-మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం -మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరించాలి -గెలుపోటములకు ఎమ్మెల్యేలదే బాధ్యత -ఇంటింటికీ ప్రచారం చేయండి -ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. -సంక్షేమ పథకాలను వివరించండి -త్వరలో గల్ఫ్ యాత్ర -ఎంబీసీలకు మరిన్ని నిధులు -జిల్లా పరిషత్ చైర్మన్లకు అధికారాల బదిలీ -నిరక్షరాస్యులులేని రాష్ట్రంగా తెలంగాణ -త్వరలోనే ఈచ్‌వన్-టీచ్‌వన్ కార్యక్రమం -టీఆర్ఎస్ విసృ్తతస్థాయి సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్‌రావు

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని, ప్రజలంతా టీఆర్ఎస్వైపే ఉన్నారని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరించాలని చెప్పారు. ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత అంతా పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యులదేనని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో శనివారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి తెలంగాణలో ఎవరూచేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
దాదాపు 40 లక్షల మందికిపైగా ఆసరా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.2016 ఇస్తున్నామని, దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.3016 ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని 21 రాష్ర్టాల్లో బీడీ కార్మికులున్నప్పటికీ.. కేవలం మన రాష్ట్రంలోనే ఒక్కొక్కరికి నెలకు రూ.2016 ఇస్తున్నామని, ఈ విషయాన్ని బీడీ కార్మికులకు మరోసారి గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. బీడీ కార్మికులు అధికంగా ఉన్న దగ్గర పార్టీ ఓడిపోతే అక్కడి ఎమ్మెల్యేదే వైఫల్యమని అన్నారు. ఒంటరి మహిళకు కూడా పింఛన్ అందిస్తున్నామని.. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి.. ఇలా అనేక పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఇంటింటికీ వెళ్లి నేరుగా కలువాలని పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని, కేవలం ప్రచారంతోనే ఈ ఎన్నికలను గెలువలేరని.. ప్రణాళికతో ముందుకు వెళ్తేనే సులువుగా గెలువగలుగుతామని వివరించారు. ముందునుంచే ఒక అంచనా ఉండాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు సూక్ష్మంగా జరిగే ఎన్నికలని.. మేనేజ్మెంట్ ద్వారానే గెలుస్తామని చెప్పారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే తండ్రిలాంటివాడని సీఎం అన్నారు.
మంత్రులూ.. బీ కేర్‌ఫుల్ అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ గెలువాలని, నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపోటముల వరకు మంత్రులు, ఎమ్మెల్యేలదే బాధ్యత అని స్పష్టంచేశారు. ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరు సీరియస్‌గా తీసుకోవాలని హెచ్చరించారు. పాత, కొత్త కార్యకర్తలు, నాయకులను కలుపుకొని పోవాలని, అభ్యర్థుల ఎంపికలో తమ చుట్టూ తిరిగే నేతలను కాకుండా వాస్తవ పరిస్థితులు, కులాలు, మతాలు, ఇతర సామాజిక సమీకరణాలు, ప్రజాదరణతోపాటు అన్నివర్గాల ప్రజలను పరిగణనలోకి తీసుకొని ఎంపికచేయాలని సీఎం మార్గనిర్దేశంచేశారు. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు మున్సిపాలిటీలవారీగా పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటుచేసుకోవాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమోదు పూర్తయిందని.. పార్టీ సభ్యుల వివరాలను అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేదే తుది నిర్ణయమన్నారు. గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు.. తాను ఎమ్మెల్యేదే తుది నిర్ణయమని అంటే, ఎన్టీఆర్ మాత్రం ఇద్దరుముగ్గురు నాయకులుండాలని.. దానిద్వారా అవినీతికి చెక్ ఉంటుందని అనేవారని గుర్తుచేశారు. తన ఉద్దేశంలో ఎమ్మెల్యే ఒక్కరే ఉండాలని.. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేదే తుది నిర్ణయమని.. ఈ విషయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరూ జోక్యం చేసుకోవద్దని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంటినుంచి పనిచేయడం కాకుండా పార్టీ కార్యాలయాల నుంచి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ఎమ్మెల్యేగా గెలువడానికి కారణమైనవారిని ఎప్పటికీ మరువవద్దన్నారు. ఎన్నికలప్పుడే పార్టీ కార్యకర్తల దగ్గరికిపోతే, ఎన్నికలు వచ్చినయి కాబట్టి వస్తున్నారనే అపప్రథ వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.

