Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ

-కాలుష్య నివారణ ఉపాధి అవకాశాలు మెరుగైన పరిహారం -హెచ్‌పీసీలో 64వేల కోట్ల పెట్టుబడులు -అనేక ప్రముఖ కంపెనీలు సంసిద్ధత -4.20 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి -పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి -హైదరాబాద్ ఫార్మాసిటీ నిర్మాణానికి -సహకరించాలని ప్రజలకు పిలుపు -కాలుష్యరహితంగా ఫార్మాసిటీ -అత్యాధునిక పరిజ్ఞానంతో కాలుష్య నివారణ -ప్రభుత్వ నిధులతోనే సీఈటీపీల ఏర్పాటు -ఫార్మాసిటీలోనే రెసిడెన్షియల్ టౌన్‌షిప్ -నీరు, గాలి నాణ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం -భూమి కోల్పోయే వారికి ఇంటికో ఉద్యోగం -ప్రభుత్వ ఖర్చులతో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ -సీఎం కేసీఆర్ కూడా భూనిర్వాసితుడే -రైతుల పట్ల ప్రభుత్వం ఉదారంగా ఉంటుంది -సామాజిక బాధ్యతగా ప్రతి కంపెనీకి ఒక గ్రామం దత్తత

రాష్ట్ర రాజధాని శివారులో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతి పెద్దదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రూ.64వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయని తెలిపారు. ఫార్మాసిటీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా, అత్యాధునిక సదుపాయాలు, వసతులతో రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ఏర్పాటుచేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్‌పీసీ)కి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. కాలుష్యం విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన నొక్కిచెప్పారు. ఫార్మాసిటీలో పనిచేసే ఉద్యోగులు మొదలు అధికారులవరకు అక్కడే నివాసం ఉండేందుకు రెసిడెన్షియల్ టౌన్‌షిప్ నిర్మిస్తున్నామని తెలిపారు. అక్కడ కాలుష్యం ఉండబోదనేందుకు ఇదే నిదర్శనమన్నారు.

ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. భూములు కోల్పోయేవారికి ఉదారంగా మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయన ప్రకటించారు. భూమి కోల్పోయినవారికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అవసరమైతే వారికి స్కిల్ డెవలప్‌మెంట్‌లో ప్రభుత్వ ఖర్చుతోనే శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఫార్మాసిటీపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో మంగళవారం హెచ్‌ఐసీసీలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తినాగప్పన్‌లతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఫార్మాసిటీపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ.. కాలుష్య నివారణ, ఉపాధి అవకాశాల కల్పన, భూములు కోల్పోయేవారికి మెరుగైన పరిహారం.. ఈ మూడు కీలక అంశాలపై మంత్రి సమగ్రంగా వివరించారు. హెచ్‌పీసీకి కేంద్రం సూత్రప్రాయంగా నిమ్జ్ హోదా కల్పించిందన్నారు. డీపీఆర్ లేకుండా ఫార్మాసిటీ ఎలా చేపడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని ఆయన ఎద్దేవాచేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు డీపీఆర్ లేకుండా చేస్తారా? కాంగ్రెస్ నాయకులు డీపీఆర్ అడిగితే ఇస్తాం. వారికి చదువడం రాకుంటే ఎవరైనా చదువు వచ్చిన వారితో చదివించుకుని అర్థం చేసుకుంటే మంచిది అని హితవు పలికారు.

కాంగ్రెస్ నిర్వాకాలతోనే అపోహలు ప్రజలకు ఫార్మా పరిశ్రమలపై అపోహలు, అనుమానాలు, భయాందోళనలు కలుగటానికి కాంగ్రెస్ నిర్వాకాలే కారణమని కేటీఆర్ చెప్పారు. అప్పట్లో సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా వ్యవహరించడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. పాశమైలారం, జీడిమెట్ల, పటాన్‌చెరువు తదితర అనేక పారిశ్రామికవాడల్లో సమస్యలు వచ్చాయి. ఇకపై అలా జరుగకుండా ఒకేచోట పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది అని తెలిపారు. సీఈటీపీలను ఏర్పాటు చేయడానికి, 24 ఎంఎల్‌డీల సామర్థ్యంతో వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఇప్పటికే ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ని పిలిచాం. అనేక ప్రముఖ పారిశ్రామిక పార్కుల్లో సేవలందిస్తున్న ఎనిమిది అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇలాంటివి ముందుకొచ్చి సీఈటీపీలను ఏర్పాటుచేయడం ద్వారా కాలుష్య సమస్యను సులువుగా దూరం చేయవచ్చు. చిత్తశుద్ధి ఉంటే ఇది సాధ్యమవుతుంది అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులు వాళ్ల మాదిరిగానే ఇతరులు చేస్తారనుకుంటే ఎట్లా అంటూ విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళపర్చాలని చూస్తున్నాయన్నారు. ఆషామాషీగా కాకుండా ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థతో మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. లైవ్, వర్క్, లెర్న్, ప్లే విధానంలో హెచ్‌పీసీని నిర్మిస్తున్నామని చెప్పారు.

