-త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావద్దు: కేసీఆర్ – ప్రజల ఎజెండానే మా ఎజెండా -ఆకుపచ్చ తెలంగాణ చూడాలన్నదే కోరిక -తుమ్మల నా కుడి భుజం.. ఆత్మీయుడు -పాలేరునుంచి పోటీచేయాలని నేనే కోరిన – బ్రహ్మాండమైన మెజారిటీతో తుమ్మలను గెలిపించాలి -ఖమ్మం బహిరంగ సభలో సీఎం కే చంద్రశేఖర్‌రావు

టీఆర్ఎస్ పార్టీకి హైకమాండ్ లేదని, తెలంగాణ ప్రజలే తమ పార్టీకి హైకమాండ్ అని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణను చూడాలన్నదే తన కోరికని అన్నారు. అనేక కష్టనష్టాలకోర్చి తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావద్దనే బాధ్యత తలకెత్తుకున్నానని చెప్పారు. సరిగ్గా 15 ఏండ్లక్రితం ఇదేరోజు ఉద్యమం ప్రారంభించినప్పుడు అవహేళన చేసినవాళ్లు పోయారని, కానీ.. ఆ రోజు ఎగరేసిన గులాబీ ఎండా ఎగురుతూనే ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు.
బుధవారం టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం రాత్రి జరిగిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పాలేరు ఉప ఎన్నికలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సీఎం ఉపన్యాసం ఆయన మాటల్లోనే..
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుమిలిపోయా ఖమ్మం వేదికనుంచి జిల్లా ప్రజలతోపాటు యావత్తు తెలంగాణ ప్రజానికి నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా. స్వప్నం కనే సాహసం ఉండాలి. డేర్ టు డ్రీమ్ అన్నారు. తెలంగాణ కుళ్లి కునారిల్లే సమయంలో.. అంతులేని దోపిడీకి గురవుతున్న టైంలో ఆ రోజు ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా అనేక సందర్భాల్లో నేను కూడా కుమిలిపోయాను. నిరాశ.. నిస్సత్తువ. ఏమీ చేయలేని అసహాయ స్థితి! అన్నా.. మనవల్ల అవుతుందా! జరగనిస్తారా!, మన పదవులు పోతే తప్పితే అది రాదు.. అనేక మాటలు వినేవాడిని. 1996లో ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఉపఎన్నిక ఉంటే అక్కడికి వెళ్లిన. ఒక సమావేశం అనుకోకుండా రద్దయితే తెలంగాణ ప్రాజెక్టు కదా అనే ప్రేమతోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్టమీదికి నాతో ఉన్న మిత్రులను తీసుకొని వెళ్లిన. ప్రాజెక్టు నిర్వహణ బాగాలేదు. శ్రీరాంసాగర్ కట్ట రోడ్డుమీద గజంలోతు గుంతలున్నయ్. మిత్రులందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నం. నేను ఒక్కటే మాట అన్న. ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి ఇంత ఘోరంగా శివాలయంలా ఉంది. అదే ఆంధ్రకు పోయే ప్రాజెక్టులు అన్నీ బ్రహ్మాండంగా వైష్ణవాలయాల్లాగ ఉన్నయి అని చెప్పిన. ఏం సార్.. అ మాట చెప్పినారు? అని నా వెంట ఉన్న మిత్రులు అడిగినారు. ఒక గంటసేపు వారికి నా బాధ అంతా వివరించిన. మరి ఇట్లయితే ఎట్లా? అంటే.. ఏదో ఒకనాటికి తప్పకుండా తెలంగాణ ప్రజానీకం తిరుగుబాటు చేస్తరు. భగవంతుని చేతుల్లో కొన్ని విషయాలు ఉంటాయ్. మన చేతిలో ఉండవ్. ఒకవేళ నేను బతికి ఉంటే, నా అరోగ్యం సహకరిస్తే ఈ దఫా తెలంగాణ ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తా అని 1996లో శ్రీరాంసాగర్ కట్టమీద కూర్చోని చెప్పిన. సందర్భం రావాలి. పాపం పండాలి. శిశుపాలుడికి కూడ దేవుడు నూరు తప్పులు చేసేవరకు అవకాశం ఇచ్చిండు.
