-హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతాం
-త్వరలో ఎలక్టికల్ బస్సులు నడుపుతాం.. తొలిదశలో 500 బస్సులు
-అక్టోబర్‌కు పూర్తిస్థాయిలో మెట్రో పరుగులు
-మూణ్నాలుగు నెలల్లో 56 రిజర్వాయర్లు పూర్తి
-ప్రతి వ్యక్తికీ 150 లీటర్ల నీటిని ఇస్తాం
-థాయ్‌లాండ్ క్లాగ్ తరహాలో ఎస్టీపీల నిర్మాణం
-100 ఫ్లాట్ల అపార్ట్మెంట్లలో ఎస్టీపీ తప్పనిసరి
-మన నగరం కార్యక్రమంలో మంత్రి శ్రీ కేటీఆర్
ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే విశ్వనగరాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ కే తారకరామారావు స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను పూర్తిగా కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం నగర నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం నిజాంపేటలో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి జీహెచ్ఎంసీ, ప్రభుత్వం ఏం కోరుకుంటున్నది? సామాజిక స్పృహ, ప్రజాస్వామ్యయుత భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాం. మంచి సంప్రదాయాలను అలవర్చుకోవాలి. విశ్వనగరం అంటే వీధి కుక్కలు కూడా ఉండొద్దు. అందుకే జీహెచ్ఎంసీ దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండువేల కుటుంబాలు ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం.
ఇంట్లోనే సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని కూరగాయలను పండించే స్థితికి ప్రతి కుటుంబం రావాలి అని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ ద్వారా రూ.2 వేల కోట్లతో సురక్షిత మంచినీటిని సంతృప్తికరస్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నామని, మరో మూడు, నాలుగు నెలల్లోనే 56 రిజర్వాయర్లను పూర్తిచేసి ప్రతి మనిషికి 150 లీటర్ల వంతున మంచినీటిని అందిస్తామని చెప్పారు. మంచినీళ్ల విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. తొలుత సర్వీసు లేని ఏరియాలు, ఆ తర్వాత తక్కువ సర్వీస్ ఉన్న ప్రాంతాలు.. ఆ తర్వాత పాతకాలం పైపులైన్ల మార్పిడికి పూనుకొంటున్నాం. హైదరాబాద్‌కు 54 ప్రధాన నాలాలు ఉండటం భౌగోళిక అనుకూలత. వాటిలో 94 శాతం మూసీలో కలుస్తున్నాయి. థాయ్‌లాండ్‌లోని క్లాగ్ వంటి విధానాన్ని అనుసరించాలని నిర్ణయించాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులను ఆగస్టులో చేపడుతున్నామని చెప్పారు.
పెరిగిన చెత్త రవాణా ఘనవ్యర్ధాల నిర్వహణలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచామని, సీఎం కేసీఆర్ సూచన మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో రోజుకు 3500 మెట్రిక్ టన్నులైతే ఇప్పుడది 4800 మెట్రిక్ టన్నులకు చేరిందని హర్షం వ్యక్తంచేశారు. 21 లక్షల కుటుంబాలకు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు బుట్టలు ఇచ్చామని, కొందరు ఇంకా వాటిని బియ్యం, పప్పులు పోసేందుకు వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తడి చెత్త నుంచి ఎరువును, పొడిచెత్తనుంచి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు.
ప్రజారవాణాకు ప్రాధాన్యం ప్రజారవాణాకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టు మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్ జూలైలో, మిగతా మార్గం అక్టోబర్‌కల్లా పూర్తవుతుందని ప్రకటించారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని, తొలిదశలో 500 ఎలక్ట్రికల్ బస్సులను నడిపిస్తామని తెలిపారు. నగరంలో 185 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలను కూడా నిర్మిస్తున్నామన్నారు.
కాలుష్య పరిశ్రమల తరలింపు ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీని నిర్మించి, జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాల్లోని కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ముచ్చర్ల ఫార్మాసిటీలోనూ ఎలాంటి కాలుష్యం వెదజల్లకుండా అంతర్జాతీయస్థాయి ట్రీట్మెంట్ ప్లాంట్ల ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నగరంలో తొలిదశగా 20 చెరువులు హెచ్ఎండీఏ, 20 చెరువులు జీహెచ్ఎంసీ సుందరీకరిస్తున్నాయని తెలిపారు.
