Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజలకే జవాబుదారీ

-తెలంగాణ ప్రయోజనాలే తప్ప వ్యక్తులను పట్టించుకోం -త్వరలో తెలంగాణ ఇరిగేషన్ పాలసీ .. -అన్ని వివరాలు ప్రజల ముందుంచుతాం: సీఎం -గత ప్రభుత్వాల నిర్వాకంతో తెలంగాణ దగాపడ్డది -ఇప్పుడు ఒక్క తప్పు చేసినా ముందుతరాలకు నష్టమే -ఆరునూరైనా ప్రాణహిత డిజైన్ మారుస్తాం -మహారాష్ట్ర 200 ప్రాజెక్టులు కట్టింది..దారులు మూసుకుపోయాయి -తెలంగాణకు మిగిలింది ప్రాణహిత, ఇంద్రావతి మాత్రమే -రాష్ట్ర ఆదాయం బ్రహ్మాండంగా ఉంది -గుడుంబా అరికట్టేందుకే చౌక ధర మద్యం -వందల కోట్లు నష్టం వచ్చినా వెనుకడుగువేయం -ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తాం -త్వరలో పట్టణజ్యోతి.. మున్సిపాలిటీల్లోనూ క్రమబద్ధీకరణ! -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు వెల్లడి

KCR press meet in Karimnagar

రాష్ట్ర ఇరిగేషన్ పాలసీని త్వరలో ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు. ఏ నదినుంచి ఎన్ని నీళ్లు తీసుకోవచ్చు.. ఏ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీరు ఇవ్వవచ్చు.. వంటి వివరాలు ప్రజల ముందు పెడతామన్నారు. ఆంధ్ర పాలకుల హయాంలో గోదావరి మీద మహారాష్ట్ర ఏకంగా 200 ప్రాజెక్టులు కట్టిందని, ఫలితంగానే నేడు శ్రీరాంసాగర్‌కు చుక్క నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రాణహిత, ఇంద్రావతి తప్ప గోదావరినుంచి నీరు వచ్చే అవకాశం లేకుండాపోయిందని కేసీఆర్ చెప్పారు. గత ప్రభుత్వాలు చేపట్టిన అడ్డగోలు ప్రాజెక్టులు యథాతథంగా కొనసాగించే అగత్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ర్టానికి ఏది మంచిదో అదే చేస్తామని అన్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వంగా తాము ఈ రోజు ఒక్క తప్పటడుగు వేస్తే తరతరాల ప్రజలు నష్టపోతారని, అందుకే ఎవరు ఎంత అరిచి గీ పెట్టినా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు మార్చుకుంటామని తేల్చిచెప్పారు.

ఈ క్రమంలో ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చి తీరుతామని సీఎం స్పష్టంచేశారు. చేవెళ్లకు గోదావరి నీరు రాదని తాను ఎన్నికల ప్రచారంలోనే అక్కడి ప్రజలకు చెప్పానని, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు పథకం ద్వారానే కడుపునిండా నీరిస్తామని చెప్పారు. గ్రామజ్యోతి మాదిరిగా పట్టణ జ్యోతి కార్యక్రమం కూడా చేపడుతామని, క్రమబద్ధీకరణ తెచ్చి వాటికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. వచ్చే కొద్ది రోజుల్లో కేజీ టు పీజీ అంశం మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టబోతున్నానని చెప్పారు. గుడుంబా మరణాలు నివారించేందుకే వందల కోట్ల నష్టానికి సిద్ధపడి చౌకమద్యం తెస్తున్నామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్ అంశం మీద కమిషన్ అధ్యయనం చేస్తున్నదని తెలిపారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేటు సమావేశ మందిరంలో కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ, ప్రతిపక్షాల తీరుతెన్నులు, పట్టణ జ్యోతి వంటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా ముచ్చటించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే…

