Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రజల్లోకి పోదాం..

– ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పండి – మన పనులే మనకు గీటురాయి – ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దు – దసరానుంచి డబుల్ బెడ్‌రూం పథకం – ఉప ఎన్నికలకు సిద్ధం సర్వేల్లో మనకే విజయావకాశం – పార్టీలో పాత, కొత్త కలిసి పనిచేయాలి – త్వరలో కార్పొరేషన్లు, కమిటీల పదవుల భర్తీ – మార్కెట్, దేవాదాయ కమిటీలకు ప్రతిపాదనలివ్వండి – 23-24 తేదీల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ – దసరా పండుగ తర్వాత జిల్లాల పర్యటన – టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్

CM-KCR-at-Party-CLP-meeting

ప్రజల్లోకి వెళ్లండి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించండి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు వారు చేసిన పనులే గీటురాయి అని వివరించారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే అవసరమైన సందర్భాల్లో మాత్రం తప్పకుండా ఆ ఆరోపణలను తిప్పికొట్టాలి అని కేసీఆర్ ఉద్బోధించారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ, వాటర్ గ్రిడ్ పనుల అమలు బాధ్యత తీసుకోవాలని, దగ్గరుండి పనులు చేయించుకోవాలని సీఎం నిర్దేశించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఉదయం జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. మధ్యాహ్నం 1.50 గంటలకు ఆయన అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం దాదాపు రెండు గంటలకు పైగా సాగింది.

ప్రతిపక్షాల ధోరణి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులు, పార్టీ వ్యవస్థ నిర్మాణం, వివిధ కార్పొరేషన్లు, కమిటీల నియామకాలు, రానున్న ఉప ఎన్నికలు, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం తదితర అంశాలను స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. వివిధ అంశాలమీద ప్రతినిధులు వెలిబుచ్చిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. దసరా పండుగ తర్వాత జిల్లాల పర్యటనకు వస్తానని ఆయన ప్రకటించారు. దసరా పండుగ అనంతరం మరోసారి 23, 24 తేదీల్లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహిస్తామని కూడా చెప్పారు.

ఎమ్మెల్యేలదే కీలక భూమిక.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక భూమిక పోషించాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు మధ్యకు వెళ్లాలని.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను విడమరిచి చెప్పాలని అన్నారు. మనం చాలా చేస్తున్నాం.. ప్రతిపక్షాల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరంలేదు.. వాళ్లు అట్లనే మాట్లాడుతారుఅన్నారు.

అయితే అవసరమైనపుడు మాత్రం ఎక్కడికక్కడ వాళ్ల ఆరోపణల్ని, విమర్శల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని స్పష్టంచేశారు. ముఖ్యంగా వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యేలు ఎవరికి వారు వాళ్ల నియోజకవర్గంలో ఉండి చేయించుకోవాలన్నారు. మిషన్ కాకతీయకు సంబంధించి ఉత్సాహంగా పనులు చేయించుకునే ఎమ్మెల్యేలకు పది శాతం ఎక్కువ నిధులు ఇస్తానని సీఎం చెప్పారు. రానున్న ఆరు నెలల్లోనే 8, 9 నియోజకవర్గాల్లో వాటర్‌గ్రిడ్ పనులు పూర్తయ్యే అవకాశముందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ముగ్గురు సభ్యులు తమ తమ నియోజకవర్గాలకు నీరు అందే విధానం మీద సందేహాలు వ్యక్తం చేసినపుడు సాంకేతిక వివరాలతోసహా వారికి డిజైన్‌ను వివరించారు. ఎమ్మెల్యేలు వాటర్ గ్రిడ్ పైపులైన్‌కు కావాల్సిన అటవీ, ఇతర రకాల అనుమతులు ఏమైనా ఉంటే అధికారులకు సహకరించి, వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రెండు స్థానాల్లో మనకే విజయావకాశాలు.. ఈ సమావేశంలో ఉప ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. వాస్తవానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే వరంగల్ లోక్‌సభాస్థానం, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయని భావించామని కేసీఆర్ అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీలతో కలిపి బహుశా ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ వచ్చే అవకాశముందనే సమాచారం తమకు ఉందని చెప్పారు. ఈ రెండు స్థానాల్లో పార్టీకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని, సర్వేలో వరంగల్‌లో 67 శాతం, నారాయణఖేడ్‌లో 52 శాతం మద్దతు ఉన్నట్లుగా ఫలితాలొచ్చాయని చెప్పినట్లు సమాచారం. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

