Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రాజెక్టులు ఆగవు

-1350 టీఎంసీల వాటా వందశాతం వాడుతాం
-ప్రజలకు మేలుచేసే అంశాల్లో రాజీలేని నిర్ణయాలు
-త్వరలో రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పెనుమార్పులు
-పోడు భూముల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తా
-బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ డేట్ ఎత్తివేస్తాం
-నిరుద్యోగభృతిపై నాలుగైదు నెలల్లో కసరత్తు పూర్తి
-దేశానికి ఆదర్శంగా అనేక నిర్ణయాలు తీసుకున్నాం
-అయినా అవి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదు
-మరో నెలలో మిషన్ భగీరథ పనులు వందశాతం పూర్తి
-పార్ట్-బీలోని భూముల రికార్డులనూ ప్రక్షాళన చేస్తాం
-ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై వెనుకడుగు లేదు
-కోడ్‌లు ముగిసిన తర్వాత జూన్‌లో చర్చించి నిర్ణయం
-కేంద్రం ప్రాథమ్యాలు చూశాక పూర్తిస్థాయి బడ్జెట్
-కాంగ్రెస్ నేతలు చెప్తున్న లెక్కలు వందశాతం తప్పు
-ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో విపక్షాల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సుదీర్ఘ సమాధానం

కృష్ణా, గోదావరి నదుల నుంచి మనకు 1350 టీఎంసీల నీటి వాటా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. వీటిని వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి అవసరాల కోసం వందకు వంద శాతం వాడుతామని స్పష్టంచేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్న సీఎం.. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు ఆగబోవని తేల్చిచెప్పారు. సమగ్రంగా నీటి హక్కులు వినియోగించుకోవటం, మంచినీటి బాధలు తొలిగించడం, పేదరికాన్ని నిర్మూలించడం, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామన్న సీఎం.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా బడ్జెట్‌ను ఆమోదించాలని సభ్యులకు విజ్ఞప్తిచేశారు. సోమవారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షసభ్యుల ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పెనుమార్పులు చూడబోతున్నారని వెల్లడించారు.

ఎన్నో ఏండ్లుగా ఉన్న పోడుభూముల సమస్యలను తానే స్వయంగా వెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. నిరుద్యోగ భృతిపై కసరత్తు నాలుగైదు నెలల్లో పూర్తిచేస్తామని వెల్లడించారు. బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్‌డేట్‌ను ఎత్తివేస్తామని ప్రకటించారు. ఏడాదిలోపే భూరికార్డుల ప్రక్షాళన పూర్తిచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి.. మన రైతుబంధు పథకంలో ఏ మూలకూ రాదన్నారు. సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన చేశామని, పార్ట్-బీలో మిగిలి ఉన్న భూములను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. తాము తెస్తున్న అప్పులు.. రైతులు ఒక ఏడాదికి పండించే పంటల విలువ కాదని సీఎం అన్నారు. మరో నెలలో మిషన్ భగీరథ పనులు వందశాతం పూర్తవుతాయని అన్నా రు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు ఆగబోవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కృష్ణా, గోదావరి నదీజలాల్లో మనకు 1350 టీఎంసీల వాటా ఉన్నదని, ఈ నీటిని వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు వందశాతం వాడుతామని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. యాభై ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాం. ఆదిలాబాద్ ప్రజల నీటికష్టాలు చనాఖా-కొర్ట ద్వారా తీరనున్నాయి. కొన్ని నెలల్లోనే తమ్మిడిహెట్టి ద్వారా ప్రస్తుత ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు నీరిస్తాం. పూర్వ ఆదిలాబాద్‌లోని తూర్పు ప్రాంతాలకు రెండున్నర లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నాం అని వివరించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. సమగ్రంగా నీటి హక్కులు వినియోగించుకోవటం, మంచినీటి బాధలు తొలిగించడం, పేదరిక నిర్మూలన, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు లక్ష్యంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామన్న సీఎం.. అనుమానాలు లేకుండా ఆమోదించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఏమన్నారో క్లుప్తంగా ఆయన మాటల్లోనే..

అప్పులు సక్రమంగా వినియోగిస్తున్నాం
ప్రాజెక్టులపై ఎంతో ఖర్చు చేస్తున్నాం. మీలా అనాలోచితంగా చెల్లింపులు చేయట్లేదు. మీ హయాంలో ప్రాజెక్టులు గాల్లో కట్టారు. కాంగ్రెస్ హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్సులుండేవి. మా హయాంలో లేవు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ఆయకట్టు కోల్పోయాం. మైనర్ ఇరిగేషన్ ధ్వంసమైంది. జనం నీటి కష్టాలనుభవించారు. మేం ముందుచూపుతో వెళ్తున్నాం. మిషన్‌కాకతీయతో కింద చెరువులు బాగుచేసుకున్నాం. 4000 కోట్లతో ఫీడర్ చానళ్లను ఇరిగేషన్ ప్రాజెక్టులకు లింకుచేస్తున్నాం. మేజర్ ఇరిగేషన్‌లోనూ మీరు కాగితాల మీదే ప్రాజెక్టులుకట్టారు. ఎస్సారెస్పీకి 1964లో నెహ్రూ పునాదివేస్తే.. ఇప్పటికీ రెండోదశకు దిక్కులేదు.