ప్రాణహిత డిజైన్ మార్చుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో తెలంగాణ ప్రాంతం చాలా భయంకరంగా దగా పడింది. చాలా ప్రాజెక్టులు పేపర్ల మీద ఉన్నాయి తప్ప రైతుల పొలాల్లోకి నీళ్లు రాలేదు. ఇవాళ ఎస్సెల్బీసీ పరిస్థితి ఏమిటి? 35 నుంచి 40 సంవత్సరాలు అయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తీసుకుంటే దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. అక్కడ బ్యారేజీ నిర్మాణం కాలేదు. కానీ చేవెళ్ల వద్ద కాలువలు తవ్వుతరు. ఈ ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. అయితే మొత్తం ప్రాజెక్టులో ప్రతిపాదించిన నీళ్ల స్టోరేజీ మాత్రం 14 టీఎంసీలు. 14 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలు పారుతదా? వరుస లిప్టులు…మధ్యలో ఎక్కడ ఒక్క లిప్టు అగిపోయినా, మోటారు చెడిపోయినా పైకి నీరు పోదు. పడ్డ చుక్క పడ్డట్లుగా ఎత్తిపోస్తే తప్ప లాభం ఉండదు. కనీసం 50 టీఎంసీల స్టోరేజీ ఉండేటట్టు కట్టాలి కదా? బ్యారేజీలు ఉండాలన్న విషయాన్ని విస్మరించారు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్‌లో భాగంగా 200 టీఎంసీల పైచిలుకు నీరు స్టోరేజీ ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నది.

అలా చేయకుంటే ఈ ప్రాజెక్టు కట్టినా అర్థం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ముఖ్యమంత్రులు మనకు సబ్బు పెట్టే ప్రయత్నం చేశారు తప్ప నిజంగా నీరు ఇచ్చే ప్రయత్నంచేయలేదు. ఈరోజు మేం చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే.. కచ్చితంగా మల్టిపుల్ స్టేజీల్లో బ్యారేజీలు ఉండాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. అయినా పాత డిజైన్‌నే కొనసాగించాలని కొంతమంది అంటారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చితే గందరగోళం అవుతుందని ఇంకొకరు అంటారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చడం కాదు.. మార్చి తీరుతం. ఆరునూరైనా మారుతాయి. తెలంగాణ ప్రజల మంచి కోరుతాం. తెలంగాణ రైతుల శ్రేయస్సుకోసం కచ్చితంగా మారుస్తాం. తెలంగాణకు ఏది మంచో అదే చేస్తం తప్ప.. ఇదే చేయాలి.. అదే చేయాలి అంటూ మీరు అరిచినా.. గీ పెట్టినా దానిని ఆపం. మా ప్రాణం పోయినా సరే.. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం తప్ప ఎవరో వ్యక్తుల కోసం పనిచేయం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే ప్రసక్తేలేదు.

పొరపాట్లు చేయబోం.. ప్రాణహిత-చేవెళ్లగానీ.. ఖమ్మంలో చేపట్టిన ఇందిరా, రాజీవ్‌సాగర్‌గానీ ఇతర ఏ పథకాలు గానీ తెలంగాణ రాష్ట్ర అవసరాల దృష్ఠ్యా తెలంగాణకు ఎలా అయితే నీరు ఇప్పించగలుగుతామో పరిస్థితులను అకళింపు చేసుకొని ప్రణాళికలు వేస్తున్నాం. తెలంగాణకు తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఈ రోజు మేం ఒక్క తప్పడుగు వేస్తే కొన్ని తరాలు దెబ్బ తింటయి. కాబట్టి ఆ పొరపాట్లు చేయముగాక చేయం. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు జరగనివ్వం. పకడ్బందీ ప్రణాళితో ముందుకు పోతం. ప్రాజెక్టులపై సంపూర్ణ అధ్యయనం చేయాలి. ఎటుపడితే అలా చేయడానికి వీలుకాదు. ఇది కొత్త రాష్ట్రం. పునాది వేశాం. పడే పునాది ఏమాత్రం తల కిందులు అయినా రాష్ట్రం దెబ్బతింటుంది. ఎటుకాకుండా అయిపోతుంది. ఆ తప్పును ప్రభుత్వం చేయదలుచుకోలేదు.ఆగం ఆగం చేయం. చేయగల పనులు చేస్తాం.