సమయం రానే వచ్చింది.. సమయం కోసం వేచిచూస్తుండగా తెలంగాణ మీద దారుణమైన దాడి.. విద్యుత్ చార్జీల పెరుగుదల. బషీర్‌బాగ్‌లో కాల్పులు! దానితో కలత చెందిన నేను ఏది అయితే అది అయితదని, ఇంకా మౌనం పాటించడం కరెక్టు కాదని నిర్ణయం తీసుకున్న. అ రోజు అనేక అనుమానాలు! అయితదా అనేటటువంటి నిరాశ, నిసత్తువ! ఆ రోజు 2001 ఏప్రిల్ 27. ఇదే రోజున నేను హైదరాబాద్‌లోని జలదృశ్యంలో ఉద్యమాన్ని ప్రారంభించినా. పెద్దలు నాయిని నర్సింహారెడ్డి, ఈ రోజు స్సీకర్‌గా ఉన్న మధుసూదనాచారి, సభలో ఉన్నటువంటి ఇంకా చాలా మంది మిత్రులు కొంతమందిమి కలిసి ఆ రోజు గులాబీ జెండా ఎగురవేసి జై తెలంగాణ నినాదం చెప్పినం. చాలామంది ఉద్యమానికి వచ్చి మోసం చేసి పోయినారు. పదవుల కోసం అమ్ముడు పోయినారు. కాబట్టి మీకు నమ్మకం లేదు. మీరు నమ్మకాన్ని కోల్పోయి ఉన్నరు.
కానీ నేను దృఢమైన సంకల్పంతోని, కచ్చితంగా సాధించాలనే సదుద్దేశంతోని ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఇంటికి ఒక్క యువకుడిని నాకు అప్పచెప్పండి. వందశాతం తెలంగాణ రాష్ట్రం సాధిస్తా అని జలదృశ్యంలో అనాడు చెప్పడం జరిగింది. ఉద్యమపంథా వీడను. ప్రాణం పోయినా ఎత్తిన పిడికిలి దించను. ఎత్తిన జెండా దించను. కచ్చితంగా రాష్ట్రం సాధిస్తా. ఒకవేళ నేను పెడమార్గం పడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని కూడా చెప్పడం జరిగింది. చాలా మందికి విశ్వాసం రాలే. పిడికెడు మందితో ప్రారంభమైన ప్రస్థానం. అనేక అవరోధాలు, జయాలు, అపజయాలు, సుడిగాలులు తట్టుకొని ముందుకు పోయినం. చాలామంది అవహేళన చేసినారు. బక్కోడు.. ఎవడో గొంతు పిసికి సంపేస్తరు అన్నరు. అట్ల అన్నవారు పోయినారు కానీ.. గులాబీ జెండా మాత్రం పోలే. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతోని తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని మనవి చేస్తున్నా. మొక్కవోని దీక్షతో ముందుకు సాగినం. గమ్యాన్ని ముద్డాడినం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 15వ ప్లీనరీని, బహిరంగసభను స్వేచ్ఛావాయువుల మధ్య ఆత్మగౌరవంతో జరుపుకుంటున్నాం.
సీఎం పదవి ఎందుకు చేపట్టానంటే.. ఇప్పుడు నాకు 63 ఏండ్లు. ఇంకా నేను కోరుకునేది ఏమిటి? ఒక మనిషి జీవితంలో ఉండే కోరికల్లో ఈ రోజు నేను ఉన్న ముఖ్యమంత్రి పదవి కూడ ఒకటి. తెలంగాణ తెచ్చిన గొప్పతనం ముందు ఈ పదవి ఏ పాటి? కానీ నేను ఎందుకు స్వీకరించిననంటే నేను తెచ్చిన తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఆగంకావద్దు. తెలంగాణ నిలిచి గెలువాలి. తెలంగాణ తనకు తాను రుజువు చేసుకోవాలి. మరొకరికి అప్పగిస్తే ఇబ్బంది పడే, దాడులు జరిగే అవకాశం ఉంటుందని, మళ్లీ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుందనే భావంతోని నేనే ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాను.
