Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజల దీవెనలుంటే కొత్త దిశ చూపిస్తా..

-దేశంలో మార్పు రావాలి -అది తెలంగాణ నుంచే మొదలు -భావసారూప్యత ఉన్న నేతలతో త్వరలో మాట్లాడుత -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -ప్రగతిభవన్‌కు పోటెత్తిన అభిమానులు

ప్రజల దీవెనలు ఉంటే దేశానికి అద్భుతమైన దశ, దిశ చూపిస్తానని, మార్గనిర్దేశం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. దేశంలో మార్పు రావాలని, అది తెలంగాణ నుంచే మొదలుకావాలని చెప్పారు. ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో 70 ఏండ్లు ప్రయాణం సాగించిన తరువాత ఏం జరుగుతున్నది? ఈ దేశం ఎటువైపు పోతున్నది? దేశంలో నెలకొన్న పరిస్థితులపై నిజంగా నాకే అశ్చర్యంగా ఉంది అని సీఎం అన్నారు. ఉదయం నుంచి దేశం నాలుగు మూలల నుంచి అనేక ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. దేశప్రజల జీవితాల్లో, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, అందుకు అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని శనివారం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ మొదలైంది. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సహా పలువురు నేతలు ఆయనకు ఫోన్‌చేసి మద్దతు పలికారు.

కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ ఆదివారం ప్రగతిభవన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ పది లక్షల కిలోమీటర్లు ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలైతది. తెలంగాణ కోసం బయలుదేరిన్నాడు కూడా చాలామంది అనుమానాలు వ్యక్తంచేశారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తున్న! మీరు నన్ను పెంచి పోషించిన ప్రజలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు కాబట్టి చెప్తున్న. మీ దీవెనలు ఉంటే వంద శాతం దేశ రాజకీయాలకు అద్భుతమైన దశ దిశ చూపించి, ప్రజానీకానికి అద్భుతమైన మార్గనిర్దేశం చేస్త. ఈ విషయాన్ని ఆషామాషీగా, ఆవేశంతో చెప్తలేదు అన్నారు. తన ప్రకటనపై స్పందించిన మమతాబెనర్జీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కలిసి వచ్చేవారందరితో దేశ రాజకీయాలపై చర్చిస్త. ఏకాభిప్రాయం కలిగిన నేతలందరినీ కలిసి, వ్యవసాయ, ఆర్థిక శాస్త్రవేత్తలు, రైతులు.. అందరినీ విచారించి దేశానికి అవసరమైన ఎజెండా తయారుచేస్తాం అని చెప్పారు. సం కల్పం, నిజాయితీ, ధైర్యం ఉంటే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలతో సంబంధం లేకుండా ఒక కొత్తశక్తి తయారుకావాలన్నారు. రాష్ట్రాలకు అధికారాలిస్తేనే ఏ రాష్ట్రానికి వాళ్ల అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటే దేశం బాగుపడుతుందని అన్నారు.

నలువైపుల నుంచి ఫోన్లు.. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఫోన్ చేసి, తమ్ముడూ చంద్రశేఖర్.. కరెక్టు నిర్ణయం తీసుకున్నావు. నీవు ఏం చెప్తే అదే ఫాలో అవుదాం. ముందుకుపోదాం. త్వరలోనే కలిసి మాట్లాడుదాం అని చెప్పారు. ఆరుగురు మహారాష్ట్ర ఎంపీలు ఫోన్ చేసి, మీరు ప్రకటించగానే రాజీనామా చేసి జంప్ కొడుతామన్నారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ ఫోన్ చేసి మీతో ఏకాభిప్రాయంతో ఉన్నాం. మేం కూడా దేశంలో చాలా మందితో మాట్లాడుతున్నాం. అందరం కలిసి మాట్లాడుదామని అన్నారు అని కేసీఆర్ తెలిపారు.

ఆ రెండు పార్టీల ఆలోచన మారాలి దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలు వాటి పంథాను, ఆలోచనను మార్చుకోవాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. ఇన్ని కోట్ల మంది పేదరికంలో ఉంటే కథలు, ఉపన్యాసాలు చెప్తే ఎట్ల? అని ప్రశ్నించారు. రైతులకు రూ.8వేలు పథకం దేశమంతా ఎందుకు ఇవ్వరు? పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తారు.. వ్యవసాయదారుడికి ఇస్తే నామోషీనా? ఈ పథకం గురించి రాజ్‌నాథ్‌సింగ్‌కు చెప్తే.. రైతులు మళ్లీ ఎన్ని కిస్తీల్లో కట్టాలి? అని అడిగారు. కట్టాల్సిన అవసరం లేదని అంటే.. కుర్చీ మీది నుంచి కింద పడ్డంత పనిచేశారు అని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాల తలరాతలు మారాలి. ఇప్పుడున్న పద్ధతే ఉండాల్నా? బీసీ సంచార జాతులు ఎంబీసీ ఎన్ని సంవత్సరాలు ఈ గతిలో ఉండాలి? అని నిలదీశారు.

