Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజల మనసు గెలిచాం

-దేశం గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం -మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకొంటున్నాం -అభివృద్ధిని చూసి అబ్బురపడుతున్న అన్ని రాష్ట్రాలు -తెలంగాణలో ఇతర ఏ పార్టీకీ పుట్టగతులుండవు -నిధుల విషయంలో కేంద్రం మొండిచేయి -బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి -బడ్జెట్‌పై చర్చకు శాసనసభలో ఆర్థికమంత్రి శ్రీ ఈటల సమాధానం

తెలంగాణలో నాడు బొంబాయి, బొగ్గుబాయి బతుకులే ఉండేవి. అన్నివర్గాల ప్రజలూ కష్టాలు పడేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం అవతరించాక, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో అభివృద్ధిలో దూసుకెళుతున్నాం. ఇక్కడి ప్రజల కష్టాలు, కన్నీరు తెలిసిన ప్రభుత్వం వారికి ఉపశమనం కలిగించేలా, భవిష్యత్ సమస్యలకూ పరిష్కారం చూపేలా పథకాలను ప్రారంభించింది. ప్రస్తుతం తెలంగాణ పేరు చెప్తే అన్నిరాష్ర్టాలూ ప్రత్యేక గౌరవం ఇస్తున్నాయి. మూడున్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రజలందరి హృదయాలను గెలుచుకున్నాం.. నాది తెలంగాణ అని గర్వంగా చెప్పేస్థాయికి తీసుకొచ్చాం.. అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంగళవారం శాసనసభలో ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మానవీయకోణంలో ప్రజల కష్టాలను దూరం చేసేలా పథకాలు రూపొందించిందని తెలిపారు. ఈ ఏడాదిలోగా అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మిషన్ కాకతీయ, భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు వంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చూసి అన్ని రాష్ర్టాలు అబ్బురపడుతున్నాయని అన్నారు. కొత్తరాష్ట్రమైన తెలంగాణకు నిధులు ఇచ్చే విషయంలో కేం ద్రం మొండివైఖరి అవలంబిస్తున్నదని చెప్తూ రాష్ట్ర బీజే పీ నాయకులు ఇక్కడ విమర్శలు చేసేకంటే కేంద్రంపై ఒత్తిడిచేసి నిధులు రాబట్టాలని సూచించారు. బడ్జెట్‌పై మంత్రి ఈటల వివరణ ఆయన మాటల్లోనే..

మానవీయకోణంలో పథకాలు తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ కిట్స్ పథకాన్ని మధ్యప్రదేశ్‌లో అమలుచేసేందుకు సిద్ధమయ్యారు. రైతులను ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ పథకం, పెట్టుబడి పథకం, పేద మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి. గొల్లకురుమలు, ముదిరాజ్‌లు, గౌడ కులస్తులు, గంగపుత్రులు ఇతర కులాలు, భవన నిర్మాణ కార్మికులు, ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ. 6లక్షల బీమా పొందే ఏర్పాటుచేశాం. అన్ని వర్గాలవారినీ కలుపుకుని ముందుకుపోతున్నాం. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వడంతోపాటు, రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఉత్తరాదికి వెళ్తే ఎవరూ అంతగా పట్టించుకోలేదు. మూడేండ్లు గడిచాయి.. ఇప్పుడు ఉత్తరాదితోపాటు దేశవ్యాప్తంగా గౌరవం పెరిగింది. ప్రతి ఒక్కరూ ఎంతో మర్యాదతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను అడిగిమరీ తెలుసుకుంటున్నారు. ఇదంతా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వల్లనే సాధ్యమైంది. తెలంగాణలో బొగ్గుబాయి, బొంబాయి బతుకులే ఉంటాయని చెప్పుకునే పరిస్థితి నుంచి మాది తెలంగాణ అని గల్లా ఎగిరేసి గర్వంగా చెప్పుకునేస్థాయికి తీసుకువచ్చింది.

ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవం పెంచాం పార్టీతో సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.3 కోట్లు కేటాయించాం. ప్రజాప్రతినిధులు ప్రతి చిన్న అవసరం కోసం ఎదురుచూడకుండా, దేనికీ చేయిచాచకుండా వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. ప్రజాప్రతినిధులు అడుగకముందే ప్రభుత్వం అన్నీ చేస్తున్నాం. తమ, పర పార్టీలనే తేడాలు చూపడం లేదు.

ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం.. కేంద్ర ప్రభుత్వం 1.91 కోట్ల మందికి కిలో రూ. 3 ధరకు బియ్యం ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున 2.74 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తున్నది. ఒక ఇంట్లో పదిమంది ఉంటే పరిమితులు లేకుండా 60 కిలోలు ఇస్తున్నాం.

ప్రతిపక్ష పార్టీలూ అభివృద్ధిని చూడండి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు అనవసర రాద్ధాంతం చేయడం మానుకుని, పట్టణాలు, గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, తాగు, సాగునీరు.. ఇలా అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. పథకాల పేర్లుచెప్పి ఓట్లు అడుక్కోవటం మాకు చేతకాదు. మేం చేస్తున్న పనిని, కష్టాన్ని ప్రజలే చూస్తున్నారు. పనిచేసే వారెవరో, మాటలు చెప్పేవారెవరో ఇప్పటికే ప్రజలు గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకీ పుట్టగతులుండవు. వచ్చేసారి కూడా టీఆర్‌ఎస్‌నే ప్రజలు ఆదరిస్తారు.