ప్రాజెక్టుల రీడిజైన్‌ను చూపిస్తానంటే పారిపోయారు
సరిపడా నీళ్లు, ఎలాంటి ఒప్పందం లేకున్నా కాంగ్రెస్ నేతలు తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు మొదలుపెట్టారు. 148 అడుగులకంటే ఒక్క అడుగు ఎక్కువకు ఒప్పుకొనేది లేదని మహారాష్ట్ర సీఎం లేఖరాశారు. నిధులు గంగలో పోసినట్లయితదన్నారు. అయినా కాంగ్రెస్ నేతలు వినలేదు. అప్పట్లో అక్కడ, ఇక్కడ, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా ఒప్పించలేదు. తమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మన్ను తీయలేదుకానీ ఎక్కడో చేవెళ్లల తవ్వారు. సుజల స్రవంతికాదు అది కాగితపు స్రవంతి. మేం ప్రాజెక్టులు రీడిజైన్ చేసిన తర్వాత సభకు సమగ్రంగా పవర్‌పాయింట్ ద్వారా చూపిస్తా అంటే కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయారు. ప్రజెంటేషన్ చూసి జీర్ణించుకునే విజ్ఞత లేదు ఆరోజు.

గోదావరిలో ప్రతి చుక్క తీసుకుంటాం
గోదావరిలో మనకున్న హక్కువరకు చివరి చుక్కదాకా నీరు తీసుకుంటాం. ఈ ఏడాది కూడా మేడిగడ్డ వద్ద 1474 టీఎంసీ నీళ్లు పోయాయి. అందుకే గోదావరిలో 400 టీఎంసీల నీరు తీసుకునే ప్లాన్ వేశాం. రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోయాలనేది లక్ష్యం. ప్రతిపక్షాలు గ్రీన్ ట్రిబ్యునల్‌కు, కోర్టుకు వెళ్లాయి. ఒక్క కాళేశ్వరం మీదే 200 కేసులు వేశారు. ఇదీ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ వైఖరి. అంబేద్కర్ సుజల స్రవంతి నీరు 16 లక్షల ఎకరాలకు అన్నారు. అందులో స్టోరేజ్ కెపాసిటీ ప్రతిపాదించింది 14 టీఎంసీలే. అంటే నీరు రావాలే.. పొలంల పారాలే. మల్టీస్టేజ్ లిఫ్టుల్లో ఒక్క పంపు ఆగినా అంతే.. అట్ల ప్లాన్‌చేశారు. మేం ప్రశ్నించాం. కొంప మునుగుతుందని సోనియాకు చెప్పాం. ఇందిరాసాగర్, సోకాల్డ్ రాజీవ్, అంబేద్కర్ సుజల స్రవంతి ఎందుకు పెట్టారో తెలుసు.

దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ సమైక్య రాష్ట్ర కుట్ర. కాంగ్రెస్‌వాళ్లు చెప్పింది రెండులక్షల ఎకరాలు. కానీ మేం 8.5 లక్షల ఎకరాలంటున్నాం. దుమ్ముగూడెంలో మే నెలలో కూడా నీరు ప్రవహిస్తుంది. కానీ ఏపీ, తెలంగాణ వాడుకోవు. ఏపీ వాళ్లు పట్టిసీమ కట్టుకొని కృష్ణాడెల్టాకు రంది లేకుండా చేసుకున్నారు. వాళ్లు పట్టిసీమ ఎట్లయితే క్వాల ద్వారా తెచ్చుకున్నరో అలాగే సీతారామను తక్షణం నాగార్జునసాగర్ కాల్వకు కలుపుతమని చెప్పాం. ఈ వానకాలంలో సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇవ్వబోతున్నాం.. సీఎంగా చాలెంజ్ చేసి చెప్తున్నా. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కాదు. పొలిటికల్ సైన్స్, లిటరేచర్ చదువుకున్నాను. నాకు తెలియని టెర్మినాలజీ కొన్ని రాత్రులు పగలు కష్టపడి తెలుసుకున్నా.

శబరి నీళ్లతో మనకేం సంబంధం?
శబరితో మన రాష్ట్రానికి సంబంధం లేదు. ఎక్కడ రుద్రమకోట.. ఎక్కడ శబరి? మీకు (భట్టి విక్రమార్కకు) పరిజ్ఞానం లేదనుకోవాలా లేక ఏమనుకోవాలి? రుద్రమకోటకు పైన కలిసేది కిన్నెరసాని.. శబరి కాదు. శబరి ఆంధ్రా ప్రాంతంలో కలుస్తుంది. భౌగోళిక పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలా? ఎంతో కష్టపడి లైడార్ సర్వేచేశాం. పోలవరం పూర్తయితే రుద్రమకోట ప్రాజెక్టు 30 మీటర్ల లోతులో ఉంటుంది. నాగార్జునసాగర్ ఆయకట్టు కలిపి పది లక్షల ఎకరాలకు నీరు పారించి, మీరు రాకున్నా చూపించేందుకు బలవంతంగా తీసుకువెళ్తా.

