రచికిత్స తప్పదు
-అందుకే కొంత కఠినంగా చట్టం తీసుకువస్తున్నాం
-పట్టణాలు, పల్లెల్లో పచ్చదనాన్ని పెంచాలి
-85% మొక్కలు పెంచకపోతే వార్డుసభ్యుడి తొలిగింపు
-ఏకఛత్రాధిపత్యాన్ని రూపుమాపేలా ఉద్యోగుల బదిలీలు
-చైర్మన్లు, మేయర్లు కూడా మినహాయింపు కాదు
-ఆగస్టు 15 తర్వాత రియల్‌టైమ్ అడ్మినిస్ట్రేషన్
-భారతదేశమే మనదగ్గర నేర్చుకునేలా
-అద్భుత పరిపాలనా సంస్కరణలు తెస్తాం
-రాజకీయ జబ్బులతో చచ్చిపోయిన పంచాయతీరాజ్ స్ఫూర్తి
-ఆ స్ఫూర్తి మళ్లీ పునరుత్తేజం పొందేందుకు కొత్త చట్టం
-ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్లకు అధికారాలు పెంచాం
-తెలంగాణ పురపాలక సంఘాల బిల్లు -2019పై
-అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ వివరణ
-కొత్త మున్సిపల్ చట్టం బిల్లుకు ఉభయసభల ఆమోదం

CM KCR Full Speech On New Municipal Act In Telangana Assembly

జాహితంకోసం, ప్రజలను లంచాల బెడదనుంచి కాపాడేందుకు ఎంతవరకు వెళ్లేందుకైనా ప్రభుత్వం సిద్ధమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రజలకు మేలుజరిగేలా, పట్టణాలు, పల్లెల్లో పచ్చదనాన్ని పెంచేలా నూతన మున్సిపల్ చట్టం ద్వారా కఠిన నిబంధనలు అమల్లోకి తేబోతున్నట్టు ప్రకటించారు. పట్టణప్రాంతాల్లోని పేదలపైనా సీఎం కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. పట్టణాల్లోని పేదలకు 75 చదరపు గజాల్లోపు స్థలంలో నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదని చెప్పారు. ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు వెల్లడించారు. ఆస్తి పన్నుకూడా ఏడాదికి వందరూపాయలే ఉంటుందని తెలిపారు. ఇంటి అనుమతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తున్నామన్న సీఎం.. దీనిని దుర్వినియోగం చేస్తే ఆస్తిపన్నుపై 25 రెట్లు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు లేకుండానే కూల్చివేసేలా కొత్త చట్టంలో కఠిన నిబంధనలు పెట్టామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి పదిహేనురోజుల్లో అనుమతి ఇవ్వకుంటే అనుమతి ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందని చెప్పారు.

ఎప్పుడో 1920లో చేసిన టౌన్‌ప్లానింగ్ చట్టం ఇంకా అమలులో ఉన్నదని, అందుకే దానిని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ల్యాండ్ మాఫియాలు, అక్రమ లేఅవుట్లు పోవాలన్నదే కొత్త చట్టం ఉద్దేశమన్నారు. అక్రమాలను అరికట్టడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో కాదన్న సీఎం.. అందుకు శస్త్రచికిత్స చేయాల్సిందేనని, అందుకే చట్టాన్ని కొంత కఠినంగా తీసుకువస్తున్నామని తెలిపారు. మూడేండ్లలో తెలంగాణలో అద్భుతం జరగబోతున్నదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏకఛత్రాధిపత్యాన్ని రూపుమాపేలా బదిలీలపైనా నిర్ణయాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. భావితరాలకోసమే హరితహారం కార్యక్రమం చేపట్టామన్న సీఎం.. మున్సిపాలిటీల్లో 85శాతం మొక్కలు పెంచకపోతే వార్డుసభ్యుడిని తొలిగిస్తామని హెచ్చరించారు. చైర్మన్లు, మేయర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు. ఆగస్టు 15 తర్వాత రియల్‌టైమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. భారతదేశమే మన దగ్గర నేర్చుకునేలా అద్భుతమైన పరిపాలనా సంస్కరణలు తెస్తామన్నారు. తెలంగాణ పురపాలక సంఘాల బిల్లు -2019పై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

పర్యావరణాన్ని కాపాడలేకపోతే ఎంతచేసినా వృథా
మొన్న ఎండాకాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45, 46 డిగ్రీలు దాటాయి. గోదావరితీరం వెంట ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలకు పక్షులన్నీ పండిన పండ్లలాగా రాలిపోయినయి. స్థానికసంస్థల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు అంతా అనుకుంటే మొక్కలు పెంచడం కానిపనా? అదేమైనా గొప్పవిద్యా? కానీ ఎందుకో వీళ్లంతా అనుకోవడంలేదు. నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తున్నా. నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, ఇంకెన్ని అభివృద్ధి పనులుచేసినా బతకలేని వాతావరణ పరిస్థితులు, భరించలేని ఉష్ణోగ్రతలున్న వాతావరణాన్ని భవిష్యత్తుతరాలకు ఇస్తే మనం గొప్పవాళ్లంకాదు. ఎంత సంపద సృష్టించినా దాన్ని అనుభవించే పర్యావరణ పరిస్థితులు కూడా ఉండాలి. అదిలేకుండా మనం ఎంత కష్టపడ్డా నిష్క్రియే. అర్బన్ లోకల్‌బాడీస్ కూడా మంచి పద్ధతిలో రావాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నం. మున్సిపల్ వ్యవస్థను పూర్తి అవినీతిరహితం చేయడమే లక్ష్యం. ఈ రోజు అర్బన్ లోకల్‌బాడీస్‌లో ప్రజలు పడుతున్న బాధలు, ఉన్న పద్ధతులు మనందరికీ తెలిసిందే. అందుకే నూటికినూరుపాళ్లు మానవజోక్యం తగ్గించి, పారదర్శకంగా మున్సిపల్ పర్మిషన్లు, లేఅవుట్ పర్మిషన్లు వచ్చేలా ఏర్పాటుచేస్తున్నాం.

ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్
నిరుపేదలకు నేను శుభవార్త తెలియజేస్తున్నా. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో ఒకటి నుంచి 75 చదరపు గజాలవరకు భూమి ఉన్న పేదలు గ్రౌండ్ ప్లస్ వన్ (జీ ప్లస్ వన్) ఫ్లోర్ నిర్మాణానికి అనుమతులకోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వాళ్లకు ఆస్తిపన్ను కూడా ఏడాదికి రూ.100కు మించి ఉండదు. కానీ, వాళ్లు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఒక్క రూపాయి మాత్రమే. మున్సిపాలిటీల్లో వాళ్లు ఎన్‌రోల్ అయితేనే రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, నల్లా కనెక్షన్, ఇంటినంబర్ తదితర పౌరసదుపాయాలు వస్తాయి. అందుకే ఆ నిబంధన పెట్టాం. మున్సిపల్‌శాఖలో పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గపరిధిలో ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి.. వారిద్దరు ఈ విధమైన మార్పుచేస్తే బాగుంటుందని నాకు చెప్పారు. దానికి అనుగుణంగా మార్పులు చేశాం.