ఎమ్మెల్యే క్రాంతికి అభినందనలు అందోల్ నియోజకవర్గంలో గతంలో బాబూమోహన్‌ను కష్టపడి తిరిగి తాను గెలిపించానని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా ఇచ్చామని.. కానీ వాటిని సద్వినియోగంచేసుకోకుండా కేవలం నోటిదురుసుతోనే ఓడిపోయే పరిస్థితి తెచ్చుకొన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. అక్కడ ఉద్యమకారుడు, జర్నలిస్టు క్రాంతికి టిక్కెట్ ఇచ్చి గెలిపించుకొన్నామన్నారు. ఎమ్మెల్యేలంతా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవుచెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోతామని తెలిసి కూడా సీటు ఇవ్వాల్సివచ్చిందన్నారు. సంగారెడ్డి సీటులో ఓడిపోతామని ముందే తెలుసునని, సర్వే నివేదికలు, ఇంటెలిజెన్స్ నివేదికలు అదేవిధంగా చెప్పాయని.. అయినప్పటికీ అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో టిక్కెట్ ఇవ్వాల్సివచ్చిందని చెప్పారు. అక్కడ చివరివరకు కష్టపడ్డారని.. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయామని గుర్తుచేశారు.
జెడ్పీ చైర్మన్లకు అధికారాలు జిల్లా పరిషత్ చైర్మన్లకు త్వరలో అధికారాలు, విధుల అప్పగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారులు, జెడ్పీ చైర్మన్లతో వర్క్‌షాప్ నిర్వహించి అధికారాల గురించి చర్చిస్తామని, జెడ్పీలకు విద్య బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదన ఉన్నదని పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్లను ప్రొటోకాల్ పరంగా గౌరవించుకోవాలని, అన్ని కార్యక్రమాల్లో వారిని వేదికమీదకు పిలువాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటుహక్కు ఉంటుందని, ఎక్కడ పడితే అక్కడ ఓటు వేయవద్దని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘మీ ఓటు మీది కాదు. పార్టీ ఓటు. ఎక్కడపడితే అక్కడ వినియోగించుకోవద్దు. పార్టీ సూచనల ప్రకారం నడుచుకోవాలి. రాష్ట్ర పార్టీ సూచించిన మున్సిపాలిటీల్లోనే ఓటుహక్కు వినియోగించుకోవాలి. 25న ఉదయం ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ రోజున ఎంపీలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్‌కు రావాలి. ఫలితాల ఆధారంగా వారు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలో సూచిస్తాం’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈచ్ వన్ – టీచ్ వన్ అక్షరాస్యతలో తెలంగాణ వెనుకబడి ఉండటం బాధాకరంగా ఉన్నదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే ఈచ్ వన్ -టీచ్ వన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. దీని అమలు తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పార్టీపరంగా అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులు లేని రాష్ట్రంగా తెలంగాణను తయారుచేద్దామని సీఎం పిలుపునిచ్చారు.