ఏడాది పంటల విలువకాదు అప్పులు
అప్పులు తెస్తున్నాం. లక్ష 25 వేల కోట్ల విలువైన పంట తెలంగాణ రైతులు పండిస్తే అద్భుతం కదా! పన్నులు, జీఎస్డీపీ పెరుగుతాయి. రుణాల చెల్లింపు సమస్యే కాదు. ఒక ఏడాది పండే పంటల విలువకాదు మేం తెచ్చే అప్పులు. పసుపు ధర, ఎర్రజొన్న ధర అని ధర్నాలు చేస్తున్నారు. రాజకీయంగా వాడుకునే ప్రయత్నిస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. మూడు ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి తెలంగాణలో పండుతాయి. వీటితో పంటకాలనీలు ఏర్పాటుచేయబోతున్నాం. డిమాండున్న పంటలే పండించాలి.

పరిపాలనలో ఇక పెనుమార్పులు
రాష్ట్రంలో కొనసాగుతున్న అనేక అరాచకాలు, లీకేజీలు, దుర్మార్గాలను చాలా కఠినంగా అరికట్టాలని అనుకున్నాం. పాలనా విషయంలో పెనుమార్పులు చూడబోతున్నారు. చాలా కఠిన పద్ధతుల్లో వ్యవహారం చేస్తాం. ఈ ఐదేండ్లు ప్రభుత్వాన్ని నడిపితే నా వయస్సు 71 ఏండ్లకు పోతుంది. ఈ వయస్సులో నేను ఎవరికి? ఎందుకు? దేనికి భయపడాలి? నూటికి నూరుశాతం ప్రజల మంచి కాంక్షించి, వారికి మేలు జరిగే పనులు ఎలాంటి రాజీలేకుండా చేస్తాను. ఏదో తాత్కాలిక వ్యవహారంలా ఉండదు. కచ్చితంగా చాలా నిర్మాణాత్మకంగా వెళుతాం.

ప్రజలు అంతా గమనిస్తున్నారు
గతంలో భూరికార్డుల ప్రక్షాళన మేం కూడా చేసినం అని భట్టి విక్రమార్క అంటున్నరు. చేస్తే ఏం లాభం? ఎక్కడా లెక్కలేదు పత్రం లేదు. ప్రతి ఏడాది ఆర్వోఆర్, జమాబందీ ఒక తంతుగా జరుగుతూ పోతాఉన్నది. వందశాతం వాటన్నింటినీ అరికట్టి నిజాయితీగా ప్రజలకు రిలీఫ్ వచ్చేలా చేయాలని దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఎవరు ఏం విమర్శలు చేసినా పట్టించుకోదల్చుకోలేదు. పూర్తి పారదర్శంగా, ప్రజలకు అన్ని విషయాలు చెప్తున్నాం. ఇందులో కొంత కఠినంగా కూడా ఉంటది. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. వాళ్లకు (కాంగ్రెస్) ఎక్కువ జ్ఞానం ఉంటే ప్రజలు వాళ్లనే విశ్వసిస్తారు. మాకు తక్కువ జ్ఞానం ఉంటే మమ్మల్నే శిక్షిస్తారు. మొన్న ఎన్నికల్లో మేం చెప్పింది ఒప్పు.. వాళ్లు చెప్పింది తప్పని ప్రజలు తేల్చారు. ప్రభుత్వం కూర్చుకునే నిధులను మీరు అప్పులు అంటున్నరు.. మేం లివరేజింగ్ ఎకానమీ అంటున్నాం. అది మాకు అర్థంకాదు.. మా కథ అంతే అంటే మేంచేసేది కూడా ఏమీలేదు.. మా కథ కూడా ఇంతే అనడం తప్ప.

చెప్పిన తప్పు లెక్కలు సవరించుకోవాలి
బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపక్ష సభ్యులు కొన్ని లెక్కలు తప్పు చెప్పారు. వాటిని సరిచేసుకోవాలని కోరుతున్నా. విద్యకోసం ఖర్చు ఆరు శాతమే అన్నారు.. అది కరెక్టు కాదు. 11.2% పెడుతున్నం. వివిధ పద్దులకింద విద్యకోసం బడ్జెట్‌లో రూ.19,482 కోట్లు పెట్టాం. 2004-2014 వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కాంగ్రెస్ హయాంలో 10.99 శాతమే ఖర్చుచేశారు. మేం 1.46 లక్షల పనులకు సంబంధించి లబ్ధిదారులు, ఏ గ్రామంలో, పనులు చేశామన్నది పెన్‌డ్రైవ్‌లో పెట్టి ప్రతి సభ్యుడికీ అందజేశాం. 2017-18లో 16.34%, 2018-19లో 15.75% నిధులు ఖర్చుచేశాం. ఇవన్నీ కాగ్ లెక్కలు. అంటే బడ్జెట్‌లో పెట్టినదానికంటే ఎక్కువ ఖర్చు చేసినం.