రంగారెడ్డికి పాలమూరు నీరు… ఇవాళ చేవెళ్ల డిజైన్ మార్చవద్దని కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేస్తున్నారు.. టీఆర్‌ఎస్ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల పర్యటనలో వికారాబాద్ సభలోనే నేను స్పష్టంగా చెప్పాను. రంగారెడ్డి జిల్లాకు ఎట్టి పరిస్థితులలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నీళ్లురావు. నీరు తెచ్చిఇచ్చే పద్ధతి ఇది కాదని అనాడే స్పష్టంగా చెప్పాను. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తాయి. మేం తెచ్చి ఇస్తాం అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకంతోనే రంగారెడ్డి జిల్లాకు కడుపు నిండా నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు టేకాఫ్ అయింది. బ్రహ్మాండంగా అక్కడికి నీళ్లు తీసుకొచ్చి రాబోయే రెండు రెండున్నర ఏండ్లలో రంగారెడ్డి జిల్లాకు నీరు ఇవ్వడం జరుగుతుంది.

బ్యారేజీ లేదు..పైపులు కొన్నరు… దుమ్మగూడెం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునేందుకు రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద రూ. 800 కోట్లు ఖర్చుపెట్టింది. ఏం చేసింది? కనీసం దుమ్మగూడెం వద్ద ఇన్‌టెక్‌వెల్ కూడా ఏర్పాటుచేయలేదు. కానీ రూ. 720 కోట్లు పెట్టి పైపులు, మోటార్లు కొన్నరు. ఎవనికి వచ్చే పైసలు వాడు జేబుల వేసుకున్నరు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తికావాలె? ఆ పైపులు, మోటార్లు ఎప్పుడుపెట్టుకోవాలె? అప్పటివరకు అవి తుప్పుపట్టి పనికి వస్తయా? తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇరిగేషన్ మంత్రుల సాక్షిగా ఈ తంతంగం జరిగింది. ఇంత ఘోరమైన ప్రాజెక్టు కట్టి.. ఇంత దగా చేసి అనాడు ఆంధ్రా ముఖ్యమంత్రులకు వత్తాసు పలికి ఈ రోజు అదే నాయకులు వక్రీకరణ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏమి చెప్పినా వంకర మాటలు, వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవేం పనికి మాలిన రాజకీయాలో చెప్పాలి. ఇవన్నీ వచ్చే శాసనసభ సమావేశాల్లో లేదా దానికి ముందే మీడియా ద్వారా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళుతాం. ఒక్కో ప్రాజెక్టుపై ఏమి జరిగింది? ఒక్కో నది పై ఏం జరిగింది? దాని ద్వారా తెలంగాణకు అన్యాయం ఎలా జరిగింది? ఏ ప్రాజెక్టు ద్వారా ఎలా నష్టపోయాం? అన్న వివరాలను ప్రజల ముందు పెడుతాం.

దేవాదులకు నీళ్లే లేవు… ఇంకొక ఉదాహరణ చెపితే మీరు అశ్చర్యపోతారు. దేవాదుల ఎత్తిపోతల పథకం మీద ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ. 7,500 కోట్లు. ప్రాజెక్టు అంచనాల ప్రకారం లిప్టులు 170 రోజులు నడువాలి. గోదావరి నది పారుతున్నా లిప్టుకు నీళ్లు అందడం లేదు. చిన్న అనకట్ట అన్న కట్టిండ్రా అంటే అదీ లేదు. 170 రోజుల పాటు నీళ్లు అందించాల్సిన దేవాదుల అతి కష్టం మీద 50 నుంచి 60 రోజులకు మించి నడువడం లేదు. ఏడున్నరవేల కోట్లు ఖర్చు పెడితే ఇదీ ఫలితం! తెలంగాణ ప్రాజెక్టులు అంటే అంతర్‌రాష్ట్ర వివాదాలు సృష్టించడం.. క్లియరెన్స్‌ల పేరుతో కాలయాపన చేయడం.. వివాదాలు లేకపోతే కావాలని కొత్తగా సృష్టించడం… గోదావరి నీరంతా ధవళేశ్వరం తీసుకెళ్లే కుట్రలే ఇన్నాళ్లు జరిగాయి.