ఎంబీసీలకు వ్యవసాయ యంత్రాలు వ్యవసాయపనులకు కూలీల కొరత పెద్దఎత్తున ఉన్నదని, ఈ సమస్యను తీర్చడానికి యాంత్రీకరణ ఇంకా పెరుగాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. విత్తనాలు వేసే యంత్రాలు, కలుపుతీసే యంత్రాలు రావాల్సి ఉన్నదని చెప్పారు. జపాన్‌లో యాంత్రీకరణపై అధ్యయనంచేయడానికి మంత్రి నిరంజన్‌రెడ్డిని పంపిస్తామని పేర్కొన్నారు. సంచార జాతులకు గతేడాది కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కేటాయిస్తామన్నారు. రైతుబంధు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నామని.. ఈ పథకంలో ఐదెకరాల కంటే ఎక్కువగా ఉన్నవారికి ఇవ్వొద్దని సలహా ఇచ్చినప్పటికీ.. అలాంటివారి సంఖ్య ఒకశాతం మించి ఉండదని.. వారిని మినహాయించడం ఎందుకనే ఉద్దేశంతో వారికీ చెల్లిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ వారిని చేర్చుకోవాలి కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరడానికి చాలామంది నాయకులు, కార్యకర్తలు ముందుకొస్తున్నారని.. వారిని పార్టీలో చేర్చుకోవాలని సీఎం కేసీఆర్.. పార్టీ నాయకులను సూచించారు. టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, ఎంఐఎం మనకు మిత్రపక్షమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకే బీ ఫారం జారీచేసే అధికారమిస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డిని సంప్రదించాలని కేసీఆర్ నేతలకు సూచించారు. మున్సిపాలిటీల్లో తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి.. ప్రతి ఓటూ విలువైనదేనని.. ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకొనేలా చూడాలని తెలిపారు. తెలంగాణ ఇతర పార్టీలకు ఒక రాజకీయ ఆట అని, టీఆర్ఎస్కు మాత్రం ఒక టాస్క్ లాంటిదన్నారు. సాధించుకొన్న తెలంగాణను సమగ్రంగా అభివృద్ధిచేసుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్పై ఉన్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా 530 టీఎంసీల నీటిని వినియోగించుకొంటున్నామని, దీనిద్వారా రైతులకు రెండు పంటల నీళ్లు ఇచ్చుకోగలుగుతున్నామని అన్నారు. కాళేశ్వరాన్ని విమర్శించేవారికి ప్రజలు బుద్ధిచెప్పారని.. ఇంకా చెప్తారని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొద్దామని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి పురపాలకశాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తే బాగుంటుందని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందిస్తూ.. సమన్వయంతో ప్రచారం చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. సమావేశం ప్రారంభంలో ఎమ్మెల్సీ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొన్నారు. సభ తరుపున శంభీపూర్‌రాజుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. సమావేశం అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. శంభీపూర్‌రాజు జన్మదినం సందర్భంగా కేక్ కట్‌చేసి అభినందించారు. ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, పార్టీ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వర్రావు, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జీ జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, చామకూర మల్లారెడ్డి, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించాం: వినోద్‌కుమార్ ఈ సమావేశం అనంతరం ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ పట్టణాల్లో అనేక సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వమని.. ప్రభుత్వం చేసిన పనులను గుర్తుచేస్తే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశంచేశారని, టీఆర్ఎస్ పథకాలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. నేతలందరూ గెలుపు కోసం కలిసి పనిచేయాలని చెప్పారన్నారు. పురపోరులో ప్రజలంతా కారుగుర్తుకు ఓటువేయాలని, టీఆర్ఎస్ను గెలిపించాలని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కోరారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రూపొందించిన క్యాలెండర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, రైతుసమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు శంభీపూర్‌రాజు, టీఆర్ఎస్వీ నాయకులు పరుశారాం, రఘరామ్, ఎన్ఎన్ రాజు, కే కిషోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పంటలు.. ధరల నియంత్రణ రైతు సమన్వయసమితుల ద్వారా పంటల నియంత్రణ, ధరల నియంత్రణ జరుగాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో సాగునీరు, కరంట్ పుష్కలంగా ఇస్తున్నామని.. వీటిని చూసి రైతులు ఏ పంట పడితే ఆ పంట వేయకుండా పంటల నియంత్రణ చేయాల్సిన బాధ్యత రైతుసమన్వయ సమితుల మీద ఉన్నదని అన్నారు. భూములను బట్టి మంచి దిగుబడి వచ్చే పంటలను సాగుచేయాల్సిందిగా సూచించాలని చెప్పారు. దిగుబడి రాగానే మార్కెట్‌కు పెద్దఎత్తున పంట రావటంతో ధరలు తగ్గడం.. ఆ తర్వాత పంట తక్కువరావటంతో ధరలు పెరుగటం వల్ల ప్రజలకు కూడా అధికంగా ధరలు ఉంటాయని.. వీటిని పరిష్కరించేందుకు రైతు సమన్వయ సమితుల ద్వారా సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారు. మార్కెట్‌కు ఎప్పుడు.. ఎంత పంట అవసరమైతే అంత పంట వచ్చేలా చూడాలని సూచించారు. రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కష్టపడే వ్యక్తి అని.. వీటన్నింటినీ చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో 1.65 లక్షల మంది రైతు సమన్వయసమితి సభ్యులకు గౌరవవేతనాన్ని నిర్ణయించుకొందామన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి నిరంజన్‌రెడ్డి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో కూడా రైతు వేదికలను నిర్మించాల్సి ఉన్నదన్నారు. ప్రభుత్వ స్థలాలను కానీ, దాతలు ముందుకొచ్చిన వాటిని తీసుకొని గానీ నిర్మించాలని చెప్పారు.