CMKCR2

నిధులు ఇస్తేనే అభివృద్ధి సాధ్యం
పంచాయతీరాజ్ చట్టం మాదిరిగానే మున్సిపల్‌చట్టంలోనూ కొన్ని అమలుచేస్తున్నాం. తియ్యగా మాటలు చెప్తే అభివృద్ధి జరుగదు. డబ్బులిస్తేనే జరుగుతుంది. గ్రామపంచాయతీలు, అర్బన్ లోకల్‌బాడీలకు వారి ఆదాయాలు వారికి ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కూడా ఉన్నది. 14వ ఆర్థికసంఘం సిఫారసులమేరకు కేంద్రం ఇస్తున్న డబ్బు గ్రామీణ ప్రాంతాలకు రూ.1600 కోట్లు, జీహెచ్‌ఎంసీకూడా కలిపి పట్టణప్రాంతాలకు రూ.1030 కోట్లు వస్తున్నది. మనంకూడా అంతే సమానంగా మ్యాచ్ చేయాలని ఆలోచనచేశాం. దాన్ని చట్టంలోనూ పొందుపర్చాం. ఏదైనా కారణంతో ఒక ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1030 కోట్లు ఇవ్వలేకపోతే వాటిని ల్యాప్స్ చేయకుండా, ఎంత తక్కువ ఇచ్చారో తర్వాతి ఏడాది ఆ డబ్బును జతచేయాలని నిర్ణయించాం. అంటే ఏటా రూ.3,200కోట్లు గ్రామాలకు పోతాయి. 500 జనాభా ఉన్న ప్రతి గ్రామపంచాయతీకి రూ.5 లక్షలకు తగ్గకుండా నిధులు వస్తాయి. పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.కోట్లలో వస్తాయి. కాబట్టి నిధులకు ఢోకా ఉండదు. పట్టణప్రాంతాలకు 14వ ఆర్థికసంఘం గ్రాంట్‌కింద రూ.1030 కోట్లు, దానికి సమానమైన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. పట్టణప్రాంతాల అభివృద్ధికి రూ.2060 కోట్లు వస్తాయి. గ్రామాలకు, పట్టణాలకు కలిపి సుమారు రూ.5 వేల కోట్ల పైచిలుకు నిధులు అభివృద్ధి పనులకు ఉంటాయి. గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు వారి ఆదాయం వారికి ఉం టుంది. అదికాకుండా ఈ మొత్తం అదనం. మున్సిపాలిటీల పన్నులకు సంబంధించి ముందుముందు స్పష్టత ఇస్తాం.

ఎన్నికల తేదీలపైనే ప్రభుత్వ నిర్ణయం
మున్సిపాలిటీలకు నిధులు, అధికారాలు ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు. గతంలో జెడ్పీ చైర్మన్లకు రెండేండ్ల నుంచి నిధులులేవు.. విధులులేవు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఎందుకో నిధులు కట్‌చేసింది. ఇప్పుడా పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఉపాధిహామీ పథకంద్వారా ఇప్పుడు కొంత దుర్మార్గం కొనసాగుతున్నది. దాన్ని నివారించి, గ్రామపంచాయతీ కావొచ్చు, మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్ కావొచ్చు.. వాళ్లు మాత్రమే నరేగా నిధులు ఖర్చుపెట్టేలా ఈ చట్టం తెచ్చాం. ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండేలా పెట్టాం. ఇది మేం పూర్తి సోయితో చేస్తున్న పని. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. దాన్ని గౌరవిస్తాం. దానిలో కలుగజేసుకోం. కానీ ప్రభుత్వం కేవలం ఎన్నికల తేదీల నిర్ణయంలోనే జోక్యం చేసుకుంటుంది. రాష్ట్రంలో వరదలు, కరువులు ఉంటాయి. పరీక్షలు, పండుగలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మిగిలిన ప్రక్రియలో ఎక్కడా కలుగజేసుకోం. ఎన్నికల సంఘానికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది.

భవననిర్మాణ అనుమతులు ఇంటికే
మున్సిపల్ పర్మిషన్లు కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పనిలేదు. 500 చదరపు మీటర్ల స్థలం ప్లస్ 10 మీటర్ల ఎత్తుతో నిర్మించే భవనాలకు ఎవ్వరూ మున్సిపల్ కార్యాలయం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన పనిలేదు. వేధింపులు ఉండవు.. మానవ జోక్యం ఉండదు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పర్మిషన్లు ఇస్తాం. స్పెసిఫికేషన్స్ ప్రకారం ఉన్నట్టయితే ఏ ఆఫీసర్‌ను కలవాల్సిన పనిలేదు. సక్కగా ఇంటికే పర్మిషన్లు వస్తాయి. నిర్ణీత కాలపరిమితి లోపు అనుమతి రాకపోతే.. అనుమతి వచ్చినట్టే భావించి నిర్మాణం కూడా ప్రారంభించుకోవచ్చు.

తప్పు చేయటానికి భయపడేలా జరిమానా
ఇలా పర్మిషన్లు ఇస్తే, అక్రమకట్టడాలుంటే ఏం చేస్తారు? అన్న ప్రశ్న వస్తది. వీటికి మేం భారీ మొత్తంలో జరిమానాలు పెట్టాం. తప్పుచేస్తే నష్టపోతాం.. కష్టపడతాం అనే భయం కలిగేలా జరిమానాలు ఉంటాయి. నియంత్రణ లేకుండా ఏదీ జరుగదు. ప్రాపర్టీ ట్యాక్స్‌కు సెల్ఫ్ సర్టిఫికేషన్ పెట్టాం. ఇంటిస్థలం ఎంత ఉన్నదని ఎవరో వచ్చి కొలుచుడు, డబ్బులిస్తే ఎక్కువ కొలుచుడు, ఇయ్యనోళ్లకు తక్కువ కొలుచుడు ఇక ఉండవు. గతంలో మాదిరిగా ప్రజలకు వేధింపులు ఉండవు. ఏ ఇంటి యజమాని అయినా నా ఇల్లు రెండువేల స్కేర్ ఫీట్లలో ఉన్నది.. 2,500 స్క్వేర్ ఫీట్లలో ఉన్నది.. ఇంతకే నేను ప్రాపర్టీ ట్యాక్స్ కడతాను అని డిక్లేర్ చేసుకుంటారు. అయితే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఫ్లయింగ్ స్కాడ్ ఏర్పాటుచేస్తాం. వాళ్లు ఎక్కడ ఎవరి ఇల్లు కొలుస్తారో తెలియదు. నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే 25 రెట్లు జరిమానా విధిస్తాం. రూ.10వేలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటే, దానికి 25 రెట్లు అంటే రూ.2.50 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటది. ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలను విశ్వసిస్తున్నది. ప్రజలను నమ్మి వారికి మేం ఇస్తున్న సెల్ఫ్‌సర్టిఫికేషన్ అధికారాన్ని ప్రజలు దుర్వినియోగం చేయకూడదు. ప్రభుత్వం ఇచ్చే అధికారాన్ని భగవద్గీతలా భావించి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.