అడిగేటోడు లేడా? సింగపూర్‌లో మన్ను కూడా లేదు. వాడు తాగే నీళ్లు వాడివి కావు. మలేషియా నుంచి కొంటడు. వాడుకుంటడు. అదే నీళ్లను ట్రీట్ చేసి అమ్ముకుంటడు. బుక్క ధాన్యం పండదు. సింగపూర్ డాలర్ విలువ ఎంత? మన రూపాయి విలువ ఎంత? ఇంత నామోషీనా? అడిగేటోడు లేడా? అని సీఎం ప్రశ్నించారు. మీ జమానాల విజయ్‌మాల్యా పోయిండువయా అనివాళ్లు, మీ జమానాల నీరవ్‌మోదీ పోయిండువయా అని వీళ్ళు! దేశానికి ఇది కావాల్నా? పేరుకు ఫెడరల్ వ్యవస్థ. ఈ దేశంలో ఫెడరలిజం ఉందా? మాట్లాడితే డెమోక్రసీ అంటరు. నరేగా కూలీలకు కూడా ఢిల్లీలో టప్పాలో డబ్బులు వేసేంత గొప్ప ప్రజాస్వామ్యం మనది. ఇది ప్రజాస్వామ్యమా? ఇక్కడున్న సర్పంచ్, మండలం, జిల్లా పరిషత్ ఎటు పాయే? ఎమ్మెల్యే, ఎంపీ ఎటు పాయే? స్టేట్ గవర్నమెంట్ ఎటుపాయే? స్థానిక ప్రభుత్వాలను గౌరవించే విధానమా ఇది? అని సీఎం సూటిగా ప్రశ్నించారు.

దవాఖాన నడిపించాలి.. ఢిల్లీలో కూర్చున్న వారికి ఏం తెలుస్తది? ఆరోగ్యం, విద్య, వ్యవసాయ విధానం, అర్బన్ డెవలప్‌మెంట్ రాష్ట్రాలకు అప్పగించాలి. ఎందుకు అప్పగిస్తలేరు? ఢిల్లీలోనే పెత్తనం పెట్టుకుని డిక్టేటర్‌షిప్‌తో చిల్లరమల్లర రాజకీయలబ్ధికోసం ఆ రెండు పార్టీలు 130 కోట్ల ప్రజల గోస పుచ్చుకుంటున్నాయి అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. 64 ఏండ్లలో 11 ఏండ్లు బీజేపీ, 50 ఏండ్లచిల్లర కాంగ్రెస్ పాలించింది. మళ్లీ వాళ్లే మాట్లాడుతరు. 64 ఏండ్లు ఉన్నది మీరే! మీరు చేస్తే ఎవరైనా వద్దన్నరా? కేంద్రానికి దవాఖాన కాడ ఏం పని? పాఠశాల కాడ, మున్సిపల్ మోరీ కాడ ఏం పని? వాళ్లకు ఏం అవసరం ఉంది? మీ పని విదేశీ విధానంమీద ఉండాలి.. ఆర్మీ మీ కంట్రోల్లో ఉండాలి.. జాతీయ రహదారులు మీ దగ్గర ఉండాలి. కానీ.. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఏంది? ఆప్‌కా క్యా కామ్ హై? రాష్ట్రాల్లేవా? సిగ్గు పడాలి. ఇదీ రాజకీయం అని సీఎం అన్నారు.

కేసీఆర్ భయపడేటోడుకాదు తనపై తప్పుడు ఆరోపణలు చేసేవారిపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను దేనికీ భయపడబోనన్నారు. 70 ఏండ్లు టైం పాస్ చేశారు. ఇప్పుడు కూడా మాట్లాడితే జైలులో వేస్తాం అంటారా? కేసీఆర్ భయపడేటోడు అయితే తెలంగాణ కోసం కొట్లాడుతాడా? కుంభకోణాలు చేసినోళ్లను బెదిరించుండ్రి. మీ పిట్ట బెదిరింపులు కేసీఆర్ మీద కాదు. మేం నిటారుగా ఉన్నం. మమ్మల్ని ముట్టుకుంటే భస్మం అవుతరు. ఎవరన్న మాట్లాడితే వాడిపై ఆరోపణలు, నిందలు వేయడం కాకుండా పద్ధతిగా మాట్లాడాలి అని ఆయన హితవు పలికారు.