అటవీభూముల సమస్య కథ ఇదీ
అటవీభూమి అని తెలిసి కూడా ఎన్నికల ముందు అటవీభూముల్లో పట్టాలు ఇవ్వడం.. ఆ పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు ఆ భూములపై తమకు హక్కున్నదని అనుకోవడం జరుగుతున్నాయి. అసలు ఈ సమస్య ఎందుకు ఉన్నదంటే.. 1960ల్లో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీఎంలే ఉండేవాళ్లు. ఢిల్లీలో తుమ్మితే అంతా తుమ్మాలి.. దగ్గితే అందరూ దగ్గాలి.. అది పరిస్థితి. అప్పుడు ఒక కమిటీ స్టడీ చేసి నెహ్రూగారికి సలహా ఇస్తే, అటవీ భూములు నోటిఫై చేయండి అని ఆయన అన్ని రాష్ర్టాలకు ఆదేశాలిచ్చారు. అప్పుడు భూములమీద ఇంత చర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడిమరీ, ప్రజల, ప్రభుత్వాల అవసరాలు ఏందన్నది పరిగణనలోకి తీసుకోకుండా.. అప్పటి ఉమ్మడి ఏపీలో కూడా ఇష్టం వచ్చినట్టు భూములు పంచిఇచ్చేసిండ్రు. వీటిల్లో కొన్ని ఫైనల్ నోటిఫై అయినయి.. ఇంకొన్ని ప్రాథమికదశలో.. ఇట్లా అసంబద్ధంగా, అసమగ్రంగా రికార్డులున్నయి. ఇక ఇప్పుడు ఇది మాది.. అని ఫారెస్టువాళ్లు.. కాదు.. మాదేనని రెవెన్యూవాళ్లు వస్తరు.. ఇట్లా ఇద్దరు ఒకే గవర్నమెంట్ అధికారులే.. దాంట్లో తగాదా చాలా పెద్దగా ఉన్నది.

పోడు భూముల సమస్యను నేనే స్వయంగా వెళ్లి పరిష్కరిస్తా
అటవీ భూముల్లో పండ్ల తోటలు పెట్టుకోవాలని చట్టంలో ఉంది. కానీ అక్కడి గిరిజనులు ఆ భూములమీద బతుకుతున్నరు. ఉన్న ఎకరమో, అర ఎకరంలోనూ మక్కలో, పచ్చజొన్నలో, వరో వేసుకుని బతుకుతున్నరు. వాళ్లను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. పోడు భూములపై సుప్రీంకోర్టు తీర్పు గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఆర్వోఆర్‌యాక్ట్ కింద కానీ, పోడు భూముల రక్షణ విషయంలోగానీ రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించిన దరఖాస్తుదారులు మాత్రమే అన్యాక్రాంతం కింద ఉన్నట్టు లెక్క. వారిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. నేను రాష్ట్రంలోని గిరిజన బిడ్డలకు హామీ ఇస్తున్నా.. ఒక కటాఫ్ డేట్ పెట్టి అసలు ఉన్నవాళ్లను గుర్తించి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికలు, తర్వాత లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉంటది కాబట్టి జూన్ తర్వాత నేనే స్వయంగా ఒక 15 రోజులు కేటాయించుకుని పోడు భూముల సమస్య పరిష్కారం చేసేందుకు వెళ్తా. మొన్న ఒక పేపరాయన కూడా ముఖ్యమైన శాఖలన్నీ సీఎం దగ్గరే పెట్టుకున్నడు అని రాసి పుణ్యం గట్టుకుండు. భూ రికార్డుల ప్రక్షాళన, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి. అందుకే రెవెన్యూశాఖను వేరేవాళ్లకు ఇవ్వకుండా నా దగ్గరే పెట్టుకున్నా. పట్టాదారు పాస్‌పుస్తకాల అంశాన్ని కూడా విక్రమార్క చెప్పారు. వందశాతం యావత్‌దేశం మన నుంచి నేర్చుకునే విధంగాచేస్తాం. ఇప్పటికే చాలా విషయాల్లో తెలంగాణను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకుంటున్నాయి. ఇంగ్లిష్ దినపత్రికలు కూడా తెలంగాణ మోడల్ అని రాస్తున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్‌వాళ్లకు కనిపించకపోతే మేంచేసేది ఏం లేదు.

ఏడాదిలోపే భూరికార్డుల ప్రక్షాళన
ఏడాదిలోపే భూరికార్డుల ప్రక్షాళన పూర్తిచేస్తాం. దేశంపుట్టిన కాడినించి అన్నదాత అంటూ ఎన్నో డైలాగులు కొట్టిండ్రుగానీ ఎవ్వరూ తెలంగాణ తెచ్చినట్టు రైతుబంధు కార్యక్రమం తేలేదు. ఈ మధ్య కేంద్రం కిసాన్ సమ్మాన్ అని పథకం తెచ్చింది. అది మన పథకంలో ఏ మూలకూ రాదు. మనం ఎకరానికి రూ.10వేలిస్తే.. వాళ్లు వెయ్యికూడా ఇచ్చే పరిస్థితిలేదు. అది వాళ్ల విజ్ఞత. కేంద్రం ఇచ్చేది మనకు అదనమే. కానీ రైతుబంధు వంటి పథకాన్ని అమలుచేయాలంటే ఎవరికి ఇవ్వాలి? లెక్కలు ఎట్లా? అన్నప్పుడు.. భూ రికార్డుల ప్రక్షాళన చేసినం. పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చినం. తర్వాత రైతుబంధు డబ్బులు పంపినం. అందుకే రైతుబంధు విషయంలో ఎలాంటి వివాదాలు రాలేదు. పార్ట్-బీలోని భూములు కొన్ని మిగిలాయి.

