-రాష్ట్రంలో జోరుగా ‘పట్టణ ప్రగతి’ -వార్డుల్లో మంత్రుల విస్తృత పర్యటన -తొలుగుతున్న మురుగు.. స్వచ్ఛబాటలో పట్టణాలు
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం జోరందుకున్నది. పల్లె ప్రగతి స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమంలో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడుతున్నది. కాలనీల్లో అంతర్గత రోడ్లతోపాటు డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం వేగవంతమవుతున్నది. కౌన్సిలర్ నుంచి మంత్రి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో మమేకమవుతూ శ్రమదానం చేస్తుండటంతో పట్టణాలు మెరుస్తున్నాయి. బుధవారం జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 13, 30వ వార్డుల్లోని దళితవాడల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ కాలి నడకన పర్యటించారు. పలు జిల్లాల్లో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

మౌలిక సదుపాయాల కల్పనకే ‘పట్టణ ప్రగతి’ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టణాలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించి, ప్రజల భాగస్వామ్యంతో వాటిని అభివృద్ధి పథంలో నిలుపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలో అదనపు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 20, 30వ వార్డుల్లో కలియతిరిగారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎవరికి వారు తమ ఇండ్లల్లోనే తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కోరారు. ఇందుకోసం ఇంటింటికీ వేర్వేరు చెత్తబుట్టలు ఇస్తున్నామని చెప్పారు. వీధుల్లో, ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామన్నారు. చెత్త దేశానికి పెద్ద సమస్యగా మారిందని, దేశంలో రోజూ 20 వేల టన్నుల చెత్త సేకరిస్తున్నామని, దానిని అరికట్టే బాధ్యత మనందరిపై ఉందన్నారు. త్వరలో 57 ఏండ్ల వారికి పింఛన్లు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో తమ సొంత ప్లాట్లలో ఇండ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తామని పేర్కొన్నారు.
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావించి అమలుచేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణితో కలిసి మంత్రి పాల్గొన్నారు. అధికారులు, నాయకులతో కలిసి కాలనీలో కలియతిరిగారు. పట్టణాభివృద్ధి జరుగుతుందా?, సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అని స్థానికులను అడిగారు. అనంతరం అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మాట్లాడారు. ప్రజలకు సక్రమంగా సేవలందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 75 గజాల్లోపు ఇండ్లు నిర్మించుకుంటే అనుమతులు అవసరం లేదన్నారు. భూపాలపల్లి పట్టణ ప్రగతికి హాజరుకాని విద్యుత్‌శాఖ అధికారులతోపాటు కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

ప్రతిపక్షాలు పాల్గొనడం శుభసూచకం: గంగుల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన వస్తున్నదని, ప్రతిపక్ష నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభసూచకమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 11, 12, 42వ డివిజన్లతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీలో బుధవారం మంత్రి విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో కాలినడకన తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఇక అభివృద్ధి తప్ప.. రాజకీయాలకు తావుండకూడదన్నారు. అంతిమంగా ప్రజల కు మేలు చేయడమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా వెచ్చించేందుకు సిద్ధ్దంగా ఉందని స్పష్టం చేశారు. 42వ డివిజన్లోని ఇందిరానగర్‌లో పర్యటించిన మంత్రి ఒడ్డెరకాలనీలో ఇండ్ల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. ఇందిరానగర్‌లో ఇండ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తొలిగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన వెంట ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ కమిషనర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

సుందర పట్టణంగా తీర్చిదిద్దుతా: శ్రీనివాస్‌గౌడ్ పాలమూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీలో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి పర్యటించారు. వార్డులో కలియతిరిగి పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీలను, పైపులైన్ లీకేజీలను పరిశీలించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు పట్టణ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని, తెలంగాణ వచ్చాకే ప్రతి సమస్య పరిష్కారానికి నోచుకుంటున్నదని తెలిపారు. 2014 కంటే ముందు పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారనీ, ప్రస్తుతం ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు వస్తుందన్నారు. మంత్రివెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, సింగిల్ విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

వందశాతం వసతులు కల్పిస్తాం: మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన పట్టణాల్లో వందశాతం మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని పోచారం, నాగారం మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అధికారులు అంకితభావంతో పని చేయాలని మంత్రి సూచించారు.
కొత్తచట్టంతో మంచి సేవలు: సబితారెడ్డి మున్సిపాలిటీల్లో అవినీతిని తగ్గించడంతోపాటు పౌరసేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టాన్ని తెచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పట్ట ణ ప్రగతిలో భాగంగా రంగారెడ్డి జిల్లా మీర్పేట్, ఆమనగల్లు మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమనగల్లులో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకు సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరాతో నీటి సమస్య తీరుతుందని చెప్పారు.

నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ ; మంత్రి జగదీశ్‌రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలను అమలుచేస్తున్నారని, అభివృద్ధి పథంలో తెలంగాణ తనకు తానే పోటీ పడుతున్నదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మున్సిపాలిటీ చైర్పర్సన్ కర్న అనూషాశరత్రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పైలాన్‌కాలనీలోని 7వ వార్డులో పర్యటించి పనులను పరిశీలించారు. వార్డుల వారీగా కమిటీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలంతా సమష్టిగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమస్యను అధిగమించడానికి ప్రతిఒక్కరూ ఆరు మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే రానున్న రోజుల్లో గాలిని కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రపంచ పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్ అభివృద్ధిని గత పాలకులు విస్మరించారని, స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా ఎదిగిన తీరును మంత్రి గుర్తు చేశారు.