ఒంటరి పోరే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని, స్థానికంగా పొత్తులు అవసరంలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రజలు మనవైపే ఉన్నారని.. సొంతంగానే గెలుస్తామని చెప్పారు. స్థానికంగా ఎవరైనా పొత్తుకు ముందుకొచ్చినా అవసరంలేదని, ఆ తర్వాత వారితో చిక్కులు వస్తాయన్నారు. ఎన్నికలు లేని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఎన్నికలు జరిగే ప్రాంతాలకు పంపిస్తామని వారి సేవలను వినియోగించుకొంటామని వెల్లడించారు. ఎన్నికల్లో ఎక్కడివారు అక్కడే ప్రచారం చేసుకోవాలన్నారు. మంత్రులు, ఇతర నాయకుల ప్రచారం అవసరముంటే తమకు చెప్పాలని.. వారిని అక్కడికి పంపిస్తామని పేర్కొన్నారు. మైనార్టీలు అధికంగా ఉండేదగ్గర హోంమంత్రి మహమూద్ అలీ, అక్బర్ హుస్సేన్ వంటి నేతలను, ఇతర సామాజిక వర్గాలకు అవసరమైతే ఆ నాయకులను పంపిస్తామని పేర్కొన్నారు. త్వరలో గల్ఫ్ యాత్ర.. రాష్ర్టానికి చెందిన అనేకమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారని.. వారి సంక్షేమం గురించి తెలుసుకోవడానికి త్వరలో గల్ఫ్ యాత్రకు వెళ్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. గల్ఫ్‌వాసుల కుటుంబీకులు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్తానని వెల్లడించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు మరికొందరు తన వెంట వస్తారన్నారు. తెలంగాణలో ఉపాధికోసం ఇతర రాష్ర్టాలనుంచి చాలామంది వస్తున్నారని, కానీ మన రాష్ర్టానికి చెందిన వారు దుబాయి వెళ్తున్నారని చెప్పారు. వారికి ఇక్కడే కావాల్సినంత పని ఉన్నదని పేర్కొన్నారు. పల్లెప్రగతి రెండోవిడుత కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని ఆయన ప్రజాప్రతినిధులను కోరారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చామని.. ఈ రెండు చట్టాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పట్టణప్రగతి కూడా చేపడుతామని వెల్లడించారు. త్వరలో అర్బన్, రూరల్ పాలసీలను తీసుకొస్తామని చెప్పారు.
పురపోరులో పార్టీ విజయానికి కృషిచేయండి – టీఆర్ఎస్ ఆస్ట్రేలియాశాఖ ప్రతినిధులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు కృషిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పార్టీ ఎన్నారై విభాగానికి సూచించారు. శనివారం టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆస్ట్రేలియాశాఖ ప్రతినిధులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నదని, మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మీడియా ద్వారా ప్రచారంచేయాలని కేటీఆర్ వారికి సూచించారు. ఉపాధ్యక్షుడు రాజేశ్గిరి రాపోలు ఆధ్వర్యంలో సామాజిక మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని, ఇకపై మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్‌ను కలిసినవారిలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియాశాఖ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ దూపాటి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీరేందర్, సాంబరాజు, అనిల్ ఉన్నారు.