ఒక్క చెరువునూ పోనివ్వం ఒక్క చెరువును కూడా పరిశ్రమల్లో పోనివ్వబోమని, పైగా వాటిని సుందరీకరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. నీటి సంరక్షణకు వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. మా ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులను కాపాడుతున్నది. కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. వారిలా జీడిమెట్ల, పాశమైలారం, పటాన్‌చెరువుల్లో చేసినట్టు చేయం. ఫార్మాసిటీలో నిర్మించే పరిశ్రమల్లో కేవలం 24% పరిశ్రమలు మాత్రమే రెడ్ క్యాటగిరీ పరిశ్రమలు. మిగిలిన 76% ఆరెంజ్ క్యాటగిరీ పరిశ్రమలున్నాయి. ఫార్మాసిటీకి కేటాయించిన స్థలంలో 33% గ్రీన్ ఏరియా ఉంటుంది. దీంతోపాటుగా పరిసరాల్లో ఉన్న 1200 ఎకరాల అడవిని ఇంకా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. అద్భుతమైన అటవీ ప్రాంతంగా మారుస్తాం అని చెప్పారు. చెరువుల్లోకి ఎలాంటి కాలుష్య వ్యర్థాలను వదిలేది లేదని, దీనిపై ఎవరికీ అనుమానాలు అవసరంలేదని కేటీఆర్ స్పష్టంచేశారు.

ఒక్క బోరు వేయకుండా నీటి సరఫరా.. ఫార్మాసిటీలో కంపెనీలకు, అక్కడ పనిచేసే వారందరికీ మిషన్ భగీరథద్వారా నీటిని సరఫరా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాగునీటి కోసం శుద్ధిచేసిన నీటిని, కంపెనీల అవసరాలకు ఇతర నీటిని సరఫరా చేస్తాం. మిషన్ భగీరథలో 10% నీటిని పారిశ్రామిక అవసరాలకు ఇప్పటికే కేటాయించాం. ఆ ప్రాంతంలో కొత్తగా ఒక్క బోరు కూడా వేయం. బోర్లు వేసి అవి విఫలమైతే వాటి ద్వారా కాలుష్యపు నీటిని భూమిలోకి పంపించిన ఘటనలపై మాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. జడ్చర్ల ప్రాంతంలో ఇలా జరిగినట్టు మీడియాలో వస్తే ఆ బోరుబావులను మూసివేశాం. కాబట్టి అలాంటి అవకాశమే లేకుండా ఒక్క బోరు వేయం. వేయనివ్వం. కాలుష్య సమస్యపై ఆందోళన అవసరంలేదు. వాన నీటిని సంరక్షించడానికి చెరువులను పరిరక్షిస్తాం. వాటిలోకి నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తాం అని తెలిపారు.

జడ్‌ఎల్డీ విధానంలో ట్రీట్‌మెంట్ ప్లాంటు కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జి విధానంలో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వ్యర్థాలు భూమిలోకి, చెరువుల్లోకి వెళ్లకుండా సీఈటీపీలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. పూర్తిగా వేస్ట్‌వాటర్ ట్రీట్‌మెంట్ చేయిస్తాం. సమర్థవంతంగా వాటర్ రీసైక్లింగ్ చేయడం ద్వారా 43% నీటి అవసరాలు తగ్గుతాయని అధ్యయనంలో తేలింది. ఫార్మా సిటీకి 500 మీటర్ల దూరంలో ఎలాంటి ఆవాసాలు లేవు. దీనిని బఫర్‌జోన్‌గా గుర్తించాం. దీంతో సమీప గ్రామాలకు ఎలాంటి సమస్యలు రావు అని చెప్పారు.

