-అభివృద్ధిపై న్యాయ నిర్ణేతలు వారే -24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణదే -వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి -మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

ప్రజలే మా ప్రభువులు.. అభివృద్ధిపై న్యాయ నిర్ణేతలు వారే అని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో గ్రామపంచాయతీ భవనానికి మిషన్ కాకతీయ ఫేజ్-3 కింద రూ.46.66 లక్షలతో చేపట్టిన వెంకటరాయని చెరువు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. భవిష్యత్తులో కరెంటు కష్టాలు, నీళ్లగోస ప్రజలకు ఉండకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని కేటీఆర్ కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు రాత్రనక పగలనక కరెంటు కోసం పంట చేల వద్ద పడిగాపులు కాసేవారన్నారు. అధికారుల కాళ్లు మొక్కినా.. పంటలు ఎండి నా కరెంటు ఇవ్వకుండా నానా తిప్పలు పెట్టారని గుర్తుచేశారు..
స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత 24గంటలపాటు కరెంటు ఇస్తామన్నా కొందరు రైతులు వద్దంటున్నారని ఇదీ బంగారు తెలంగాణలో వచ్చిన మార్పు అన్నారు. వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం పనులు పూర్తవుతాయని చెప్పారు. ఇంటింటికీ నీరందించి గోదావరి జలాలతో ఆడపడుచుల కాళ్లు కడుగుతానన్న సీఎం హామీ త్వరలో నెరవేరుతుందన్నారు. మధ్య మానేరు ఎత్తిపోతల పథకంతో మల్కపేట చెరువుతోపాటు ఎగువ మానేరును నింపి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల బోర్లున్నాయన్నారు. అన్ని బోర్లు ఏకధాటిగా నడిస్తే పంటలకు నీరందడం కష్టంగా ఉంటుందన్నారు. అందుకే రైతులు గతంలో ఏర్పాటు చేసుకున్న ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంత బురద చల్లినా.. తమను అప్రతిష్ఠపాలు చేయాలని చూసినా ప్రజలే తగిన సమాధానం చెపుతారన్నారు