-తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఉచితంగా 52 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు -హైదరాబాద్‌లోని పట్టణ ప్రాథమిక, కమ్యూనిటీ, జిల్లా దవాఖానలకు ఆన్లైన్ లింక్ -నెల రోజులుగా ప్రయోగాత్మక పరిశీలన -త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి -నారాయణగూడ ఐపీఎం ఆవరణలో ఏర్పాటు
ప్రజలకు ప్రైవేట్ వైద్యం భారమై న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. రోగులు ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్నా పలు వైద్య పరీక్షలు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెం టర్లలో చేయించాల్సి వస్తున్నది. దీంతో పేదలు వైద్యానికి, వైద్య పరీక్షలకు రూ.వేలు ధారపోసి ఆర్థికంగా చితికిపోతున్న ట్టు సీఎం కేసీఆర్ గుర్తించారు. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ (వ్యాధి నిర్ధారణ పరీక్షల) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం హైదరాబాద్‌లోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(యూపీహెచ్సీ), ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ), జిల్లా దవాఖానల్లో వైద్య పరీక్షలు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్టు చేసిం ది. హైదరాబాద్‌లోని 85 యూపీహెచ్‌సీలతోపాటు మొత్తం 163 సెంటర్లలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు రూ.కోట్లు విలువ చేసే అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చారు.
52 రకాల రక్త పరీక్షలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ వంటి ఖరీదైన పరీక్షలు కూడా ఈ కేంద్రాల్లో ఉచితంగా చేస్తారు. ఈ మేరకు గత నెల 10వ తేదీ నుంచి ట్రయల్ రన్ నడుస్తున్నది. నగరంలోని 50 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన రక్త నమూనాలను నారాయణగూడలోని ఐపీఎంలో నెలకొల్పిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపిస్తున్నారు. అక్కడ పరీక్షలు చేసి ఫలితాలను ఆన్లైన్లో ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇటీవలే వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ ల్యాబ్‌ను పరిశీలించి వైద్య పరీక్షల కోసం తన రక్త నమూనాలు ఇచ్చారు. పథకం పనితీరును మరికొన్ని రోజులు పరిశీలించి లోపాలను సరిదిద్ది నగరం అంతటా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో నగరంలోని 163 కేంద్రాల నుం చి నమూనాలను సేకరిస్తారు. రాజధానిలో విజయవంతం అయితే రాష్ట్రమంతటా విస్తరిస్తారు.
ఎలా చేస్తున్నారంటే…. -యూపీహెచ్‌సీల్లో సేకరించిన నమూనాలను మధ్యాహ్నం ఒంటి గంటలోపు సమీపంలోని క్లస్టర్ ఆరోగ్య కేంద్రాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి 3 గంటల్లోపు నారాయణగూ డ ఐపీఎంలోని తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్‌కు చేరుస్తారు. ఎక్కువ శాతం ఫలితాలను అదే రోజు సాయంత్రానికి, కొన్నింటిని మరుసటి రోజు ఉదయం వెల్లడిస్తారు. -రోగి నుంచి నమూనాలను సేకరించినప్పుడే వారి వివరాలతోపాటు మెయిల్ ఐడీ తీసుకుంటారు. -నమూనాల నివేదికలను సర్వర్‌లో పొందుపరుస్తారు. అక్కడి నుంచి నేరుగా, యూపీహెచ్సీకి, రోగి మెయిల్ ఐడీకి రిపోర్ట్ వెళ్తుంది. -యూపీహెచ్సీ సిబ్బంది ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని రోగికి అందిస్తారు.
అత్యాధునిక ప్రయోగశాల.. నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) ఆవరణలో ప్రస్తుతం ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్‌కు అదనంగా రూ.4 కోట్లతో మరో అత్యాధునిక ప్రయోగశాలను నెలకొల్పారు. ఇందులో రోజుకు 10వేల రక్త నమూనాలను విశ్లేషించవచ్చు. గ్రేటర్ పరిధిలోని యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రాంతీయ, జిల్లా దవాఖానలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం 50 కేంద్రాల నుంచి రోజుకు 300 నమూనాలను సేకరించి, పరీక్షించి, ఆన్లైన్లో ఫలితాలను వెల్లడిస్తున్నారు. యూపీహెచ్‌సీల్లోని కొందరు ల్యాబ్టెక్నీషియన్లతోపాటు సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించారు.
ఉచితంగా ఖరీదైన పరీక్షలు -తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో మొత్తం 52 రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు. రక్త, మల, మూత్ర పరీక్షలతోపాటు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా జ్వరాల నిర్ధారణకు, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్ పనితీరును తెలుసుకోవడానికి, రక్తంలో కొలెస్ట్రాల్, రక్తంలో మూడు నెలల సగటు చక్కెరస్థాయి తదితర ఖరీదైన పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు. -జీహెచ్ఎంసీ పరిధిలోని 13 యూపీహెచ్‌సీల్లో ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేశారు. -హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతీయ దవాఖానల్లో సిటీ స్కాన్ పరికరాలను, జిల్లా దవాఖానల్లో ఎంఆర్ఐ పరికరాన్ని అందుబాటులోకి తేనున్నారు.
విజయవంతంగా నడుస్తున్నది జనవరి 10వ తేదీ నుంచి ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తున్నది. నగరంలోని 50 యూపీహెచ్సీల నుంచి రోజుకు 300 నమూనాలు వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు విశ్లేషించి నివేదికలను వెంటనే ఆన్లైన్లో పంపిస్తున్నాం. త్వరలో గ్రేటర్ పరిధిలోని 163 సెంటర్ల నుంచి నమూనాలు సేకరిస్తాం. – డాక్టర్ ఫాతిమాబేగం, ల్యాబ్ ఇంచార్జి