ఎన్నికల సమయంలో వరంగల్ ఎంపీ స్థానంలో ఆ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నారాయణఖేడ్‌లో నిజామాబాద్ జిల్లా వాళ్లు కూడా పని చేయాలని చెప్పినట్లు తెలిసింది. ఈ ఎన్నికల ప్రభావం ఆ తర్వాత వచ్చే మున్సిపల్ ఎన్నికల మీద ఉంటుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపై ఈ ఉప ఎన్నికల ప్రభావం పడే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడినట్టు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జనవరి నెలలో జరిగే అవకాశముందని సీఎం అన్నట్లు సమాచారం.

అందరినీ కలుపుకుపోవాలి.. సమావేశంలో పార్టీ వ్యవహారాల్లో పాత, కొత్తవారందరూ కలిసి నడవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. అందరినీ కలుపుకొనిపోతేనే పార్టీ పటిష్ఠంగా రూపొందుతుందన్నారు. ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కలుపుకొనిపోతేనే మరోసారి గెలుస్తారని కూడా చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పలు స్థానాల్ని కోల్పోయామని, గట్టిగా పనిచేస్తే మరో 10-12 స్థానాల దాకా వచ్చి ఉండేవని కేసీఆర్ విశ్లేషించారు. అలాంటివి పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. పార్టీ నిర్మాణంలో భాగంగా త్వరలో రాష్ట్ర కమిటీని వేసుకుందామని, అందులో 42 మంది ఉంటారని కూడా సీఎం చెప్పినట్లు తెలిసింది. మునుపటి మాదిరిగా కాకుండా 5-6 మందితోనే పోలిట్‌బ్యూరో ఉంటుందని సంకేతాలు కూడా ఇచ్చారు.

మార్కెట్, దేవాదాయ కమిటీలకు సంబంధించి పది రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలని, 17-18 వరకు ఉన్న కార్పొరేషన్లను ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భర్తీ చేద్దామని కూడా చెప్పినట్లు తెలిసింది. ఇందులో నలుగురైదుగురు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు దక్కే అవకాశముంటుందన్నారు. కార్పొరేషన్లకు సంబంధించి డైరెక్టర్లకు జిల్లాల మంత్రులు ప్రతిపాదనలు పంపాలని, చైర్మన్ల ఎంపికను మాత్రం రాష్ట్రస్థాయిలో చేద్దామని చెప్పారు. మార్కెట్ కమిటీలకు సంబంధించి ఎమ్మెల్యేలదే బాధ్యత అని కూడా చెప్పిన సీఎం.. ఆ ప్రతిపాదనల్ని సంబంధిత మంత్రి హరీశ్‌రావుకు, దేవాదాయ కమిటీ ప్రతిపాదనలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఇవ్వాలన్నారు.

అయితే ఇంకా చాలా కమిటీలు ఉంటాయని, హాస్పిటల్ కమిటీ, సివిల్ సప్లయ్, ఆర్టీసీ, విజెలెన్స్.. ఇలా జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఉంటాయని చెప్పిన ఆయన.. వీటి జాబితాను రూపొందించే బాధ్యతను మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు అప్పగించారు. ఈ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ కుంటాల జలపాతం క్షేత్రదర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశం తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐడీహెచ్ కాలనీలో మోడల్ డబుల్ బెడ్‌రూం ఇండ్ల సందర్శనకు వెళ్లారు.

దసరానుంచి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు దసరా పండుగనుంచి డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 400 ఇండ్ల చొప్పున ప్రారంభిస్తున్నామని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు. ఇప్పటికే ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఇండ్లను చూడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పిన కేసీఆర్ అందుకోసం వెంటనే బస్సులను ఏర్పాటు చేశారు. దసరా పండుగ తర్వాత తాను జిల్లా పర్యటనలకు వస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. త్వరలో జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.