Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రాణహిత-చేవెళ్లకు ఓకే

తెలంగాణ, మహారాష్ట్రల మధ్య తలపెట్టిన అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ఇరురాష్ర్టాల మధ్య కీలక అవగాహన కుదిరింది. ఇరుగు పొరుగు రాష్ర్టాలుగా పరస్పర సహకారంతో సాగు,తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఇద్దరు సీఎంలు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూడు సాగునీటి ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సంపూర్ణ సానుకూలత ప్రకటించారు. గోదావరి నదిలోని 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

CM-KCR-meeting-with-Maharashtra-CM-fadnavis-on-Pranahita-Chevella-Project-issue

-తెలంగాణ-మహారాష్ట్ర స్నేహగీతం -మూడు ప్రాజెక్టులపై కీలక ఒప్పందం -రెండు రాష్ర్టాల నిపుణులతో కమిటీ -లెండి, లోయర్ పెన్‌గంగ సత్వర పూర్తికి నిర్ణయం -సంయుక్త సమావేశంలో ఇద్దరు సీఎంల ప్రకటన -పరస్పరం సహకరించుకుంటామన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ -గోదావరిని సమర్థంగా వినియోగిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ -ముంబై రాజ్‌భవన్‌లో తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల సమావేశం ఈ ప్రాజెక్టుకింద ముంపు ప్రాంతాన్ని తగ్గిస్తామని ఫడ్నవిస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. లెండి ద్వారా 6 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు తాగు,సాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అంగీకరించారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని సీఎంలు నిర్ణయించారు. గోదావరి నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఇరు రాష్ర్టాలు సమన్వయంతో పనిచేయాలని, ఆయా ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఇరు రాష్ర్టాలు నిపుణులతో కూడిన కమిటీని నియమించుకోవాలని ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది.

కీలక చర్చలు: ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడానికి సిద్ధంగా ఉందని, దీనికి మహారాష్ట్ర కూడా సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఈ ప్రాజెక్టుకు తమ అంగీకారాన్ని తెలిపారు. గోదావరి నదిలోని 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఈ సందర్భంగా గడ్చిరౌలి, చంద్రాపూర్ జిల్లాల్లోని దాదాపు 30 గ్రామాల్లో 740 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని కేసీఆర్ దృష్టికి తెచ్చారు.

దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదని చెప్పారు. ముంపు ముప్పు ఎక్కువగా లేకుండానే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామని హామీ ఇచ్చారు. ఇక లెండి ప్రాజెక్టుకు సంబంధించి 2003లో కుదిరిన అవగాహన మేరకు ఆరు టీఎంసీల గోదావరి జలాలను ఇరు రాష్ర్టాలు వినియోగించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రాజెక్టు పరిస్థితిని వివరించిన అధికారులు మహారాష్ట్రలో 12 గ్రామాలు ముంపునకు గురిఅవుతుండగా, 11 గ్రామాల్లో భూసేకరణ పూర్తయిందని, 6 గ్రామాల్లో నష్ట పరిహారం చెల్లించామని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని కోరిన కేసీఆర్, నష్ట పరిహారానికి సంబంధించి మహారాష్ట్ర ప్రతిపాదనలకు అనుగుణంగా డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు

కొత్త భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలనే డిమాండ్‌ను తాము అంగీకరిస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.500 కోట్లను వెచ్చించామని వెల్లడించారు. లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు అంశంపై జరిగిన చర్చలో ఇరు రాష్ర్టాలకు ఎంతో ఉపయోగమైన ఈ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూములను ఇవ్వాలని నిర్ణయించారు. రాజాపేట, రుభా, పిపర్టుల వద్ద బ్యారేజీల నిర్మాణంపై అవగాహనకు వచ్చారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు చూపించారు.