రికార్డుల్లో రైతు పేరు ఉంటుంది.. అది మా భూమి అని అటవీవాళ్లు అంటున్నరు. రైతు పేరుమీద భూమి ఉంటది, అక్కడ సబ్‌స్టేషన్ ఉంటది. ఇట్లాంటి అన్ని సమస్యలు సమైక్య పాలకుల మతిలేని విధానాలవల్ల సంక్రమించినయి. అధిగమించాలంటే సమయం పడతది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో, రెవెన్యూ కార్యాలయంలో ఎవరికీ పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా వెబ్‌సైట్‌ద్వారా జరుగాలని సంకల్పించినం. కోర్టుల్లో భూ వివాదాలు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండి ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారుతున్నాయి. ఆ బాధలు ఉండొద్దంటే కంక్లూజివ్ టైటిల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. దీనితో వందశాతం వారికి హక్కులు ఉంటా యి. అందుకు రెండేండ్లు పట్టొచ్చు. వెబ్‌సైట్ మాత్రం ఆరేడు నెలల్లో అందుబాటులోకి తెస్తాం.

నాలుగేండ్లలో అద్భుతంగా పనిచేశాం
గత నాలుగేండ్లలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సంక్షేమాన్ని చేశాం. పేదల బతుకుల్లో కొంత వెలుగులు నింపాం. దేశం మొత్తంలో బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బీడీ కార్మికులకు పీఎఫ్ 2014 వరకే కటాఫ్ పెట్టారు అని వినతులు వచ్చాయి. దాన్ని ఎత్తివేయిస్తాం. సౌరవిద్యుత్‌లో ఒక్క మెగావాట్ ఉత్పత్తి అయినా పెంచారా? అని శ్రీధర్‌బాబు ప్రశ్నిస్తున్నారు. ఒక్కటి కాదు.. 5వేల మెగావాట్లకు పైగా ఉత్పత్తి చేశాం. 10వేల మెగావాట్లు సమకూర్చాం. అవన్నీ మీకు కనిపించకపోతే మేం చేసేది ఏమీ లేదు. నేను చెప్పేవి మీ కుటుంబ సభ్యులు, మీ గ్రామాల ప్రజలు వింటున్నరు. వస్తున్న కరంటును రాట్లేదని మీరు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం సమజసంకాదు. అతి భయంకరమైన కరంటు కష్టా లు, లక్షల మోటర్లు కాలిపోయింది మీ జమానాలోనే. ఇప్పుడు ఎక్కడా మోటర్లు కాలకుండా వ్యవసాయం జరుగుతున్నది. దేశంలోనే 24 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నిమ్జ్‌కు 2,370 ఎకరాలు సేకరించాం. ఆ పని సత్వరం కాకుండా కాంగ్రెస్‌వాళ్లే కోర్టులకు వెళ్లారు.

కోర్టులకు వెళ్లి అడ్డుకుందే కాంగ్రెస్
నిన్న హౌస్‌లో బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? పంచాయతీరాజ్ పదవుల్లో 34% రిజర్వేషన్ ఉండే. దాన్ని మేం యథాతథంగా పెట్టినం. మళ్లా కాంగ్రెస్ ఆఫీస్‌బేరర్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి కోర్టుకు వెళ్లిండ్రు రిజర్వేషన్లు 50% దాటొద్దని. ఇదే కాంగ్రెస్ మరో నాయకుడు స్థానికసంస్థలకు ఎన్నికలు పెట్టించాలని హైకోర్టుకు వెళ్లిండ్రు. ఒకవైపు 50% రిజర్వేషన్ మించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలిచ్చాయి. మరోవైపు ఫలానా తేదీలోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు మరో ఆదేశం ఇచ్చింది. అందుకే ఆ టైంలో రెండు కోర్టుల ఆదేశాలను పాటిస్తూ ఆర్డినెన్సులు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాం. కోర్టుకు పోయామని ప్రతిపక్ష నేత భట్టివిక్రమార్క కూడా ఒప్పుకొన్నారు.

