Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రాణహిత – చేవెళ్లకు నిధులివ్వండి

-తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వండి -మిషన్ కాకతీయకు ఆర్థికంగా సహకరించండి -కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో మంత్రి ఈటెల

Etela Rajendar 01

వచ్చే కేంద్ర వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ సన్నాహక చర్యల్లో భాగంగా వివిధ రాష్ర్టాల అభిప్రాయాలను, అవసరాలను తెలుసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన రాష్ర్టాల ఆర్థిక మంత్రుల సమావేశానికి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యతలను ఆయన వివరించారు. వివిధ జాతీయ అంశాలతో పాటు రాష్ట్ర అవసరాలకు కేంద్రం నిధులు ఇవ్వల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రాష్ర్టానికి వివిధ పద్దుల కింద ఇవ్వాల్సిన నిధులను తక్షణం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ గురించి వివరించి ఈ పథకానికి ఇతోధిక సహాకారం అందించాలని కోరారు.

సీఎస్టీ బకాయిలు.. కేంద్ర విక్రయ పన్ను (సీఎస్టీ)ని ప్రకటించినప్పుడు ఆర్థికంగా నష్టపోయే రాష్ర్టాలకు పరిహారం ఇస్తామన్న హామీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని ఈటెల గుర్తు చేశారు. రానున్న బడ్జెట్‌లో ఈ విషయాన్ని పేర్కొనడం మాత్రమే కాకుండా ఆ సమయానికి బకాయి ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో ఈ అంశానికి సంబంధించి రూ. 11వేల కోట్లను కేటాయించారని, ఆ మేరకు తెలంగాణ వాటా ఇవ్వాలని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి తెలంగాణలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీలను ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యానవన విశ్వవిద్యాలయ స్థాపనకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు ముమ్మరం చేయాలని కోరారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం,రాష్ర్టానికి రైలు కోచ్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై కేంద్ర వైఖరిని బడ్జెట్‌లో స్పష్టం చేయాలని కోరారు.

రుణ పరిమితి పెంచండి.. తెలంగాణ రాష్ర్టానికి ఉన్న ఆర్థిక అప్పులను దృష్టిలో పెట్టుకుని అదనంగా రూ. 4000 కోట్లను ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% వరకు అప్పు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ దానిని రానున్న బడ్జెట్‌లో 4%కు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటిపారుదల సౌకర్యాల కల్పనకు ప్రాణహిత చేవెళ్లకు జాతీయ ప్రాజెక్టు హోదాతో పాటు మిషన్ కాకతీయకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కోరారు.

రాష్ర్టాల అభివృద్ధే దేశాభివృద్ధి.. రాష్ర్టాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా మాత్రమే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటతో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా ఏకీభవిస్తుందని ఈటల అన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును సైతం తమ ప్రభుత్వం పూర్తిగా స్వాగతిస్తోందన్నారు. ఇందుకోసం వార్షిక బడ్జెట్‌లో రాష్ర్టాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జాతీయ ఆదాయంలో 45% సమకూర్చుతున్న చిన్న, మధ్య తరహా యూనిట్ల ఏర్పాటుకయ్యే పెట్టుబడిని కేంద్రం ఒకటిన్నర కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు పెంచిందని, అదే సమయంలో ఎక్సయిజ్ పన్ను మినహాయింపును కూడా ఇదే నిష్పత్తిలో పెంచాలని సూచించారు.

ఐటీ విధానంలో మార్పులు రావాలి.. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు అనుబంధ పరిశ్రమలు చేసే ఎగుమతుల విషయంలో ప్రస్తుతం అమలవుతున్న విధానాల్లో మార్పులు తీసుకురావాలని ఈటెల రాజేందర్ ప్రతిపాదించారు. ఇప్పుడు అమలవుతున్న వ్యవస్థ ఈ రంగంలో పూర్తిగా పన్ను మినహాయింపు ఉన్నప్పుడు రూపొందించినవి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో విధానాలు మరింత సరళీకృతంగా ఉండేలా మార్పులు జరగాలని అభ్నారు. జాతీయ స్థాయిలో ఉత్పత్తి రంగం నుంచి స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసంగా 25% వాటి ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లను నెలకొల్పాలని భావించిందని, తొలి దశలో 16 జోన్‌లను ప్రకటించిందని, ఈ విధానం ద్వారా దశాబ్దకాలంలో 100 మిలియన్ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసిందని, తెలంగాణ రాష్ర్టానికి సైతం ఇలాంటి ఒక జోన్‌ను కేటాయించినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి కనిపించలేదని రాజేందర్ పేర్కొన్నారు.

గ్రాంట్లు పెంచాలి.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సంఖ్య తగ్గినప్పటికీ రాష్ర్టాలకు బ్లాక్ గ్రాంట్స్ మోతాదు పెరగలేదని, అందువల్ల రాష్ర్టాలకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా సాధారణ ప్లాన్ గ్రాంట్లను మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం అమలవుతున్న గ్రాంట్ల విధానం రాష్ర్టాల స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న బడ్జెట్‌లో దీన్ని సవరించి నిర్దిష్టంగా ఆయా రాష్ర్టాల్లో ప్రజల అవసరాలను తీర్చడానికి వీలుగా స్వేచ్ఛ కల్పించాలని కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.