ముఖ్యంగా లోయర్ పెన్‌గంగా, లెండి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై రూపొందించిన ప్రజంటేషన్ ఫడ్నవిస్‌ను ఆకట్టుకున్నట్లు సమాచారం. సమావేశంలో ఇరు రాష్ర్టాల ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌రావు, ఎంపీలు బీ వినోద్‌కుమార్, బీవీ పాటిల్, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

పరస్పర సహకారంతో ముందుకు.. సమావేశం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇరుగు పొరుగు రాష్ర్టాలుగా తెలంగాణ, మహారాష్ట్ర ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తాయని మహారాష్ట్ర సీఎం చెప్పారు. మూడు ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని, పరస్పరం సంప్రదించుకుంటూ ముందు సాగుతామని అన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆకాంక్షలు, అవసరాలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా ఇరుగు పొరుగు రాష్ర్టాలతో సంబంధాలు మెరుగుపర్చుకుంటామని చెప్పారు. నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని ప్రకటించారు. పొరుగు రాష్ర్టాలతో ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ పూరిత వాతావరణం ఉండబోదని స్పష్టం చేశారు. ముంపును తగ్గించుకుంటూ, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకుంటూ తెలివిగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అంతరాష్ట్ర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

కేసీఆర్‌కు ఫడ్నవిస్ జన్మదిన శుభాకాంక్షలు.. పుట్టిన రోజునాడు సంబరాలకు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబాయి వరకు వచ్చారని ఫడ్నవిస్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి పండుగ నాడు ఇరు రాష్ర్టాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం కోసం సమయం కేటాయించినందుకు ఫడ్నవిస్‌కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ ప్రాజెక్టుల తీరు తెన్నులు.. లెండి ప్రాజెక్టు.. – ఈ ప్రాజెక్టుకు సంబంధించి 12 గ్రామాల్లో భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియ పూర్తి అయ్యింది. లెండి నదిపై పైప్ అక్విడెక్టు నిర్మాణం, మహారాష్ట్రవైపు మిగిలిపోయిన కాలువల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. డ్యామ్ నిర్మాణం, గేట్ల ఏర్పాట్లు తదితర అంశాలు పునరావాసం, పరిహారంతో ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే మహారాష్ట్రలో 27 వేల ఎకరాలు, తెలంగాణలో 22 వేల ఎకరాలకు నికర జలాలు అందించే అవకాశముంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కింది ఇప్పటికే రూ.189.73 కోట్లు డిపాజిట్ చేసింది. మిగిలిన మొత్తం ఎప్పుడు అవసరమైతే అప్పుడు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

లోయర్ పెన్‌గంగా.. 1975లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ ప్రాజెక్టు విషయంలో ఒప్పందం కుదిరింది. విదర్భలో 3,95,185 ఎకరాలకు, ఆదిలాబాద్ జిల్లాలోని 47,486 ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు అంశాలను సత్వరం చేపట్టాల్సి ఉంటుంది. కేంద్ర జలవనరుల సంఘం పరిధిలోని వివిధ శాఖల నుంచి చట్టపరమైన అనుమతులు పొందాలి. భూసేకరణ, పునరావాసం, నష్టపరిహారం చెల్లించాలి. కోర్టులో ఉన్న వివిధ కేసులను పరిష్కరించాల్సి ఉంది. పర్యావరణ అనుమతులకు కావలసిన ప్రతిపాదనలను ముందుగానే తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. ఇంతకు ముందు ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోసం కొంత సమయం కోరింది. ఆలోగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిత మొత్తం మూడు బ్యారెజీలలో ఒక బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు… ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2012లో ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర మధ్య ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. కేంద్ర జలవనరుల సంఘం నుంచి అనుమతులు తీసుకొచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తున్నది. మహారాష్ట్ర ప్రాంతంలో ముంపునకు గురయ్యే ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, భూసేకరణ చేయాల్సిన బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహట్టిలో నిర్మించనున్న బ్యారేజీ వల్ల మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ముంపునకు గురయ్యే 1850 ఎకరాలను సేకరించాల్సి ఉంది. భవిష్యత్తులో అవసరమైతే ప్రాణహిత బ్యారేజీ వద్ద బ్యాక్‌వాటర్‌ను మహారాష్ట్ర వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించనున్నట్లు వివరించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.