-జిల్లా, మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి -పరిషత్ ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. ఈ గెలుపుతో పొంగిపోకుండా ప్రజలతో కలిసి పనిచేయాలని వారికి సూచించారు. ప్రతిజిల్లా, మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా ప్రయత్నించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఫలాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీకి మరింత మంచిపేరు తేవాలని కోరారు. బుధవారం వివిధ జిల్లాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలు కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గెలిచిన జెడ్పీటీసీ సభ్యులు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఆధ్వర్యంలో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో చర్చించారు.
గ్రామీణప్రాంత ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలదే కీలకపాత్ర అని చెప్పారు. కార్మిక, ధార్మికక్షేత్రాలు రాష్ర్టానికే ఆదర్శంగా ఉండేలా అభివృద్ధిచేయాలని, రోడ్లు, మురికికాల్వల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలను, నాయకులను ప్రశంసించారు.

కేటీఆర్, మంత్రి ఈటల పరస్పర అభినందనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానికసంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు మంత్రి ఈటల రాజేందర్, కేటీఆర్ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాతోపాటు పూర్వ కరీంనగర్ జిల్లాలో పెద్దఎత్తున స్థానిక సంస్థల స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకున్న నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్.. కేటీఆర్ నివాసానికి వెళ్లి అభినందించారు.