అక్రమ కట్టడాలను ఉపేక్షించం
అక్రమనిర్మాణం ప్రారంభిస్తే ఇకపై ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయడమేనని కొత్త చట్టం చెప్తున్నది. అక్రమకట్టడాలను ఉపేక్షించేది లేదు. గతంలో చాలాసందర్భాల్లో ప్రభుత్వ తప్పిదం లేకున్నా.. హైకోర్టువద్ద ఇలాంటి కేసుల్లో తలదించుకోవాల్సి వచ్చింది. బీఆర్‌ఎస్ పెద్ద ప్రహసనం అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ కట్టేస్తరు. కూలగొడుదామంటే రేషనల్ లాస్! ఏం చేయాలి? అపరాధరుసుం కట్టించుకుని రెగ్యులరైజ్ చేయాలి. ఒకసారి హైకోర్టు ఎందుకయ్యా మీరు అందర్నీ ఇష్టమొచ్చినట్టు కట్టుకోమని బీఆర్‌ఎస్ పెడతరు అని అవమానకరంగా మాట్లాడింది. తల కొట్టేసినంత పనైంది. అందుకే రాష్ట్రంలో అక్రమకట్టడాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు.

ఇంకొక్క జిల్లా చేయాలన్న కోరిక ఉండే
పరిపాలన సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలు చేసుకున్నాం. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇంకా ఒక జిల్లా ఏర్పాటుచేసుకోవాల్సి ఉండే. జనాభా తగ్గాలన్న ఉద్దేశంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు కావాలన్న కోరిక ఉండే. ఈ నగరానికి ఒక పేరు ఉన్నది.. దాన్ని విడదీయొద్దని చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్ కీర్తిని కాపాడేందుకు దాన్ని కొనసాగించాలనే నిర్ణయించాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ కాకుండా జీహెచ్‌ఎంసీ బాధ్యత నిర్వహిస్తుంది. భవిష్యత్తులో దీనిపై మళ్లీ ఆలోచన చేసుకోవచ్చు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పదికిపైగా మున్సిపాలిటీలున్నాయి. మిగిలిన చాలాజిల్లాల్లో 2, 3 లేదా 4 మాత్రమే ఉన్నాయి. కాబట్టి కలెక్టర్లు చాలా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు.

ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉద్యోగుల బదిలీ
హెచ్‌ఎండీఏలో పుట్టిన ఉద్యోగి అక్కడే రిటైర్ అయితాడు. అతడిని ఏం చేస్తాం! జీహెచ్‌ఎంసీలో అధికారి సుల్తాన్‌బజార్ టు బేగంబజార్, బేగంబజార్ టు సిద్ధిఅంబర్‌బజార్! ఇండ్లనే ఉంటరు. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే బిల్లులో మున్సిపల్ సర్వీసెస్ కామన్ అని పెట్టినం. ఏ ఉద్యోగినైనా, ఏ అధికారినైనా ఎక్కడినుంచైనా ఎక్కడికైనా బదిలీచేయవచ్చు. ఆదిలాబాద్ ఆయన జీహెచ్‌ఎంసీకి, జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని కాగజ్‌నగర్‌కు బదిలీచేసే వెసులుబాటు, నియంత్రణ ప్రభుత్వానికి, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఉంటుంది. లేకపోతే నియంత్రణ జరుగదు. ఈ మోనోపలీ బ్రేక్‌కావాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, యూఎల్బీలు కావొచ్చు.. హుడా, కుడా, హెచ్‌ఎండీఏ వంటి లోకల్‌బాడీస్‌ను కూడా ఈ చట్టం ద్వారా ఏకీకృతంచేస్తున్నాం. కేవలం ప్రజలను వేధింపులనుంచి తప్పించడానికే ఇవన్నీ. ఈ పని మేం మాత్రమే చేస్తాం అన్నప్పుడు కరప్షన్, అహంకారం వస్తుంది. ఆ పద్ధతి పోవాలి. ప్రభుత్వంలో ప్రత్యామ్నాయం ఉండాలి.

ప్రజల మంచికోసం ఎంతదాకైనా వెళతాం
డిపార్ట్‌మెంట్లను చీల్చిచీల్చి మరీ యూనియన్స్ పెట్టించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సిబ్బందికి ప్రత్యేకంగా యూనియన్. వాళ్లు రెవెన్యూ విభాగంలో ఒక భాగమే. వాళ్లుకూడా వేరుగా యూనియన్ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి అంతే! ప్రభుత్వం పాలనా సౌలభ్యంకోసం విభాగాలను పెట్టుకుంటది. ఎవరిని ఎక్కడ పనిచేయాలంటే అక్కడ చేయాలి. కానీ, మేం ఈ విభాగం, మేం ఆ విభాగం.. మేం మాత్రమే ఈ పనిచేయగలం అనేది ఉన్నప్పుడు ఈ బాధ వస్తుంది. వీఆర్వోకు ఉన్న పవర్ ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, రెవెన్యూ సెక్రటరీకి, సీసీఎల్‌ఏకు లేదు. వీఆర్వో తలచుకుంటే నీ భూమి నాకు, నా భూమి మహమూద్‌అలీకి, ఆయన భూమి నాగేందర్‌కు రాసిస్తారు. భూమి మూడెకరాలుంటే ఏడెకరాలు.. ఏడెకరాలుంటే ఎకరం చేస్తారు. ఈ బాధలు నిత్యకృత్యం అయ్యాయి. రెవెన్యూ చట్టాలను మేం చెప్పినట్టు రాయాలని కొందరు మాట్లాడుతుంటరు. వాళ్లు చెప్పినట్టు రాయాలంటే ఇంక శాసనసభ ఎందుకు? శాసనసభ్యులు ఎందుకు? కుక్క తోకను ఊపుతదా? తోక కుక్కను ఊపుతదా? ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఉపేక్షించేదిలేదు. మొహమాటాల్లేవు. ప్రజలకు మంచి చేసేందుకు ఈ ప్రభుత్వం ఎంతకాడికైనా వెళ్లేందుకు సిద్ధమే. పూర్తిస్థాయిలో ప్రజలను వేధింపులనుంచి దూరం చేయడానికి, దోపిడీ నుంచి కాపాడేందుకు ఈ మోనోపలీ పోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.