కేంద్రం నుంచి సహకారమేదీ? కేంద్రం నుంచి తెలంగాణ రాష్ర్టానికి ఆశించిన దానికంటే చాలా తక్కువగా సహకారం అందుతున్నదని మంత్రి ఈటల చెప్పారు. 2014-15లో కేంద్రం నుంచి రూ.9,749 కోట్లు వస్తాయని ఆశిస్తే… రూ. 8,189 కోట్లు వచ్చాయని ఆయన లెక్కలు విప్పారు. 2015-16లో 12,823 కోట్లు ఆశిస్తే రూ.12,353 కోట్లు, 2016-17లో రూ.13,955 కోట్లకు రూ. 14,877 కోట్లు, 2017-18లో రూ. 17,004 కోట్ల కు రూ.16,420 కోట్లు వచ్చినయి. సెంట్రల్ గ్రాంట్స్ కింద కూడా కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని, ఏపీ పునర్విభజన చట్టం 94(2) ప్రకారం కొత్తరాష్ట్రమైన తెలంగాణకు మంచి నిధులిస్తారని ఆశించినా అలా జరుగలేదు. 2014-15లో రూ. 21,721 కోట్లకు కేవలం రూ.7118 కోట్లు మాత్రమే వచ్చినయి. 2015-16లో రూ.12,404 కోట్లు అనుకుంటే రూ.9764 కోట్లు, 2016-17లో రూ. 14,557 కోట్లకు రూ.9752 కోట్లు మాత్రమే వచ్చినయి. రాష్ర్టాల స్థితిగతుల్ని నీతి ఆయోగ్ అధ్యయనం చేసే క్రమంలో తెలంగాణకు వచ్చినపుడు ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయను అభినందించి.. రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ కేం ద్రం మాత్రం ఒక్కపైసా ఇవ్వలేదు అని వివరించారు.

కేంద్రానిది ఒక్కమంచి పథకమైనా ఉందా? గత నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మనసు దోచుకునే పలు పథకాలను ప్రవేశపెట్టిందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పథకమైనా వారికోసం తీసుకొచ్చిందా? అని ఆర్థికమంత్రి ఈటల ప్రశ్నించారు. 2014-15లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ న్యాక్‌లో సమావేశం ఏర్పాటుచేశారని, అదే సమయంలో పార్లమెంటులో అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కేంద్రబడ్జెట్‌లో మహిళా, శిశు సంక్షేమశాఖ కేటాయింపులను రూ.17,800 కోట్ల నుంచి రూ.8 వేల కోట్లకు తగ్గించారన్నారు.

బీజేపీ నేతలు కేంద్రాన్ని నిలదీయాలి కేంద్రం బీహార్, యూపీ తదితర రాష్ట్రాలకు ఆర్థిక సాయంచేస్తే మాకు ఇబ్బంది లేదని చెప్పాం. కొత్త రాష్ర్టానికి సాయం చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరాం. కానీ స్పందన లేదు. బీజేపీ నేతల రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కంటే కేంద్రంలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తే మంచిదని చురక అంటించారు.

బడ్జెట్‌లో 95 శాతం ఖర్చుచేశాం 2017-18 బడ్జెట్‌లో 95 శాతం ఖర్చుచేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గత నాలుగేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో ఖర్చు శాతాన్ని క్రమంగా పెంచుతున్నామని వివరించారు. 2014-15లో బడ్జెట్‌లో 62 శాతం, 2015-16లో 84.33 శాతం, 2016-17లో 93.34 శాతం ఖర్చుచేశామని చెప్పిన ఈటల 2017-18లో రూ.1,49,640 కోట్ల బడ్జెట్‌కుగాను సవరణ అంచనా ప్రకారం రూ.1,42,506 కోట్లు (95 శాతం) ఖర్చుపెట్టామని వివరించారు. 1868లోనే నిజాం హయా ంలో ప్రధానమంత్రి సాలార్జంగ్ హైదరాబాద్-వాడి, హైదరాబాద్-ఖాజీపేట్, ఖాజీపేట్-బెజవాడ, ఖాజీపేట్-చాందా రైల్వేలైన్ల కోసం బ్రిటన్ దగ్గర అప్పు తీసుకున్నారని.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల కట్టేందుకు, సంక్షేమపథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం అప్పు తీసుకోవడం తప్పా? అని ఈటల ప్రశ్నించారు. 2013-14లో దేశ జీడీపీ 5.9 ఉంటే, అప్పటి ఉమ్మడి ఏపీది 4.2 శాతం మాత్రమే ఉందని, కానీ 2017-18లో దేశ జీడీపీ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని, ఈ క్రమంలో రాష్ట్రం అభివృద్ధి చెందినట్లా? కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఐటీ రంగంలో రూ.85,470 కోట్ల ఎగుమతులు ఉన్నాయని, ఈ రంగంలో కర్ణాటక, తమిళనాడు తరువాత మూడోస్థానంలో తెలంగాణ ఉన్నదని, త్వరలో ఒకటి లేదా రెండోస్థానానికి చేరుకుంటామని మంత్రి ఈటల ఆకాంక్షించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.