మహారాష్ట్ర కట్టింది 200 ప్రాజెక్టులు.. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ ఇరిగేషన్ పాలసీ మీడియాద్వారా ప్రజల ముందు పెడుతాం. ఏ నదినుంచి నీళ్లు తీసుకొవచ్చు.. ఏ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీరుఇవ్వవచ్చు..వంటి పూర్తివివరాలను ప్రజల ముందు పెడుతాం. గతంలో జరిగిన పొరపాట్లను కూడా విప్పి చెపుతాం. గతమంతా డ్రామాల మయంగానే నడిచింది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం అడిన డ్రామాను మనం చూసినం. ఉద్యమ ప్రస్థానంలో వచ్చిన ఉప ఎన్నికల సమయంలో బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకున్నట్లుగా నటించి. అక్కడ అరెస్టు అయి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కానీ జరిగిందేమిటో తెలుసా? ఇదే చంద్రబాబునాయుడు సాక్షిగా.. అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సాక్షిగా గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు సంఖ్య రెండువందలు. అందుకే మన ఎస్సారెస్పీకి నీళ్లు రావడం లేదు. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం వివరాలు తెప్పించినం. గోదావరి నదిపై ఏ ప్రాజెక్టు ఎక్కడ కట్టారన్న వివరాలు మొత్తం వచ్చినయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అవలంభించిన క్రియశూన్యత, అసమర్థత, అవివేకం వల్ల.. రైతాంగాన్ని రక్షించలేని చేతగాని తనం వల్ల ఈ రోజు తెలంగాణ ప్రాంతంతో పాటుగా ఆంధ్రాకు అన్యాయమే జరిగింది. ఏదో ఒక ప్రాజెక్టు వద్దకు పోయి డ్రామాలు చేసే ప్రయత్నం చేసుడే తప్ప.. చిత్తశుద్ధితో అపే ప్రయత్నం జరుగ లేదు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వద్దకు పోవడమో.. కోర్టును అశ్రయించడమో జరగాలి.. కానీ అవేవీ జరుగలేదు. దీంతో రెండు వందల ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. అలాగే భీమా, కృష్ణనదిపై కూడా ప్రాజెక్టులను నిర్మాణం చేశారు. గోదావరిమీదనే కాదు.. దాని ఉపనదులు మంజీర, ప్రవరపై కూడా ప్రాజెక్టులు కట్టారు. కృష్ణనది మీద కూడా దాదాపు వంద ప్రాజెక్టులను కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు నిర్మాణం చేశాయి. ఆరోజు ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించలేదు. ఏ ఒక్క నాయకుడు నోరు విప్పలేదు. ఈరోజు మళ్లీ ఆవే పార్టీలు, ఆ నాయకులే మాట్లాడుతున్నరు.

మనకు మిగిలినవి రెండే నదులు.. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణకు ముందు కనిపిస్తున్నవి రెండే నదులు. ఒకటి ప్రాణహిత, రెండవది ఇంద్రావతి. మనం నీళ్లు వాడుకోవాలంటే ఈ రెండు నదులల్ల మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఇక వేరే మార్గాలు లేవు. దారులన్నీ మూసుకుపోయినయి. మనకు సాగునీరు కాని, తాగునీరు కాని, పరిశ్రమల నీరు గానీ, ఈరోజు ఉన్న ఏకైక అవకాశం ఇంద్రావతి, ప్రాణహిత.

లేని సమస్యలు సృష్టి.. రాష్ట్రంలో కొన్ని యూనియన్లు లేని సమస్యలను సృష్టిస్తున్నాయి. ఇది బాధ కలిగించే విషయం. ఎందుకంటే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా సఫాయి అన్న.. నీకు సలాం అని నేనే చెప్పా. వారి వేతనాలు సరిగా లేవు పెంచుతామని చెప్పా. స్వయంగా ముఖ్యమంత్రే వేతనాలు పెంచుతామని చెప్పిన తర్వాత ఎవరైనా సమ్మెనోటీసు ఇస్తారా? కొన్ని యూనియన్లు పనికిమాలిన రాజకీయాల కోసం ప్రాకులాడుతున్నాయి. ఒకవైపు బోనాలు, మరోవైపు రంజాన్ పండుగలు. ఈ సమయంలో సమ్మె నోటీసు ఇచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అది మంచి పద్దతి కాదు. రాష్ర్టానికి శ్రేయస్కరం కాదు. చాలా కష్టాలు పడి త్యాగాలు చేసి ఈ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఆషామాషీగా రాలేదు. ఇప్పటికైనా ఈ ప్రతిపక్షాలు అత్మవలోకనం చేసుకోవాలి.