ఆక్సిజన్ క్లబ్బులు.. సిగ్గుచేటు
ఆక్సిజన్ కొనుక్కుంటామా? హైదరాబాద్‌లో ఆక్సిజన్ క్లబ్బులు వస్తున్నాయంటే సిగ్గుచేటు. నా చిన్నతనంలో బంజారాహిల్స్‌లో ఫ్యాన్‌తో పనిలేకుండే. అంత చల్లగా ఉండేది. ఎవరైనా ఊరునుంచివస్తే తెల్లగ అయ్యేటోడు. వీనికి గండిపేట నీళ్లు పడ్డయిరా అని ఊళ్లళ్ల అనేటోళ్లు. ఇప్పుడు హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ అయిపోయి.. ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం నేల విడిచి సాముచేస్తే సరికాదు. అడవులు నష్టపోకుండా చూసుకోవాలి. నేను ముఖ్యమంత్రి అయిన మొదటివారంలో రివ్యూ పెట్టుకున్న సబ్జెక్ట్ హరితహారం. ఆ సబ్జెక్ట్ ప్రాధాన్యం నాకు తెలుసుకాబట్టి రాష్ట్రంలో పచ్చదనం పెరగాలని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. రాష్ట్రంలో నాలుగువేల నర్సరీలు ఏర్పాటుచేశాం. కోట్ల మొక్కలు పెంచుతున్నాం. వాటిని గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు, వార్డులకు తీసుకెళ్లి వాళ్ల గడ్డాలు పట్టుకున్నా మొక్కలు పెడతలేరు. నిర్లక్ష్యం వహిస్తున్నారు. మనదగ్గర చెట్టు పెరగాలంటే అమెరికావాడో పొరుగుదేశంవాడో వచ్చి పెంచడు కదా? మనకు మనమే మేల్కోవాలి. భయంకరమైన వేడి తగ్గాలన్నా, భవిష్యత్తుతరాలకు పరిశుభ్రమైన వాతావరణ ఇవ్వాలన్నా మొక్కలు పెంచడం ఒక్కటే మార్గం.

85% చెట్లు పెరగకపోతే ఉద్యోగాలు పోతాయి
పట్టణాల్లో, గ్రామాల్లో పచ్చదనం ఎట్లా పెరగదో చూస్తాం. ఇప్పటివరకు బతిమిలాడినం. ఇకమీదట బతిలాడేది లేదు. ఇప్పుడు రెగ్యులేట్ చేస్తాం. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలని, పంచాయతీరాజ్ చట్టంలో చాలా బలమైన రెగ్యులేషన్స్ పెట్టినం. పంచాయతీ కార్యదర్శులకు కన్సాలిడేటెడ్ పే రూ.15వేలు పెట్టాం. మూడేండ్లు క్రమంతప్పకుండా విధి నిర్వర్తిస్తే, ఆయన గ్రామంలో 85% చెట్లు బతికితే అప్పడు పర్మినెంట్ చేస్తాం. లేదంటే ఇంటికి పోతాడు. అధికారితోపాటు సర్పంచ్‌కు కూడా బాధ్యత పెట్టినంం. పారిశుద్ధ్యం, పచ్చదనం కాపాడే బాధ్యతతోనే మీరు ఎన్నికయ్యారు అంటూ పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పెట్టినం. 85% చెట్లు పెరుగపోతే సర్పంచ్ పదవికూడా పోతుంది. ఎవరేమనుకున్నా బాధలేదు. చట్టాలను కఠినంగా పెట్టాం. ఇక చెట్లు ఎందుకు పెరుగవో చూస్తాం. ఉద్యోగం పోతది, పదవి పోతదన్న భయం ఉంటది కాబట్టి ఇద్దరూ కలిసి పనిచేస్తరు. గ్యారంటీగా చెట్లు పెరుగుతయి.

అనుకున్న ఫలితాలు కూడా వస్తాయి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక గ్రీన్‌కమిటీ ఏర్పాటుచేస్తున్నాం. జిల్లా డీఎఫ్‌వో, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్.. వీళ్లు కమిటీలో ఉంటారు. ఉదాహరణకు బాన్సువాడ 22 వార్డులో రెండు వేల మొక్కలు పెరుగాలి అనుకుందాం. అందులో 85% మొక్కలు పెరుగాల్సిన బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది. ఆ మున్సిపాలిటీలో పనిచేసే ఒక అధికారిని ఒకటి లేదా రెండు వార్డులకు ఇంచార్జిగా మున్సిపల్ కమిషనర్ నియమిస్తారు. పెట్టిన మొక్కల్లో 85% మొక్కలను బతికించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది, ఇంచార్జి అధికారిది. ఒకవేళ 85% మొక్కలు బతుకకపోతే కౌన్సిలర్ పదవి, ఇంచార్జి అధికారి ఉద్యోగం పోతాయి. సస్పెన్షన్ కాదు.. సర్వీస్‌లోంచి తొలిగిస్తాం. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు.. ఎవరైనా కావొచ్చు.. ఎవరూ వీటికి అతీతంకాదు. చైర్మన్‌కూడా ఒకవార్డు కౌన్సిలరే కాబట్టి ఆయన వార్డులో 85% మొక్కలు పెరగకపోతే ఆయన పదవి కూడా పోతుంది.

మూడేండ్లలో అద్భుతం చూడాలి
తెలంగాణలో 75 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులున్నారు. మరి తెలంగాణలో అటవీసంపద ఎందుకు తరిగిపోతున్నది? హైదరాబాద్‌నుంచి నర్సాపూర్ పోతుంటే.. గతంలో భయపడేంత అడవి ఉండే.. సినిమా షూటింగ్‌లు జరుగుతుండేవి.. ఆ అడవి అంతా ఇప్పుడు ఎక్కడికి పోయింది? వికారాబాద్‌కా హవా.. మరీజోంకా దవా.. అని దేశం మొత్తం ప్రసిద్ధి. ఇప్పుడు ఆ అనంతగిరి కొండలు, అడవులు మనమంతా చూస్తుండగానే అదృశ్యమైనాయి. అందుకే తిరిగి అడవులు పునరుజ్జీవం పొందేలా, గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడేలా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది. మూడేండ్లలో తెలంగాణలో అద్భుతం జరగబోతున్నది. నేనైనేతే ఆశపడుతున్నా. అందుకే కఠినతరమైన నిబంధనలు తెచ్చినం. నా పట్టణంకోసం, నా బస్తీకోసం, నా ప్రజలకోసం నేను పనిచేయాలి అన్న స్ఫూర్తిరాకపోతే ఈ దేశం బాగుపడదు. నేను కూడా ఎన్నో ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. నాకుకూడా ఒక మున్సిపాలిటీ ఉన్నది. పర్వాలేదు అక్కడ కొంతచేసిన. ఒక్కరోజే సిద్దిపేటలో పదివేల మొక్కలు నాటినం. నా తర్వాత హరీశ్ ఎమ్మెల్యే అయితే ఆయన కూడా చేసినాడు. ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉంటుంది. కానీ ఆశించిన స్థాయిలో ఉండదు.