గాలి కాలుష్యంపైనా అధ్యయనం ఫార్మాసిటీ ప్రాంతంలో ఎయిర్ ఫ్లో (గాలివాటు)ను కూడా అధ్యయనం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏ ప్రాంతం నుంచి ఎటువైపు గాలి వీస్తుందో శాస్త్రీయంగా నిపుణులద్వారా అధ్యయనం చేయించాం. నీటి నాణ్యత, గాలి నాణ్యత పరీక్షించాం. గాలి నాణ్యత తెలుసుకోవడానికి బయో ఫిల్టర్స్, బయో స్క్రబ్బర్స్ ఏర్పాటుచేస్తారు. పర్యావరణంపై ఎప్పటికప్పుడు సమర్థ నిర్వహణకు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ, సెంట్రల్ కమాండ్ కంట్రోల్‌కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. నీరు, గాలి నాణ్యత పరీక్షకు రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. డిజాస్టర్ మిటిగేషన్ సిస్టం నెలకొల్పుతాం. ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. ఇందుకోసం పర్యావరణ అనుమతులను మొత్తం ప్రాంతానికి తీసుకుంటున్నాం. పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి వెంటనే స్థలం కేటాయించే అవకాశముంటుంది. మొత్తం 19333 ఎకరాల్లో ఏ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి? ఏ ప్రాంతంలో రెసిడెన్షియల్ టౌన్‌షిప్, యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి? అనే అంశాల్లో నిర్ణయం తీసుకున్నాం. ఫార్మా పరిశ్రమతోపాటు రాబోయే రోజుల్లో కాస్మోటిక్ పరిశ్రమ విస్తరించే అవకాశముంటుంది. ఇక్కడ పనిచేసేవారికోసం స్కూల్, హాస్పిటల్, అంగన్‌వాడీ కేంద్రాలు, పార్కు ఇతర సౌకర్యాలు ఏర్పాటుచేస్తాం అని కేటీఆర్ వివరించారు.

కాలుష్య నివారణపై విదేశాల్లో అధ్యయనం తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫార్మా పరిశ్రమ ఉన్న ప్రాంతాల్లో కాలుష్య సమస్యను చూశారు. కాబట్టి ఆ సమస్య మళ్లీ రాష్ట్రంలో ఎక్కడా రాకుండా ఉండటానికి అధికారులతో విదేశాల్లో అధ్యయనం చేయించారు. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శులు అరవింద్‌కుమార్, జయేశ్‌రంజన్, సీఎంవో అధికారి శాంతికుమారి, ఇతర పరిశ్రమల అధికారులు సింగపూర్, చైనా, అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లండ్, బెల్జియం దేశాల్లో పర్యటించారు. గాలి, నీటి కాలుష్య నివారణ గురించి అధ్యయనంచేశారు. సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి సుచాయ్ ఫార్మాపార్కును సందర్శించారు. అక్కడ గేటెడ్ కమ్యూనిటీలా ఉన్న వాతావరణం చూసి ఎంత ఖర్చు అయినా మన దగ్గర ఇలా ఉండేలా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు అని కేటీఆర్ తెలిపారు.

పరిశ్రమల కోసం 46 శాతమే స్థలం ఫార్మాసిటీలో 46% స్థలంలో మాత్రమే పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని మంత్రి చెప్పారు. మిగిలినదానిని ఇతర అవసరాలకు వినియోగిస్తామన్నారు. ఇందులో 9% స్థలంలో రెసిడెన్షియల్ జోన్, 5% పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్, 21% గ్రీన్ ఏరియా, ఓపెన్ స్పేసెస్, ఒక శాతం స్థలంలో ఫార్మా వర్సిటీ, యుటిలిటీకోసం 3%, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థకోసం 15% స్థలాన్ని వినియోగిస్తామని వెల్లడించారు.

ఉద్యోగులు, కార్మికుల నివాసం అక్కడే ఫార్మాసిటీలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, కార్మికులందరూ అక్కడే నివాసం ఉండేలా దాదాపు రెండు వేల ఎకరాల్లో రెసిడెన్షియల్ టౌన్‌షిప్ ఏర్పాటుచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కంపెనీల బాధ్యులనుంచి కిందిస్థాయి కార్మికుల వరకు ఉంటారు కాబట్టి అక్కడ కాలుష్యం సమస్య ఉంటుందనే ప్రచారం తప్పు అని నిర్ధారణ అవుతుంది. ఒకవేళ గాలి, నీటి కాలుష్యం ఉంటే వారు అక్కడ ఎలా ఉండగలుగుతారు? కాలుష్య సమస్య ఉంటే వారు కూడా బాధితులే అవుతారు కాబట్టి అవి ఉండవనేది గ్రహించాలి అని ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మవద్దని, ప్రతిపక్షాలది రాజకీయ ప్రచారమనే విషయాన్ని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