ఐటీఐఆర్ కోసం పోరాటం చేశాం
చిట్టచివరి దశలో మన్మోహన్‌సింగ్ మన రాష్ట్రంతోపాటు కర్ణాటకలో ఐటీఐఆర్‌కు పునాదివేశారు. అది అక్కడే ఆగిపోయింది. మోదీ వచ్చాక అనేక ప్రయత్నాలుచేశాం. ఉత్తరాలు రాశాం. నిరసనలు తెలిపాం. ఎంపీలు పార్లమెంట్‌లో కొట్లాడారు. లాభం లేదు. అయినా మేం చూస్తూ ఊరుకోలేదు. కర్ణాటకలో తట్టడు మట్టిపని కూడా జరుగలేదు. మేం బుద్వేల్, కోకాపేట, కొల్లూరులో క్లస్టర్లు ఏర్పాటుచేశాం. బ్రహ్మాండమైన పెట్టుబడులు వచ్చాయి. గేమింగ్ టవర్ మీలా అల్లాటప్పాగా కాకుండా పకడ్బందీగా ఏర్పాటుచేశాం. అంతర్జాతీయ స్టాండర్స్‌తో ఇమేజ్ టవర్ నిర్మాణం జరుగుతున్నది. టీ హబ్‌ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తున్నది. ఏడాదిన్నరలో టీహబ్ 2 స్టార్ట్ చేస్తున్నాం. మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తున్నాం. ఐటీలో హైదరాబాద్ అద్భుతంగా దూసుకుపోతున్నది. ఫికర్ లేదు. మనకు 1028 కోట్లతో ఎయిమ్స్ మంజూరైంది. విమర్శలు చేసేముందు ఆలోచించుకోవాలి. మనకు మనమే చెడ్డపేరు తెచ్చుకోవద్దు. సద్విమర్శగా ఉండాలి కానీ.. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా ఉండకూడదు.

అప్పులు ఎట్లతెస్తే మీకేంటి?
అప్పులు ఎలా తెస్తే కాంగ్రెస్‌కు ఏం బాధ? కార్పొరేషన్ల నుంచి తెచ్చుకుంటాం. తప్పేంటి? అది ప్రభుత్వ వ్యూహం. అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం. బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. కేంద్రం విధించే నిబంధనల మేరకు జీఎస్డీపీకి లోబడి తెస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నకాడ 26%, 27% దాకా లోన్లు ఉన్నాయి. ఏపీలో 29% లోన్లున్నాయి. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అన్ని లోన్లు కలిపితే 21.25% ఉన్నం. 25శాతానికి వెళ్లే ఆస్కారం ఉన్నా.. లోబడి ఉన్నం. అప్పుల కుప్ప చేయడం లేదు. భవిష్యత్ తరాలకు బంగారుమయం చేస్తున్నాం. అప్పు చేసి పప్పు కూడు తింటలేం. మనదేశంలో సంప్రదాయపరమైన ఆలోచన పద్ధతి బద్దలుకావాలి.

కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గ విధానాలు
ప్రతి ఇంటిలో నల్లా ఉండాలనే కోరిక ఎవరికైనా ఉండేదా? ఎవరైనా దేశంలో చేశారా? ఈ దేశానికి ప్రకృతి 70 వేల టీఎంసీలు ఇచ్చింది. అంతర్జాతీయ నదుల్లో ఇంకో నాలుగైదువేలున్నయి. స్నోఫాల్ వల్ల ఇంకో వెయ్యి టీఎంసీలు ఉన్నయి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. ఇవి అనుసరించిన విధానంవల్ల ప్రాజెక్టులు పూర్తికాలేదు. 20 ఏండ్లు అయినా ట్రిబ్యునళ్లు క్లియరెన్స్ ఇవ్వవు. కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గమైన విధానాలు పెట్టాయి. సభ తరఫున నేను నిరసన తెలియజేస్తున్నా. తాత కడుతే మనుమడు నీళ్లు తాగుతడా! 70వేల టీఎంసీలు ఉండగా మంచినీళ్లకు ప్రజలకు అలమటిస్తరా? కరువు ఉంటదా?

ఎండాకాలం నీటి కష్టాలు లేవు
ఎండకాలం వస్తున్నది.. మంచినీళ్లకు ఇబ్బందులు ఉంటాయని శ్రీధర్‌బాబు అన్నరు. నీటి కష్టాలు మీ జమానాలో ఉండేవి. ఇప్పడు లేవు. భగీరథ వచ్చి నీటి కష్టాలను కమ్మేసింది. ఎక్కడో భగీరథ కవర్ కానిచోట కొన్ని సమస్యలుండొచ్చు. అది వన్ పర్సెంట్. అక్కడా యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఎండాకాలం వస్తే నీటి గోస గత చరిత్ర. సురక్షిత మంచినీళ్లు సరఫరా చేస్తున్నాం. మీ పరిపాలనలో నల్లగొండలో లక్షా 50వేల మంది నడుములు వంగాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు దుశ్చర్ల సత్యనారాయణ ఒక ఫోైర్లెడ్ బాధితుడిని ప్రధానికి టేబుల్ మీద చూపించాడు. అయినా పరిష్కారం లేదు. మేం శాశ్వతపరిష్కారం చూపిస్తున్నాం. ప్రతి ఇంటికి ట్రీటెడ్ వాటర్ అందిస్తున్నాం. యూరప్, అమెరికా దేశాల్లో బాటిల్ నీళ్ల వాడకం పోయింది. మళ్లీ ట్రీటెడ్ వాటర్‌వైపు వస్తున్నారు. మనం ఇప్పటికే ప్రారంభించాం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకు 16వేల ట్యాంకులు కడితే మేం దానికి 22 వేలు కలిపి 38 వేల ఓహెచ్‌ఎస్‌ఆర్ ఏర్పాటు చేశాం. కొత్త సాంకేతికతతో అన్ని ఇండ్లకు నల్లా ద్వారా సమాన వేగంతో నీటిని అందిస్తున్నాం.

