Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజల మనిషి కేసీఆర్

-ఓట్ల కోసం.. ఎలక్షన్ల కోసం పనిచేసే వ్యక్తికాదు
-ప్రజల గుండెల్లో పదికాలాలు ఉండిపోవాలి
-ప్రజాప్రతినిధులందరికీ ఆయన చెప్పేది అదే
-ప్రతిపక్షాల అడ్డగోలు మాటలతోనే ముందస్తుకు
-ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, డీ శ్రీనివాస్ పార్టీని వీడితే నష్టమేమీ లేదు
-నిజామాబాద్ రూరల్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ కవిత

సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని, ప్రజా ప్రయోజనాలకోసమే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారని ఎంపీ కవిత చెప్పారు. ఓట్లు, ఎలక్షన్లకోసం పనిచేసే వ్యక్తికాదని, ఏ పనిచేసినా పదికాలాలపాటు ప్రజల్లో నిలిచిపోయేలా ఉండాలనేదే ఆయన అభిమతమన్నారు. ఇదే విషయాన్ని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులందరికీ చెప్తుంటారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ ప్రజాతీర్పుకోసం వస్తున్నారన్నారు. శుక్రవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిపక్షాలు అడ్డగోలు మాటలతో ప్రతి విషయంలో అడ్డుపడుతుండటంతో ప్రజాతీర్పు కోసం ముంద స్తుకు సిద్ధమయ్యారన్నారు. అవాకులు చవాకులు పేలే ప్రతిపక్షాల మాటలు నమ్ముతరా? మీకోసం 24 గంటలు పనిచేసే కేసీఆర్‌ను నమ్ముతరా? దయచేసి ఆలోచన చేయండి అని ప్రజలను కోరారు. 2014కు ముందు మీకు కనీసం వెయ్యి రూపాయల ఆసరా కూడా ఇవ్వలేదు. ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నది? తెలంగాణవాళ్లు అన్నం పెట్టేవాళ్లకు సున్నం పెట్టరు. చేసిన సహాయాన్ని మరిచిపోరు అని అన్నారు.

ప్రజాతీర్పు కోసం మళ్లీ మీ ముందుకు కేసీఆర్..
ప్రజలకోసం తమ ప్రభుత్వం పనిచేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు బట్టకాల్చి మీదవేసే విధంగా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాయని ఎంపీ కవిత మండిపడ్డారు. వీళ్లు (ప్రతిపక్షాలు) ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుడేంది? ఏ చిన్న కార్యక్రమం చేసినా పెడర్థాలు తీస్తున్నారు.. ఇదంతా కాదు.. నేను ఎప్పుడైనా ప్రజల్నే నమ్ముకున్న అని సీఎం కేసీఆర్ ప్రజాతీర్పుకోసం వచ్చారు అని కవిత చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని ఇవ్వకుంటే రాజీనామా చేసి ప్రజల దగ్గరకే వచ్చినం. మధ్యలో ఇంకొన్ని పార్టీలు ఇబ్బంది పెట్టినా రాజీనామాలు చేసి ప్రజల దగ్గరికి వచ్చినం. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. నా తెలంగాణ బిడ్డలను నమ్ముకొని ఎన్నికలకు పోయిన. నాకు వాళ్లు వెన్నంటి నిలబడ్డరు అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడుకూడా ఇదే మాటతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఇంత అభివృద్ధి చేసినా, ఇంకా తొమ్మిది నెలల గడువున్నా సాహసంతో ప్రభుత్వాన్ని రద్దుచేశారని కవిత చెప్పారు.

పచ్చగా కళకళలాడుతున్న పాలమూరు
వలసలకు మారుపేరైన మహబూబ్‌నగర్ జిల్లాను పచ్చగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఎంపీ కవిత అన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు కడితే.. పాలమూరు నుంచి కూలీలు పోతరు అని చెప్పుకొనే పరిస్థితి ఉండేదని, అటువంటిది జిల్లా ఇవాళ పచ్చని పంట పొలాలు, నిండుగా చెరువులతో కళకళలాడుతున్నదన్నారు. దానిని చూసి కాంగ్రెస్, టీడీపీ ఆగమాగమవుతున్నాయని చెప్పారు.

విద్యుత్ వెలుగులే కేసీఆర్ పాలనకు ఓ నిదర్శనం
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కేసీఆర్ పాలనకు ఒక నిదర్శనమని ఎంపీ కవిత చెప్పారు. గత ముఖ్యమంత్రులు ముందు వాళ్ల ఊళ్లకు, నగరాలకు, మండల కేంద్రాలకు కరంటు ఇచ్చేవారని, అడుగుబొడుగు ఉంటే ఊళ్లకు ఇచ్చేవారని చెప్పారు. ఊళ్లలోఉండేవారు మనుషులు కాదా? రైతులంటే మనుషులు కాదా? అని ఆమె ప్రశ్నించారు. కానీ ఇవాళ సీఎం కేసీఆర్ ఊళ్లవైపు, గ్రామాలవైపు చూస్తున్నారని, వాటి అభివృద్ధికి కృషిచేస్తున్నారని అన్నారు.

ఉద్యమకారులందర్నీ కడుపులో పెట్టి చూసుకుంటాం
ఉద్యమకారులకు అన్యాయం చేశామని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అంటున్నడు. అన్యాయం చేసివుంటే నీకు పదవి ఎందుకిస్తం? పదవులు రాని ఉద్యమకారులు చాలామంది ఉన్నరు. వాళ్లందరినీ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటది అని ఎంపీ కవిత చెప్పారు. పార్టీకి ద్రోహంచేయడం తగదని చాలా సందర్భాల్లో భూపతిరెడ్డికి చెప్పామన్నారు. రేపు ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా.. అదే పనులు చేస్తారని దుయ్యబట్టారు. డీ శ్రీనివాస్‌నుకూడా మర్యాదగా పార్టీలోకి ఆహ్వానించాం. పదవి ఇచ్చినం. కానీ వారు ఇంకోరకంగా ఆలోచన చేసుకున్నరు. ఇటువంటివాళ్లకి ప్రజలే బుద్ధి చెప్తరు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, డీ శ్రీనివాస్ పార్టీని వీడితే వచ్చే నష్టమేమీలేదు అని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్, రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ అలీం, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడిల శ్రీరాములు, టీఆర్‌ఎస్ నాయకులు బాజిరెడ్డి జగన్, కులాచారి దినేశ్, ఆల్ ఇండియా బంజారా సేవాసంఘం నాయకుడు శ్రీహరినాయక్ తదితరులు పాల్గొన్నారు.

సభ ఏర్పాట్లను పరిశీలించిన కవిత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ వెన్నంటి ఉన్నారని ఎంపీ కవిత అన్నారు. అక్టోబర్ 3న జరిగే ప్రజా ఆశీర్వాద సభకు పెద్దఎత్తున తరలివచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజ్ మైదానంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను కవిత శుక్రవారం పరిశీలించారు. కేసీఆర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3గంటల మధ్య జిల్లాకు వస్తారని, నాలుగు గంటలకు సీఎం ప్రసంగం ఉంటుందని చెప్పారు. ప్రజలకు, పార్టీ అభిమానులకు సహాయం చేయడానికి టీఆర్‌ఎస్వీ వలంటీర్లను ఏర్పాటుచేశా మన్నారు. మహి ళా వలంటీర్లను కూడా ఏర్పాటుచేయాలని సూచించారు. అంతకుముందు డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు మేడే రాజీవ్‌సాగర్ వలంటీర్లతో కవాతు చేయించారు. కార్యక్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.