కాలుష్య సమస్య లేకుండా.. ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుంటే కొందరి దుష్ప్రచారం, గత అనుభవాల దృష్ట్యా అపోహలు పడుతున్నారు. గతంలో ఏర్పాటుచేసిన ఫార్మా పరిశ్రమలు 30-40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసినవి. అప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం, అక్కడక్కడ విసిరేసినట్లుగా పరిశ్రమలు ఏర్పాటుచేయడంతో వాటిపై నియంత్రణ, పర్యవేక్షణ సరిగా లేక, సీఈటీపీలు ఏర్పాటు చేసుకోక కాలుష్య సమస్యలు వచ్చాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోయారు. ఆ సమస్య లేకుండా ఈసారి అన్నింటినీ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీద్వారా అత్యాధునిక యంత్రాలను ఏర్పాటుచేస్తారు. దీనితో వాటిపై పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. ప్రభుత్వానికి సులువుగా ఉంటుంది. ఫార్మాసిటీలో మొదటిదశలో 24ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ను ప్రభుత్వమే ఏర్పాటుచేస్తున్నది. ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా చెల్లించి, వినియోగించుకుంటారు. దశలవారీగా కంపెనీల అవసరాలకు అనుగుణంగా దీనిని పెంచుకుంటూ పోతాం. ప్రభుత్వమే దీనిని ఏర్పాటుచేస్తున్నదికాబట్టి.. ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కంపెనీలు వీటిని ఏర్పాటు చేసుకోవనే అనుమానాలు, అపోహలు లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఘన పదార్థాల వేస్టేజ్, ద్రవపదార్థాల వేస్టేజ్ రెండింటినీ బయట వేసే అవసరం లేకుండా అత్యాధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం అని కేటీఆర్ వివరించారు.

హెచ్‌పీసీలో 64 వేల కోట్ల పెట్టుబడులు ఫార్మాసిటీలో ప్రపంచంలోని అనేక అత్యుత్తమ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని, ఇప్పటికే తమ ఆసక్తిని తెలియజేస్తూ ప్రభుత్వానికి లేఖలు రాశాయని కేటీఆర్ వెల్లడించారు. హెచ్‌పీసీలో రూ.64వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. దీంతోపాటుగా రూ.58 వేల కోట్ల ఎగుమతులు ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రూ.20వేల కోట్ల విలువైన ఎగుమతులు మాత్రమే ఉన్నాయి. పెట్టుబడులు భారీగా పెరుగటం, ఎగుమతులు వృద్ధి చెందటంద్వారా రాష్ట్ర యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో ప్రజల అవసరాలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చించే అవకాశముంటుంది. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని తెలిపారు.

నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఫార్మాసిటీలో స్థానికులు కోల్పోయే భూములకు మెరుగైన పరిహారం ఉదారంగా అందిస్తామని కేటీఆర్ చెప్పారు. హెచ్‌పీసీ మొదటి దశను 8300 ఎకరాల్లో ఏర్పాటుచేయడానికి ప్రణాళిక సిద్ధంచేశాం. దీనికోసం ఇప్పటికే దాదాపు ఏడు వేల ఎకరాలు సేకరించాం. మరో 1200 ఎకరాల సేకరణకు నోటీసులిచ్చాం. మొదటి దశకు ఇది సరిపోతుంది. దీనికోసం చట్ట ప్రకారంగా భూములను సేకరించాం. కొత్త చట్టం ప్రకారం భూసేకరణ నోటీసులు ఇచ్చాం. భూసేకరణకు ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లకు పైగా వెచ్చించాం అని మంత్రి వివరించారు.

సీఎం కేసీఆర్ కూడా నిర్వాసితుడే సీఎం కేసీఆర్ కూడా భూనిర్వాసితుడు. మా తాత ప్రస్తుత కామారెడ్డి జిల్లా పోసాన్‌పల్లి గ్రామానికి చెందిన వారు. ఆ గ్రామం అప్పర్ మానేరు ప్రాజెక్టుతో ముంపునకు గురైంది. దీంతో అక్కడినుంచి మా కుటుంబం ప్రస్తుత సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వచ్చింది. మా అమ్మది కుదురుపాక గ్రామం. అది మిడ్ మానేరు ప్రాజెక్టులో ముంపు గ్రామం. మా అమ్మ చదువుకున్న స్కూల్ కూడా ఇటీవలే ప్రాజెక్టులో ముంపునకు గురైంది. ఇలా మా నాన్న కుటుంబం, మా అమ్మ పుట్టిన ఊరు.. రెండూ కూడా భూ నిర్వాసితులవే. కాబట్టి భూమిని కోల్పోయిన వారి బాధలు ఎలా ఉంటాయో సీఎం కేసీఆర్‌కు ప్రత్యక్షంగా తెలుసు. ఆ బాధ, ఇబ్బంది, వేరే ఊరికి వెళ్లడం ఎంత కష్టమో వారికి స్వయంగా తెలుసుకాబట్టి భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయంచేయడానికి కృషిచేస్తున్నాం. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. పరిహారం అందించడంలో ఉదారంగా ఉంటాం అని కేటీఆర్ చెప్పారు.

