-స్వచ్ఛతలో మెట్రో నగరాలను దాటేశాం -మెట్రోరైలుతో విప్లవాత్మక మార్పు -కమర్షియల్ స్పేస్‌కు భారీగా పెరిగిన గిరాకీ -భద్రతాపరంగా సేఫ్‌సిటీగా హైదరాబాద్ -పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు -నిర్మాణ వ్యర్థాల తరలింపు వాహనాలు ప్రారంభం

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశలో వేగంగా పురోగతి సాధిస్తున్నామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. స్వచ్ఛత విషయంలో ఇతర మెట్రో నగరాలకన్నా ముందున్నామని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ ర్యాంకులతో స్పష్టమైందని చెప్పారు. ఇండ్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, జనవరి నుంచి వ్యవసాయానికి సైతం 24గంటల విద్యుత్ అందించే స్థాయి కి చేరామన్నారు. మంచినీటి సరఫరాలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించినట్టు చెప్పారు. క్రైంరేట్ తగ్గి హైదరాబాద్ సేఫ్‌సిటీగా మారిందన్నారు. మెట్రో రాకతో ప్రజారవాణాలోనూ విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో కమర్షియల్ స్పేస్ కు గత ఏడాదితో పోల్చితే రెండున్నర రెట్లు డిమాండ్ పెరిగిందన్నారు. అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని రోడ్లు, ప్రజారవాణా, ట్రాఫిక్, కాలుష్యం తదితర రంగాల్లో ఇంకా చేయాల్సింది ఉన్నదని పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన నిర్మాణ వ్యర్థాల తరలింపు వాహనాలను మంగళవారం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ మిషన్ ర్యాంకుల్లో హైదరాబాద్‌ది 22వ స్థానమైనా.. కోటి జనాభా దాటిన నగరాలతో పోల్చుకుంటే ముందున్నదని విశ్లేషించారు. పురపాలన అంటేనే ప్రజల భాగస్వామ్యమని, వారి సహకారం లేకుండా స్వచ్ఛత సాధించలేమన్నారు. కోటి మంది జనాభా ఉత్పత్తి చేస్తున్న వ్యర్థాలను 22 వేల మంది కార్మికులు తొలిగించడం సాధ్యం కాదన్నారు. కేంద్రం స్వచ్ఛభారత్ ప్రారంభించకముందే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తుచేశారు. చెత్త రవాణాకు రెండువేల స్వచ్ఛ ఆటోలను, ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు సుమారు 25 లక్షల చెత్త డబ్బాలను పంపిణీ చేయడంతో వ్యర్థాల తొలిగింపు మెరుగుపడిందన్నారు. నగరంలో సేకరిస్తున్న చెత్త మూడున్నర వేల మెట్రిక్ టన్నుల నుంచి నాలుగున్నర వేల మెట్రిక్ టన్నులకు పెరుగడమే నిదర్శనమన్నారు.
కొనసాగుతున్న విద్యుత్ ప్లాంట్ పనులు జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో ట్రీట్‌మెంట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. దాదాపు రూ.140 కోట్లతో ల్యాండ్‌ఫిల్, గ్రీన్ క్యాపింగ్ పనులు జరుగుతున్నాయని, త్వరలో పూర్తవుతాయని చెప్పారు. దీంతో పరిసర గ్రామాల్లో కాలుష్య సమస్య చాలావరకు తగ్గుతుందన్నారు. వ్యర్థాలతో విద్యుత్ తయారు చేసేందుకు 20 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. వ్యర్థాలను ఒకేచోటికి కాకుం డా నగరం నలుమూలలకు తరలించేలా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో స్థలాలను, పాత క్వారీలను గుర్తిస్తున్నామన్నారు.
నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ నిర్మాణ వ్యర్థాలను గతంలో రోడ్ల వెంబడి పారవేసేవారని, వాటితో పేవర్ బ్లాక్స్ తయారు చేసి ఫుట్‌పాత్‌లకు వినియోగిస్తామని చెప్పారు. ట్రీట్‌మెంట్ ప్లాంట్ల కోసం జీడిమెట్లలో 15 ఎకరాలు, ఫతుల్లగూడలో 17 ఎకరాలు కేటాయించామన్నారు. పీపీపీ పద్ధతిలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. వ్యర్థాల విషయంలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఎంతో ప్రధానమైనవని, వ్యర్థాలను బహిరంగంగా పారవేయకుంటే చాలావరకు సమస్య ఉండదన్నారు.
సర్వతోముఖాభివృద్ధి దిశగా.. విద్యుత్ సరఫరా విషయంలో ఎంతో పురోగతి సాధించామని, ఇండ్లకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పా రు. మంచినీటి సరఫరాలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య వ్యత్యాసాన్ని చాలావరకు తగ్గించామన్నారు. శాంతిభద్రతల విషయంలోనూ గణనీయ మార్పు వచ్చిందని, క్రైంరేట్ తగ్గి హైదరాబాద్ సేఫ్‌సిటీగా మారిందన్నారు. మెట్రోరైలులో రోజూ సగటున 1.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, మిగతా రెండు కారిడార్లను వచ్చే ఏడాది పూర్తిచేస్తామని చెప్పారు. భవిష్యత్‌లో రోజూ 15 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు. దీంతో ట్రాఫి క్, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయన్నారు. బస్తీలను తొలిగించే విషయంలో పురోగతి సాధిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకోసం ఈ ఏడాది లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లిచేసి చూడు అనే నానుడిని నిజంచేస్తూ పేదలకోసం ఈ రెండు కార్యక్రమాలనూ విజయవంతంగా అమలుచేస్తున్నామని స్పష్టంచేశారు.
కమర్షియల్ స్పేస్‌కు పెరిగిన గిరాకీ నగరంలో ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగయ్యాయని తెలిపారు. గత ఏడాది కొత్తగా 30 లక్షల చదరపు అడుగుల మేర కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి రాగా, ఈ ఏడాది డిమాండ్ రెండున్నర రెట్లు పెరిగి 75 లక్షల చదరపు అడుగులకు పెరిగిందన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త విడదీసేందుకు సంబంధించిన స్వచ్ఛదూత్ యాప్, దోమల నివారణకు ఉద్దేశించిన మస్కిటో యాప్ విజేతలకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
16 నుంచి మన నగరం సమావేశాలు జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతున్న మన నగరం, మనందరి నగరం టౌన్‌హాల్ మీటింగులను ఈనెల 16వ తేదీన కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో ప్రారంభిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. స్థానిక ఎన్జీవోలు, కాలనీ సంఘాలు, అక్కడి ప్రముఖులు కలిపి సుమారు 300-350 మందిని ఆహ్వానించి ఆ ప్రాం తంలోని సమస్యలపై చర్చించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.