-కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ -9.30 గంటలపాటు సుదీర్ఘ సమావేశం -నేడు కోమటిబండకు ముఖ్యమంత్రి -హరితహారంపై కలెక్టర్లతో అక్కడే భేటీ -1200 ఎకరాల్లో పునరుద్ధరించిన అడవిని కలెక్టర్లతో కలిసి పరిశీలించనున్న సీఎం

ప్రజాసేవకు అంకితమవ్వాలని, ప్రజలతో మమేకమవ్వాలని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. కొత్త పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలను సమర్థంగా అమలుచేయడం ద్వారా పట్టణాలు, పల్లెప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలని కోరారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం తొమ్మిదిన్నర గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశానికి 33 జిల్లాల కలెక్టర్లతోపాటు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక, పంచాయతీరాజ్‌చట్టాల అమలుపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
అలాగే గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై 60 రోజులపాటు చేపట్టాల్సిన ప్రత్యేక కార్యక్రమాలపైనా చర్చించినట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులు భూ యాజమాన్య హక్కుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వాటిని ఎలా పరిష్కరించాలి? కొత్తగా రూపొందించే చట్టంలో ఏ అంశాలను ప్రధానంగా తీసుకోవాలి? అనే అంశాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ విషయాల్లో కలెక్టర్ల నుంచి విస్తృతస్థాయిలో అభిప్రాయాలను సీఎం తీసుకున్నారని తెలిసింది. జిల్లాలవారీగా పట్టణాలు, గ్రామాల్లో సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపైనా కలెక్టర్లతో సీఎం చర్చించినట్లు సమాచారం.

నేడు కోమటిబండకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం కలెక్టర్లందరినీ తీసుకుని సిద్దిపేట జిల్లా కోమటిబండకు వెళ్లనున్నారు. అక్కడే వారితో సమావేశం నిర్వహించనున్నారు. కోమటిబండలోని 1200 ఎకరాల భూమిలో అడవిని ప్రత్యేకంగా పునరుద్ధరించారు. అటవీ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలతో కోమటిబండలో ఇప్పుడు అడవి పచ్చగా కనిపిస్తున్నది. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అడవుల పునరుద్ధరణ జరుగాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కోమటిబండలో పునరుద్ధరించిన అడవిని కేస్‌స్టడీగా తీసుకొని కలెక్టర్లు అంతా ముందుకువెళ్లాలని కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు. ఇందులో భాగంగానే కలెక్టర్లను కోమటిబండకు తీసుకువెళుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. కోమటిబండలో మిషన్ భగీరథ పంప్‌హౌస్‌ను సీఎం పరిశీలించడంతోపాటు మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. ఇక్కడే జిల్లా కలెక్టర్లతో హరితహారం తదితర కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.