ఉద్యమసోయి ఉన్న పార్టీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. ఉద్యమ సోయి, ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ ఉధృతి ఉన్న పార్టీ. మిషన్ భగీరథ బృహత్తర పథకం. ఈ రోజు యావత్తు తెలంగాణ కరువుతో అల్లాడుతున్నది. రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి కరువు అనుభవిస్తున్నాం. ఈ మంచినీటి గోస శాశ్వతంగా పోవాలి. పట్టుదలగా తీసుకుంటే తప్ప సాధ్యమయ్యే పనికాదు. అందుకోసమే నాయకులందరు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అధికారులకు కూడ తెలవాలని, ఒక అంక్ష నాకు నేనే విధించుకున్నా. ఈ స్టేజి మీద కూర్చున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల రాజకీయ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి.. 65 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయనటువంటి సాహసం చేసిన. ఈ టర్మ్‌లోనే ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికీ నల్లా బిగించి కచ్చితంగా మంచినీళ్లు అందించకపోతే మళ్లీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పోటీ చేయదు.. ఓట్లు అడగము అని చెప్పిన. భారతదేశంలోనే ఇలా చెప్పిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. అద్భుతమైన పద్ధతిలో ఈ పథకం అమలు జరుగుతా ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్‌నాటికే 6,200 గ్రామాలకు, 2017 డిసెంబర్‌నాటికి 95శాతం గ్రామాలకు మంచినీళ్లు రాబోతా ఉన్నాయి.
ఆకుపచ్చ తెలంగాణ చూడాలన్నదే కోరిక అనాడు మన ప్రధాన నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. రెండు సమస్యలు తీరిపోయినాయి. తీరవల్సిన ప్రధాన బాధ సాగునీటి సమస్య. కిన్నెరసాని, మున్నేరు, పాలేరు, గోదావరి.. ఇన్ని నదులతో ఆలరారే ఖమ్మం జిల్లాలో ఎందుకు కరువు కాటకం ఉండాలే? అందుకోసమే ఈ రోజు అద్భుతమైన రీడిజైనింగ్ చేసి కచ్చితంగా తెలంగాణకు కోటి ఎకరాలకు నీళ్లు తీసుకురావడానికి ప్రణాళిక రూపకల్పన జరిగింది. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం ఖమ్మం జిల్లాకు మంజూరు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంచుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. అటువంటి ఆకుపచ్చ తెలంగాణ కళ్లారా చూడాలనేది నా కోరిక. వేరే ఏ కోరికలు లేవు. ఈ వయస్సులో.. తెలంగాణ తెచ్చినటువంటి ఈ సందర్భంలో.. కచ్చితంగా తెలంగాణలోని ప్రతి బిడ్డా చిరునవ్వుతోని కళకళలాడే మోహంతోని తెలంగాణ సమాజం ఉండాలి. తెలంగాణలో 80% మంది బడుగు బలహీన వర్గాల ప్రజలే. ఈ బిడ్డలందరు సంతోషంగా ఉండాలనేది మన ఎజెండా. రూ.40, రూ.200 పెన్షన్ ఇచ్చి చక్కిలిగింతలు పెట్టి, ఇక గుద్దు ఓటు అనే పద్ధతి మంచిది కాదు. ఎంతసేపూ ఓట్లు కాదు. జీవితాల గురించి ఆలోచించాలి. మానవీయకోణం ఉండాలి. భారతదేశంలో వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఇండియాలోనేకాదు వేరే దేశాల్లో కూడా లేదు. పిల్లర్లతో కట్టాలి.. ఇంటిపై మరో అంతస్తు వేసుకునే అవకాశం ఉండాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది కేవలం పేదల ఆత్మగౌరవాన్ని పెంచడానికేనని మనవి చేస్తున్నా.
ఆర్టీసీని ఆదుకున్నాం ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. వారి బతుకు ఎప్పుడుపోతదో తెల్వదు. ఇవ్వాళ ప్రైవేటు అవుతదా.. రేపు ప్రైవేటు అవుతదా అని ఆర్టీసీ వారందరూ అభద్రతాభావంతో బతికేవాళ్లు. ఈ రోజు ప్రభుత్వంనుంచి రూ.700 కోట్లు ఇచ్చి, జీహెచ్ఎంసీనుంచి ప్రతి ఏడాది రూ.200 కోట్లు ఇచ్చే చట్టం తెచ్చి, 50వేల కుటుంబాలను ఆదుకున్నాం. అదే విధంగా ప్రభుత్వరంగ సంస్థను కాపాడుకున్నాం.