ఏదీ తెగదు.. దేన్నీ తేల్చరు అమెరికాలో ప్రతి రాష్ర్టానికి సుప్రీంకోర్టు ఉంటది. సిటీ పోలీస్ కమిషనర్ మేయర్ కింద పనిచేస్తారు. ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉండదు. ఎవరి జీడీపీ వారికి ఉంటది. పూర్తి స్వతంత్రత ఉంటది. ఫెడరల్ కోర్టు ఉంటది. రాష్ట్రాల మీద పెత్తనం ఉండదు. కానీ ఇవాళ ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 85% ప్రజలు దళితులు, బీసీలు, మైనార్టీలు. వారికి రిజర్వేషన్ ఇవ్వాలని అడిగాం. ఒకటే దేశం రెండు ఖానూన్లు ఉంటాయా? 85% ఉన్న బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు 50% లోపల రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ విధంగా సమాధానం చెప్పాలి? పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. ఒక దగ్గర గిరిజనులు ఎక్కువ. ఓ రాష్ట్రంలో ఓసీలు ఎక్కువ. కొన్ని రాష్ర్టాల్లో ఓసీలు ఎక్కువ ఉండొచ్చుగాక.. మరి వాళ్ల గతేంకావాలి? ఇవన్నీ పెట్టి ప్రజలకు తాకులాటలు పెడుతున్నరు. ఇవాళ ఓసీలుగా ఉన్న వారు కూడా బాధ పడుతున్నారు అని సీఎం చెప్పారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ వేసి 14 ఏండ్లు అయితాంది. సెక్షన్ 3 కింది మా నీళ్ల వాటా తేల్చమన్నాం. తేలదు! నది నీళ్లు పంపిణీ చేయడానికి 14 ఏండ్లు కావాల్నా? ఉళ్ల ఉన్న చింత కింది బాలయ్య పంచాయితీ చెప్పమంటే మూడ్రోజుల్లో చెప్తారు అని అన్నారు. చాట్ల తౌడు పెట్టి కుక్కలకు కొట్లాట పెట్టే తీరున కేంద్రం వైఖరి ఉన్నదని ఆయన తూర్పారబట్టారు. ఇలాంటి ఢిల్లీనా మనకు కావాల్సింది? అని ప్రశ్నించారు.

మద్దతు ధర ఎందుకు పెంచరు? కేంద్రం రైతులకు ఏం చేసిందని సీఎం ప్రశ్నించారు. అందరికీ రేట్లు, జీతాలు పెరుగతయి. సబ్బు, చక్కెర, చెప్పుల ధరలు పెరుగుతయి. రైతులు పండించే ధాన్యం ధర మాత్రం పెరుగదు. ఎవడు అవునన్నా కాదన్నా భారతదేశం బతికేదే వ్యవసాయం మీద. పెద్ద సెక్షన్ రైతులు, రైతు కూలీలు! పెద్దపెద్ద లెక్కలు చెప్తరు. జీడీపీ అంటూ..! ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరికి కావాలి జీడీపీ? అని ప్రశ్నించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, వారిపై ఆధారపడినవారు పెద్ద ఎత్తున సంక్షోభంలో కూరుకుపోతుంటే.. 70 సంవత్సరాలు టైమ్‌పాస్ చేశారు అని ముఖ్యమంత్రి విమర్శించారు.