ప్రతి గ్రామంలో ఇండ్ల జాబితా
బలహీనవర్గాలకు ఇండ్ల విషయంలో చర్యలు పెంచాల్సి ఉన్నది. కాంగ్రెస్, టీడీపీ కట్టామని చెప్తున్న ఇండ్లు నిజంగా కట్టి ఉంటే కొత్తగా ఇండ్లు కట్టే అవసరం ఉండేదికాదు. కాగితాల్లోనే కట్టారు కానీ ఫీల్డ్‌లో కాదు. చాలావరకు మేశారు. వరికోల్ గ్రామంలో 600 ఇండ్లు కట్టినామని చెప్పి.. తిన్నారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. అయితే ఇండ్లు ఎన్నికట్టుకుంట పోవాలే? దీనికి లెక్క ఉండాలి. అందుకే గ్రామ కార్యదర్శులకు ఆదేశాలిచ్చి ఏ ఊర్లో ఎన్ని ఇండ్లు అవసరమో జాబితా తయారుచేస్తాం. కోడ్ తర్వాత లబ్ధిదారుల జాబితా తయారుచేస్తాం.

నిర్మాణాత్మక సూచనలేవి?
ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా ప్రతిపక్షనాయకుడు నిర్మాణాత్మక సూచనలిస్తారని ఆశపడ్డాం. ఒక్క నిర్మాణాత్మక సూచన చేయలేదు. పైగా సభను తప్పుదోవ పట్టించేలా సత్యదూర విషయాలు చాలా చెప్పే ప్రయత్నం చేశారు. ఓటాన్ అకౌంట్ ఆర్నెల్లు ఎందుకు.. మూడు నెలలు ఎందుకు? అంటూ అసంబద్ధమైన, హేతురహిత వాదనచేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, జీఎస్టీ సమగ్ర స్వరూపాన్నే మార్చేస్తాం.. కేంద్ర అవలంబించే అనేక విషయాలు మార్చేస్తాం అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లను ఎన్డీఏ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తీసివేసింది. కేంద్రం తీసుకునే నిర్ణయాలు మౌనంగా భరించడంతప్ప ఏమీచేసే పరిస్థితి లేదు. దేశంలో అన్ని రాష్ర్టాల పరిస్థితి ఇదే. మరి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తదో? ఏం పాలసీ ఉంచుతారో? ఏది తీసేస్తారో తెల్వదు. అందుకే కేంద్రం ప్రాధాన్యాలు చూసి మన బడ్జెట్ పెట్టుకుంటామని చెప్పిన.

గడీల దొరలు, సంస్థానాదీశులే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
బీసీలకు రాజ్యాధికారం కావాలని స్థానికసంస్థల్లో రిజర్వేషన్ తెచ్చిన మొదటివ్యక్తి ఎన్టీఆర్. అప్పటిదాకా ఏ పార్టీలూ బీసీలకు ఏమీ చేయలేదు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మాజీ సంస్థానాధీశులు, గడీల దొరలే. గద్వాల, వనపర్తి రాజులు, ఇటిక్యాల దొరలు కాంగ్రెస్ నాయకులు. ఇంకా కొల్లాపూర్, విసునూరు దొరలు.. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉన్నది నాదగ్గర. వాళ్లంతా కిరీటాలు తీసి గాంధీటోపీలు పెట్టారు. సామాన్యులకు అవకాశాలే ఉండేవి కావు. ఎన్టీఆర్ మొదటిసారి అవకాశమిచ్చారు. మేము కూడా చిరు ప్రయత్నంచేశాం. మార్కెట్ కమిటీల్లో 50% రిజర్వేషన్లు తెచ్చాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఇదేసభలో తీర్మానంచేసి పంపించాం. అన్ని రాష్ట్రాలకు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది.. మీరూ కచ్చితంగా పెట్టాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు చెప్పాం. ఇన్నేండ్ల కాంగ్రెస్, టీడీపీ చరిత్రలో తెలంగాణలో 19 రెసిడెన్షియల్ సూళ్లే ఉండేవి. మేము 280 పెట్టాం. 119 స్కూళ్లు త్వరలో ప్రారంభించబోతున్నాం. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం ఉద్యోగులకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలున్నాయి. ఉద్యోగులకు మొదటినుంచీ మా ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తున్నది. వేతనాలను 42%-43% పెంచాం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినందుకు ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ ఇచ్చాం. హామీల అమలుకు కోడ్ అడ్డంకిగా మారింది. కోడ్ మీద కోడ్ వస్తున్నాయి. జూన్ తర్వాత ఉద్యోగుల హామీల అమలుకు నిర్ణయం తీసుకుంటాం.