ట్యాబ్లెట్లతో కాదు సర్జరీ అవసరం
అక్రమాలు అరికట్టడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో కాదు. కొంత సర్జరీ అవసరం. అందుకే చట్టం కొంత కఠినంగా పెడుతున్నాం. కాఠిన్యం ఉంటే తప్ప పనులు జరుగవు. సీఎంగా పూర్తి అవగాహనతో, స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని స్పష్టమైన గమ్యాన్ని ఆశించి ఈ చట్టాన్ని పెడుతున్నాం. అలవోకగా, ఏదో అధికారులు రాస్తే దాన్ని పైపైన చెప్పడం లేదు. ఈ చట్టంలో ప్రతి వాక్యాన్ని నేనే రాయించాను. కచ్చితంగా ఎవరి డ్యూటీ వారు చేయాల్సిందే. లేదంటే వారిని తొలిగిస్తాం. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.

బహుముఖంగా పనిచేస్తేనే ఫలితం
ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. ఒక్క కేసీఆర్‌వల్లో, మంత్రో, ఎమ్మెల్యేనో చేస్తేకాదు. ఏ వార్డు కౌన్సిలర్ ఆ వార్డులో, ఏ గ్రామ సర్పంచ్ ఆ గ్రామంలో, ఏ గ్రామ కార్యదర్శి ఆ గ్రామంలో పనిచేయాలి. బహుముఖంగా పనిచేయాలి. ఒక వ్యక్తి పనిచేస్తే కాదు. అదేవిధంగా ప్రతి వార్డులో.. మహిళల కమిటీ, ఆ వార్డులోని వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, కవులు, రచయితలతో కలిపి ఒక కమిటీ, యూత్ కమిటీ, ఎమినెంట్ పర్సన్స్‌తో కమిటీ మొత్తం నాలుగు కమిటీలను 60 మంది సభ్యులతో ఏర్పాటుచేస్తాం. చట్టప్రకారం ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రజాదర్బార్ జరుగుతుంది. దానికి కమిషనర్, చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ విధిగా హాజరుకావాలి. వార్డులో సమస్యలపై చర్చించాలి.

1920ల నాటి చట్టమే ఇంకానా?
లేఅవుట్ అప్రూవల్స్ మున్సిపాలిటీలు ఇవ్వవు.. జిల్లా కలెక్టర్ ఇస్తారు. 1920లో చేసిన టౌన్‌ప్లానింగ్ చట్టం ఇంకా అమల్లో ఉన్నది. మధ్యలో ఏం మార్చలేదు. అందుకే మెరుగుపరుస్తున్నాం. ల్యాండ్ మాఫియాలు, అక్రమ లేఅవుట్లు పోవాలి.. ఈ ఉద్దేశంతోనే కలెక్టర్లకు ఈ అధికారం ఇస్తున్నాం. లేఅవుట్ అని పెడతారు.. దాంట్లో పార్క్, రోడ్డు, కమ్యూనిటీ ప్లేస్ ఉంటది.. కానీ రియల్‌ఎస్టేట్‌వాళ్లు ఆ ప్లేస్ మొత్తం అమ్మేస్తారు. ఈ చట్టం చేసేటప్పుడు మా బంధువు ఒకాయన వచ్చారు. ఆయన ఒక విషయం చెప్పారు.. 500 గజాలున్నవారికి సెల్లార్ పర్మిషన్ ఇవ్వరు.. మున్సిపల్ అధికారి వచ్చి ఏం ఫర్వాలేదు కట్టుకోండి.. బీఆర్‌ఎస్‌లో తీసేద్దాం అని చెప్తాడట. అంటే అడ్డుకోవాల్సిన అధికారే కట్టుకోమని చెప్తాడు. మరి ఎట్లా కంట్రోల్ కావాలి? ఇంకొందరు బుద్ధిమంతులు సెల్లార్ కట్టి దాంట్లో మట్టి నింపేస్తున్నారు. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత దాంట్లో మట్టితీసేసి షట్టర్లు పెడుతున్నరు. వీటిని ఎట్లా ఆపాలి? కొన్ని అనుభవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక ఎంపీ ఒక పని నిమిత్తం హెచ్‌ఎండీఏకి వెళ్లిండ్రు. ఎన్నిసార్లు తిరిగినా పనికావటం లేదట. కమిషనర్‌ను అడిగితే పని తొందరగా అయితదని కమిషనర్‌కు ఫోన్‌చేసి చెప్పారట. కమిషనర్ చెప్పిండు కదా అని కింది అధికారి దగ్గరికి పోతే.. బహుత్ కమిషనర్ ఆతేజాతే.. హమ్ పర్మినెంట్ హై ఇదర్ అన్నాడంట ఆ అధికారి! కొంతకాలానికి పనైందట.. ఆ పనికి సంబంధించిన కాగితం పోస్ట్ చేయడానికి అటెండర్ డబ్బు అడిగారట.. దానికి ఎంపీ నీకు ఏ అధికారం లేదు.. నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? అని అడిగితే.. ఆ అటెండర్ సారు, ఏ కాయితం ఏ డబ్బాలో వేయాలో దాంట్లోనే వేయాలి.. అప్పుడు చేరేకాడికి చేరతది అన్నాడట. అంటే ఒక అటెండర్‌కు డబ్బులు అడిగేంత ధైర్యం ఎట్లా వచ్చింది? అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఒక రకమైన మొనాటమీ వచ్చేసింది.

రాష్ట్రంలో 50% పట్టణ జనాభా
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. 50% అర్బనైజేషన్ ఉంటుంది. మంచి ప్రగతిశీల అడుగు ఇది. అర్బన్ పాలసీ, వ్యవహారాలు, సమస్యలపై రాష్ట్రం సమగ్రదృక్పథం కలిగి ఉండాలి. మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు స్పష్టత ఉండాలి. విధిగా శిక్షణపొందాలి. రాష్ట్రంలో అర్బన్‌సెంటర్ లేదు. సెంటర్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్స్‌ను 20-25 ఎకరాల్లో ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఎన్నుకోబడిన అర్బన్ ప్రజాప్రతినిధులు మేయర్లు, చైర్మన్లు, చైర్‌పర్సన్లు విధిగా శిక్షణ పొందాలి. చట్టం ఆమోదం పొందినంకనే ఎన్నికలు జరుగాలని నిర్ణయం తీసుకున్నాను. మున్సిపాలిటీల్లో వివిధస్థానాలకు పోటీపడటానికి సిద్ధమవుతున్నవారు చట్టాన్ని విధిగా చదువుకోవాలి. కొత్తగా ఎన్నికయ్యేవాళ్లకు ఈ చట్టం పరిధిలోనే ఎన్నుకోబడుతున్నామనే సోయి ఉండాలి. వారికి ఇష్టముంటేనే పోటీచేయాలి. బలవంతపెట్టేదిలేదు. తర్వాత బాధపడితే లాభంలేదు. పోటీదారులందరికీ విజ్ఞప్తిచేస్తున్నా. జవాబుదారీతనం రావాలి. ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి.