గోసపడ్డాం.. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిణామాలు చూస్తున్నాం. కొంతమందికి అది రుచించకపోవచ్చు, కొన్ని పార్టీలకు పాపం నచ్చకపోవచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. విమర్శించాలనుకునే వాళ్లకు ప్రతీది ఒక విమర్శ కిందే ఉంటది. చాలా సమాధానాలు ఇప్పటికే చెప్పినం. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతకు 30 ఏళ్లు తల్లడిల్లినం. ఇపుడు ఆరు మాసాలు తిరగకముందే ఆ సమస్యను అధిగమించినం. ఇది గ్రేట్ సక్సెస్. 91వేల 500 కోట్ల రూపాయలతో 25వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ రోజు రాష్ట్రం ముందుకు దూసుకొని పోతున్నది. భూముల సేకరణ, కాంట్రాక్టుల అప్పగింత, అంతా జరిగిపోయింది. దాంట్లో ఒక్క పైసా కూడా ఎక్కడ అవినీతి లేకుండా పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలకే బాధ్యతలు అప్పగించాం.

ఆదాయాలపై అసత్య ప్రచారం ఈ సంవత్సరం పటిష్టంగా బడ్జెట్ రూపకల్పన చేసుకున్నం. చాలా చక్కగా మన రెవెన్యూ ఉన్నది. క్వాటర్‌లో వచ్చిన ట్రెండ్స్ చూసినట్లయితే చాలా ఆరోగ్యకరంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఉంది. కొన్ని పత్రికలు పని కట్టుకొని కథనాలు రాస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు తెలిసీ తెలియక వాళ్ల పరువు తీసుకునే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రినన్నా అడగాలి. సెక్రటరీని అడగాలి.స్టేట్‌మెంట్లు ఇచ్చేముందు వాస్తవాలు తెలుసుకోవాలి, అదేం లేకుండానే రాష్ట్రం దివాళా తీసిందంటూ ఏదో ఒకాయన పేపర్లో రాస్తడు. దాన్ని పట్టుకొని ఇంకో లీడర్ మాట్లాడుతడు. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ తెలంగాణ రాష్ర్టానికి ఏ రేటింగ్ ఇచ్చింది. చాలా తక్కువ రాష్ర్టాలకు ఇది వస్తది. నాకు తెలిసి ఈ తరహాలో ఒకటో, రెండో రాష్ర్టాలున్నయి . ఈ పరిస్థితులు గమనించకుండా కొంతమంది లేనిపోని ఆరోపణలు, లేనిపోని కథలు మాట్లాడుతా ఉన్నరు. ఈ రోజు సంక్షేమ రంగంలో దేశంలో మనమే నంబర్‌వన్ స్థానంలో ఉన్నాం.రూ. 28 కోట్ల ఖర్చుతో అమలుచేస్తున్నం.

70 సంవత్సరాలుగా నిర్లక్ష్యం గత 70 సంవత్సరాల నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామసీమలు, పట్టణాలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయి. మురికి కూపాల్లా తయారైనయి. హైదరాబాద్ కూడా మినహాయింపు కాదు. ఒక వ్యూహం ప్రకారం స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నం. హైదరాబాద్‌ను దాదాపు 400 విభాగాలు చేసాం. ఒక వారం పాటు తిరిగి సమస్యలన్నింటిని ఆకళింపు చేసుకున్నాం. తాత్కాలికంగా కావాల్సిన పనులు అక్కడిక్కడే చేశాం. రూ200 కోట్ల రూపాయల పనుల కోసం ఆర్జీలు వచ్చాయి. వాటిని శాంక్షన్‌చేశాం. పనులు ప్రారంభమయ్యాయి. జీహెచ్‌ఎంసీలో 40 లక్షల చెత్త బుట్టలకు, 2500 ఆటో రిక్షాలకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని 21వేల కోట్లతో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్స్, రోడ్ ఓవర్ రోడ్ వంటి ప్రణాళికలు చేశాం.