రూ.3100 కోట్లతో శివార్లలో మురుగునీటి వ్యవస్థ రూ.3100 కోట్లతో శివారు మున్సిపాలిటీల్లో మురుగునీటి వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఏడాది తర్వాత సమీకృత మురుగునీటి వ్యవస్థను తీర్చిదిద్దే ప్రక్రియను ఆరంభిస్తున్నట్లు తెలిపారు. ఎస్సార్డీపీతో ప్రమేయం లేకుండా రూ.1100 కోట్లతో నగరంలో రోడ్ల మరమ్మతు పను లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
నిర్వహణలో కఠినంగా ఉంటాం 100 ఫ్లాట్లు కలిగిన అపార్టుమెంట్లల్లో ఎస్టీపీలు తప్పనిసరిగా ఏర్పాటుచేసి నిర్వహించాలని, లేకుంటే కఠినంగా చర్యలు తీసుకొంటామని కేటీఆర్ స్పష్టంచేశారు. నగర నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 230 పెద్ద అపార్ట్మెంట్లలో 70-80 శాతం ఎస్టీపీలున్నా 20 శాతం మాత్రమే వినియోగంలో ఉన్నాయని, అన్నింటినీ నిర్వహణలోకి తీసుకురాకుంటే భారీ జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, మంత్రి కేటీఆర్ చొరవతో కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.387 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. అనంతరం స్వచ్ఛదూత్‌లను, తడి పొడి చెత్తను వేరుచేసి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారుచేస్తున్న వ్యక్తిని, ప్లాస్టిక్‌ను బహిష్కరించినవారిని సన్మానించారు. ఈ సందర్భంగా స్వచ్ఛదూత్ మధులత తడి, పొడి చెత్త వేరు చేయడంపై కలిగే ప్రయోజనాలను సభాముఖంగా వివరించడంతో మంత్రి కేటీఆర్ అభినందించారు. మధులతకు ఎంపీ మల్లారెడ్డి రూ.10వేల నగదు బహుమతిని అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ నగర కమిషనర్ జనార్దన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
టోక్యో ఆదర్శం కావాలి
నేను గతేడాది టోక్యోకు వెళ్లాను. రోడ్లు, మోరీలు శుభ్రంగా ఉన్నాయి. 2, 3 రోజులు చూసిన. ఎక్కడా చెత్త కనిపించలేదు. జపనీస్‌ను అడిగా.. మీ పట్టణాన్ని ఎలా క్లీన్‌గా ఉంచుకుంటారు? అతను అసలు మేం చెత్తనే వేయం. శుభ్రం చేసేదెందుకు? అని తిరిగి ప్రశ్నించారు. ఆ తర్వాత డిన్నర్‌కు వెళ్లా. అక్కడ భోజనం పూర్తిచేశాక వినియోగించిన టిష్యూ పేపర్లను జేబుల్లో పెట్టుకొంటున్నారు. అప్పటికే డస్ట్‌బిన్ నిండటంతో జేబుల్లో పెట్టుకొని ఇంట్లోని బిన్లో వేస్తామని చెప్పారు. ఈ సోయి ఇక్కడా వస్తే విశ్వనగరం సాధ్యం అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అనధికారిక వంటశాలపై చర్యలు తీసుకోండి -మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేసిన 80 ఏండ్ల వృద్ధురాలు మూసాపేట్ సర్కిల్ పరిధిలోని కేపీహెచ్‌బీకాలనీ మూడవ ఫేజ్‌లో కింది పోర్షన్లో అనధికారికంగా కొనసాగుతున్న రెస్టారెంట్ కిచెన్ (వంటశాల)తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ కిచెన్‌పై చర్య లు తీసుకోవాలని దానిపై అంతస్తులో నివసిస్తున్న 80 ఏండ్ల వృద్ధురాలు శేషా నవరత్నం మన నగరంలో మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదుచేశారు. గతంలో మూసాపేట్ సర్కిల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, హోటల్ యాజమాన్యం కోర్టుకు వెళ్లారని, సర్కిల్ అధికారులు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ చర్యలు తీసుకోలేదని ఆమె చెప్పా రు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్‌రెడ్డి, మూసాపేట్ సర్కి ల్ అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. తనను పక్కనే కూర్చోబెట్టుకుని సమస్యను ఆలకించడమే కాకుండా తక్ష ణ చర్యలకు ఆదేశాలిచ్చినందుకు వృద్ధురాలు శేషా నవరత్నం హర్షం వ్యక్తంచేశారు.