కచ్చితంగా శ్మశానవాటికల ఏర్పాటు
నిరుపేదలు చనిపోతే ఎక్కడ దహనసంస్కారాలు చేయాలో తెలియదు. భూమిలేనివారు చాలామంది ఉన్నారు. ఈ సమస్య రాకుండా గ్రామాల్లో, పట్టణాల్లో వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, ఖననవాటికలు కచ్చితంగా ఉండాలి. ప్రజల అవసరాల దృష్ట్యా వాటిని ఏర్పాటుచేసే అధికారాన్ని ఈ చట్టం ద్వారా పాలకవర్గాలకు అందిస్తున్నాం. గ్రామాల్లో శ్మశానవాటిక ఏర్పాటుకు స్థలం లేకుంటే కొనుగోలుచేసే అధికారాన్ని చట్టంద్వారా కల్పిస్తున్నాం. గ్రామపంచాయతీ నిధులనుంచే కొనుగోలు చేయవచ్చు. ఇదే అధికారాన్ని మున్సిపాలిటీలకు కల్పిస్తాం. జనాభా అవసరాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.

టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలి
హైదరాబాద్ జనాభా కోటి దాటింది. హైదరాబాద్‌కు వచ్చిపోయే విమానాల సంఖ్యనే 500 దాటిపోయింది. ఇటువంటి హైదరాబాద్‌లో ప్రజల అవసరాలకు వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు ఎన్ని ఉండాలి? లక్ష జనాభాకు ఒక్కటి పెట్టుకున్నా కనీసం వంద ఉండాలి. కానీ అధికారికంగా ఐదారుకంటే ఎక్కువలేవు. హైదరాబాద్‌కు వివిధ ప్రాంతాలనుంచి కొనుగోళ్లకోసం పెద్దసంఖ్యలో మహిళలు వస్తుంటారు. పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఉన్నాయా? టాయిలెట్లు లేకుంటే మహిళలకు ఎంత కష్టం! పురుషులు సందులోకో, ఎక్కడికో పోతరు. మహిళల పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయంకరం. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఆ పట్టణంలో జనాభాకు తగ్గట్టుగా ఎన్ని టాయిలెట్లు ఉండాలనేది కమిటీ నిర్ణయిస్తది. వీటిని టాప్ ప్రయార్టీగా తీసుకొని నిర్మించాలి. వీటి నిర్వహణ కూడా చేపట్టాలి. స్లాటర్‌హౌస్‌లు శుభ్రంగా ఉండవు. తోలు పరిశ్రమతో నీరు కలుషితమై గతంలో ఓసారి హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఏడుగురు చనిపోయారు. వీటిపై నియంత్రణలేదు. అడిగేవాడులేడు. పౌరసదుపాయాలకోసమే వీటిని చట్టంలో పెట్టాం. వేరే ఉద్దేశంకూడా లేదు. మున్సిపల్ మంత్రి ఇక్కడి నుంచి పర్యవేక్షణ చేయలేరు. కలెక్టర్‌కు మూడు నాలుగు మున్సిపాలిటీలే ఉంటాయి. కనుక బాగా పర్యవేక్షించగలుగుతారు.

చట్టంలో మున్సిపల్ బడ్జెట్ మేకింగ్
ప్రభుత్వానికి ప్రజలనుంచి పన్నుల రూపంలో డబ్బు వస్తుంది. రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు, స్థానికసంస్థలు ఏవైనా వీటిని ప్రజల అవసరాలకు ఖర్చుపెట్టాలి. ఈ నిధులపై నియంత్రణ, పద్ధతి లేదు. ఎంపీలకు రూ.5 కోట్లు, ఎమ్మెల్యేలకు రూ.3 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులున్నాయి. జెడ్పీటీసీ సభ్యులకు నిధులున్నాయి. మున్సిపాలిటీలో దేనికి ఎంత ఖర్చుపెట్టాలో లెక్కపత్రం లేదు. మున్సిపల్ బడ్జెట్ మేకింగ్‌ను చట్టంలో పెట్టాం. కచ్చితంగా 10% నిధులు గ్రీన్‌కవర్‌కు కేటాయించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన నిబంధన ఉన్నదో మున్సిపాలిటీలకు కూడా చార్జ్‌డ్ అకౌంట్ ఉంటుంది. దీంతో ఆటోమేటిక్‌గా నిధులు వెళుతాయి. చార్జ్‌డ్ అకౌంట్ ఉండగా వాటిని నిర్లక్ష్యం చేసి, ఇష్టారీతిన ఖర్చు పెడుతున్నారు. గ్రామపంచాయతీలు, కొన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వశాఖలు కరంటు బిల్లులు కట్టవు. నియంత్రణ తెస్తున్నాం. కరంటు, వాటర్ బిల్లులు ఏనెలకానెల కచ్చితంగా కట్టాల్సిందే. కట్టకపోతే కమిషనర్ ఉద్యోగం గోవిందా. మున్సిపాలిటీకి ఉన్న అప్పులు కట్టిన తర్వాతే నిధులను ఇతరవాటికి ఖర్చుచేసుకోవాలి. చార్జ్‌డ్ మనీ మున్సిపల్ బడ్జెట్‌ను నిర్ణయిస్తుంది. మున్సిపాలిటీ బడ్జెట్ రూపకల్పనలో కలెక్టర్ పాత్ర ఉంటుంది. కలెక్టర్లు పెత్తనం చేయరు. గైడ్ చేస్తరు. కలెక్టర్ జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంటారు. రాష్ట్రస్థాయిలో అన్ని మున్సిపాలిటీల పర్యవేక్షణ కష్టం.

ఒడిదుడుకులకు తలొగ్గని బలమైన ప్రజాస్వామ్యం మనది
మనది ఎంతో గొప్పగా పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యం. మనదేశంలో కొన్ని లక్షలమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రతి 250 ఓట్లకు ఒక వార్డు మెంబర్ ఉంటారు. 3100 పైచిలుకు మున్సిపల్ కౌన్సిళ్లు ఉన్నాయి. ఎంతో విస్తృతమైన, బలమైన పునాదులు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. అందుకే మన ప్రజాస్వామ్యంలో ఒడిదుడుకులు తక్కువ. ఎంతో పటిష్ఠంగా ఉంటది.

ఎమ్మెల్యే శిక్షణ తరగతుల్లో పంచవర్ష ప్రణాళికల అంశం చేర్చాలి
పంచవర్ష ప్రణాళికలు ఎట్లా అమలుచేశారు? దేశ ఆర్థికప్రగతిలో ఎట్లా మార్పులు వచ్చాయో ప్రతి ప్రజాప్రతినిధి తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల్లోనూ ఈ అంశాన్ని తప్పక చేర్చాలి. కనీసం పంచవర్ష ప్రణాళికల సారాంశాన్నైనా చేర్చాలని కోరుతున్నాను.

పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తి పునరుత్తేజానికే కొత్త చట్టం
జాతిపిత మహాత్మాగాంధీ స్థానిక స్వపరిపాలన గురించి ఎంతగా తపనపడ్డారో అందరికీ తెలుసు. ఢిల్లీనుంచే మొత్తం పాలన చేయలేమని, ఎక్కడికక్కడ సంభావ్యత అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతోనే దేశంలో రాష్ర్టాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ప్రభుత్వ విభాగాలన్నీ ఉద్యమాలు (మూమెంట్స్). డిపార్ట్‌మెంట్లు కావు. మన అదృష్టం కొద్దీ అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న ఎస్కే డే హైదరాబాద్‌లోనే ఎన్‌ఐఆర్డీని స్థాపించి దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రమోట్‌చేశారు. ఐసన్‌హొవర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకసారి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక విందు కార్యక్రమంలో ఎస్కే డేను అమెరికా అధ్యక్షుడు నెహ్రూకు పరిచయం చేస్తూ, ఈయన మీ భారతీయుడు. అమెరికాలో రూరల్ డెవలప్‌మెంట్‌కు ఇన్‌చార్జిగా ఉన్నారు అని చెప్పారు. దీనికి ఎంతో సంతోషపడిన నెహ్రూ.. మీలాంటి మేధావి స్వదేశానికి వచ్చి సేవలందించాలని ఆహ్వానిస్తారు. తొలుత నిరాకరించినా, నెహ్రూ రెండో పంచవర్ష ప్రణాళికలో ఎన్నో బహుళార్థ ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు తీసువస్తున్న సంస్కరణలు చూసి భారత్‌కు వచ్చి పనిచేసేందుకు ఎస్కే డే అంగీకరిస్తారు.

అప్పుడు ఎస్కే డేను రాజ్యసభ సభ్యుడిగా చేసి.. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనే పోర్టుఫోలియో సృష్టించి, ఆ శాఖకు ఆయనను మంత్రినిచేశారు. వాస్తవానికి ఇప్పుడు మనం చెప్పుకొంటున్న పంచాయతీరాజ్‌శాఖ అసలు పేరు అది. అలా కేంద్రమంత్రి అయిన ఎస్కే డే.. మన అదృష్టం కొద్దీ రాజేంద్రనగర్‌లోనే ఎన్‌ఐఆర్డీని స్థాపించి, ఇక్కడినుంచే దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఉద్యమాన్ని విస్తరించారు. నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఏడురోజుల కోర్సులో చేరి, గ్రామీణ భారతంపై ఎంతో తెలుసుకున్నా. ఎన్‌ఐఆర్డీలో ప్రపంచవ్యాప్తంగా గ్రామీణభారతంపై ఎన్నో గొప్పగొప్ప పుస్తకాలతో గొప్ప విజ్ఞాన భాండాగారం ఉన్నది. నేను దుబ్బాకలో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు అప్పటి సమితి ప్రెసిడెంట్‌గా సోలిపేట రామచంద్రారెడ్డి ఉండేవారు. ఆయన మమ్మల్ని గ్రామాల్లోకి తీసుకెళ్లి పారిశుధ్యంపై పాటలు పాడించేవారు. ఆనాటి పంచాయతీరాజ్ ఉద్యమ తీరుతెన్నులు, అధికారుల పనితీరు, వారిని సమాజం గౌరవించిన తీరు గొప్పగా ఉండేది. అన్నీ చూశాను. అలాంటి స్ఫూర్తి మన మున్సిపాలిటీల్లోనూ ఉండేది. కానీ, కాలక్రమంగా రాజకీయ జబ్బులు విస్తరించి, ఈ ఉద్యమాలను డిపార్ట్‌మెంటలైజ్ చేసి, కంపార్ట్‌మెంటలైజ్ చేసి, వాటిని ఊపిరాడనీయకుండా చేసి చంపేశాం. ఆ స్ఫూర్తి చచ్చిపోయింది. ఆ స్ఫూర్తి మళ్లీ పునరుత్తేజం పొందాలి. అందుకే ఈ చట్టం.

పోడు సమస్యలు స్వయంగా పరిష్కరిస్తా
గిరిజనుల పోడు భూముల సమస్యలు తేల్చేయాలి. నేనే స్వయంగా జిల్లాలకు వెళతా. నాతోపాటు మంత్రివర్గాన్ని, చీఫ్ సెక్రటరీ, అటవీశాఖ ఉన్నతాధికారులను, రెవెన్యూ అధికారులను మొత్తం అధికార గణాన్ని తీసుకెళ్లి ప్రజాదర్బార్లు పెట్టి పోడుభూముల సమస్య తీర్చుతాం. ఇది పోడుభూమి, ఇది మీ పట్టా అని ఫైనల్ చేస్తాం. ఆ తర్వాత ఒక ఇంచుకూడా అటవీభూమి ఆక్రమణ కానివ్వబోం. పొరుగురాష్ర్టాల నుంచి వచ్చే గొత్తికోయలు అడవిని నరికేస్తున్నారు. దీనివల్ల మన గిరిజనులు నష్టపోయే పరిస్థితి. దాన్ని కఠినంగా నియంత్రించాలంటే ఎక్కడో ఒకచోట ఈ సమస్యకు భరతవాక్యం పలుకాలి. దానికి కేంద్ర చట్టాల నిబంధనల ప్రకారం హక్కులు ఇస్తాం. ప్రజలందరి మాదిరిగానే పేద గిరిజనులకు కూడా రైతుబంధు అందాలి. వాళ్లుకూడా మన బిడ్డలే. వాళ్లుకూడా మంచిగ బతుకాలి. అందుకే నేనే స్వయంగా వెళ్లి ఎక్కడో జెడ్పీ సమావేశమందిరంలో గోప్యంగా కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందర్నీ కూర్చోబెట్టి విస్తృతస్థాయిలో ప్రజాదర్బార్ పెడుతాం. ప్రజల సమక్షంలోనే సమస్యను పరిష్కరిస్తాం.

ఆగస్టు 15 నుంచి రియల్ టైం అడ్మినిస్ట్రేషన్
మిత్రుడు అక్బరుద్దీన్ ఒవైసీతో మాట్లాడిన సందర్భంలో చెప్పాను. మొత్తం ఆరునెలలనుంచి ఎలక్షన్ కోడ్ ఉన్నదన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలప్పుడు కోడ్ తప్పదు కదా! లక్కీగా ఈ ఆగస్టు 10 వతేదీ వరకు ఎన్నికల కోడ్‌లన్నీ ముగుస్తాయి. ఆగస్టు 15 నుంచి రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ ఏంటో చూపిస్తాం. అద్భుతమైన పరిపాలనా సంస్కరణలు తెస్తాం. జిల్లాల్లో పరిపాలన ఎట్లా ఉండాలి.. సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఉండాలి.. ఏయే కార్యక్రమాలు ఎవరు చూడాలి.. ఉన్న ఐఏఎస్ అధికారులను ఎట్లా వాడుకోవాలన్న అన్ని అంశాలపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తున్నది. భారతదేశమే మన దగ్గర నేర్చుకునేలా అద్భుతమైన పరిపాలనా సంస్కరణలు తెస్తాం.

