-ప్రజలతో నిత్యం మమేకంకావాలి
-మున్సిపల్ ఎన్నికలు ముగిశాక పాలనపైనే పూర్తిస్థాయిలో దృష్టి
-దసరాకల్లా జిల్లా పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తిచేయాలి
-మంత్రులు, పార్టీ కార్యాలయాల నిర్మాణ ఇంచార్జులతో కేసీఆర్
-కార్యాలయాల నిర్మాణాలకోసం రూ.60 లక్షల చొప్పున చెక్కులు అందజేత
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పార్టీ నాయకులు ఉండాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పార్టీ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకంకావాలని, వారి సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండాలని పిలుపునిచ్చారు. వచ్చే దసరాకల్లా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని సూచించారు. వీటికోసం బాధ్యులకు రూ.60 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో రాష్ట్ర మంత్రులు, పార్టీ కార్యాలయాల నిర్మాణ ఇంచార్జులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జాతీయపార్టీలకు స్థానంలేదని చెప్పారు.

మున్సిపల్ ఎన్నికలు ముగియగానే పూర్తిస్థాయిలో పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలపై దృష్టి పెడుదామన్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ బలంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకంతో ఇంకా బాగా పనిచేద్దామన్నారు. రాష్ట్రంలో అన్నిరంగాలకు 24గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. గతంలో విద్యుత్ సరఫరా ఎలా ఉన్నదో, ఇప్పుడెలా ఉన్నదో ప్రజలంతా ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తున్నామన్నారు. అనేకరకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయని చెప్పారు. ఇలా ప్రజల అవసరాలను తీర్చేలా పథకాలను ప్రవేశపెడుతున్నాం కాబట్టే వారి మనసుల్లో చెరగని ముద్ర వేశామని, అందుకే మనల్ని ఆదరిస్తున్నారని అన్నారు.

దసరాకల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలను దసరాకల్లా పూర్తిచేయాలని నిర్మాణ ఇంచార్జులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాలు ఒకేవిధంగా ఉండేలా నమూనాలను రూపొందించామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును త్వరగా పూర్తిచేయాలని, ఆ తర్వాత కమిటీలను వేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తికావచ్చిందని, పార్టీ నాయకులు చురుకుగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాల వివరాలను ఆన్లైన్లో నమోదుచేయడం కూడా పూర్తయిందని తెలిపారు.

రూ.60 లక్షల చొప్పున చెక్కులు అందజేత పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణాలకు అవసరమయ్యే నిధులను పార్టీయే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు రూ.60లక్షల చొప్పున చెక్కులను పార్టీ భవనాల ఇంచార్జులకు ఆయన అందజేశారు. పార్టీ కార్యాలయాల నమూనాలను కూడా అందించారు. కొత్తగా నిర్మించుకునే కార్యాలయాల్లో పార్టీ క్యాడర్‌కు శిక్షణాకార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గస్థాయిలోనూ పార్టీ కార్యాలయాలను నిర్మించుకుందామన్నారు. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయానికి ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం కేసీఆర్ చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రజలిఇచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని, మెరుగైన పాలనను అందిద్దామని పిలుపునిచ్చారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో కరువు ఉం డదని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలుచేయని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రజల అవసరాలను తీర్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులందరితోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జిల్లా పార్టీ కార్యాలయాలున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జోగురామన్న, టీ హరీశ్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, దివాకర్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గంపగోవర్ధన్, భూపాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.