పట్టణాల్లో ఉన్న దుస్థితి, ఇక్కడ అవలంభించాల్సిన పద్ధతి గురించి ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చింది. పురపాలకసంఘాలకు, కార్పొరేషన్లకు నిధులు, మౌలిక సౌకర్యాలు సమకూర్చాల్సి ఉంది. వారి దగ్గర నిధులు లేవు. మున్సిపాలిటీల్లో అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ, అక్రమంగా కట్టిన భవనాల క్రమబద్ధీకరణ వంటి వాటిని త్వరలో ప్రారంభం చేయబోయే పట్టణ జ్యోతి కింద తీసుకుంటం. మేయర్లు, చైర్మన్లతో త్వరలో సమావేశం నిర్వహిస్తాం. గ్రామాల్లో సుమారు 25వేల కోట్లును మనం రాబోయే 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నాం. ఎంపీటీసీ మిత్రులు తమకు కమిటీల్లో సభ్యత్వం ఇవ్వలేదని.. అవకాశం ఇవ్వాలని అంటున్నరు. వంద శాతం సమర్థిస్తా. ఎంపీటీసీలను కూడా సర్పంచ్‌తో సమానంగా భాగస్వామ్యం చేసేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి త్వరలో విడుదలచేస్తాం.

గుడుంబా ఎవరి పుణ్యం? విలేకరుల ప్రశ్నలకు సీఎం బదులిస్తూ రాష్ట్రంలో విచ్చలవిడిగా గుడుంబా ఏరులై పారేందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఏ గ్రామానికి వెళ్లినా గుడుంబా బారిన పడి పోయి చనిపోయిన వాళ్లే కనిపించడానికి కారణాలు ఏమిటి? అని ప్రశ్నించారు. తాను వరంగల్ వెళ్లినపుడు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి ప్రభుత్వ సారా పెట్టి అయినా సరే గుడుంబా రాకుండా చేయ్యమని అడిగారని గుర్తు చేశారు. చీప్‌లిక్కర్‌తో గుడుంబా మహమ్మారిని తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. నిజానికి గుడుంబా వ్యాపారం తయారు చేసేవాళ్లు.. సరఫరా చేసేవాళ్లు అంటూ వ్యవస్థగా పాతుకుపోయి ఉందని వారికి ఉపాధి చూపించాల్సి వస్తున్నదని చెప్పారు. తాను ఈ ప్రతిపాదన అధికారుల ముందు పెట్టినపుడు వందల కోట్ల నష్టం వస్తుందని చెప్పినా, ఫర్వాలేదు అమలు చేద్దామని నిర్ణయించామని వివరించారు. ఆదాయం పోయినా శాశ్వత పరిష్కారం దిశగా ఈ విషయంలో అడుగులు వేస్తున్నామన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కడతారా? అన్న ప్రశ్నపై స్పందించిన ముఖ్యమంత్రి ఎందుకో ఇచ్చంపల్లి మనకు అచ్చిరాలేదని చెప్పారు. అందుకే ఆ స్థలానికి అటూ ఇటుగా కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు కడతామని తెలిపారు. గోదావరి నీటి వినియోగంపై లైడార్ సర్వే చేయిస్తున్నామని ఈనెలాఖరులోపు సర్వే రిపోర్టులు వస్తాయని అశిస్తున్నామన్నారు. దీని ద్వారా ఏ ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో నిర్దారిస్తామన్నారు. నగరాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలపై కేంద్రం నుంచి అమృత్, స్మార్ట్ సిటీలపై పూర్తి వివరాలు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కేజీ టూ పీజీ విద్యను ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని చెప్పిన ముఖ్యమంత్రి.. దీనికి పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందన్నారు. ఏపీ తరహాలో తెలంగాణకు ప్యాకేజీ అడుగుతారా? అన్న ప్రశ్నకు ఇప్పటికే చాలా సార్లు లేఖలు రాశామని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో దుర్భిక్షంపై మాట్లాడుతూ సెప్టెంబర్ 30వరకు సీజన్ ఉంటుందని ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వేచి ఉన్నామని చెప్పారు. రాజీవ్ రహదారి పై ఉన్న క్రాసింగ్‌లు తొలగించడానికి చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీకి టోల్‌టాక్సు మినహాయింపు గురించి అలోచిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తితో పాటుగా మహబూబ్‌నగర్‌లో సోలార్ విద్యుత్ ఉత్పదనకోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. త్వరలో నామినేటేడ్ పోస్టులు భర్తీచేస్తామని తెలిపారు.