ఎంతో అవగాహనతో మాట్లాడుతున్న 2004 నుంచి అనేక అనుభవాలు పంచుకున్నాం. 12 పంచవర్ష ప్రణాళికలు చదివిన. ఏ రంగంలో ఏం జరిగిందీ అన్నీ అవగాహన చేసుకున్న. సిద్దిపేట కాలేజీలో డిగ్రీ చదివే సందర్భంలో నేను ఇందిరాగాంధీకి పెద్ద అభిమానిని. ఆమె భూసంస్కరణల చట్టం తీసుకొచ్చి, గుడిసెలు వేయించారు. కానీ గొప్పగా జరుగలేదు. రాజీవ్‌గాంధీ వచ్చారు. ఎవరి మోతాదు లేకుండా గెలిచారు. ఏమన్న చేస్తరేమోనని ఆశపడ్డ. ఏమీ జరుగలేదు. మోదీగారు వస్తే ఏదో జరుగుతుందనుకున్న. వారితో చాలాసార్లు మాట్లాడిన. దళితులు, గిరిజనులకు మంచి చేయండి.. రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించండని చెప్పాను. చంద్రశేఖర్ జీ.. మీరు చెప్పారని రైతులకు ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. అది కూడా బాగోలేదు. మండలం, గ్రామ యూనిట్ అంటరు. రైతుల నుంచి ప్రీమియం కట్ చేస్తారు. కానీ రైతులెవ్వరికీ కూడా బీమా రాదు. రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు బంద్ కావాలి? అని ప్రశ్నించారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు విఫలమైనట్టు ప్రజలకు అర్థమయ్యింది.. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయని, ఈ విషయం ప్రజలందరికీ అర్థమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగాలే? నీళ్లు లేవా? 70వేల టీఎంసీలు ఉన్నాయి. నేపాల్, భూటాన్, మనకు మధ్య నదులున్నాయి. వాటికి ఇప్పటికీ పరిష్కారం లేదు. వాటాలు తేల్చరు. అమెరికాలో గట్ల ఉంటదటా! చైనాలో గిట్ల ఉంటదట! జర్మనీలో అట్ల ఉంటదంట.. జిందగీలో మనం కథలు ఇనుడేనా? జర్మనీవాడు బంగారం తింటున్నాడా? అమెరికావాడు వెండి తింటుండా? మనం ఏమైన మన్ను తింటున్నామా? ఏం జరుగుతున్నది? ఇంకా దేశాన్ని ఎన్ని విధాలుగా విభజిస్తారు? దేశమంటే ప్రజలు. ఏ కులమైతే మనకేంది? ఏ మతమైతే ఏంది? అందరు బాగుండాలి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే వంకలు పెట్టి ప్రజాశక్తిని ఒకటి కాకుండా చేసి, రాజకీయ ఆటలు అడుకుంటున్నరు తప్ప.. వాస్తవ దృక్పథంతో లేరు అని సీఎం అన్నారు. నేను ఏదో తమాషాగా.. ఆషామాషీగా చెప్పడం లేదు. నాకు వయస్సు సహకరించే పరిస్థితి లేదు… ఇప్పుడు 64 ఏండ్లు. ఇక్కడ కావాల్సినంత పని ఉంది. నిన్నగాక మొన్న రాష్ట్రం తెచ్చుకున్నం. తిప్పలు పడుతున్నం. ఒకటి, ఒకటిన్నర సంవత్సరాలైతే బాధ పోతది అని కేసీఆర్ పేర్కొన్నారు.

నాలుగేండ్లలో ఏం చేశారు? కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి వేసినం. నాలుగేండ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పనిచేసినరా? మాటలు మస్తు మాట్లాడ్తరు. కానీ.. రైతులకా? విద్యార్థులకా? కార్మికులకా? నిరుద్యోగులకా? ఎవరికి ఏం జరిగింది? మనం కహానీలు వినాలి. వీళ్ల మీద కోపం వస్తది.. వాళ్లు వస్తరు! వాళ్లు వస్తే ఏం చేయాలి? ఏమీచేయరు. మన పక్కన చైనా దేశంలో 1976 వరకు మావో అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉండే. ఆయన చనిపోయిన తరువాత డెంగ్‌సియావోపింగ్ అనే అధ్యక్షుడు వచ్చారు. మనకన్నా అధ్యాన్నమైన దేశం. వ్యవసాయ భూమి తక్కువ. కొండలు, గుట్టలు. అటువంటి దేశాన్ని 24 ఏండ్లలో అమెరికా తరువాత అత్యంత బలవంతమైన దేశంగా తీర్చిదిద్దిండ్రు. వాళ్లు ఎక్కడో లేరు. హిమాలయాలకు అటు వాళ్లు ఉన్నరు. మనం ఇటువైపు ఉన్నం అని సీఎం చెప్పారు. నేను ఢిల్లీకి పోయినప్పుడు కొందరితో మాట్లాడిన. చైనాలో ఇట్ల చేశారట కద.. అని అడిగి. వాళ్ల ఖానూన్ వేరు సాబ్ అన్నరు. మరి మీ ఖానూన్ మార్చుకో! మనకు అధికారం లేదా? వాళ్లు ఎట్ల పైకి వచ్చిన్రో అఖల్ లేదా మనకు? రాజ్యాంగం మార్చుకో. ఎవరి కోసం రాజ్యాంగం? రాజ్యాంగం, ప్రధాని, సీఎం, పార్టీ, ప్రభుత్వాలు ప్రజల కోసమే కదా! కానీ వాటిని మార్చరు. చైనా రాజ్యాంగం డిఫరెంట్ అంటరు. యూ బికేమ్ డిఫరెంట్. వై డోంట్ యువర్ బికేం డిఫరెంట్? యూ చేంజ్. ఎన్ని రోజులు ప్రజలు కథలు వినాలి? అని సీఎం అన్నారు.

దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. హమ్ ఆప్ సే ఏక్ మత్ హై.. ఆప్ కే సాథ్ రహేంగే (మేము మీతో ఏకీభవిస్తున్నాం. మీతో కలిసి నడుస్తాం) – కేసీఆర్‌తో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

జాతీయ రాజకీయాల్లోక్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.