భవిష్యత్తులో విద్యా అసమానతలు రాకుండా నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించడమే తెలంగాణ సర్కార్ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. -నవతరాన్ని పుస్తక పఠనం వైపు ఆకర్షించాలి -హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

కాన్వెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 29వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, బీజేపీ ఎమ్మెల్యే కే లక్ష్మణ్, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, నేషనల్ బుక్ ట్రస్టు ఎడిటర్ పత్తిపాక మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, నూతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యువతరంలో పుస్తక పఠనం తగ్గుతున్నదన్నారు. నవతరాన్ని పుస్తక పఠనం వైపు ఆకర్షించేందుకు సాహితీవేత్తలు ప్రణాళికలు రూపొందిస్తే ప్రభుత్వం వాటిని అమలుపర్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌ను నాలెడ్జ్‌హబ్‌గా మారుస్తామన్నారు. ప్రభుత్వ లైబ్రరీలకు అవసరమైన పుస్తకాలను హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మహానేతలు రాసిన పుస్తకాల్లోని అంశాలను ఆచరించడమే వారికిచ్చే ఘన నివాళి అని ప్రముఖ కవి దేశపతిశ్రీనివాస్ అన్నారు. సమాజంలోని అనేక ప్రమాణాలకు పుస్తకం సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే కే లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 34శాతం మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేస్తేనే జ్ఞాన తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థకు చేరిన 400 లైబ్రరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.