బ్యారేజీలను నిపుణులు నిర్ణయిస్తరు.. ఈ రోజు తోటపల్లి బ్యారేజీ కట్టాలంటూ కొంత మంది ధర్నా చేస్తున్నారు. ఇదో పనికి మాలిన ధర్నా. ఇంజినీర్లను రీ డిజైన్ చేయమని చెప్పాం. ఎక్కడ బ్యారేజీ ఉండాలన్న నిర్ణయాలను రాజకీయనాయకులు చేయరు. అది సాంకేతిక నిపుణులు చేస్తరు. ప్రజలకు నీళ్లు ఇవ్వాలె.. అందుకు ప్రాజెక్టు కట్టాలె అనే నిర్ణయాన్ని మాత్రమే రాజకీయ నాయకులు చేస్తారు. ఆ ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి? దాని పీజిబిలిటీ ఏమిటి? అనే విషయాలను సాంకేతిక నిపుణులు చూసుకుంటారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గంలోని మెజార్టీ ప్రాంతం దుర్భిక్షంలో ఉంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ నాలుగు నియోజకవర్గాలకు కడుపు నిండా నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వ్యూహరచన చేశాం. పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో స్పష్టమైన అదేశాలు ఇచ్చాను. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యమానేరు నింపుకోవాలి. అందులోని ఉన్న ముంపు, నష్టపరిహారం అంతా పరిష్కరించాలని చెప్పాం. తర్వాత మిడ్‌మానేరు నుంచి అప్పర్ మానేరుకు ఉన్నటువంటి లిప్టు ఇరిగేషన్ పూర్తిచేస్తే సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయి. మధ్యమానేరు నింపడం వల్ల హుస్నాబాద్, మానకొండూరుకు నీళ్లు వస్తాయి.

విమర్శిస్తే గొప్పవాళ్లు అయిపోరు.. తెలంగాణ బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చిన సందర్భంంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదు. ఇరిగేషన్‌లో గోదావరి కృష్ణ నదులు కలిపి 1280 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించామని శాసనసభకు ఒక అధికారిక నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనుకూలమైన భూమి ఉన్నదే 40 లక్షల 40వేల హెక్టార్లు. అంటే ఒక కోటి రెండు లక్షల ఎకరాలు. మరి 1280 టీఎంసీ లు ఇస్తే కోటి రెండు లక్షల ఎకరాలు పారకం పోను ఇంకా నీళ్లు మిగిలి ఉండాలి. మరి ఎందుకు లేవు? ఈ రోజు కరెంటు కొరతకు, రైతుల అత్మహత్యలకు, సాగునీటి లేమికి, నిలువెత్తు నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులకు, గ్రామాలు, పట్టణాలు మురికి కూపాలుగా మారడానికి కారకులెవ్వరు? గత 65ఏండ్ల పాలనలో మొత్తం కాంగ్రెస్, టీడీపీలే ఈ రాష్ర్టాన్ని పాలించాయి. వేరే ఎవరో పరిపాలించలేదు. కానీ ఇంతదాకా ఎవరో పరిపాలించినట్లు.. దీనికి ఎవరో బాధ్యులైనట్లు ఆ పార్టీల నాయకులే ఇప్పుడు మాట్లాడుతున్నారు. 14నెలల్లోనే అంతా కరాబు చేసినంట్లు మాట్లాడుతున్నరు. మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలా? వద్దా? ఇంత అన్యాయంగా వక్రీకరణ చేస్తూ ఎలా మాట్లాడుతారు? ప్రభుత్వాన్ని విమర్శిస్తే మేం గొప్పవాళ్లం అయితం అనే ధోరణి కనిపిస్తుంది. ఇది కరెక్టు పద్ధతికాదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.