మేక్ ఇన్ తెలంగాణ నినాదంతో.. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ నినాదంలో భాగంగా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఇక్కడే ఏర్పాటుచేయడం ద్వారా దిగుమతులు తగ్గుతాయని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందడంలో ట్యాబ్లెట్లు, మందులు కీలకమైనవి. అవి స్థానికంగా తయారైతేనే తక్కువ ధరకు దొరికే అవకాశాలుంటాయి. పేద, మధ్య తరగతి వారికి తక్కువ ధరలకు ఔషధాలు దొరుకడం ముఖ్యం. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఔషధాల ముడిసరుకుల్లో 84% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. వీటిలో చైనా నుంచే 66% ఉన్నాయి. వీటి విలువ రూ.13853కోట్లు ఉంటుంది. ఫార్మా, బల్క్‌డ్రగ్ పరిశ్రమ అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా నుంచి దిగుమతులు 2014 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. 2014లో రూ.12,200 కోట్ల దిగుమతులు జరిగాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ తక్కువ ధరకు ముడిసరుకు లభించడమే అని కేటీఆర్ వివరించారు.

గ్రామానికో కంపెనీ దత్తత ఫార్మాసిటీలో ఏర్పాటయ్యే ప్రతి కంపెనీ సీఎస్‌ఆర్ (సామాజిక బాధ్యత) కింద ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని, ఆ గ్రామ సామాజిక అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకుంటాయని కేటీఆర్ చెప్పారు. ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల ప్రజల అపోహలు, అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాలుష్య నివారణ, ఉపాధి కల్పన, పరిహారంపై ఉదారంగా వ్యవహరిస్తాం. ప్రతిపక్షాలు సృష్టించే అబద్ధాలను, కుట్రపూరిత దుష్ప్రచారాలను నమ్మవద్దు అని ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు.

ఫార్మా యూనివర్సిటీ ఫార్మాసిటీలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనికోసం అంతర్జాతీయంగా ఫార్మా రంగంలో అనుభవమున్న సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఉత్పత్తులు తయారుచేయడమే కాకుండా కొత్త విషయాలపై అధ్యయనం చేయడానికి యూనివర్సిటీ ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. కొత్త పరిశోధనలు, అధ్యయనం జరుగాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కిచెప్పారు.

4.20 లక్షల మందికి ఉపాధి ప్రపంచంలోనే అతి పెద్ద, ఉత్తమ ఫార్మాసిటీని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నాం. ఈ రంగంలో ఏ దేశంలో కూడా ఇలాంటిది వచ్చే అవకాశం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. దీనిద్వారా ప్రత్యక్షంగా 1.70 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా 4.20లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని కేటీఆర్ చెప్పారు. ఫార్మాసిటీ ఏర్పాటులో భూమి కోల్పోయే కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అవసరమైన వారికి స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తామన్నారు. అన్‌స్కిల్డ్, సెమీస్కిల్డ్ ఉద్యోగులను, కంపెనీలకు అవసరమైన స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ముచ్చర్ల, సమీప ప్రాంత ప్రజలకు ఒకటే విజ్ఞప్తి. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది, ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఎవరో కొందరు చేసే కుట్రపూరిత దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. కాలుష్య నివారణకు, ఉపాధి అవకాశాల కల్పనకు, సరైన పరిహారం అందేందుకు చర్యలు తీసుకుంటాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. కాలుష్యంపై ఆందోళన అవసరంలేదు. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు అక్కడే ఉంటారు.. అంటే కాలుష్య సమస్య ఉండదనే విషయాన్ని పెద్ద మనుసుతో అర్థం చేసుకోవాలి. రాజకీయాలకోసం చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఫార్మాసిటీని నిర్మించుకోవడానికి సహకరించాలి – మంత్రి కేటీఆర్

డీపీఆర్ లేకుండా ఫార్మాసిటీ ఎలా చేపడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం ఈ దశాబ్దపు పెద్ద జోక్. ఇంత పెద్ద ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు డీపీఆర్ లేకుండా చేస్తారా? కాంగ్రెస్ నాయకులకు డీపీఆర్ కావాలంటే.. అడిగితే ఇస్తాం. వారికి చదువడం రాకుంటే ఎవరైనా చదువు వచ్చినవారితో చదివించుకుని అర్థం చేసుకుంటే మంచిది. – మంత్రి కేటీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.