నిర్ణీత సమయం దాటితే అనుమతులు ఇచ్చినట్టే
పదిహేనురోజుల్లో అనుమతులివ్వాలని నిబంధనల్లో ఉంటే అప్పటిలోగా ఇవ్వకుంటే అనుమతి ఇచ్చినట్లు భావించాలి. లేఅవుట్‌లో కామన్ ఫెసిలిటీ కింద ఏవైతే రోడ్లు, పార్కుస్థలాలు చూపెట్టారో వాటన్నింటినీ తుది లేఅవుట్ అనుమతులు రాకముందే రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పటివరకు వాటిని అమ్మడానికిలేదు. వాటన్నింటికీ ఓనర్ మున్సిపాలిటీయే. హైదరాబాద్, వరంగల్‌లాంటి నగరాల్లో ఒత్తిడి పెరుగుతున్నది. దానినుంచి వెసులుబాటు కావాలంటే శాటిలైట్ టౌన్‌షిప్‌లు రావాల్సిన అవసరం ఉన్నది. వాటికి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం. త్వరలోనే ప్రకటిస్తాం. గేటెడ్ కమ్యూనిటీలాంటివి కడితే నగరాలపై ఒత్తిడి తగ్గుతుంది. వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇక్కడి శాసనసభ్యుల వినతిమేరకు కొత్తగా ఈ చట్టంద్వారా వాటిని ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు మూడు క్యాటగిరీల అర్బన్‌బాడీలు ఉంటాయి. మొత్తం 128 మున్సిపాలిటీలు ఉంటాయి. కొత్తగా నిజాంపేట, మీర్‌పేట, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్.. ఈ ఏడింటిని కార్పొరేషన్లుగా ఏర్పాటుచేస్తున్నాం. అవినీతి లేకుండా అనుమతులు పారదర్శకంగా రావాలని భావిస్తున్నాం.

మిషన్ భగీరథ సూపర్‌హిట్ ప్రోగ్రాం
గత టర్మ్‌లో సంక్షేమం, కరంటు బాధల నివారణ, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, మంచినీటి సరఫరాపై ఎక్కువ దృష్టిపెట్టాం. ఆ సమస్యలన్నీ భగవంతుడి దయ, శాసనసభ్యులు, ప్రజల సహకారంతో పోయాయి. రాష్ట్రంలో 55 లక్షల ఇండ్లకు నల్లాద్వారా నీటి సరఫరా జరుగుతున్నది. గర్వంగా చెప్తున్నా.. 99.9% వరకు సమస్య పరిష్కారం అయింది. ఇంకా అతి తక్కువసంఖ్యలో 3,800 ట్యాంకులు తుది దశలో ఉన్నాయి. అవికూడా పూర్తయితే అద్భుతం జరగబోతాఉన్నది. మిషన్ భగీరథ సూపర్‌హిట్ ప్రోగ్రాం. ప్రజలకు తాగునీటి కష్టాలు, కరంటు బాధలు, సంక్షేమంలో కష్టాలు పోయినయి.. భద్రతతో కూడిన బతుకు ఉన్నది. చాలారంగాల్లో మార్పు వచ్చింది.

చట్టం రూపకల్పనలో ప్రతి అంశంలో నేనున్నా
ఈ చట్టం రూపకల్పనలో ప్రతి అంశంలో నేను ఉన్నా. నెలల తరబడి చేశాం. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్, కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, ప్రధాన సలహాదారులు ఉన్నారు. రాజ్యాంగస్ఫూర్తి దెబ్బతినకుండా చేశాం. ఇప్పుడు అతాపతా లేకుండా ఉన్నది. ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్‌తో కొత్త డోర్‌నంబర్లు ఇస్తాం. ఎలక్ట్రానిక్ విధానంలో మానిటరింగ్ ఉంటుంది. అపరిచితులను పట్టుకోవడానికి, నేర పరిశోధనలకు పెడుతాం. మున్సిపాలిటీలు బర్త్, డెత్, ల్యాండ్‌యూజ్ సర్టిఫికెట్లు జారీచేయటానికి నిర్ణీత కాలవ్యవధి పెట్టాం. ఇవ్వకపోతే.. సస్పెండ్ చేయడంకాదు.. ఉద్యోగంనుంచి తొలిగిస్తాం. ఈ చట్టాన్ని మున్సిపల్ ఉద్యోగులందరూ చదవాలి. ఈ చట్టం మేరకే ప్రవర్తించాలని వారికి తెలియాలి. ప్రజలకు మేలు జరుగాలనే సదుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు. ఎవరి డ్యూటీ వారు నిర్వహించాలి. ఎవరి బాధ్యత వారు స్వీకరించాలి. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా భవననిర్మాణ అనుమతులుకానీ, ఇతర సర్టిఫికెట్లు పొందడానికికానీ.. అన్నీ జరుగడం కోసమే కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం.

కొత్త చట్టంలో ముఖ్యాంశాలు
-తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత -అవినీతిరహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం -ప్రజలకు మేలుచేసేలా చట్టం రూపకల్పన -75 గజాలలోపు నిర్మించుకున్న ఇంటికి రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయి.. ఆస్తిపన్ను రూ.100 -500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతి -యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి -తప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే ఆస్తిపన్నుకు 25 రెట్ల జరిమానా -అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత -పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ.. కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ -హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేస్తే ఉద్యోగాల నుంచి తొలగింపు -మొక్కలు నాటి సంరక్షించని వార్డు సభ్యుడు, చైర్‌పర్సన్లు కూడా ఇంటికే -అధికారులు, ఉద్యోగులను ఎక్కడినుంచి ఎక్కడికైనా బదిలీచేసే అధికారం -కొత్త చట్టంలో మరింత కీలకంగా జిల్లా కలెక్టర్ల పాత్ర

ప్రభుత్వం పాలనా సౌలభ్యంకోసం విభాగాలను పెట్టుకుంటది. ఎవరిని ఎక్కడ పనిచేయాలంటే అక్కడ చేయాలి. మేం ఈ విభాగం, మేం ఆ విభాగం.. మేం మాత్రమే ఈ పనిచేయగలం అనేది ఉన్నప్పుడు ఈ బాధ వస్తుంది. వీఆర్వోకు ఉన్న పవర్ ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, రెవెన్యూ సెక్రటరీకి, సీసీఎల్‌ఏకు లేదు. వీఆర్వో తలచుకుంటే నీ భూమి నాకు, నా భూమి మహమూద్‌అలీకి, ఆయన భూమి నాగేందర్‌కు రాసిస్తారు. ఈ బాధలు నిత్యకృత్యం అయ్యాయి. – సీఎం కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.