Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రకృతి సంపదను కాపాడుకుందాం

-గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెరువులు కబ్జా -మిషన్ కాకతీయకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రశంసలు -అమీన్‌పూర్ పెద్ద చెరువులో మొక్కలునాటిన భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -రూ.3 కోట్లతో మినీట్యాంక్ బండ్‌గా మారుస్తామని హామీ -చెరువు పరిరక్షణ బాధ్యతలు తీసుకున్న ఎస్‌పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్

Harish-Rao-planting-a-sapling01 ప్రకృతి సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. పక్షుల కిలకిలరావాలతో కళకళలాడాల్సిన చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రకృతి సంపదకు నెలవైన చెరువులు ఆగమయ్యాయి. ప్రజల జీవనవిధానంతో పెనవేసుకున్న చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుంకట్టింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఊరు.. చెరువు మనది అని ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడే చెరువులకు పూర్వవైభవం వస్తుంది. చెరువుల పునురుద్ధరణలో పోలీసు శాఖ పాల్గొనడం హర్షణీయం. మిషన్ కాకతీయను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రశంసించారు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువును స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) డీజీ తేజీదీప్‌కౌర్ మీనన్ దత్తత తీసుకున్నారు. మనోహర-అమీన్‌పూర్ పేరుతో నాలుగు నెలలుగా చెరువు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం చెరువు భూమిలో ఎస్‌పీఎఫ్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు నాలుగు వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి మొక్కనాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ప్రకృతి ప్రేమికులు, ఇతరుల సహకారంతో డీజీ తేజ్‌దీప్‌కౌర్ పెద్ద చెరువును దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. అమీన్‌పూర్ చెరువు గొప్ప చరిత్రను తేజ్‌దీప్ వెలికితీశారని ప్రశంసించారు. ఈ చెరువుకు ఏటా 171 రకాల పక్షులు వస్తుంటాయని, 9 రకాల చేపలు, 41 రకాల సీతాకోక చిలుకలు,13 రకాల ఉభయచరాలు, 10 రకాల అరుదైన మొక్కల వంటి ప్రకృతి సంపదతో చెరువు కళకళలాడేదని గుర్తుచేశారు. పూర్వీకులు కాపాడిన ఈ చెరువు గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి తరుణంలో నాలుగు నెలల క్రితం చెరువు ప్రాముఖ్యత తెలుసుకున్న ఎస్‌పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ దీని పరిరక్షణకు నడుంకట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఆదివారం 200 మంది పోలీసు సిబ్బందితో చెరువులోని చెత్తను తొలగించి రక్షణ బాధ్యతలు తీసుకున్నారన్నారు.

సైబీరియాతోపాటు వివిధ దేశాల నుంచి ఎన్నో పక్షులు ఇక్కడికి వచ్చి వెళ్లేవని, నాలుగునెలలుగా ఇక్కడ చేపట్టిన పరిరక్షణ చర్యలతో తిరిగి వలస పక్షులు రావడం గొప్పవిషయమన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మక్తమీది కుంట, మక్తకింది కుంటల నుంచి ఈ చెరువులోకి నీళ్లు రావాల్సి ఉండగా, కట్టు కాల్వలు ధ్వంసం కావడంతో వర్షపునీరు రావడం పోయి.. మురికినీరు చేరుతున్నదన్నారు. మిషన్ కాకతీయ రెండో విడతలో పెద్ద చెరువును రూ.3 కోట్లతో మినీట్యాంకు బండ్‌గా మార్చనున్నట్లు వెల్లడించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూమి కబ్జాకు గురికాకుండా ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కట్టుకాల్వలకు మరమ్మతు చేస్తామన్నారు. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి ఎంతో సర్వే జరిపి వివరాలు అందించాలని జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, మెదక్ జిల్లా అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. చెరువులోకి చేరుతున్న మురుగునీటిని శుద్ధి చేయడాని ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెరువు ప్రాంతాన్ని బయోడైవర్సిటీ పార్క్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి బైనాక్యులర్‌తో చెరువులోని వివిధ రకాల పక్షులను పరిశీలించారు. ఈ చెరువు పరిరక్షణ బాధ్యత తాము తీసుకుంటున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి ఆదివారం పనుల తీరును పరిశీలిస్తామని చెప్పారు.

పెద్దచెరువు ప్రాముఖ్యతను గుర్తించాం: డీజీ తేజ్‌దీప్‌కౌర్ ఎస్‌పీఎఫ్ కోసం పెద్ద చెరువు పక్కనే ప్రభుత్వం 2008లో కొంత స్థలాన్ని కేటాయించిందని, ఇక్కడ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని డీజీ తేజ్‌దీప్ కౌర్ తెలిపారు. ఆ సమయంలోనే చెరువులోకి రకరకాల పక్షులు రావడాన్ని గుర్తించామని, తమ సిబ్బంది నేతృత్వంలో అప్పటి నుంచే ప్రతి ఆదివారం చెరువు పునరుద్ధరణకు చర్యలు మొదలు పెట్టామన్నారు. చెరువు సంరక్షణకు మంత్రి హరీశ్‌రావును సంప్రదించగా అప్పటికప్పుడు స్పందించారన్నారు. ఇందులో భాగంగానే మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవడంతోపాటు చెరువు అభివృద్ధికి రూ.3కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారన్నారు. మంత్రి అందించే వాటర్ ట్యాంకర్‌తో మొక్కలకు నీళ్లు పోస్తామని, చెరువును పరిరక్షిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పక్షుల ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు వేసిన పేయింటింగ్స్ పరిశీలించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేసీ వెంటకట్‌రాంరెడ్డి, ఎస్పీ సుమతి, ఇరిగేషన్ ఎస్‌ఈ సురేందర్, టీఆర్‌ఎస్ నేత గాలి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.