2019 నాటికి వ్యవసాయానికి 24గంటలు కరెంటు రాష్ట్రంలో కరెంటు పోయే పరిస్థితి లేదు. 9గంటలు కాదు 2019 పూర్తి అయ్యేనాటికి తెలంగాణ రైతాంగానికి 24గంటలు త్రీఫేస్ కరెంటు ఇచ్చే బాధ్యత మీ బిడ్డ కేసీఆర్‌ది. గతంలో పాలకులు ఏమి చేసినారో.. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేస్తున్నదో మీరు కళ్లారా చూస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్కు ఘనవిజయం కట్టబెడుతున్నారు. ఈ మద్దతును ఇదే విధంగా కొనసాగించాలని యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా. ప్రజల ఎజెండానే మా ఏజెండా. మాకు వేరే ఎజెండాలు లేవు. మాకు ఢిల్లీ హైకమాండ్లు లేవు. మాకు బాస్‌లు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ ప్రజానీకమే. మేము ఎవరికీ భయపడం. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చ తెలంగాణగా మార్చే వరకు, 24గంటలు కరెంటు సరఫరా అయ్యేవరకు, గుంతలులేని రోడ్లు తయారుచేసే వరకు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు కేజీ టు పీజీ ఆత్మగౌరవంగా చదువుకునేవరకు కేసీఆర్ నిద్రపోడు.. విశ్రమించడు.
వీరులనుగన్న గడ్డ ఖమ్మం ఖమ్మం జిల్లా భక్తరామదాసు నడయాడిన బ్రహ్మాండమైన గడ్డ. సర్దార్ జమలాపురం కేశవరావు పోరాటం చేసిన గడ్డ ఇది. రావెళ్ల వెంకటరామారావు కవి పుట్టిన గడ్డ ఇది. ఎందరో మహానుభావులు ఉద్భవించిన గడ్డ ఇది. ఈ ఖమ్మం జిల్లాకు ఏమి తక్కువ? గోదావరి ఒరుసుకొని పారుతది. కిన్నెరసాని ఉప్పొంగి ఉరకలేస్తది. మున్నేరు లక్షల క్యూసెక్కుల నీరు తీసుకెళ్లిపోతది. మరి ఎందుకు ఖమ్మంలో నీళ్లు లేవు? ఖమ్మానికి చాలా సులభంగా నీళ్లు ఇయ్యవచ్చు. గోదావరి నది నుంచి మెదక్ జిల్లాకు తీసుకెళ్లాలంటే 500 మీటర్లు ఎత్తుకు నీళ్లను లేపాలి. 180 మీటర్లు ఎత్తులేపితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామం అయ్యే పరిస్థితి. మంత్రి తుమ్మల, జిల్లా ఎమ్మెల్యేలు కలిసి కూర్చోని మాట్లాడి జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్లువచ్చే పథకానికి రూపకల్పన చేశాం. రాబోయే రెండు, మూడేండ్లలో మీకు ఫలితం అందచేస్తాం.
