అవినీతిరహిత ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ సర్కారుకు ప్రజల్లో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రజాప్రతినిధులతో అన్నారు. అంతేకాదు.. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ప్రధానమంత్రికి ఇచ్చిన నివేదికలో దేశంలోనే తెలంగాణ అవినీతిరహిత (కరప్షన్ ఫ్రీ) ప్రభుత్వంగా ఉందని తెలిపారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉన్న మంచి పేరును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధుల్లో చాలామంది పేదవారు ఉన్నప్పటికీ.. నిబద్ధతతో పనిచేస్తున్నారని, రాజకీయాల్లో ఇదే ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గంటకు పైగా మాట్లాడారు.

-అవినీతిరహిత రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నాం -అదే నిబద్ధతతో ఇకముందూ పనిచేద్దాం -పార్టీకి బలమైన ప్రజాపునాది పడింది -నేడు మండలిలో ప్రభుత్వ విప్‌ల పేర్లు ప్రకటన -పార్లమెంటరీ పార్టీ, ఎల్పీ సంయుక్త భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితి లేదని, ఏదో ఆరోపణలు చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారని కేసీఆర్ చెప్పారు. దేశంలో ఎవరూ ఫలానా అంశంలో అవినీతి చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే పరిస్థితి లేదన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ 63 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం బలం 85-87కు చేరిందని, అంతకుమించి ప్రజల్లో మంచి పేరు సాధించామని అన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో పట్టణ.. గ్రామీణం అనే తేడా లేకుండా గణనీయమైన నమ్మకం, విశ్వాసం పెరిగిందని చెప్పారు. పార్టీ కూడా చాలా బలపడిందన్నారు. అటు ఖమ్మంగానీ, ఇటు నారాయణ్‌ఖేడ్‌గానీ రాష్ట్రంలోని నాలుగువైపులా పార్టీ బలోపేతం అయ్యిందన్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వంద సీట్లు గెలవాలని, ఒకవేళ నియోజకవర్గాలు పెరిగినట్లయితే 125 సీట్లు గెలిచేలా సిద్ధం కావాలని అన్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమివ్వండి పార్టీ కమిటీల్లో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులకు సీఎం సూచించినట్లు తెలిసింది. మండల కమిటీల విషయంలో సంబంధిత ఎమ్మెల్యే ఇచ్చిన పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని, ఒకవేళ ఒక మండలం ఇద్దరు ఎమ్మెల్యేల పరిధిలోకి వస్తే వారిద్దరినీ మంత్రులు కూర్చోబెట్టి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయంగా, స్నేహపూర్వకంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. నిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఎమ్మెల్యేలు అహంభావం లేకుండా పని చేయాలని చెప్పారు. అసలు ప్రజాప్రతినిధులకు రాజకీయాల్లో అలుపు అనేది ఉండొద్దని సీఎం హితవు పలికినట్లు తెలిసింది. డబుల్ బెడ్‌రూం ఇండ్లలో ఎమ్మెల్యేలు కేవలం గ్రామాన్ని ఎంపిక చేయడం మినహా లబ్ధిదారుల ఎంపికలో జోక్యం చేసుకోవద్దని సీఎం స్పష్టం చేశారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలను బాగా నడుపుకొంటున్నామన్న ముఖ్యమంత్రి.. ప్రతిపక్షాలు కన్ఫ్యూజన్‌లో ఉన్నాయని అన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గృహాలు, కార్యాలయ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు సూచించారు.
దగ్గరుండి పనులు చేయించుకోండి ఎమ్మెల్యేలు తమ పరిధిలో మిషన్ కాకతీయ కింద పనులు చేపట్టే ప్రతి చెరువును పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని కూడా త్వరితగతిన చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరువు సహాయ చర్యల కోసం జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే నిధులు మంజూరు చేశామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే ఇంకిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
నేడు మండలి ప్రభుత్వ విప్‌ల పేర్లు ప్రకటన శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ల పేర్లు శనివారం ప్రకటిస్తామని సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు శాసనసభలోని మిగతా కమిటీలను కూడా వేసుకుందామని చెప్పారు. పార్టీ కమిటీలతోపాటు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని.. దేవాదాయ కమిటీలకు సంబంధించి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి హరీశ్‌రావుకు జాబితా ఇవ్వాల్సిందిగా సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఎకరం స్థలం చొప్పున సేకరించాలని చెప్పారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు అంశంపై చాలామంది సభ్యులు అడగ్గా.. ఇతర పార్టీల ప్రతినిధులనుంచి ఈ డిమాండ్ ఉందని, దానిని పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇండ్ల స్థలాలకు సంబంధించి కేసు కోర్టులో ఉన్నందున.. వివరాలు సేకరించాల్సిందిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డికి సీఎం సూచించారు.
ఖమ్మం ప్లీనరీకి 3వేల మంది ప్రతినిధులు పార్టీ ప్లీనరీలను ఇప్పటివరకు ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో నిర్వహించుకోలేదని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఈ ఏడాది ఖమ్మంలో నిర్వహించుకోనున్నందున.. ఇకముందు మిగిలిన రెండు జిల్లాల్లో పూర్తి చేద్దామని చెప్పారు. ఖమ్మం ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మండల అధ్యక్షులు, ఆ పైస్థాయి వారిని ప్రతినిధులుగా ఆహ్వానిద్దామని చెప్పారు. వచ్చే నెల 27న ప్లీనరీ తర్వాత నిర్వహించే బహిరంగ సభకు ఖమ్మం, చుట్టుపక్కల జిల్లాలనుంచి రెండు లక్షల మంది వరకు ప్రజలను సమీకరించాలని చెప్పినట్లు సమాచారం.