కాకి లెక్కలు చెప్తే చూస్తూ ఊరుకోం
-భట్టివిక్రమార్కపై సీఎం కేసీఆర్ ధ్వజం
-రాష్ట్ర రాబడుల విషయంలో స్పష్టంగా ఉన్నాం
-మిషన్ భగీరథకు చార్జీలు వేస్తామనలేదు

రాష్ట్ర రాబడుల విషయంలో సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు మాట్లాడితే సహించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. తాము అనని మాటలను అన్నామంటూ ఆరోపిస్తుంటే ప్రేక్షకుల్లా కూర్చోలేమని హెచ్చరించారు. సోమవారం శాసనసభలో సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం రావాల్సినంత రాలేదని ప్రభుత్వమే ఒప్పుకున్నదని అన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. రాష్ట్ర రాబడుల విషయంలో మేం స్పష్టంగా ఉన్నాం. ఎలా ఖర్చు చేయాలి? ఎక్కడి నుంచి అప్పు తేవాలి? ఎలా చెల్లించాలనే విషయాలన్నీ కూలంకషంగా చర్చించిన తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టాం. మేం రాబడి వచ్చిందని చెప్తున్నాం. కాంగ్రెస్ రాలేదని అంటున్నది. ఇలా తప్పుగా మాట్లాడి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకపాత్ర వహించం. మన రాష్ట్రంలో రూ. 1.25 లక్షల కోట్ల పంట పండుతుందని నిపుణులు తేల్చారు. రెవెన్యూ మీద ప్రతిపక్షానికి టెన్షన్ అసవరం లేదు. తాగు, సాగునీటి మీద అప్పులు తీసుకునేటప్పుడు తిరిగి ఎలా చెల్లిస్తారని బ్యాంకులు ప్రశ్నిస్తాయి. మేం రెవెన్యూ స్కీం గురించి చెప్తాం. చెల్లింపు సామర్థ్యాన్ని చూసే కమర్షియల్ బ్యాంకులు తెలంగాణ ప్రభుత్వానికి అప్పులిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఇచ్చారు. దానికి కూడా అప్పు తీసుకున్నారు. బడ్జెట్‌కు సవరణలు ఉండటం ఆనవాయితీ. మావి కాకిలెక్కలు కావు. మీరు రాష్ట్ర గ్రోత్ చెప్పడం లేదు.

మన రాష్ర్టాన్ని మనమే శపించుకోవద్దు. గ్రోత్‌లో దేశంలోనే ముందున్నామని కాగ్ నివేదిక, సెంటర్ ఫైనాన్స్ కమిషన్ తేల్చాయి. మిషన్ భగీరథ నిర్వహణకు రూ.13,600 కోట్లు కావాలని ఫైనాన్స్ కమిషన్‌ను అడిగాం. అంతేగానీ బిల్లులు వసూలు చేస్తామని చెప్పలేదు. మిషన్ భగీరథ డీపీఆర్‌లో నీళ్లను అమ్మి బిల్లులు కడుతామనలేదు. బిల్లులు తీసుకోవాలా.. వద్దా అనేది భవిష్యత్తులో నిర్ణయిస్తాం. ఆర్‌డబ్ల్యూఎస్ పథకాన్ని మేం మిషన్ భగీరథగా మార్చాం. నోటీసులు ఆ పేరుమీదే వస్తాయి. అది కూడా తెలుసుకోకపోతే ఎలా? పెండింగ్ బిల్లులన్నీ మీ కాలం నుంచి వస్తున్నయే. మా దగ్గర పెండింగ్ అనేది లేదు. దబాయించాల్సిన అవసరం లేదు. ఆ పదాన్ని విరమించుకోవాలి. మీకు బడ్జెట్‌పై అపోహలున్నాయి.. అవగాహన లేదు అని సీఎం కేసీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో భట్టి విక్రమార్క.. తన వ్యాఖ్యలను సీఎం నెగెటివ్‌గా తీసుకుంటున్నారంటూ చల్లబరిచే ప్రయత్నం చేశారు. చర్చలో భాగంగా ఓ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని భట్టి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పులు, సమైక్య పాలనలో జరిగిన లోపాలతో తెలంగాణ ఉద్యమం వచ్చిందని, తెలంగాణ ఏర్పాటై టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.

నాలుగైదు నెలల్లో నిరుద్యోగభృతి విధివిధానాలు నిరుద్యోగ భృతి గురించి శ్రీధర్‌బాబు అడిగారు. నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంటే మాకు కూడా నాలుగు ఓట్లు వస్తయి అని కాంగ్రెస్‌వారు ఆశిస్తున్నారు. కానీ మీకు ఆ అవకాశం ఇవ్వం. మీరు ఎంత తెలివైన వాళ్లో, మేం అంతకంటే తెలివైన వాళ్లమే. మొదట నిరుద్యోగి అంటే ఎవరు అన్నది నిర్వచించాల్సి ఉంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలవారీగా వివరాలు సేకరించాలి. 18 ఏండ్ల నుంచి 35 ఏండ్ల వయసువారు నిరుద్యోగులు అనుకుంటే.. 36 ఏండ్ల వయసు తర్వాత భృతి బంద్‌కావాలి. అంటే లెక్కలు పకడ్బందీగా తయారుచేయాలి. లేదంటే నిధులు దుర్వినియోగమవుతాయి. రాబోయే నాలుగైదు నెలల్లో అంతా పకడ్బందీగా చేసి అమల్లోకి తెస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.