తుమ్మల నా కుడి భుజం ఈ రోజు జిల్లాకు నాయకత్వం వహించే తుమ్మల నాగేశ్వరరావు నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు. 35 ఏండ్లక్రితం మా రాజకీయ జీవితం ఒక్కసారి ప్రారంభమైంది. ఇద్దరం ఆత్మీయ మిత్రులుగా పనిచేశాం. నీతి నిజాయతీగల వ్యక్తిగా, మొండిగా పనిచేసే, అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా రాజకీయాల్లో పేరున్న నేత తుమ్మల. వారి నాయకత్వంలో జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతది. ఈ సందర్భంలోనే పాలేరు ఉప ఎన్నిక వచ్చింది. తుమ్మలకు వాస్తవంగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా అవకాశం ఉంది. ఎన్నికల తరువాత కూడ ఎమ్మెల్సీగా రెండు సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో ప్రజల మధ్య ఉండాలే. ప్రజల మద్దతుతో ఒక నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించాలె అని చెప్పి తుమ్మలను పాలేరు పంపించింది కేసీఆర్ అని మీకు మనవి చేస్తున్నా. కలిసొచ్చే అదృష్టానికి నడిచి వచ్చే కొడుకు అనే సామెత చెబుతరు. తుమ్మల ఈ రోజు క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నరు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కుడిభుజంగా, ఆత్మీయుడుగా ఉన్న వ్యక్తి. పాలేరు ప్రజలారా! కలిసొచ్చే అదృష్టంలాగా మీకు కలిసొచ్చింది. తుమ్మలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించండి. మీ నియోజకవర్గాన్ని మీరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తరు. అన్ని విధాలుగా నేను కూడా అండదండలుగా ఉంటా. మాకు విశ్వాసం ఉంది. బ్రహ్మాండమైన మెజార్టీతో తుమ్మల గెలవబోతున్నారని సర్వే రిపోర్టులు వస్తున్నయ్. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. అద్భుతమైన విజయం తుమ్మల సాధించాలే. తుమ్మల నాయకత్వంలో అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందాలనే నేను కోరుతున్నా.
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్నాం. ఒక వేళ వాళ్లు చేయకపోతే.. స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. కేంద్ర వద్ద పెండింగ్‌లో ఉంది. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ఆనాడు మణుగూరులో పెట్టాల్సిన విద్యుత్ కేంద్రాన్ని సమైక్యరాష్ట్రంలో విజయవాడకు తరలించినారు. దానికి ప్రత్యామ్నాయంగా భద్రాద్రి పవర్ స్టేషన్‌ను మనం తెచ్చుకున్నాం. ఖనిజ సంపద, ఆటవీ సంపద, జలసంపద, మానవ సంపద.. బంగారు గుమ్మమైతది ఈ ఖమ్మం జిల్లా. తెలంగాణ పొలిమేర్లలో ఉన్న ఈ జిల్లా బంగారు గుమ్మంలా చేస్తం.
సీఎం కేసీఆర్ సహకారంతో పాలేరు సస్యశ్యామలం – రాష్ట్ర ఆర్ అండ్ బీ, స్త్రీ శిశుసంక్షేమ:శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే మూడు నెలల్లో సీఎం కేసీఆర్ సహకారంతో పాలేరు నియోజకవర్గంలోని ప్రతిఎకరాకు సాగునీరు అందిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మలనాగేశ్వర్‌రావు ప్రతిజ్ఞ చేశారు. బుధవారం టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు, కోరికలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకంటే ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పారు. గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించేందుకు అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయనున్న సీతారామ ప్రాజెక్టు మంజూరు చేయడంతోపాటు సీఎం స్వయంగా రోళ్లపాడు వద్ద శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. మిషన్ భగీరథ పథకం అమలులో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా పరిధిలో త్వరలోనే ఇంటింటికీ మంచినీరు అందనుందన్నారు. సెంటీమీటర్ నేషనల్ హైవే కూడా లేని ఖమ్మం జిల్లాకు కేంద్రమంత్రితో మాట్లాడి నలుదిక్కులా రహదారులు మంజూరు చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కేవలం ఖమ్మం జిల్లాలోనే రూ. 18,500 కోట్ల అభివృద్ధి పనులు నడుస్తున్నాయన్నారు. 22 నెలల పసిగుడ్డు తెలంగాణ ప్రభుత్వాన్ని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఆసరా, కళ్యాణలక్ష్మి, ఆహారభద్రత వంటి సంక్షేమ పథకాలు దేశానికే తలమానికమన్నారు. రూ. 35వేల కోట్లు సంక్షేమానికి ఖర్చుచేయటం చెప్పుకోదగ్గ విషయమన్న మంత్రి తుమ్మల.. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్ఎస్దే అయ్యిందని, అధికార పార్టీకి ఎదురు నిలబడాలంటేనే ప్రతిపక్షాలు బిత్తర పోతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా పాలేరులో ప్రజల అన్నిరకాల సమస్యలు పరిష్కరించాకే మరోసారి ఓట్లడిగేందుకు ప్రజల ముందుకు వస్తానన్నారు. ఈ బహిరంగ సభలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, డీ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్, మహిందర్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, అజ్మీరా చందూలాల్, హరీష్‌రావు, పద్మారావు, జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వరెడ్డి, సీతారాంనాయక్, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గువ్వల బాలరాజు, పువ్వాడ అజయ్‌కుమార్, కొండా సురేఖ, గొంగిడి సునీత, మదన్‌లాల్, రాజయ్య, కోరం కనకయ్య, జలగం వెంకటరావు, తాటి వెంకటేశ్వర్లు, రసమయి బాలకిషన్, రెడ్యానాయక్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, రాములు నాయక్, బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొండా మురళీధర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖమ్మం మేయర్ డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, చావా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్: కడియం శ్రీహరి, డిఫ్యూటీ సీఎం ఎందరో మహానుభావులు పుడతారు. కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. గాంధీ మహాత్ముడు కొట్లాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దళితుల జీవితాలు బాగుపడేందుకు, దేశానికి ఎంతో అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించారు. మహాత్మా జ్యోతిరావుపూలే సామాజిక న్యాయం కోసం, అసమానతలు లేని సమాజం కోసం కడవరకు పోరాడారు. సీఎం కేసీఆర్ కూడా పదమూడు సంవత్సరాలు కొట్లాడి నాలుగున్నర కోట్లమంది ఆకాంక్షలకు అనుగుణంగా, అమరవీరుల త్యాగాల సాక్షిగా తెలంగాణ సాధించి పెట్టి చరిత్ర సృష్టించారు అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఉద్యమ ప్రస్థానంలో ఆయన తెలంగాణ కష్టాలను తెలుసుకోవటమే కాకుండా కళ్లారా చూశారని చెప్పారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, రైతుల కళ్లలో ఆనందం చూడాలనే లక్ష్యంతో రకరకాల ప్రణాళికలతో పాలన చేస్తున్నారు. కేసీఆర్ దీక్షాదక్షతతో కోతలు లేని కరెంట్ వచ్చింది. వ్యవసాయానికి 9 గంటలు, సింగిల్ ఫేస్‌కు 24 గంటలు నిరంతరం కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలమంది పేదలకు ఆసరా పింఛన్లు, రైతుల కోసం రూ. 17వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు. ప్రభుత్వ హాస్టల్స్‌లోని చిన్నారి బిడ్డలందరికీ తన మనుమడు తినే భోజనమే కడుపునిండా పెట్టాలనే సదుద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని అమల్లోకి తెచ్చిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ స్థాపనకు కేసీఆర్ శంకుస్థాపన చేశారని, అదేరోజున ఎస్సీలకు 100, ఎస్టీలకు 70, మైనార్టీలకు 50 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఖర్చుచేస్తున్న ప్రతిపైసా నిరుపేదల అవసరాలకే ఉపయోగపడాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ప్రస్తుతం ఆయన పరిపాలన చూసి దేశప్రధానే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ముస్లింలకు అండగా సీఎం కేసీఆర్:డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలను ఓట్లుగానే వాడుకునే వారని, వారి సంక్షేమాన్ని ఎవ్వరూ పట్టించుకున్న దాఖాలాలు లేవని, దీంతో రాష్ట్రంలోని ముస్లింలు అనేక రంగాల్లో వెనుబడ్డారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగానే ముస్లింలకు పథకాలను అమలు చేశారన్నారు. షాదీముబారక్ పథకం ద్వారా పెళ్లికార్డుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే వధువు ఖాతాలో రూ.51 వేలు జమ అవుతున్నాయన్నారు. ముస్లింల కోసం 2016-17 సంవత్సరానికి రూ. 1204 కోట్లు సీఎం కేటాయించారని చెప్పారు. ముస్లిం విద్యార్థుల కోసం ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్రంలో ఈ ఏడాది 71 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించారన్నారు. సుమారు 90 వేల పేద మైనారిటీ వర్గాల విద్యార్థులకు లబ్ధి చేకూరాలే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవ్వడానికి రూ. 35 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలను అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఒక ముస్లింకే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తమ నిబద్ధతను చాటుకున్నారన్నారు.